సాక్షి, హైదరాబాద్: మహిళలు పనిచేసేచోట మరింత భద్రత కల్పించేలా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముందడుగు వేసింది. ‘సెక్సువల్ హరాస్‌మెంట్ ఆఫ్ వుమెన్ ఎట్ వర్క్‌ప్లేస్’చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఉపక్రమించింది. ఇప్పటివరకు ఈ చట్టం కింద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉండగా, ఇకపై ఆన్‌లైన్ ద్వారా వినతులు స్వీకరించే వ్యవస్థను అందుబాటులోకి తెస్తోంది. మాన్యువల్ పద్ధతిలో ఫిర్యాదు చేయడంలో ఉన్న ఇబ్బందుల వల్ల ఎక్కువ మంది మహిళలు ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చేవారు కాదు. ఫిర్యాదు చేయకుండా వేధింపులను సహిస్తూ వస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో ఈ పరిస్థితిని అధిగమిస్తూ ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచేలా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ప్రతి కార్యాలయంలో షీ బాక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిం ది. వీటిని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలే నిర్వహించనున్నాయి. ఈ పెట్టె ద్వారా వచ్చే ఫిర్యాదుల ను పరిశీలించి పరిష్కరించేలా జిల్లా, డివిజన్ స్థాయిల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనుంది. షీ బాక్స్‌లతోపాటు ఆన్‌లైన్ పద్ధతిలో ఫిర్యాదులు స్వీకరించేందుకు వెబ్‌పేజీని తెరిచేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఈ చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేకంగా యాప్‌ను సైతం అందుబాటులోకి తేనుంది. వెబ్‌పేజీ, యాప్‌ల రూపకల్పన పూర్తి కాగా, ప్రస్తు తం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వచ్చే నెలలో ప్రారంభించేలా ఆ శాఖ సన్నాహాలు చేస్తోంది.
నిర్వహణకు ప్రత్యేక విభాగం
ప్రభుత్వ కార్యాలయాల్లో షీ బాక్స్‌లతోపాటు వెబ్‌పేజీ, యాప్ నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా జిల్లా స్థాయిలో మహిళా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ విభాగంలో ఒక మహిళా సంక్షేమాధికారి, ఇద్దరు సమన్వయకర్తలుంటారు. ఇప్పటివరకు గృహహింస చట్టం సెల్ (విభాగం) పర్యవేక్షిస్తున్న సోషల్ కౌన్సిలర్, లీగల్ కౌన్సిలర్లను కోఆర్డినేటర్లుగా నియమించేందుకు ఆ శాఖ నిర్ణయించింది. డీవీ సెల్‌ను సఖి కేంద్రాల్లో విలీనం చేయడంతో అక్కడి సిబ్బందిని మహిళా శక్తి కేంద్రాల్లో కొనసాగించేందుకు ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కోఆర్డినేటర్లు మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులను గోప్యంగా ఉంచుతూ బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు చట్టపరమైన చర్యలకు సహకరిస్తారు. అదేవిధంగా న్యాయపరమైన సాయం అందిస్తూ చట్టం పట్ల అవగాహన కల్పించి చైతన్యపరుస్తారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక విభాగాలతో పాటు డివిజన్ స్థాయిలోనూ ప్రత్యేకంగా కమిటీలు పనిచేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment