Skywalk bridge construction
-
మెహిదీపట్నం స్కైవాక్‌కు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: మెహిదీపట్నం చౌరస్తాలో ఏర్పాటు చేయనున్న స్కైవాక్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. స్కైవాక్ కోసం అవసరమైన భూమిని అప్పగించేందుకు రక్షణ శాఖ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే స్కైవాక్ నిర్మాణ పనులను పునరుద్ధరించనున్నారు. వాహనాల రద్దీ, అత్యధిక జనసమ్మర్థం కలిగిన మెహిదీపట్నం కూడలిలో పాదచారులు నలువైపులా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా స్కైవాక్ నిర్మాణాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ స్కైవాక్ విస్తరణకు అవసరమైన స్థలం అందుబాటులో లేకపోవడంతో రక్షణ శాఖకు చెందిన స్థలాన్ని ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలోనూ ఈ మేరకు రక్షణ శాఖతో సంప్రదింపులు జరిపారు. కానీ అప్పట్లో భూమిని ఇచ్చేందుకు రక్షణ శాఖ అధికారులు ససేమిరా అనడంతో పనులు నిలిచిపోయాయి. ఉప్పల్ స్కైవాక్ పూర్తి చేయడంతో పాటు మెహిదీపట్నం స్కైవాక్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు అప్పట్లో హెచ్ఎండీఏ ప్రణాళికలను సిద్ధం చేసింది. కానీ స్థలం లభ్యత సవాల్‌గా మారడంతో పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం స్కైవాక్‌కు అవసరమైన 3,380 చదరపు గజాల స్థలాన్ని ఇచ్చేందుకు ముందుకు రావడంతో పనులు పరుగులు పెట్టనున్నాయని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఫలించిన సీఎం రేవంత్‌రెడ్డి చొరవ.. ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్లపై నడిచి వెళ్లేవారి భద్రత దృష్ట్యా మెహిదీపట్నంలో స్కైవే నిర్మించాలనే ప్రతిపాదనలు ఎప్పటినుంచే ఉన్నాయి. కానీ.. రైతు బజార్ ప్రాంతంలో ఉన్న తమ భూములను ఇచ్చేందుకు రక్షణ శాఖ అంగీకరించకపోవటంతో పీటముడి పడింది. రక్షణ శాఖ పరిధిలోని 0.51 ఎకరాల స్థలం తమకు బదిలీ చేయాలని గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అత్యంత రద్దీ ఉండే మెహిదీపట్నం రైతు బజార్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ పెరిగిపోయింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే సిటీలో ట్రాఫిక్ రద్దీని అధిగమించే చర్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ నెల 5వ తేదీన ఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రత్యేకంగా రక్షణ శాఖ మంత్రిని కలిశారు. మెహిదీపట్నంలో ఉన్న రక్షణ శాఖ భూములను తమకు బదిలీ చేయాలని కోరారు. ఈ మేరకు అక్కడ ఉన్న డిఫెన్స్ జోన్‌కు ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్పులకు అనుగుణంగా స్కైవే డిజైన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు అధికారులు మార్పులు చేశారు. సవరించిన కొత్త ప్రతిపాదనలను ఇటీవలే కేంద్రానికి పంపించారు. దీంతో స్కైవే నిర్మాణానికి అవసరమైన మేరకు భూముల కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. మొత్తం 3,380 చదరపు గజాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించనుంది. బదిలీ చేసిన భూములకు బదులుగా కేంద్రం డిఫెన్స్ విభాగానికి రూ.15.15 కోట్ల విలువైన మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కలి్పంచాల్సి ఉంటుంది. మరికొంత స్థలానికి పదేళ్ల పాటు లైసైన్స్ రుసుం చెల్లించాలనే నిబంధన విధించింది. నాలుగు వారాల్లోనే ఈ భూములను అప్పగించేందుకు కేంద్ర రక్షణ శాఖ అంగీకరించింది. దీంతో మెహిదీపట్నం స్కై వాక్ పనులకున్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. ముంబై హైవేలో అత్యంత కీలకమైన రైతు బజార్ జంక్షన్లో ట్రాఫిక్ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించనుంది. వీలైనంత త్వరగా స్కైవే నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. -
నేడు ఉప్పల్ స్కైవాక్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో నగరవాసులకు మరో గుడ్‌న్యూస్. ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉప్పల్ చౌరస్తాలో విశాలంగా రూ.36.50 కోట్ల వ్యయంతో స్కైవాక్‌ను హెచ్ఎండీఏ నిర్మించింది. దేశంలో అతిపొడవైన స్కైవాక్‌లలో ఒకటైన దీనిని నేడు మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. దీంతో పాటు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక.. పాదచారులు, ప్రయాణీకులు ఎక్కడా రోడ్డు దాటే అవసరం లేకుండా.. అటు నుంచి ఇటు వైపు.. ఇటు నుంచి అటు వెళ్లేందుకు వీలుగా 665 మీటర్ల పొడవు, 4 మీటర్ల వర్టికల్ వెడల్పు, ఆరు మీటర్ల ఎత్తులో బస్టాపులు, మెట్రోస్టేషన్‌ను కలుపుతూ.. ఈ కాలినడక వంతెనను నిర్మించారు. 8 చోట్ల లిఫ్ట్‌లు,4 ఎస్కలేటర్స్, 6 చోట్ల మెట్ల సౌకర్యాన్ని కల్పించారు. నాగోల్ రోడ్డు, రామంతాపూర్ రోడ్డు, జీహెచ్ఎంసీ థీమ్ పార్క్, జీహెచ్ఎంసీ ఆఫీసు సమీపంలోని వరంగల్ బస్టాప్, ఉప్పల్ పోలీస్ స్టేషన్, ఉప్పల్ ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ ఎదురుగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ బిగ్ ప్లాన్.. 500 వాహనాల కాన్వాయ్‌తో కేసీఆర్.. -
ఆకాశంలో నడక.. అక్కడే టీ, కాఫీ, స్నాక్స్ .. అంతేనా చక్కగా షాపింగ్ కూడా
సాక్షి, హైదరాబాద్: ఆకాశంలో నడక. అక్కడే టీ, కాఫీ, స్నాక్స్ వగైరా... అంతేనా చక్కగా షాపింగ్ చేయొచ్చు. అలా ఆకాశంలో నిల్చుని కాలక్షేపం కూడా చేయొచ్చు.ఇదంతా ఎలా సాధ్యమనుకుంటున్నారా? కచ్చితంగా సాధ్యమే. హైదరాబాద్ మహానగర కూడళ్లలో మణిహారాల్లా రూపుదిద్దుకుంటున్న స్కైవాక్‌లలో షాపింగ్ సెంటర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. మొదట మెహిదీపట్నం స్కైవాక్‌లో ఈ తరహా షాపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలను రూపొందించింది. చిన్న చిన్న కియోస్క్‌ల రూపంలో ఉండే ఈ సెంటర్లు స్కైవాక్ పాదచారులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. టీ,కాఫీ, స్నాక్స్ వంటి వాటితో పాటు తక్కువ స్థలంలో విక్రయించేందుకు అనుగుణంగా ఉండే షాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. నగరంలోని స్కైవాక్‌లను ఆహ్లాదకరంగా మార్చేందుకు ఈ తరహా ఏర్పాట్లు చేయనున్నట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. స్కైవాక్ మార్గాల్లో ఒక వైపు నుంచి మరో వైపునకు వెళ్లే పాదచారులు కొద్దిసేపు పైనే సేదతీరేందుకు వీలుగా ఇవి ఉంటాయి. రూ.28 కోట్ల వ్యయంతో.. ► మెహిదీపట్నం కూడలిలో ప్రస్తుతం నిర్మిస్తున్న స్కైవాక్‌లో అన్ని వైపులా సుమారు 20 వేల చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి రానున్నట్లు అంచనా. మొత్తం 350 మీటర్ల పొడవులో రూ.28 కోట్ల వ్యయంతో స్కైవాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులు నాలుగు వైపులా నడుచుకుంటూ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో కనీసం లక్షమందికి పైగా స్కైవాక్ మార్గంలో రాకపోకలు సాగించవచ్చు. ► ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు షాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. ప్రైవేట్ వ్యాపార సంస్థలకు ఈ స్థలాలను అద్దెకు ఇవ్వడం ద్వారా హెచ్ఎండీఏకు అదనపు ఆదాయం లభించనుంది. మరోవైపు పాదచారులకు కూడా ఆటవిడుపుగా మారనుంది. తక్కువ స్థలంలో ఏర్పాటు చేయగలిగే షాపులకే స్కైవాక్ అనుకూలంగా ఉంటుందని ఒక అధికారి చెప్పారు. చదవండి: Hyderabad: భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం సెప్టెంబర్ నాటికి ఉప్పల్‌లో స్కైవాక్.. ► నిత్యం వాహనాలు, ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండే ఉప్పల్ కూడలిలో స్కైవాక్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు 650 మీటర్ల పొడవుతో రూ.34 కోట్ల అంచనా వ్యయంతో ఉప్పల్ రింగు రోడ్డుకు అన్ని వైపులా రాకపోకలు సాగించేవిధంగా ఈ స్కైవాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ► మెట్రో రైలు దిగిన ప్రయాణికులు తాము ఏ వైపునకు వెళ్లాలనుకొన్నా స్కైవాక్‌లోనే వెళ్లవచ్చు. అలాగే సిటీ బస్సులు, దూరప్రాంతాల బస్సుల్లో వచ్చేవారు ఒకవైపు నుంచి మరో వైపు వెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ నాటికి వినియోగించలోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలో మరిన్ని.. జన సమ్మర్థం ఉన్న ప్రధాన కూడళ్లలో మరిన్ని స్కైవాక్‌లను ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ అధ్యయనం చేపట్టింది. అమీర్‌పేట్, కోఠి, ఎల్బీనగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో స్కైవాక్‌ల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. -
అంతన్నారు.. ఇంతన్నారు
► ముందుకు కదలని స్కైవాక్ వంతెన నిర్మాణం ► ఫైలును పక్కన పడేసిన వైనం ► ఆంధ్రా ప్యారిస్‌లో నిర్మాణం సీఆర్డీఏకే తలమానికం ప్రపంచ స్థాయి ప్రజా రాజధాని నిర్మిస్తున్నామంటూ అధికార పక్ష నాయకులు పదే పదే ప్రకటనలు గుప్పిస్తున్నారు. వీరి ప్రకటనలు నిజం కావాలంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా సౌకర్యాలు కల్పించాలి. దీనికి దేశ దేశాల్లోని అనేక అభివృద్ధి నమూనాలను ఆదర్శంగా తీసుకోవాలి. కానీ నేటి పాలకులు నాటి అభివృద్ధి ప్రతిపాదనలను కాలగర్భంలో కలిపేస్తున్నారు. ఇలా మరుగున పడినదే స్కైవాక్ (ఆకాశ నడక) వంతెన నిర్మాణం. ఢిల్లీ, బెంగళూరు వంటి మహా నగరాలకే పరిమితమైన ఈ వంతెనను ఆంధ్రా ప్యారిస్ తెనాలిలో నిర్మించాలని నాలుగేళ్ల క్రితం అప్పటి పాలకులు నిర్ణయించగా..ఇప్పుడు పాలకులు ఆ ఊసే లేకుండా చేశారు. తెనాలిరూరల్ : మహా నగరాలకే పరిమితమైన స్కై వాక్ వంతెనను రాష్ట్రంలోనే తొలిగా తెనాలి పట్టణంలో నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబయ్ నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా పాదచారులు రోడ్డు దాటేందుకు వీలుగా రహదారులపై భారీ ఆకాశ నడక వంతెనలను నిర్మించారు. తెనాలి పట్టణంలో ఇటువంటి వంతెన నిర్మాణానికి సన్నాహాలు చేసిన అధికారులు ఆనక దానికి సంబంధించిన ఫైలును పక్కన పడేశారు. పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ వంతెన వద్ద, ఇక్కడి మహాత్మాగాంధీ కూరగాయల మార్కెట్ కాంప్లెక్సు నుంచి పాత బస్టాండ్ వరకు తూర్పు, పడమర, నిజాంపట్నం, తూర్పు కాల్వల మీదుగా వంతెనను నిర్మించేందుకు నిర్ణయించారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో సుమారు రూ. ఐదు కోట్ల అంచనాతో వంతెనను నిర్మించేందుకు కసరత్తులు చేశారు. 100 మీటర్ల పొడవు ఉండే ఈ వంతెన నిర్మాణానికి సంబంధించి సర్వే పూర్తయ్యాక, ప్రాజెక్టు రిపోర్టును తయారు చేశారు. మూడు రోజులపాటు చేపట్టిన సర్వేలో మార్కెట్ వంతెన వద్ద తెనాలి-గుంటూరు రోడ్డు, తెనాలి-చందోలు రహదారిలో గంటకు 1400 నుంచి 1600 మంది పాదచారులు రాకపోకలు సాగిస్తున్నారని, ఇదే సంఖ్యలో వస్తున్న వాహనాల రద్దీ కారణంగా పాదచారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదని సర్వేలో తేలింది. ముంబయి, బెంగళూరు నగరాల్లో ఇటువంటి వంతెనలను నిర్మించిన సంస్థతో సంప్రదించి మరిన్ని సలహాలు, సూచనలను అధికారులు తీసుకున్నారు. ప్రైవేటు ఏజెన్సీల ద్వారా స్కైవాక్ వంతెన నమూనానూ తయారు చేయించారు. తొలిగా రూ. 10 కోట్లతో వంతెనకు ఇరువైపులా ఎస్కలేటర్లతో నిర్మించాలని భావించిన అధికారులు పూర్తి సర్వే అనంతరం రూ. ఐదు కోట్లతో పనులు పూర్తి చేయవచ్చన్న నిర్ణయానికొచ్చారు. కేవలం పాదచారులను దృష్టిలో పెట్టుకుని నిర్మించనున్న ఈ వంతెనకు ఎస్కలేటర్ల స్థానంలో స్టెయిర్‌కేస్, లిఫ్టులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. పట్టణంలో టౌన్ హాల్ నిర్మాణానికి శంఖుస్థాపన జరిగిన నాడు ఇదే విషయాన్ని అధికారులు స్పష్టంగా తెలియజేశారు. పాదచారులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఈ వంతెన ఉపయోగపడుతుందని అప్పట్లో అధికారుల భావన. మార్కెట్ కాంప్లెక్సుతో పాటు మున్సిపల్ కార్యాలయం, మార్కెట్ ఏరియాకు వెళ్లే ప్రజలకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. కౌన్సిల్ ఆమోదం తీసుకోలేకపోయాం ప్రతిష్టాత్మకంగా వంతెనను నిర్మించేందుకు రంగం సిద్ధం చేశాం. ఈ లోగా ఎన్నికలు రావడంతో కౌన్సిల్ ఆమోదం తీసుకోలేకపోయాం. దాంతో స్కైవాక్ నిర్మాణం మరుగునపడిపోయింది. ఎం ప్రభాకరరావు, మున్సిపల్ ఇంజినీర్