సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో దశ కోవిడ్ సమయం లో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పిల్లలు అనాథలయ్యారు. అలాంటి పిల్లలను గుర్తించేం దుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల ద్వారా సమాచార సేకరణ చేపట్టింది.
ఇందులో భాగంగా రాష్ట్రంలో 236 మంది పిల్లలు పాక్షిక, పూర్తి అనాథలైనట్లు తేల్చింది. తాజాగా కోవిడ్–19 మూడో దశ కూడా తీవ్రంగా ఉంది. వైరస్ వ్యాప్తి పెరుగుతుండగా.. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఈనేపథ్యంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సమాచారాన్ని సేకరించాలని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖను ఆదేశించింది.
జిల్లా కార్యాలయానికి సమాచారం..
కరోనా వైరస్ ప్రభావంతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలుంటే ఆ సమాచారాన్ని నేరుగా జిల్లా సంక్షేమాధికారి కార్యాలయానికి చేరవేయాలి. ప్రభుత్వం ఈ బాధ్యతలను అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు అప్పగించింది. తల్లిదండ్రుల్లో ఒకరు మరణిస్తే పాక్షిక అనాథగా, ఇద్దరు మరణిస్తే పూర్తి అనాథగా గుర్తించి ఆ సమాచారాన్ని జిల్లా కార్యాలయానికి చేరవేయాలి. తల్లిదండ్రుల మరణం నేపథ్యంలో వారి ఆర్థిక స్థితిని అంచనా వేసి తక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలకు తరలించాలి.
ఈ ప్రక్రియను శిశుసంక్షేమ ప్రాజెక్టు కార్యాలయం (సీడీపీఓ) ఆధ్వర్యంలో చేపట్టాలి. రాష్ట్రంలో ఇప్పటివరకు 236 మంది పిల్లలు అనాథలైనట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ప్రస్తుతం 11 మంది మాత్రమే ప్రభుత్వ సంక్షేమ గృహాల్లో వసతి పొందుతున్నారు. మిగతా పిల్లలు వారి సమీప బంధువుల వద్ద ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. పిల్లల వయసు బట్టి ప్రభుత్వ గృహాలకు పంపే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలో జారీ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment