Supervisor Posts
-
Telangana: అంగన్వాడీ పోస్టుల భర్తీలో గోల్మాల్.. ఈ ప్రశ్నలకు బదులేది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో నిబంధనలు పాటించకుండా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోస్టర్ పాటింపులో గందరగోళం తలెత్తిందని, మరోవైపు ఇన్స్ట్రక్టర్లకు రిజర్వ్ చేసిన పోస్టులను ఇతరులతో భర్తీ చేశారని, దివ్యాంగుల కోటాలోనూ అనర్హులను ఎంపిక చేశారంటూ అభ్యర్థులు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ ఎదుట నిరసనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇతరుల ప్రవేశానికి అనుమతి ఇవ్వకుండా కమిషనరేట్ అధికారులు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. 434 పోస్టులకి వేలల్లో దరఖాస్తులు ►రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో 434 గ్రేడ్–2 సూపర్వైజర్(ఎక్స్టెన్షన్ ఆఫీసర్) పోస్టులకు గతేడాది సెప్టెంబర్ 30న ఆ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులను కొత్త వారితో కాకుండా ఇప్పటికే అంగన్వాడీల్లో టీచర్లుగా పనిచేస్తూ పదేళ్ల అనుభవం ఉండి పదోతరగతి ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పించింది. ఈ పోస్టుల్లో 5 శాతం కోటాను అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్లు, మిడిల్ లెవల్ ట్రైనింగ్ సెంటర్లో పనిచేస్తున్న కోఆర్డినేటర్లు/ఇన్స్ట్రక్టర్లకు రిజర్వ్ చేయగా... మరో 15 శాతం మార్కులను ఇప్పటికే కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న సూపర్వైజర్లకు కేటాయించింది. కానీ కాంట్రా క్టు సూపర్వైజర్ ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించడంతో వారంతా ఈ నోటిఫికేషన్ పరిధిలోకి రాకుండానే ప్రభుత్వ కొలువుల్లో చేరిపోయారు. ఇక నోటిఫికేషన్ వెలువడిన క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 23వేల మంది అంగన్వాడీ టీచర్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ఏడాది జనవరి రెండో తేదీన అర్హత పరీక్ష నిర్వహించిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ... ఫిబ్రవరిలో ఫలితాలను ప్రకటించింది. ఆ తర్వాత మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాలను రూపొందించి ప్రాథమిక అర్హుల జాబితా అనంతరం... ఇటీవల తుది జాబితాను విడుదల చేసి వారికి పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే తుది జాబితాలో నిబంధనలు పాటించకుండా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి. ►మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో మొత్తం 434 పోస్టులకు హైదరాబాద్, వరంగల్ రీజియన్లు వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. మొత్తం పోస్టుల్లో 427 పోస్టులు భర్తీ అయ్యాయి. 7 పోస్టులకు అభ్యర్థులు లేకపోవడంతో ఖాళీగా ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. భర్తీ చేసిన 427 పోస్టుల్లో 15 మంది ఇన్స్ట్రక్టర్లకు అవకాశం కల్పించారు. ►5 శాతం పోస్టులను ఇన్స్ట్రక్టర్లు/కోఆర్డినేటర్లకు అవకాశం కల్పిస్తున్నట్లు నోటిఫికేషన్లో ప్రకటించారు. ఈ క్రమంలో సగటున 22 పోస్టులు ఇన్స్ట్రక్టర్లు/కోఆర్డినేటర్లకు దక్కాల్సి ఉండగా... కేవలం 15 పోస్టులతోనే సరిపెట్టారు. అయితే రిజర్వ్ చేసిన పోస్టులను కమ్యూనిటీ రిజర్వేషన్లతో భర్తీ చేయడం.. పలు అనుమానాలకు తావిచ్చినట్లయింది. ►కొన్నిచోట్ల కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా మెరిట్‌ను పరిశీలిస్తే తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థి అర్హత సాధించగా... అదే కేటగిరీకి చెందిన మరో అభ్యర్థికి ఎక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగం రాలేదు. ఉదాహరణకు జోన్–7 పరిధిలో ఎస్సీ కేటగిరీకి చెందిన అభ్యర్థికి 10.125 మార్కులు వచ్చినప్పటికీ ఉద్యోగం వచ్చింది. కానీ అదే ఎస్సీ కేటగిరీకి చెందిన అభ్యర్థికి 13.125 మార్కులు వచ్చినా కొలువు దక్కలేదు. ►ఇక ఖమ్మం జిల్లాలోని ఓ అభ్యర్థి దరఖాస్తులో వైకల్యం లేదని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ సదరు అభ్యర్థికి దివ్యాంగుల కోటాలో ఉద్యోగం దక్కింది. వాస్తవానికి వైకల్యం ఉన్న అభ్యర్థికి కొలువు రాలేదు. మహబూబ్‌నగర్, వికారాబాద్ తదితర జిల్లాల్లో కూడా దివ్యాంగులైన అభ్యర్థులకు అవకాశం రాలేదంటూ లబోదిబోమంటున్నారు. ►కాగా నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగానే పోస్టుల భర్తీ జరిగిందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
ప్రాథమిక జాబితా ఏది.. కటాఫ్ మార్కులేవి?
సాక్షి, హైదరాబాద్: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో సూపర్వైజర్ పోస్టుల నియామకాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నియామకాల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని క్షేత్రస్థాయి నుంచి సంబంధిత మంత్రి పేషీ, రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రాథమిక జాబితాను, కటాఫ్ మార్కులను ప్రకటించకుండా ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాల వారీగా ఎవరెవరు ఎంపికయ్యారో: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో 420 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. అంగన్వాడీ టీచర్‌గా పదేళ్ల సీనియారిటీ, పదో తరగతి విద్యార్హతలను విధించడంతో దాదాపు 24 వేల మంది అభ్యర్థులు జనవరి రెండో తేదీన పరీక్ష రాశారు. రాత పరీక్ష తాలూకు ఫలితాలను ఫిబ్రవరిలో ప్రకటించిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జిల్లాల వారీగా ఉన్న ఖాళీల ప్రకారం 1:2 పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చింది. దీంతో నిర్దేశించిన తేదీల్లో అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. అయితే జిల్లాల వారీగా ఎవరెవరు ప్రాథమికంగా ఎంపికయ్యారో స్పష్టత లేదు. అధికారుల వద్ద జాబితా ఉన్నా ఆ వివరాలను వెబ్సైట్లో లేదా జిల్లా కార్యాల యాల్లో అందుబాటులో ఉంచ కపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాల వారీగా, కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులనూ ఆ శాఖ వెల్లడించలేదు. దీంతో తమ కంటే తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను ఎంపిక చేశారంటూ ఉన్నతాధికారులకు, సంబంధిత మంత్రి కార్యాలయానికి పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. మరోవైపు మంత్రిని, ఆ శాఖ కమిషనర్‌ను వ్యక్తిగతంగా కలిసి సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్ సూపర్వైజర్ పోస్టుల నియామకాలపై వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా ఫిర్యా దులు స్వీకరిస్తోంది. అభ్యర్థుల ప్రశ్నలకు వీలైనంత మేర సమాధానాలిస్తున్నామని చెబుతున్నారు. హెల్ప్‌లైన్ ఏర్పాటుతో మంత్రి పేషీకి, కమిషనరేట్‌కు అభ్యర్థుల తాకిడి తగ్గినా ఫిర్యాదులు మాత్రం తగ్గట్లేదు. కాగా, జిల్లాల వారీగా మెరిట్ జాబితా, ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితా, కేటగిరీల వారీగా కటాఫ్ వివరాలను మాత్రం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఇప్పటికీ ప్రకటించలేదు. -
సూపర్వైజర్ పోస్టుల భర్తీ ఆలస్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని సూపర్వైజర్ పోస్టుల భర్తీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయానికి ఈ పోస్టుల భర్తీ ముడిపడి ఉండటంతో ఈ ప్రక్రియ పూర్తవడానికి మరింత సమయం వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సూపర్వైజర్లను క్రమబద్ధీకరిస్తే మరింత మందికి కొత్త కొలువులు వచ్చే అవకాశముందని యంత్రాంగం భావిస్తోంది. దీంతో క్రమబద్ధీకరణ పూర్తయ్యే వరకు వేచిచూసే ధోరణిలో ఉంది. అంగన్వాడీ టీచర్లకు అవకాశమిస్తూ.. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో 420 సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి ఆ శాఖ గతేడాది నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులను కొత్త అభ్యర్థులతో కాకుండా ఇప్పటికే శాఖలో కొనసాగుతున్న అంగన్వాడీ టీచర్లతోనే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పదేళ్ల సీనియారిటీ, పదో తరగతి ఉత్తీర్ణత ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన పెట్టింది. ప్రస్తుతం ఈ శాఖలో కొనసాగుతున్న కాంట్రాక్టు సూపర్వైజర్లకు వెయిటేజీని ఇస్తూ వారినీ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 2న అర్హత పరీక్ష పెట్టి తర్వాత ఫలితాలను వెల్లడించింది. ఈక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ పూర్తయితే 420 ఉద్యోగాలను అర్హత పరీక్ష ద్వారా వడపోసిన అభ్యర్థులతోనే నేరుగా భర్తీ చేసేందుకు వీలుంటుంది. ఇతర అభ్యర్థులకు లబ్ధి జరుగుతుంది. దీంతో ఫలితాలు విడుదలైనా అర్హుల ప్రాథమిక జాబితాలను ఇంకా ఖరారు చేయలేదు. ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు సన్నాహాలు కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాలు, స్థానికత తదితర అంశాలపై స్పష్టత కోసం వారి సర్టిఫికెట్ల పరిశీలన, క్షేత్రస్థాయిలో నిర్ధారణ ప్రక్రియకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఫలితాల ప్రకటన తర్వాత 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ప్రాథమికంగా ఎంపిక చేసి వారి ధ్రువపత్రాల పరీశీలనకు ఉపక్రమించింది. వ్యూహాత్మకంగా ముందస్తు ప్రక్రియ పూర్తి చేస్తే క్రమబద్ధీకరణపై స్పష్టత వచ్చాక వేగంగా నియామకాలు చేపట్టవచ్చని ఆ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
Army Jobs: 502 ఆర్మీ పోస్టులు, నెలకు రూ.35,400
భారత సైనిక విభాగానికి చెందిన మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్‌లో ఖాళీగా ఉన్న 502 సూపర్వైజర్(బ్యారక్ స్టోర్), డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టుల భర్తీకి ఎంఈఎస్ నోటిఫికేషన్–2021 విడుదలైంది. మిలిటరీ సర్వీస్‌లో సేవలు అందించాలనుకునే అర్హత గల అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో.. అందుబాటులో ఉన్న ఖాళీలు, విద్యార్హతలు, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకుందాం... పోస్టుల సంఖ్య: 502 ఎంఈఎస్–2021 నోటిఫికేషన్ ద్వారా మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్‌లో ఖాళీగా ఉన్న మొత్తం 502 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 450 సూపర్వైజర్ పోస్టులు, 52 డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు ► డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్ అసిస్టెంట్స్‌షిప్‌లో డిప్లొమా ఉండాలి. దీంతో పాటు ఆటోక్యాడ్, ఆపరేషన్ ఆఫ్ జిరాక్స్, ప్రింటింగ్ అండ్ లామినేషన్ మెషీన్‌పై ఏడాది కాలం అనుభవం అవసరం. ► సూపర్వైజర్ పోస్టులకు ఎకనామిక్స్/కామర్స్/స్టాటిస్టిక్స్/బిజినెస్ స్టడీస్/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ డిగ్రీ తప్పనిసరి. దీంతోపాటు స్టోర్స్ అండ్ అకౌంట్స్ మెయింటెనెన్స్‌లో ఏడాది అనుభవం తప్పనిసరి.లేదా ఎకనామిక్స్/కామర్స్/ స్టాటిస్టిక్స్/బిజినెస్ స్టడీస్/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రాడ్యుయేషన్‌తోపాటు మెటీరియల్ మేనేజ్మెంట్/వేర్ హౌసింగ్ మేనేజ్మెంట్/ పర్చేజ్/లాజిస్టిక్స్/ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో డిప్లొమా,స్టోర్స్ అకౌంట్స్ మెయింటెనెన్స్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. ► రెండు విభాగాల పోస్టులకు అభ్యర్థుల వయసు దరఖాస్తు చేసుకునే నాటికి 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం–ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తారు. వేతనం ► సూపర్వైజర్, డ్రాఫ్ట్స్మెన్గా ఎంపికైనవారు పే లెవెల్–6 ప్రకారం నెలకు రూ.35,400 – 1,12,400 వరకూ వేతనం అందుతుంది. పరీక్ష విధానం ► పరీక్ష మల్టిపుల్ చాయిస్ విధానం ఉం టుంది. 125 మార్కులకు 100 ప్రశ్నలకు రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. సిలబస్‌లో నాలుగు విభాగాలు ఉంటాయి. ► జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్– 25 ప్రశ్నలు –25 మార్కులు; ► జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంగ్లిష్– 25 ప్రశ్నలు–25 మార్కులు; న్యూమరికల్ ఆప్టిట్యూడ్–25 ప్రశ్నలు –25 మార్కులు; ► స్పెషలైజ్డ్ టాపిక్ – 25 ప్రశ్నలు– 50 మార్కులకు ఉంటుంది. ముఖ్యమైన తేదీలు ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ► దరఖాస్తులకు చివరి తేదీ: 12.04.2021 ► రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100 (ఎస్సీ/ఎస్టీ/ వికలాంగులకు ఫీజు లేదు) ► రాత పరీక్ష తేది: 16.05.2021 ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్, విశాఖపట్నం ► వెబ్సైట్: దరఖాస్తు కోసం https://www.mesgovonline.com/mesdmsk/లో ‘న్యూ రిజిస్ట్రేషన్’ లింక్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆర్మీ జాబ్స్.. ఏప్రిల్ 18న ఎన్డీఏ; ఎగ్జామ్ టిప్స్ -
అమ్మకానికి అంగన్వాడీ సుపర్వైజర్ పోస్టులు
-
సూపర్వైజర్ పోస్టులు.. సర్కస్ ఫీట్లు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసీడీఎస్ గ్రేడ్-2 సూపర్వైజర్ రెగ్యులర్ పోస్టుల నియామకాల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. డెరైక్టరేట్ స్థాయిలోనే అక్రమాలకు బీజం పడటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. నిబంధనలకు పాతరేశారంటూ ఇప్పటికే గుంటూరు జిల్లా పత్తిపాడు ప్రాజెక్టుకు చెందిన అంగన్వాడీ కార్యకర్త హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా లోకాయుక్త కూడా జోక్యం చేసుకుంది. సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టీ గంగాధర్ ఫిర్యాదుతో జస్టిస్ సుభాషణ్‌రెడ్డి స్పందించారు. రాష్ట్రంలోని పది మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక ఐఎఫ్ఎస్ అధికారి, మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన ఆరుగురు రీజనల్ డిప్యూటీ డెరైక్టర్లకు నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 12వ తేదీలోగా సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి సమగ్రమైన నివేదికలు అందించాలని ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 1741 గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టులకు ఈ ఏడాది జూలై రెండో తేదీ నోటిఫికేషన్ జారీ చేశారు. అభ్యర్థుల వయసు దగ్గర నుంచి అర్హత వరకు నిబంధనలను పక్కన పెట్టేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను సైతం పక్కన పెట్టేశారు. అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్ కోఆర్డినేటర్ అండ్ ఇన్స్ట్రక్టర్లకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వడం వివాదానికి దారితీసింది. కాంట్రాక్టు సూపర్వైజర్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారికి కంటిన్యూషన్ ఆర్డర్ ఇవ్వకపోవడం, వారు యథావిధిగా రెగ్యులర్ సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం, వారికి హాల్‌టికెట్లు పంపించడం కూడా వివాదాస్పదమైంది. గుంటూరు జిల్లా పత్తిపాడు ప్రాజెక్టు పరిధిలోని పెదనందిపాడు అంగన్వాడీ కార్యకర్త ఎం రమాదేవి హైకోర్టును ఆశ్రయించగా, సూపర్వైజర్ల పోస్టులకు సంబంధించి కౌంటర్ (డబ్ల్యూఏ 1746) ఇవ్వాలంటూ మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, కమీషనర్, సాధారణ పరిపాలన శాఖ కమిషనర్లతోపాటు ఆయా జిల్లాల కలెక్టర్లు, రీజనల్ డిప్యూటీ డెరైక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. తాజాగా లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి జోక్యం చేసుకొని మహిళా శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమీషనర్లతోపాటు ప్రకాశం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కర్నూలు, విశాఖపట్నం, వరంగల్, హైదరాబాద్ కలెక్టర్లతోపాటు సంబంధిత రీజనల్ డిప్యూటీ డెరైక్టర్లకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్నవారు లోకాయుక్తకు అందించే సమాధానాన్ని బట్టి రాత పరీక్ష రాసిన అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉంది. ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్న’ చందంగా కొంతమంది మహిళా శిశు సంక్షేమశాఖ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం అభ్యర్థులకు శాపంగా పరిణమించింది. ఏ రోజు ఏం జరుగుతుందోనని అభ్యర్థులు ఉత్కంఠకు గురవుతున్నారు. -
305 పోస్టులు.. 3887 మంది అభ్యర్థులు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: మహిళా శిశు సంక్షేమ శాఖలో పెద్ద సంఖ్యలో సూపర్వైజరు పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల పరిధిలోని వారికి ఒంగోలులో ఈ నెల 27వ తేదీ రాత పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. మూడు జిల్లాల పరిధిలో మొత్తం 305 పోస్టులకుగాను 3887 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ప్రకాశం జిల్లా నుంచి 1214 మంది, గుంటూరు జిల్లా నుంచి 1891 మంది, నెల్లూరు జిల్లా నుంచి 782 మంది అభ్యర్థులు ఉన్నారు. అర్హులైన అంగన్వాడీ కార్యకర్తలు, కాంట్రాక్టు సూపర్వైజర్లు, గ్రేడ్-1, గ్రేడ్-2, అంగన్వాడీ శిక్షణ కేంద్రాల్లో పని చేసే కో-ఆర్డినేటర్లు రెగ్యులర్ సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రతిభ, రోస్టర్ పద్ధతిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. సూపర్వైజర్ పోస్టులకు సంబంధించిన మార్గదర్శకాలను మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ డిప్యూటీ డెరైక్టర్ సీహెచ్ కామేశ్వరమ్మ శనివారం విడుదల చేశారు. పరీక్ష నిర్వహణ సిలబస్ ఆరేళ్లలోపు పిల్లలకు పోషణ, రక్షణ, ఆరోగ్య పరీక్షలు, రిఫరల్ సేవలు, వ్యాధి నిరోధక టీకాలు, ఆహార పదార్థాల పంపిణీ, నిర్వహణ, సాధారణ అవగాహన, పూర్వ ప్రాథమిక విద్య, శిశు అభివృద్ధి, స్త్రీ, శిశువుల రక్షణ, గృహ హింస,మహిళలపై హింస సమగ్ర బాలల పరిరక్షణ పథకం, పోషణ, ఆరోగ్యవిద్య, గర్భిణులు, బాలింతలకు కౌన్సెలింగ్ వంటి అంశాలపై పరీక్షల సిలబస్ ఉంటుంది. పరీక్ష ఎలా నిర్వహిస్తారంటే.. = 45 మార్కులకు (90 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలతో) ఓఎంఆర్ షీట్స్ ద్వారా రాత పరీక్ష నిర్వహించనున్నారు. = 8 తప్పుల సమాధానాలకు ఒక మార్కు మూల్యాంకనంలో తగ్గిస్తారు. = గ్రేడ్-1, గ్రేడ్-2 కాంట్రాక్టు సూపర్వైజర్లకు సర్వీస్ వెయిటేజ్ కింద 15 శాతం, బాలసేవిక శిక్షణ పొందిన వారికి 5 మార్కులు అదనంగా కేటాయించనున్నారు. = ఓఎంఆర్ షీట్స్‌లో సమాధానాలను బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతో రాయాలి. పరీక్షలు ఎక్కడ జరుగుతాయంటే.. ప్రకాశం జిల్లా నుంచి దరఖాస్తున్న వారిలో 538 మందికి సంతనూతలపాడు సమీపంలోని ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కాలేజీ ఏ-బ్లాక్ , 676 మందికి బీ-బ్లాక్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో 960 మందికి ఒంగోలులోని రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కాలేజీ, 931 మందికి రైజ్ ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో పరీక్షా కేంద్రాలు కేటాయించారు. నెల్లూరు జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో 336 మందికి ఒంగోలులోని సెయింట్ జేవియర్స్ జూనియర్ కాలేజీ, 288 మందికి సెయింట్ జేవియర్స్ హైస్కూల్, 158 మందికి సంతనూతలపాడు సమీపంలోని ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ ఏ-బ్లాక్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు: ఆర్డీడీ కామేశ్వరమ్మ సూపర్వైజర్ పోస్టులకు ప్రతిభ, రోస్టర్ పద్ధతి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని రీజనల్ డిప్యూటీ డెరైక్టర్ కామేశ్వరమ్మ వెల్లడించారు. అభ్యర్థులు దళారు మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు పరీక్ష రోజు ఉదయం పది గంటలకల్లా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులకు సంబంధిత సీడీపీఓల ద్వారా వారి కార్యాలయాల్లో హాల్ టికెట్లు అందిస్తామన్నారు. ఓఎంఆర్ షీట్స్ భర్తీ చేయించడం, సిలబస్‌పై తరగతుల నిర్వహించడం ద్వారా పరీక్ష విధానంపై అభ్యర్థులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.