సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీ ఆలస్యం! | Telangana Delay Of Supervisor Posts | Sakshi
Sakshi News home page

సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీ ఆలస్యం!

Published Sun, Apr 24 2022 2:53 AM | Last Updated on Sun, Apr 24 2022 3:32 PM

Telangana Delay Of Supervisor Posts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయానికి ఈ పోస్టుల భర్తీ ముడిపడి ఉండటంతో ఈ ప్రక్రియ పూర్తవడానికి మరింత సమయం వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సూపర్‌వైజర్లను క్రమబద్ధీకరిస్తే మరింత మందికి కొత్త కొలువులు వచ్చే అవకాశముందని యంత్రాంగం భావిస్తోంది. దీంతో క్రమబద్ధీకరణ పూర్తయ్యే వరకు వేచిచూసే ధోరణిలో ఉంది. 

అంగన్‌వాడీ టీచర్లకు అవకాశమిస్తూ..
రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో 420 సూపర్‌వైజర్‌ ఉద్యోగాల భర్తీకి ఆ శాఖ గతేడాది నవంబర్‌లో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పోస్టులను కొత్త అభ్యర్థులతో కాకుండా ఇప్పటికే శాఖలో కొనసాగుతున్న అంగన్‌వాడీ టీచర్లతోనే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పదేళ్ల సీనియారిటీ, పదో తరగతి ఉత్తీర్ణత ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన పెట్టింది.

ప్రస్తుతం ఈ శాఖలో కొనసాగుతున్న కాంట్రాక్టు సూపర్‌వైజర్లకు వెయిటేజీని ఇస్తూ వారినీ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 2న అర్హత పరీక్ష పెట్టి తర్వాత ఫలితాలను వెల్లడించింది. ఈక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ పూర్తయితే 420 ఉద్యోగాలను అర్హత పరీక్ష ద్వారా వడపోసిన అభ్యర్థులతోనే నేరుగా భర్తీ చేసేందుకు వీలుంటుంది. ఇతర అభ్యర్థులకు లబ్ధి జరుగుతుంది. దీంతో ఫలితాలు విడుదలైనా అర్హుల ప్రాథమిక జాబితాలను ఇంకా ఖరారు చేయలేదు. 

ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు సన్నాహాలు 
కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాలు, స్థానికత తదితర అంశాలపై స్పష్టత కోసం వారి సర్టిఫికెట్ల పరిశీలన, క్షేత్రస్థాయిలో నిర్ధారణ ప్రక్రియకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఫలితాల ప్రకటన తర్వాత 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ప్రాథమికంగా ఎంపిక చేసి వారి ధ్రువపత్రాల పరీశీలనకు ఉపక్రమించింది. వ్యూహాత్మకంగా ముందస్తు ప్రక్రియ పూర్తి చేస్తే క్రమబద్ధీకరణపై స్పష్టత వచ్చాక వేగంగా నియామకాలు చేపట్టవచ్చని ఆ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement