శనివారం జరిగిన మంత్రి వర్గ ఉపకమిటీ సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్, వెంగళరావునగర్: రాష్ట్రంలోని అనాథలను సంరక్షించేందుకు దేశం గర్వించేలా సమగ్ర చట్టం తీసుకొస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో శనివారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్. సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్, వినోద్‌కుమార్, మహిళా శిశుసంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల్లో దేశానికి దిక్సూచిలా ఉన్న తెలంగాణ అనాథల విషయంలో తల్లిదండ్రులుగా మరో అద్భుత విధానానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో అనాథలు ఉండొద్దనే సంకల్పంతో వారిని రాష్ట్ర బిడ్డలుగా పరిగణిస్తామన్నారు. అనాథల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లు పెట్టి ప్రత్యేక గురుకులాల్లో నాణ్యమైన విద్యనందించి జీవితంలో స్థిరపడేలా ప్రత్యేక రక్షణ కల్పిస్తామన్నారు. సబ్ కమిటీ సమావేశం అనంతరం స్టేట్ హోం ప్రాంగణంలో రసాయనాలు లేకుండా పండించేందుకు ఏర్పాటు చేసిన న్యూట్రిగార్డెన్‌ను కేటీఆర్ సందర్శించి కమిషనర్‌ను అభినందించారు.
సబ్ కమిటీ సూచనలు...
♦అనాథ పిల్లల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై పీడీ చట్టం పెట్టి భవిష్యత్‌లో ఎవరూ ఇలా చేయకుండా కఠిన చర్యలు తీసుకొనేలా నిబంధనలు రూపొందించాలి.
♦అనాథలను ప్రభుత్వ బిడ్డలుగా గుర్తించడంతోపాటు వారికి ప్రత్యేక స్మార్ట్ ఐడీ కార్డులు ఇవ్వాలి. ఈ కార్డులు ఉంటే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతోపాటు ఇతర సర్టిఫికెట్లకు మినహాయింపు ఉండేలా చర్యలు తీసుకోవాలి.
♦ముస్లింలలో అనాథలను చేరదీసే విధంగా నిర్వహిస్తున్న యతీమ్‌ఖానాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి అన్ని విధాలా అండగా నిలబడాలి.
♦ప్రభుత్వ బిడ్డల కోసం చేసే ఖర్చును గ్రీన్ చానల్‌లో పెట్టాలి. ఆ ఏడాది నిధులు ఖర్చుకాకపోతే వచ్చే ఏడాది ఉపయోగించుకొనే విధానం పెడితే వారికి శాశ్వత ఆర్థిక భద్రత లభిస్తుంది.
♦ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద భిక్షాటన చేసే పిల్లలను గుర్తించి వారికి ప్రభుత్వ హోమ్స్‌లలో షెల్టర్ కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment