
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు శిల్పారామంలో ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఈ ఫెస్టివల్‌ను ప్రతి సంవత్సరం ఢిల్లీలో నిర్వహించేవారు. అయితే ఈ సారి హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.జగదీశ్వర్ తెలిపారు. ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ ఏర్పాట్ల నేపథ్యంలో సోమవారం శిల్పారామంలోని సంప్రదాయ హాల్‌లో సంచాలకులు బోయి విజయేందిరతో కలసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సేంద్రియ పద్ధతుల్ని ప్రోత్సహించి ఆరోగ్య భారతాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
దేశవ్యాప్తంగా 150 మంది మహిళా ప్రతినిధులు ఇందులో పాల్గొంటారన్నారు. సేంద్రియ రంగంలో కృషి చేస్తున్న మహిళలు ఇక్కడ ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేసి సేంద్రియ సాగు ఉత్పత్తులు, విత్తనాలు, బేకరీ ఉత్పత్తులు, తినుబండారాలను ఇక్కడ ప్రదర్శిస్తారని తెలిపారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు స్టాళ్లు తెరిచి ఉంటాయని చెప్పారు. సేంద్రియ పద్ధతుల్ని మరింత ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని, పురుగుమందులు, రసాయనిక ఎరువుల వినియోగం అధికమవుతుండటంతో మనుషులపై వాటి దుష్ప్రభావాలు పెరిగాయన్నారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment