15 శాతం ఫీజు తగ్గించండి  | Maharashtra: Education Minister Varsha Gaikwad Ordered Reduce Fees By 15 Percent | Sakshi
Sakshi News home page

15 శాతం ఫీజు తగ్గించండి 

Published Fri, Jul 30 2021 3:28 AM | Last Updated on Fri, Jul 30 2021 3:28 AM

Maharashtra: Education Minister Varsha Gaikwad Ordered Reduce Fees By 15 Percent - Sakshi

సాక్షి, ముంబై: రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో 2021–22 విద్యా సంవత్సరానికి 15 శాతం ఫీజు తగ్గించాలని విద్యాశాఖ మంత్రి వర్షాగైక్వాడ్‌ ఆదేశించారు. ఫీజు తగ్గించని పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ మేరకు ఫీజుల తగ్గింపు విషయంపై మంత్రిమండలిలో సైతం ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ ప్రభుత్వం త్వరలో జారీ చేయనున్నట్లు తెలిసింది.

ఆర్థిక ఇబ్బందులతో. 
గత సంవత్సరం మార్చిలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేసింది. అప్పటి నుంచి అనేక మంది ఉపాధి కోల్పోయారు. వ్యాపారాలు మందగించాయి. అనేక సంస్థలు తమ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లించకపోవడంతో కుటుంబాన్ని పోషించడమే కష్టంగా మారింది. ఇలాంటి సందర్బంలో పేదలతోపాటు మధ్య తరగతి కుటుంబాలు కూడా తమ పిల్లల స్కూలు ఫీజులు చెల్లించడం సాధ్యం కాలేదు. దీంతో విద్యార్థుల ఫీజులు వసూలు చేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ అనేక పాఠశాలలు ఫీజులు వసూలు చేయడం కొనసాగిస్తున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు కొద్ది నెలల కిందట సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఇచ్చింది. అంతేగాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందో నివేదిక సమర్పించాలని సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురు చూడసాగారు. ఆ మేరకు బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో 15 శాతం ఫీజు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు వర్షా గైక్వాడ్‌ తెలిపారు. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంతో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కొంత ఊరట లభించింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేసే పాఠశాలల యాజమాన్యాలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అదేవిధంగా కొన్ని పాఠశాలలు ఫీజు చెల్లించని విద్యార్థుల ఫలితాలు (రిజల్ట్‌), ప్రొగ్రెస్‌ కార్డు ఇవ్వలేదు. ఇలాంటి యాజమాన్యాలపై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టంచేశారు.  

చెల్లించిన ఫీజులపై రాని స్పష్టత.. 
లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలలన్ని మూసే ఉన్నాయి. కొందరు ఉపాధ్యాయులు మినహా మిగతా బోధన, బోధనేతర సిబ్బంది అందరు ఇంటి నుంచి విధులు నిర్వహించారు. విద్యార్థులకు కూడా ఆన్‌లైన్‌లోనే బోధన తరగతులు ప్రారంభించారు. ఇలాంటి సమయంలో పాఠశాలల్లో విద్యుత్‌ వినియోగం, స్పోర్ట్స్, లైబ్రరీ, ల్యాబ్‌ ఇతర అనేక మౌలిక సదుపాయాల వినియోగం కాలేదు. దీంతో ఫీజులు తగ్గించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. ఎట్టకేలకు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంతో పేదలు, మధ్యతరగతి కుటుంబాల్లో కొంత ఆశలు చిగురించాయి. కానీ, ఇప్పటికే అనేక పాఠశాలలు అన్‌లైన్‌లో తరగతులు ప్రారంభించాయి. విద్యార్థులు ఆ తరగతులకు హాజరు అవుతున్నారు. దీంతో అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇదివరకే ఫీజులు చెల్లించారు. మరి వీరి సంగతేంటనేది ఇంకా స్పష్టం చేయలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement