కొత్తగా నిర్మించనున్న ఎయిర్‌పోర్టు మెట్రో స్టేషన్
రెండు స్టేషన్‌ల మధ్య విశాలమైన స్కైవాక్
నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు స్టేషన్‌ల అలైన్‌మెంట్
కాలినడకన వెళ్లి పరిశీలించిన మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నాగోల్‌లో కొత్తగా ఎయిర్‌పోర్టు మెట్రో స్టేషన్‌ను నిర్మించనున్నారు. ఇప్పుడున్న స్టేషన్‌కు సమీపంలో ఎడమవైపున (ఎల్‌బీ నగర్ వైపు) ఉంటుంది. ఈ రెండు స్టేషన్‌ల మధ్య ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు విశాలమైన స్కైవాక్‌ను నిర్మిస్తారు.
రాయదుర్గం, అమీర్‌పేట కారిడార్‌లో నాగోల్‌కు చేరుకున్న ప్రయాణికులు అక్కడి నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు ఈ స్కైవాక్ మార్గంలో కొత్తగా నిర్మించే నాగోల్ ఎయిర్‌పోర్ట్ మెట్రో స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఎల్‌బీనగర్, చాంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్‌పోర్టు వరకు కొత్త కారిడార్ నిర్మాణం జరగనుంది. ఎయిర్‌పోర్టు మెట్రో రెండో దశలో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదించిన నాగోల్ –శంషాబాద్ ఎయిర్‌పోర్టు కారిడార్ మార్గంలో హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి పర్యటించారు.
నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట జంక్షన్ వరకు 14 కిలోమీటర్ల దూరం ఆయన ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ అయిన సిస్టా ఇంజనీరింగ్, సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి కాలినడకన వెళ్లి పరిశీలించారు. ఈ అలైన్‌మెంట్‌లో నిర్మించనున్న మెట్రోస్టేషన్లు, అలైన్‌మెంట్‌పై అధికారులకు, ఇంజనీరింగ్ నిపుణులకు దిశానిర్దేశం చేశారు. అలైన్‌మెంట్ ఇలా...
♦ నాగోల్ స్టేషన్ తర్వాత మూసీ నది బ్రిడ్జిని ఆనుకొని పెద్ద మంచినీటి పైపులు, భూగర్భ హైటెన్షన్ విద్యుత్ కేబుళ్లు ఉన్నాయి. దీంతో ఈ మార్గంలో మెట్రో అలైన్‌మెంట్‌ను మరో 10 మీటర్లు ఎడమ వైపునకు జరపనున్నారు. మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు రూపొందించిన దృష్ట్యా మూసీ నదిపై మెట్రో బ్రిడ్జిని పొడవైన స్పాన్‌లతో నిర్మించనున్నారు.
♦ మూసీ దాటిన తరువాత కొత్తపేట వైపున్న రోడ్డుకు కనెక్టివిటీని ఇస్తూ చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులకు సదుపాయంగా ఉండేలా మరో స్టేషన్‌ను నిర్మించనున్నారు. నాగోల్ ఆర్టీఓ కార్యాలయం వద్ద అల్కాపురి జంక్షన్ (లక్కీ రెస్టారెంట్)కు సమీపంలో ఈ స్టేషన్ ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రయాణికులు ఔటర్‌రింగ్‌రోడ్డుకు రాకపోకలు సాగించేలా కనెక్టివిటీ ఇవ్వనున్నారు. చాంద్రాయణగుట్ట
ఇంటర్‌చేంజ్ స్టేషన్
♦ చాంద్రాయణగుట్ట వద్ద విశాలమైన ఇంటర్‌చేంజ్ స్టేషన్ నిర్మించనున్నారు. ఈ రూట్ లో ఫ్లైఓవర్ నిర్మాణం దృష్ట్యా చాంద్రాయణగుట్ట వరకు చేపట్టనున్న పాతబస్తీ మెట్రో విస్తరణ పనులు, కొత్త టెర్మినల్ స్టేషన్ పనులు ఇంజనీరింగ్ సవాలుగా ఉంటుందని ఎన్విఎస్ రెడ్డి చెప్పారు. రెండు కారిడార్‌లను అనుసంధానిస్తూ నిర్మించనున్న ఈ ఇంటర్‌చేంజ్ స్టేషన్లో కాంకోర్స్, ప్లాట్‌ఫాంల ఎత్తును సరిచేయాల్సి ఉంటుందన్నారు.ఎల్‌బీనగర్‌లో మరో స్కైవాక్..
♦ కామినేని ఆసుపత్రి వద్ద ఒక స్టేషన్ నిర్మించనున్నారు. ఆ తర్వాత ఎల్‌బీనగర్ జంక్షన్‌లో కొత్తగా ఎల్‌బీనగర్ ఎయిర్‌పోర్టు స్టేషన్ రానుంది. ఈ మార్గంలో అండర్‌పాస్‌తోపాటు, రెండు ఫ్లైఓవర్‌లతో మెట్రో కారిడార్ నిర్మాణంలో ఇంజనీరింగ్ సవాళ్లు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.
♦ ఎల్‌బీనగర్ జంక్షన్‌కు కుడి వైపున కొత్తగా నిర్మించనున్న మెట్రోస్టేషన్ నుంచి ఎడమవైపున ఉన్న మరో స్టేషన్ (మియాపూర్–ఎల్‌బీనగర్ కారిడార్)కు మరో విశాలమైన స్కైవాక్‌తో అనుసంధానం చేయనున్నారు. మియాపూర్, అమీర్‌పేట మీదుగా ఎల్‌బీ నగర్‌కు వచ్చే ప్రయాణికులు ఇక్కడి నుంచి స్కైవాక్ మార్గంలో ఎల్‌బీనగర్ కొత్త ఎయిర్‌పోర్టు మెట్రో స్టేషన్‌కు చేరుకుంటారు.
♦ బైరామల్‌గూడ, సాగర్‌రింగ్ రోడ్డు కూడలిలో ఇప్పటికే ఎత్తయిన ఫ్లైఓవర్లు ఉన్నందున ఈ రూట్‌లో ఎయిర్‌పోర్ట్ మెట్రో లైన్ ఎత్తును మరింత పెంచాల్సి ఉంటుందని ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఈ జంక్షన్‌లో మెట్రో స్టేషన్ ఎత్తును తగ్గించడానికి, అలైన్‌మెంట్‌ను ఫ్లై ఓవర్లకు కుడి వైపునకు మార్చాల్సి ఉంటుందన్నారు. అలాగే పక్కనే ఉన్న బహిరంగ ప్రదేశంలో మెట్రో స్టేషన్‌ను నిర్మించనున్నారు.
♦ మైత్రీ నగర్, కర్మన్‌ఘాట్, చంపాపేట జంక్షన్, ఒవైసీ హాస్పిటల్, డీఆర్డీఓ, హఫీజ్ బాబానగర్ తదితర ప్రాంతాల్లో ప్రతిపాదించిన మెట్రో స్టేషన్‌లను చుట్టుపక్కల ఉన్న కాలనీలకు అందుబాటులో ఉండేలా కూడళ్లకు సమీపంలో నిర్మించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment