మెహిదీపట్నం స్కైవాక్‌కు లైన్‌ క్లియర్‌ | Mehdipatnam Sky Walk | Sakshi
Sakshi News home page

మెహిదీపట్నం స్కైవాక్‌కు లైన్‌ క్లియర్‌

Published Thu, Jan 25 2024 8:30 AM | Last Updated on Thu, Jan 25 2024 4:42 PM

Mehdipatnam Sky Walk  - Sakshi

సాక్షి, హైదరాబాద్: మెహిదీపట్నం చౌరస్తాలో ఏర్పాటు చేయనున్న స్కైవాక్‌ నిర్మాణానికి మార్గం సుగమమైంది. స్కైవాక్‌ కోసం అవసరమైన భూమిని అప్పగించేందుకు రక్షణ శాఖ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే స్కైవాక్‌ నిర్మాణ పనులను పునరుద్ధరించనున్నారు. వాహనాల రద్దీ, అత్యధిక జనసమ్మర్థం కలిగిన మెహిదీపట్నం కూడలిలో పాదచారులు నలువైపులా  ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా స్కైవాక్‌ నిర్మాణాన్ని  చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ స్కైవాక్‌ విస్తరణకు అవసరమైన స్థలం అందుబాటులో లేకపోవడంతో రక్షణ శాఖకు చెందిన స్థలాన్ని  ఇవ్వాలని కోరారు.

 గత  ప్రభుత్వ హయాంలోనూ ఈ మేరకు రక్షణ శాఖతో  సంప్రదింపులు జరిపారు. కానీ అప్పట్లో భూమిని ఇచ్చేందుకు రక్షణ శాఖ అధికారులు ససేమిరా అనడంతో పనులు నిలిచిపోయాయి. ఉప్పల్‌ స్కైవాక్‌  పూర్తి చేయడంతో పాటు మెహిదీపట్నం స్కైవాక్‌ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు అప్పట్లో హెచ్‌ఎండీఏ ప్రణాళికలను సిద్ధం చేసింది. కానీ  స్థలం లభ్యత సవాల్‌గా మారడంతో పనులు  ఆగిపోయాయి. ప్రస్తుతం  స్కైవాక్‌కు అవసరమైన 3,380 చదరపు గజాల స్థలాన్ని ఇచ్చేందుకు ముందుకు రావడంతో పనులు పరుగులు పెట్టనున్నాయని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.  
 
ఫలించిన సీఎం రేవంత్‌రెడ్డి చొరవ..  
ట్రాఫిక్‌ రద్దీ కారణంగా రోడ్లపై నడిచి వెళ్లేవారి భద్రత దృష్ట్యా మెహిదీపట్నంలో స్కైవే నిర్మించాలనే ప్రతిపాదనలు ఎప్పటినుంచే ఉన్నాయి. కానీ.. రైతు బజార్‌ ప్రాంతంలో ఉన్న తమ భూములను ఇచ్చేందుకు రక్షణ శాఖ అంగీకరించకపోవటంతో పీటముడి పడింది. రక్షణ శాఖ పరిధిలోని 0.51 ఎకరాల స్థలం తమకు బదిలీ చేయాలని గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అత్యంత రద్దీ ఉండే మెహిదీపట్నం రైతు బజార్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకూ పెరిగిపోయింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే సిటీలో ట్రాఫిక్‌ రద్దీని అధిగమించే చర్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 

ఈ నెల 5వ తేదీన ఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రత్యేకంగా రక్షణ శాఖ మంత్రిని కలిశారు. మెహిదీపట్నంలో ఉన్న  రక్షణ శాఖ భూములను తమకు బదిలీ చేయాలని కోరారు. ఈ మేరకు అక్కడ ఉన్న డిఫెన్స్‌ జోన్‌కు ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్పులకు అనుగుణంగా స్కైవే డిజైన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు అధికారులు మార్పులు చేశారు. సవరించిన కొత్త ప్రతిపాదనలను ఇటీవలే కేంద్రానికి పంపించారు. దీంతో స్కైవే నిర్మాణానికి అవసరమైన మేరకు భూముల కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. మొత్తం 3,380 చదరపు గజాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించనుంది.  

బదిలీ చేసిన భూములకు బదులుగా కేంద్రం డిఫెన్స్‌ విభాగానికి రూ.15.15 కోట్ల విలువైన మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కలి్పంచాల్సి ఉంటుంది. మరికొంత స్థలానికి పదేళ్ల పాటు లైసైన్స్‌ రుసుం చెల్లించాలనే నిబంధన విధించింది. నాలుగు వారాల్లోనే ఈ భూములను అప్పగించేందుకు కేంద్ర రక్షణ శాఖ అంగీకరించింది. దీంతో మెహిదీపట్నం స్కై వాక్‌ పనులకున్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. ముంబై హైవేలో అత్యంత కీలకమైన రైతు బజార్‌ జంక్షన్‌లో ట్రాఫిక్‌ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించనుంది. వీలైనంత త్వరగా స్కైవే నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement