సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికల్లో ‘ఆర్టీసీ ఓటర్లు’ కీలకంగా మారబోతున్నారు. ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యో గులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల వరకు ఓట్లున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో వారి సంఖ్య అధికంగా ఉంది. నగరంలోని ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో 10 వేల వరకు ఉన్నాయి. ఇలాంటి నియోజకవర్గాలు మరికొన్ని ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో అంతగా లేనప్పటికీ, వేలల్లోనే ఉండటం విశేషం. ప్రస్తుతం ఆర్టీసీలో 43 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
రిటైర్ అయిన ఆర్టీసీ ఉద్యోగులు దాదాపు 20 వేలమంది ఉన్నారు. వారి కుటుంబాలకు సంబంధించి దాదాపు 2.43 లక్షల ఓట్లు ఉన్నట్టు అంచనా. గత రెండు ఎన్నికల్లో ఆర్టీసీ ఉద్యోగులు ఎక్కువగా బీఆర్‌ఎస్ పార్టీకి అండగా నిలిచారు. ఈసారి వారి ఓట్లను సాధించేందుకు కాంగ్రెస్ తీవ్రంగా యత్నిస్తోంది. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన నేపథ్యంలో, బీఆర్‌ఎస్ పార్టీ వారి ఓట్లు తనకే అధికంగా వస్తాయని ఆ పార్టీ నమ్మకంగా ఉంది.
చదవండి: ‘ప్రజల తెలంగాణ’ కల నిజం చేస్తాం
ప్రచారంలో ఆర్టీసీ ప్రస్తావన..
నష్టాల్లో కూరుకుపోయి దివాలా దిశలో ఉన్న ఆర్టీసీని ఆదుకుని తిరిగి నిలబెట్టిన ఘనత తమదే అని బీఆర్‌ఎస్ నేత లు ప్రచారం చేస్తున్నారు. దీనికి కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం వంచించిందని, వారికి అందాల్సిన దీర్ఘకాలిక బకాయిలను కూడా చెల్లించక ఇబ్బంది పెడుతోందని చెబుతోంది. బస్సుల సంఖ్య తగ్గించి ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని, తెలంగాణ వచ్చిన తర్వాత అసలు ఆర్టీసీలో నియామకాలే చేపట్టలేదని, ఫలితంగా ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని పేర్కొంటోంది.
ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు రుణాలు ఇస్తూ ఉపయోగపడే సహకార పరపతి సంఘం నిధులు వాడేసుకుందని, సంస్థకు ప్రభు త్వం నుంచి నిధులు రాక సహకార పరపతి సంఘం మూతపడబోతోందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ప్రభుత్వంలో విలీనం చేయటం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతనాలు అందబోతున్నాయని బీఆర్‌ఎస్ చెప్తోంటే, విలీనం పేరుతో కాలయాపన చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క నెల కూడా వేతనాలు అందించలేకపోయిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
బీజేపీ కూడా ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పిస్తోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి మద్దతుగా ఉద్యోగులు బీఆర్‌ఎస్‌కు అండగా నిలుస్తారో, ఏళ్లు గడుస్తున్నా బకాయిలు చెల్లించకపోవటం, సీసీఎస్‌ను నిర్వీర్యం చేయటం, నియామకాలు లేకపోవటాన్ని పరిగణనలోకి తీసుకుని వేరే పార్టీలకు మద్దతుగా నిలుస్తారో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment