సాక్షి, ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలలన్నీ డిసెంబర్ 31 వరకు మూసే ఉంచాలని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ చహల్ ఉత్తర్వులు జారీచేశారు. ముంబైలో మళ్లీ కరోనా కేసులు సంఖ్య పెరుగుతుండటంతోపాటు మరికొన్ని కారణాల వల్ల బీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. ముంబై పరిధిలోని పాఠశాలల ప్రారంభానికి మరికొంత సమయం పడుతుందని ఉత్తర్వులో కమిషనర్ పేర్కొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ నవంబర్ 23వ తేదీన 9వ తరగతి నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు తెరిచేందుకు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు, సిబ్బందికి కరోనా ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించడం ప్రారంభించారు.
అయితే ఈ నిర్ణయంపై కరోనా రెండో దశ ప్రభావం పడింది. దీపావళి పండుగ అనంతరం మరోసారి కరోనా కేసులు ముంబైతోపాటు రాష్ట్రంలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు కరోనా సోకకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా బీఎంసీ పాఠశాలల ప్రారంభంపై వెనకడుగు వేసింది. ముంబై మేయర్ కిషోరి పేడ్నేకర్ మాట్లాడుతూ.. ముంబైలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని దీంతో నవంబర్ 23వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంలేదని పేర్కొన్నారు. (సీఓ2 ఎఫెక్ట్.. సముద్రమట్టాలు పైపైకి)
‘‘కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఆరోగ్య పరిస్థితి తదితరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. దీంతోపాటు ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు పాఠశాలలను తరగతుల కోసం సిద్దం చేసేందుకు కూడా మరింత సమయం పడుతుంది. కోవిడ్ సెంటర్‌లకు అనేక పాఠశాలలను బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వినియోగంలోకి తీసుకుంది. దీంతో ఈ పాఠశాలలను పూర్తిగా శానిటైజేషన్ చేయడం అత్యం త అవసరం. ప్రస్తుతం ఈ కోవిడ్ సెంటర్ల సంఖ్య తగ్గిస్తున్నాం. అయినప్పటికీ ఇంకా అనేక పాఠశాలల్లో శానిటైజేషన్ చేయాల్సి ఉంది. దీంతో పాఠశాలలు తెరవడానికి సమయం పట్టే అవకాశం ఉంది’’ అని కమిషనర్ ఇక్బాల్ చహల్ ఆదేశాలలో తెలిపారు.
థానేలోనూ..
థానే: ముంబైతోపాటు థానే జిల్లాలో కూడా డిసెంబర్ 31వ తేదీ వరకు పాఠశాలలు మూసి ఉంచనున్నారు. ఈ మేరకు జిల్లా ఇన్‌చార్జీ మంత్రి ఏక్‌నాథ్ థానే జిల్లా అధికారికి సూచనలు జారీ చేశారు. గత కొద్దిరోజులగా థానేలో మళ్లీ కరోనా కేసులు పెరగడం ప్రారంభమయ్యాయి. మరోవైపు ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోపే కూడా రెండో దఫా కరోనా వచ్చే అవకాశాలున్నాయన్న భయాందోళనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం థానే జిల్లా ఇన్‌చార్జీ మంత్రి ఏక్‌నాథ్ షిండే థానే జిల్లాలో కూడా పాఠశాలలను డిసెంబర్ 31వ తేదీ వరకు మూసి ఉంచాలని ఆదేశించారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని థానే జిల్లా అధికారి రాజేష్ నార్వేకర్ ఆదేశించారు. దీంతో థానే జిల్లాలోని థానే, నవీ ముంబై, కళ్యాణ్–డోంబివలి, భివండీ, ఉల్లాస్‌నగర్, మీరా – భయిందర్ మొదలగు 6 మున్సిపల్ కార్పొరేషన్‌లతోపాటు అంబర్‌నాథ్, బద్లాపూర్ మొదలగు మున్సిపాలిటీలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం పాఠశాలలు తెరుచుకోవని స్పష్టమైంది.
స్థానిక పాలక సంస్థలదే నిర్ణయం: వర్షా గైక్వాడ్
నవంబర్ 23 నుంచి పాఠశాలలు ప్రారంభించాలా? వద్దా? అనే నిర్ణయాన్ని స్థానిక పాలక సంస్థ (స్థానిక యంత్రాంగం)లు తీసుకుంటాయని విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ శుక్రవారం స్పష్టంచేశారు. ఆయా ప్రాంతా లలోని పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే బాధ్యతలను వారికే అప్పగించామని ఆమె మీడియాకు వివరించారు. ఇక బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ చహల్‌తో బీఎంసీ పరిధిలోని పాఠశాలల అంశంపై శుక్రవారం ఉదయం చర్చలు జరిగాయని మంత్రి పేర్కొన్నారు. చర్చల అనంతరం డిసెంబర్ 31వ తేదీ వరకు బీఎంసీ పరిధిలోని పాఠశాలలను మూసి ఉంచాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి చెప్పారు. పాఠశాలల ప్రారంభంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయన్నారు. ఎక్కడైతే పాఠశాలలు తెరిచేందుకు అన్నివిధాల సిద్దంగా ఉందో అక్కడ నవంబర్ 23వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment