సేవ ముసుగులో లైంగిక వేధింపులు
⇒ ‘అవేక్ ఓ వరల్డ్’స్వచ్ఛంద సంస్థ అక్రమాలు
⇒ ఖైదీల పిల్లల సంరక్షణ పేరుతో అరాచకాలు
⇒ ఏ అనుమతుల్లేకుండానే నిర్వహిస్తున్న ప్రేమ్‌రాజ్ వర్మ
⇒ ఆరేళ్లుగా యుక్తవయసు పిల్లలపై లైంగిక వేధింపులు
⇒ నిధులు మింగుతూ యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
⇒ శిశు సంక్షేమ శాఖ ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైన వాస్తవాలు
సాక్షి, హైదరాబాద్: ‘అవేక్ ఓ వరల్డ్’.. జైల్లోని జీవిత ఖైదీల పిల్లలను సంరక్షించేందుకు ప్రపంచాన్ని మేల్కొల్పాలన్న సంకల్పంతో ఏర్పాటైన సంస్థ ఇది. అయితే ప్రపంచాన్ని మేల్కొల్పడం దేవుడెరుగు... ఇన్నాళ్లూ ప్రభుత్వాన్నే మోసపుచ్చుతూ అక్రమాల పుట్టగా మారిందీ సంస్థ. ఎలాంటి అనుమతులు పొందకుండా, కనీసం లెసైన్స్ కూడా లేకుండా ఆరేళ్లుగా ఇది ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. దీన్నంతటినీ ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు సంస్థ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. దాని నిర్వాహకుడు ప్రేమ్‌రాజ్ వర్మ ఆగడాలను తెలుసుకుని నివ్వెరపోయారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు నిర్ణయించారు.
తనిఖీలో బయటపడ్డ వాస్తవాలు
2009 నుంచి హైదరాబాద్‌లోని మౌలాలి ప్రాంతంలో నడుస్తున్న అవేక్ ఓ వరల్డ్ సంస్థకి ఎలాంటి గుర్తింపుగానీ, అనుమతులు కానీ లేవు. ఆరేళ్లుగా ఒక్క రికార్డును కూడా నిర్వహించడం లేదు. పిల్లల వివరాలను కూడా నమోదు చేయడం లేదు. ఐదేళ్ల బాలబాలికల నుంచి యుక్తవయసు పిల్లల వరకు అందరినీ ఒకే హోంలో కలిపే ఉంచుతున్నారు. యుక్తవయసు వారిని విడిగా ఉంచాలన్న నిబంధనను పాటించడం లేదు. టీనేజీ అమ్మాయిలు సంస్థ నిర్వాహకుడు ప్రేమ్‌రాజ్ వర్మ ఇంటి వరండాలోనే ఉంటున్నారు. పైగా వారికి మరుగుదొడ్డి సౌకర్యం కూడా లేదు.
అవసరమైతే వర్మ గదిలోకే వెళ్లాలి. వీరికోసం మహిళా పర్యవేక్షకులెవరూ లేకపోవడం జువెనైల్ యాక్ట్‌కి విరుద్ధం. ఇక్కడి పిల్లలకు రోజూ హోటల్ భోజనమే. వంటమనిషిని కూడా పెట్టుకోలేదు. ఇక సంస్థకు వచ్చే నిధుల వివరాలే లేవు. అలాగే గతంలో ఓ జీవిత ఖైదీ భార్య దిక్కులేక ఇదే హోంలో చేరగా ఆమెపై వర్మ అఘాయిత్యానికి ప్రయత్నించినట్లు తెలిసింది. దీంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకుంది. కాగా, అవేక్ ఓ వరల్డ్ సంస్థ కార్యాలయాన్ని తనిఖీ చేసిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారుల కమిటీ ప్రేమ్‌రాజ్ వర్మను నిలదీసింది.
అన్ని ప్రశ్నలకూ అతను నీళ్లు నమిలాడు. ఇందుకోసం అనుమతులు తీసుకోవాలన్న విషయమే తనకు తెలియదని చెప్పడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. ఈ అక్రమాలపై ఈ నెల 17న మధ్యాహ్నం సీడబ్ల్యూసీ ఎదుట విచారణకు హాజరుకావాలని అతన్ని ఆదేశించారు. ఇంటర్‌నెట్, సోషల్ మీడియాపై ఆధారపడి మోసాలు చేస్తున్న ఇలాంటి తప్పుడుతడకల సంస్థలకు ఎలాంటి విరాళాలు ఇవ్వొద్దని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.
‘సాక్షి’తో వెలుగులోకి..
‘అవేక్’ నిర్వాహకుడు ప్రేమ్‌రాజ్ సమాజ సేవ చేస్తున్నానంటూ తొలుత మీడియానూ తప్పుదోవ పట్టించాడు. తద్వారా పలు పత్రికల్లో అనుకూలంగా కథనాలు వచ్చేలా చూసుకున్నాడు. ఏ ఆదరణా లేని ఖైదీల పిల్లలకు సాయం చేస్తున్నానన్న అతని ప్రచారాన్ని ‘సాక్షి’ కూడా విశ్వసించింది. దీంతో ‘ప్రేమ ఖైదీ’ పేరుతో ఓ కథనాన్ని ప్రచురించడంతో పాటు అతన్ని సత్కరించింది.
ఖైదీల పిల్లలకు మరింత అండగా నిలిచే ఉద్దేశంతో అవేక్ పూర్వాపరాలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నిం చగా దాని గుట్టు బయటపడింది. అది అక్రమాల నిలయమని, పిల్లల పేరుతో డబ్బులు దండుకుంటోందని, అందు లో అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అందులో ఉండే ఓ అమ్మాయి గతేడాది అదృశ్యమైనట్లు తెలుస్తోంది.