ఫీ‘జులుం’ కోసమే కేఎల్‌యూ మాయాజాలం | Irregularities committed by Koneru Lakshmaiah University for NAAC ranking | Sakshi
Sakshi News home page

ఫీ‘జులుం’ కోసమే కేఎల్‌యూ మాయాజాలం

Published Mon, Feb 3 2025 3:55 AM | Last Updated on Mon, Feb 3 2025 3:55 AM

Irregularities committed by Koneru Lakshmaiah University for NAAC ranking

న్యాక్‌ ఏ++ ర్యాంకింగ్‌ కోసం అడ్డదారులు

రిమాండ్‌ నివేదికలో వెల్లడించిన సీబీఐ

10 మంది నిందితులకు రిమాండ్‌

మిగిలిన నిందితుల కోసం గాలింపు ముమ్మరం

సాక్షి, అమరావతి: న్యాక్‌ ర్యాంకింగ్‌ కోసం కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం (కేఎల్‌యూ) పాల్ప­డిన అక్రమాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతు­న్నాయి. పూర్తి ఆధారాలతో బయటపడిన ఈ ర్యాంకింగ్‌ గూడుపుఠాణి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా న్యాక్‌ చైర్మన్, సభ్యులకే భారీ లంచాలు ఇచ్చి మరీ న్యాక్‌ ఏ++ ర్యాకింగ్‌ కోసం కేఎల్‌యూ యాజమాన్యం పక్కా పన్నాగంతో వ్యవహరించినట్టు సీబీఐ కీలక సాక్ష్యాధారాలను సేకరించింది. దాంతోనే పక్కా వ్యూహంతో వ్యవ­హ­రించి న్యాక్‌కు భారీ లంచాలు ఇస్తుండగా.. శని­వా­రం రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకుంది. 

అరెస్ట్‌ చేసిన 10 మంది నిందితులను విజయ­వాడలోని న్యాయస్థానంలో ఆదివారం హాజరుపరి­చింది. న్యాక్‌ చైర్మన్‌ సమరేంద్రనాథ్‌ సాహా, సభ్యులు రాజీవ్‌ సిజిరాయా, డి.గోపాల్, రాజేశ్‌సింగ్‌ పవర్, మానస్‌కుమార్‌ మిశ్రా, గాయత్రి దేవ­రాజ, బులు మహారాణతో­పాటు కేఎల్‌యూ యాజ­మాన్య ప్రతినిధులు కోనేరు రాజ హరేన్‌ (వైస్‌ ప్రెసిడెంట్‌), జీపీ సారథి వర్మ (వీసీ), ఎ.రామకృష్ణ (డైరెక్టర్‌)లకు న్యాయ­స్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది. 

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న కేఎల్‌యూ ప్రెసిడెంట్‌ కోనేరు సత్యనారాయణ, ఇతర నిందితులు ఎల్‌.మంజునాథరావు (న్యాక్‌ మాజీ సలహాదారు), ఎం.హనుమంతప్ప(బెంగళూరు విశ్వ­విద్యాలయం డైరెక్టర్‌), ఎం.శ్యామ్‌సుందర్‌ (న్యాక్‌ సలహాదారు)ల కోసం సీబీఐ గాలింపు ముమ్మరం చేసింది. కాగా.. న్యాయస్థానానికి సీబీఐ సమర్పించిన రిమాండ్‌ నివేదికలో న్యాక్‌ ర్యాంకింగ్‌ కుట్రపై పూర్తి వివరాలు వెల్లడించింది.

భారీగా ఫీజులు కొల్లగొట్టేందుకే..
అక్రమ విధానాలతో న్యాక్‌ ఏ++ ర్యాంక్‌ సాధించిన అనంతరం ఆ ర్యాంకింగ్‌ను చూపిస్తూ భారీగా ఫీజులు నిర్ణయించి దోపిడీకి పాల్పడాలన్నది కేఎల్‌యూ యాజమాన్యం ప్రధాన ఉద్దేశని సీబీఐ పేర్కొంది. రిమాండ్‌ నివేదికలో ఇంకా ఏమున్నా­యంటే.. ఇష్టానుసారంగా సెక్షన్లు పెంచేసి భారీగా విద్యార్థులను చేర్పించుకుని భారీ ఫీజులతో దోపిడీకి పాల్పడటమే అసలు లక్ష్యం. 

ఈ ఏడాది న్యాక్‌ తనిఖీలు ఉంటాయని తెలిసినప్పటి నుంచి పక్కా పన్నాగంతో వ్యవహరించింది. అందుకోసం న్యాక్‌ చైర్మన్‌ సమరేంద్రనాథ్‌ సాహాతోపాటు సభ్యులను మధ్యవర్తుల ద్వారా కొన్ని నెలల ముందుగానే సంప్రదించింది. న్యాక్‌ ప్రస్తుత సలహదారు ఎం.శ్యామ్‌సుందర్, మాజీ సలహాదారు ఎం.హనుమంతప్ప ఇందులో కీలక పాత్ర పోషించారు. వారి ద్వారా న్యాక్‌ చైర్మన్, సభ్యులను లోబర్చుకునేందుకు కేఎల్‌యూ యాజమాన్యం పావులు కదిపింది. 

ఏ++ ర్యాంకింగ్‌ ఇస్తే భారీగా ముడుపులు ముట్టజెప్పేందుకు ఒప్పందం కుదిరింది. అందుకోసం న్యాక్‌ చైర్మన్, సభ్యుల గృహాలకే భారీగా ముడుపులు అందించేలా ఏర్పాట్లు చేసింది. తనిఖీల కోసం కేఎల్‌యూను సందర్శించినప్పుడు కూడా వారికి భారీగా కానుకలు, ఇతర తాయిలాలు ముట్టజెప్పేందుకు అన్ని ఏర్పాట్లూ పకడ్బందీగా చేసింది.

పక్కా సమాచారంతో వ్యూహాత్మక దాడి
న్యాక్‌ ర్యాంకింగ్‌ కోసం కేఎల్‌యూ యాజమాన్యం అక్రమాలకు పాల్పడుతోందని ఉమ్మడి విజయవాడ, ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచే సీబీఐకి పలువురు ఫిర్యాదు చేశారు. అందుకోసం కేఎల్‌యూ ఎలా వ్యవహరిస్తోందన్నది కూడా నేరుగా ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి సమాచారమి­చ్చారు. దాంతో సీబీఐ ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దిగారు. 

ఢిల్లీ, విశాఖపట్నంలోని సీబీఐ అధికార బృందాలు గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్‌యూ ప్రధాన క్యాంపస్‌తోపాటు దేశంలోని 20 నగరాల్లోని న్యాక్‌ చైర్మన్, సభ్యులకు చెందిన నివాస గృహాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వ­హించారు. ఈ అనూహ్య పరిణామంతో న్యాక్‌ చైర్మన్, సభ్యులు, కేఎల్‌యూ ప్రతినిధులు బిత్తరపోయారు. న్యాక్‌ చైర్మన్, సభ్యుల వద్ద భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్లు, ఇతర విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

వాటికి సంబంధించిన వివరాలు అడిగితే న్యాక్‌ చైర్మన్, సభ్యులు సరైన సమాధానాలు చెప్పలేకపో­యారు. దాంతో న్యాక్‌ ర్యాంకింగ్‌ కోసమే అక్రమాలకు పాల్పడినట్టు సీబీఐ అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. న్యాక్‌ చైర్మన్, సభ్యుల నుంచి మొత్తం రూ.37 లక్షల విలువైన పరికరాలను జప్తు చేశారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement