తెలంగాణలో మహాలక్ష్మి, గృహ జ్యోతి పథకాల ప్రారంభం
మహాలక్ష్మి కింద రూ.500కే గ్యాస్ సిలిండర్
గృహజ్యోతి కింద 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్
గ్యారెంటీలను నమ్మి ప్రజలు గెలిపించారు: సీఎం రేవంత్‌రెడ్డి
అందుకే ఆర్థిక ఇబ్బందులున్నా పథకాల అమలు: సీఎం రేవంత్‌రెడ్డి
అపోహలొద్దు.. నూటికి నూరు శాతం అన్నీ అమలు చేస్తాం: సీఎం రేవంత్
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికే ఈ పథకాల వర్తింపు
తెల్లరేషన్ కార్డు ఉన్నవారికే వర్తింపు
మహిళ పేరుపై గ్యాస్ కనెక్షన్ ఉంటేనే రూ.500 సిలిండర్ పథకం వర్తింపు
హైదరాబాద్, సాక్షి: కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను నమ్మే ప్రజలు తమకు అధికారం ఇచ్చారని.. అందుకే ఆర్థిక ఇబ్బందులున్నా చిత్తశుద్ధితో ఒక్కో పథకం అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం తెలంగాణ సచివాలయంలో అభయహస్తం గ్యారెంటీల అమలులో భాగంగా.. ‘మహాలక్ష్మీ పథకం’ ‘గృహ జ్యోతి’ పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ పాల్గొన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన పథకం ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని.. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు హామీలను అమలు చేశామని సీఎం రేవంత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. నూటికి నూరు శాతం అన్ని హామీలను అమలు చేస్తామని.. తెలంగాణ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అన్నారాయన. అలాగే.. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్లకే ఈ పథకాలు వర్తిస్తాయని మరోసారి స్పష్టత ఇచ్చారు. పేదల ఇళ్లలో వెలుగులు నింపాలనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ఇస్తున్నామని, అలాగే మహాలక్ష్మీ పథకం కింద సబ్జిడీతో రూ.500 సిలిండర్ అందిస్తున్నామని అన్నారు.
ఎమ్మెల్సీ కోడ్ వల్లే..
ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని తుక్కుగుడలో సోనియా గాంధీ హామీ ఇచ్చారు. సోనియా గాంధీ హామీ మేరకు కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టారు. రెండు పథకాలను చేవెళ్ళలో ప్రారంభించాలి అనుకున్నాం. ఎమ్మెల్సీ కోడ్ వల్ల అక్కడి నుంచి సెక్రటేరియట్ కు మార్చాల్సి వచ్చింది. ప్రియాంక గాంధీ కోడ్ కారణంగా రద్దు చేసుకున్నారు. కట్టెలపోయ్యి నుంచి గ్యాస్ సిలిండర్ ను ఆనాడే తక్కువకు ఇందిరా గాంధీ ఇచ్చారు. యూపీఏ హయాంలో కాంగ్రెస్ దీపం పథకం తీసుకొచ్చింది. రూ.400 కేగ్యాస్ సిలిండర్ అందించింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రూ.1200కు సిలిండర్ రేటు పెరిగింది. మోదీ గ్యాస్ ధరలు పెంచితే కేసీఆర్ సబ్సీడీ ఇవ్వలేదు.
.. మా ప్రభుత్వం నిబద్ధతతో ఉంది.. ఎట్టి పరిస్థితుల్లో ఆరు గ్యారెంటీ లను అమలు చేస్తాం. ఎవరు ఎలాంటి శాపాలు పెట్టినా...అపోహలు ప్రచారం చేసినా పథకాలు ఆగవు. సోనియా గాంధీ హామీ ఇస్తే శిలాశాసనం. ఆమె ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తుంది ఈ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచేలాగా పాలన చేస్తాం. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటాం అని సీఎం రేవంత్ అన్నారు.
ఉచిత విద్యుత్‌పై ఆ ప్రచారం నమ్మొద్దు: డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల స్కీమ్‌ను దేశం అంతా చూస్తోందని.. ఇదొక విప్లవాత్మకమైన ఆలోచన అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘‘అమలుకాని ఆరు గ్యారెంటీల హామీ కాంగ్రెస్ ఇచ్చినట్లు BRS మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో రోజు నుంచే విమర్శలు చేస్తోంది. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు జేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆరు గ్యారెంటీ లను అమలు చేయాలని అందరం పట్టుదలతో ఉన్నాం. అరకొర నిధులతో జీతాలు ఇస్తూనే, పథకాలు అమలు చేస్తున్నాం.
ఇప్పుడు ప్రారంభించిన గృహజ్యోతి, మహాలక్ష్మీ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలువబోతున్నాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించడమే ఇందిరమ్మ రాజ్యం అంటే. 200 యూనిట్లు అమలు అంటే కోతలు అని ప్రచారం చేస్తున్నారు. 200 యూనిట్ల వరకు రేపు మార్చి నుంచి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఉచితంగా కరెంట్ ఇవ్వబోతున్నాం. అర్హత కలిగిన వారందరికీ ఉచిత 200 యూనిట్ల విద్యుత్ ఇస్తాం. బీఆర్‌ఎస్ నేతలు బోగస్ ప్రచారం చేస్తున్నారు.. వాటిని నమ్మొద్దు అని భట్టి పిలుపు ఇచ్చారు.
ఇతర మంత్రులు..
భవిష్యత్తులో తెల్లకార్డు ఉండి ఎల్పీజీ కనెక్షన్ ఉంటే.. మహాలక్ష్మీ పథకం వర్తింపజేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం సుమారు 40 లక్షల మంది బల్ధిదారులున్నారని.. లబ్ధిదారుల జాబితాలో ఇప్పుడు లేనివారిని త్వరలోనే చేరుస్తామని చెప్పారాయన. మరో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రభుత్వం కొలువుదీరాక రెండు పథకాలు.. ఇప్పుడు మరో రెండింటిని ప్రారంభించామని.. నూటికి నూరు శాతం అన్ని పథకాలు అమలు చేస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment