సాక్షి, హైదరాబాద్: రెండు విడతల వేతన సవరణ జరపకుండానే విలీన ప్రక్రియ పూర్తిచేస్తే తీవ్రంగా నష్టపోతామన్న ఆందోళనలో ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. రెండు రోజుల క్రితమే, విలీనచట్టం అమలులోకి తెస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసిన విషయం విదితమే. విలీనానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తూ త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది.
♦ ఆర్టీసీ ఉద్యోగులు ప్రస్తుతం 2013 వేతన సవరణ మీద కొనసాగుతున్నారు. 2015లో జరిగిన ఆ వేతన సవరణలో భాగంగా 44 శాతం ఫిట్‌మెంట్ పొందారు. వాటికి సంబంధించిన బకాయిలు బాండ్లరూపంలో ఇచ్చే 50 శాతం ఇప్పటికే పెండింగ్‌లో ఉంది.
♦2017లో జరగాల్సిన వేతన సవరణ చేపట్టలేదు. దాని బదులు, నాటి మంత్రులకమిటీ 16 శాతం మధ్యంతర భృతి ప్రకటించింది. ప్రస్తుతం అదే కొనసాగుతోంది.
♦ 2021లో జరగాల్సిన వేతన సవరణ కూడా జరగలేదు. ఈ రెండు వేతన సవరణలు పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల లేదు. ఫలితంగా వారు పదేళ్ల నాటి బేసిక్‌పైనే కొనసాగుతున్నారు.
♦ ఈ రెండు వేతన సవరణలు లేకుండా, ప్రస్తుతమున్న బేసిక్ ప్రాతిపదికగా తీసుకొని వారిని ప్రభుత్వంలోని కేడర్‌లో తత్సమాన బేసిక్ వద్ద ఫిక్స్ చేస్తే భారీగా నష్టపోవాల్సి ఉంటుందనేది ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళనకు ప్రధాన కారణం.
♦ 1990లో ప్రభుత్వ ఉపాధ్యాయుల కంటే ఆర్టీసీ ఉద్యోగుల బేసిక్ ఎక్కువ. ఆ సమయంలో కొందరు ఉపాధ్యాయ, ఆర్టీసీలో పోస్టుల్లో చాన్స్ వస్తే.. బేసిక్ ఎక్కువగా ఉన్న ఆర్టీసీ వైపే మొగ్గు చూపారు.
♦ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ టీచర్ బేసిక్..ఆర్టీసీ డీఎం బేసిక్ కంటే రెట్టింపునకు చేరింది. ఈ తరుణంలో ప్రస్తుత బేసిక్ ఆధారంగా ప్రభుత్వంలోని కేడర్ ఫిక్స్ చేస్తే, సీనియర్ డిపోమేనేజర్ స్థాయి ఆర్టీసీ అధికారి సెకండ్ గ్రేడ్ టీచర్ స్థాయిలో ఉండిపోవాల్సి వస్తుంది.
♦ అదే రెండు వేతన సవరణలు చేసి, ఆ బేసిక్ ఆధారంగా ఫిక్స్ చేస్తే జిల్లాఅధికారి స్థాయిలో ఉంటారు. ఇదే తరహా పరిణామాలు డ్రైవర్, కండక్టర్, అసిస్టెంట్ డీఎం, ఇతర స్థాయి ఉద్యోగుల్లో కూడా ఉంటుంది.
ఉద్యమానికి కార్యాచరణ
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో, సంబరాలు చేసుకోవాల్సిన కార్మికులు ఆందోళన బాట పట్టడం ప్రస్తుత పరిణామాలకు అద్దం పడుతోంది. పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలు చేయటంతోపాటు, ఇతర బకాయిలు చెల్లించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేక్రమంలో ఈనెల 26న ఆర్టీసీ కా ర్మిక సంఘాల జేఏసీ (3 సంఘాల కూటమి) ఇందిరాపార్కు వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. కొద్ది రోజులుగా అన్ని డిపోల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి.
రెండు వేతన సవరణలు చేయకుంటే తీవ్రంగా నష్టపోవటమే
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయటం శుభపరిణామం. కానీ, 2017, 2021 విడతల వేతన సవరణలు ముందు చేపట్టాలి. అప్పుడు ఉద్యోగుల స్థూల వేతనం పెరుగుతుంది. ఆ మొత్తం ప్రభుత్వంలో ఏఏ కేడర్‌లతో సమంగా ఉందో చూసి ఆయా ఉద్యోగులను ఆయా స్థాయిల్లో ఫిక్స్ చేస్తే అప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో మా జీతాలు కనిపిస్తాయి. అప్పుడే విలీన ప్రక్రియకు న్యాయం జరుగుతుంది. లేదంటే, భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే ముందు రెండు వేతన సవరణలు చేయాలని ముక్తకంఠంతో కోరుతున్నాం. – వీఎస్‌రావు కార్మిక నేత
Comments
Please login to add a commentAdd a comment