సాక్షి, హైదరాబాద్: ఆకాశంలో నడక. అక్కడే టీ, కాఫీ, స్నాక్స్ వగైరా... అంతేనా చక్కగా షాపింగ్ చేయొచ్చు. అలా ఆకాశంలో నిల్చుని కాలక్షేపం కూడా చేయొచ్చు.ఇదంతా ఎలా సాధ్యమనుకుంటున్నారా? కచ్చితంగా సాధ్యమే. హైదరాబాద్ మహానగర కూడళ్లలో మణిహారాల్లా రూపుదిద్దుకుంటున్న స్కైవాక్‌లలో షాపింగ్ సెంటర్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. మొదట మెహిదీపట్నం స్కైవాక్‌లో ఈ తరహా షాపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలను రూపొందించింది.
చిన్న చిన్న కియోస్క్‌ల రూపంలో ఉండే ఈ సెంటర్‌లు స్కైవాక్ పాదచారులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. టీ,కాఫీ, స్నాక్స్ వంటి వాటితో పాటు తక్కువ స్థలంలో విక్రయించేందుకు అనుగుణంగా ఉండే షాపింగ్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తారు. నగరంలోని స్కైవాక్‌లను ఆహ్లాదకరంగా మార్చేందుకు ఈ తరహా ఏర్పాట్లు చేయనున్నట్లు హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. స్కైవాక్ మార్గాల్లో ఒక వైపు నుంచి మరో వైపునకు వెళ్లే పాదచారులు కొద్దిసేపు పైనే సేదతీరేందుకు వీలుగా ఇవి ఉంటాయి.
రూ.28 కోట్ల వ్యయంతో..
► మెహిదీపట్నం కూడలిలో ప్రస్తుతం నిర్మిస్తున్న స్కైవాక్‌లో అన్ని వైపులా సుమారు 20 వేల చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి రానున్నట్లు అంచనా. మొత్తం 350 మీటర్ల పొడవులో రూ.28 కోట్ల వ్యయంతో స్కైవాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులు నాలుగు వైపులా నడుచుకుంటూ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో కనీసం లక్షమందికి పైగా స్కైవాక్ మార్గంలో రాకపోకలు సాగించవచ్చు.
► ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు షాపింగ్ సెంటర్‌లను ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండీఏ భావిస్తోంది. ప్రైవేట్ వ్యాపార సంస్థలకు ఈ స్థలాలను అద్దెకు ఇవ్వడం ద్వారా హెచ్‌ఎండీఏకు అదనపు ఆదాయం లభించనుంది. మరోవైపు పాదచారులకు కూడా ఆటవిడుపుగా మారనుంది. తక్కువ స్థలంలో ఏర్పాటు చేయగలిగే షాపులకే స్కైవాక్ అనుకూలంగా ఉంటుందని ఒక అధికారి చెప్పారు.
చదవండి: Hyderabad: భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం
సెప్టెంబర్ నాటికి ఉప్పల్‌లో స్కైవాక్..
► నిత్యం వాహనాలు, ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండే ఉప్పల్ కూడలిలో స్కైవాక్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు 650 మీటర్ల పొడవుతో రూ.34 కోట్ల అంచనా వ్యయంతో ఉప్పల్ రింగు రోడ్డుకు అన్ని వైపులా రాకపోకలు సాగించేవిధంగా ఈ స్కైవాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
► మెట్రో రైలు దిగిన ప్రయాణికులు తాము ఏ వైపునకు వెళ్లాలనుకొన్నా స్కైవాక్‌లోనే వెళ్లవచ్చు. అలాగే సిటీ బస్సులు, దూరప్రాంతాల బస్సుల్లో వచ్చేవారు ఒకవైపు నుంచి మరో వైపు వెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ నాటికి వినియోగించలోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.
నగరంలో మరిన్ని..
జన సమ్మర్థం ఉన్న ప్రధాన కూడళ్లలో మరిన్ని స్కైవాక్‌లను ఏర్పాటు చేసేందుకు హెచ్‌ఎండీఏ అధ్యయనం చేపట్టింది. అమీర్‌పేట్, కోఠి, ఎల్‌బీనగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో స్కైవాక్‌ల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment