Prabhakara Rao
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు మొదటిసారి స్పందించారు. ప్రభాకర్‌రావుకు రెడ్ కార్నర్ నోటిసు జారీపై కోర్టులో వాదనలు జరిగాయి. తన వాదనలను అఫిడవిట్ ద్వారా ప్రభాకర్‌రావు వివరించారు. తాను అప్పటి డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్‌ల పర్యవేక్షణలో పనిచేశానన్నారు.‘‘నేను ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడలేదు. నేను కూడా కేసీఆర్ బాధితుడినే. కారణం లేకుండానే నన్ను నల్లగొండ నుంచి బదిలీ చేశారు. చాలా రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. కేసీఆర్‌ది, నాది ఒకే కులం అయినందున నన్ను నిందిస్తున్నారు. క్యాన్సర్ చికిత్స కోసం నేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నా.. చికిత్స పూర్తయ్యాక ఇండియాకు వస్తా’’ అని ప్రభాకర్ రావు తెలిపారు.కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుతో పాటుగా మరో ప్రైవేటు వ్యక్తిని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇక, ప్రభాకర్ రావుతో పాటుగా సదరు ప్రైవేటు వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే జరిగిందని పోలీసులు తేల్చారు.మరోవైపు.. ఎస్ఐబీలో హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడంలో కూడా ప్రభాకర్ రావే ప్రధాని సూత్రధారి అని పోలీసులు వెల్లడించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అలాగే, ప్రభాకర్ రావు చెప్పిన నంబర్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్టు చెప్పారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారని అన్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావుకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ‘ఆసరా’పై దెబ్బ
హైదరాబాద్‌లోని సీతాఫల్‌మండికి చెందిన ఆయన వయసు 73 సంవత్సరాలు.. ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. రిటైర్మెంట్ బెనిఫిట్ డబ్బులను ఆర్టీసీ సహకార పరపతి సంఘం(సీసీఎస్)లో డిపాజిట్ చేయగా దానిపై నెలకు రూ.15 వేల వడ్డీ వస్తోంది. ఇప్పుడు ఆయన పూర్తిగా ఈ వడ్డీపైనే ఆధారపడి ఉన్నారు. కానీ మూడు నెలలుగా రాకపోతుండటంతో ఆయనకు దిక్కుతోచని దుస్థితి ఎదురైంది. వరంగల్ జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ రిటైర్ అయి పదేళ్లయింది. తన రిటైర్మెంట్ బెనిఫిట్‌ను సీసీఎస్‌లో దాచుకోగా నెలకు రూ.9 వేల వడ్డీ వస్తోంది. చిన్నచిన్న పనులు చేసుకుంటూ తనకు వచ్చే వడ్డీ ఆసరాగా భార్యతో కలిసి బతుకీడుస్తున్నాడు. కానీ ఇప్పుడు వడ్డీ నిలిచిపోవటంతో ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇలా వీరిద్దరిదే కాదు.. చాలామంది ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల వేదన ఇది. సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న సీసీఎస్ నిధులను ఆర్టీసీ వాడేసుకుని ఖాళీ చేయటంతో ఇప్పుడు ఆ సంస్థ విశ్రాంత ఉద్యోగులకు దిక్కు తోచని పరిస్థితి ఎదురైంది. ఉద్యోగం చేస్తున్న కాలంలో నెలవారీ వాటాగా నమోదైనమొత్తం, పదవీ విరమణ సమయంలో వచ్చిన బెనిఫిట్ మొత్తాలను చాలా మంది సీసీఎస్‌లో పొదుపు చేసుకున్నారు. బ్యాంకు కంటే మెరుగైన వడ్డీ పొందే వీలుండటమే దీనికి కారణం. ఆర్థికంగా మెరుగ్గా ఉన్న వారి సంగతి పక్కన పెడితే, పేదరికంలో మగ్గుతున్నవారు మాత్రం ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీపైనే ఆధారపడుతున్నారు. కానీ సీసీఎస్ నిధులను ఆర్టీసీ వాడేసుకుని ప్రస్తుతం రూ.932 కోట్లు బకాయిపడింది. నెలవారీగా ప్రస్తుతం సీసీఎస్ కోసం ఉద్యోగుల జీతాల నుంచి మినహాయిస్తున్న రూ.19 కోట్లను ఆర్టీసీ సీసీఎస్‌కు పూర్తిగా చెల్లించటం లేదు. గత నెల కేవలం రూ.కోటి మాత్రమే ఇచ్చింది. దీంతో డిసెంబరు నుంచి విశ్రాంత ఉద్యోగులకు చెల్లించే వడ్డీ పంపిణీ నిలిచిపోయింది. దీంతో చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీసీఎస్ కార్యాలయం చుట్టూ తిరిగి ఫలితం లేక ఉస్సూరు మంటున్నారు. రూ.కోటి కూడా కష్టమేనా.. సీసీఎస్‌లో ప్రస్తుతం ఐదున్నర వేల మంది విశ్రాంత ఉద్యోగులు డిపాజిట్లు పెట్టుకున్నారు. వారి డిపాజిట్ల మొత్తం దాదాపు రూ. 150 కోట్లు. దీనిపై ప్రతినెలా రూ.కోటి వరకు వడ్డీని చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు ఆ రూ.150 కోట్లు లేవు. నెలవారీ వడ్డీకి సరిపడా రూ.కోటి కూడా అందుబాటులో లేదు. దీంతో మూడు నెలలుగా వడ్డీ చెల్లింపు ఆపేశారు. గతంలో పది వేల మంది విశ్రాంత ఉద్యోగుల డిపాజిట్లు ఉండగా, సీసీఎస్ పరిస్థితి గందరగోళంగా మారటంతో సగం మంది డిపాజిట్లు వెనక్కు తీసుకున్నారు. తాజా గందరగోళంతో ఇప్పుడు కొత్తగా 150 మంది సభ్యత్వం రద్దుకు దరఖాస్తు చేసుకున్నారు. మందులకు కూడా డబ్బుల్లేవు ‘‘సీసీఎస్‌లో దాచుకున్న రిటైర్మెంట్ బెనిఫిట్ మొత్తం సహా ఇతర డిపాజిట్ల నుంచి నాకు నెలకు రూ.15 వేలు వస్తాయి. నాకు, హృద్రోగ బాధితురాలైన నా భార్యకు నెలకు మందులకే రూ.20 వేల ఖర్చవుతుంది. సీసీఎస్ వడ్డీ మమ్మల్ని ఆదుకుంటోంది. కానీ గత మూడు నెలలుగా వడ్డీ అందటం లేదు. ఒకప్పుడు ఆసియాలోనే గొప్ప పొదుపు సంస్థగా వెలిగిన సీసీఎస్‌కు మళ్లీ పూర్వవైభవం తెప్పించి నా లాంటి వారిని ఆదుకోవాలి.’’ – ప్రభాకరరావు, రిటైర్డ్ ఏడీసీ -
రేవంత్‌పై భగ్గుమన్న విద్యుత్ ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును గన్‌పార్క్ వద్ద బహిరంగంగా కాల్చిచంపినా తప్పులేదన్న మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై విద్యుత్ ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ఎంపీ వాఖ్యలకు నిరసనగా శుక్రవారం ఆ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్‌సౌధ నుంచి గన్‌పార్క్ వరకు భారీ ర్యాలీ జరిపారు. అనంతరం మింట్‌కాంపౌండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని వారంతా మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ.. నిజాయితీ పరుడైన ట్రాన్స్‌కో సీఎండీ ని కాల్చిచంపాలని చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. తన వాఖ్యలను ఉపసంహరించుకుని, సీఎండీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ రేవంత్ విద్యుత్ సంస్థలపై అడ్డగోలు ఆరోపణలు చేసి, వాటిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కార్యక్ర మంలో పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ సంఘాలతోపాటు 2వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు. -
జెన్కోతో బీహెచ్ఈఎల్ చర్చలు
సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్ కేంద్రాలపై తెలంగాణ జెన్కో.. బీహెచ్ఈఎల్తో సంప్రదింపులు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా గురువారం టీఎస్జెన్కో సీఎండీ ప్రభాకరరావుతో బీహెచ్ఈఎల్ సీఎండీ ప్రసాదరావు భేటీ అయ్యారు. మణుగూరులో 1,080 మెగావాట్ల విద్యుత్తు కేంద్రాన్ని రెండేళ్లలో.. కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల ఏడో యూనిట్‌ను మూడేళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని టీఎస్ జెన్కో లక్ష్యంగా నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.