అంతన్నారు.. ఇంతన్నారు
► ముందుకు కదలని స్కైవాక్ వంతెన నిర్మాణం
► ఫైలును పక్కన పడేసిన వైనం
► ఆంధ్రా ప్యారిస్‌లో నిర్మాణం సీఆర్‌డీఏకే తలమానికం
ప్రపంచ స్థాయి ప్రజా రాజధాని నిర్మిస్తున్నామంటూ అధికార పక్ష నాయకులు పదే పదే ప్రకటనలు గుప్పిస్తున్నారు. వీరి ప్రకటనలు నిజం కావాలంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా సౌకర్యాలు కల్పించాలి. దీనికి దేశ దేశాల్లోని అనేక అభివృద్ధి నమూనాలను ఆదర్శంగా తీసుకోవాలి. కానీ నేటి పాలకులు నాటి అభివృద్ధి ప్రతిపాదనలను కాలగర్భంలో కలిపేస్తున్నారు. ఇలా మరుగున పడినదే స్కైవాక్ (ఆకాశ నడక) వంతెన నిర్మాణం. ఢిల్లీ, బెంగళూరు వంటి మహా నగరాలకే పరిమితమైన ఈ వంతెనను ఆంధ్రా ప్యారిస్ తెనాలిలో నిర్మించాలని నాలుగేళ్ల క్రితం అప్పటి పాలకులు నిర్ణయించగా..ఇప్పుడు పాలకులు ఆ ఊసే లేకుండా చేశారు.
తెనాలిరూరల్ : మహా నగరాలకే పరిమితమైన స్కై వాక్ వంతెనను రాష్ట్రంలోనే తొలిగా తెనాలి పట్టణంలో నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబయ్ నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా పాదచారులు రోడ్డు దాటేందుకు వీలుగా రహదారులపై భారీ ఆకాశ నడక వంతెనలను నిర్మించారు. తెనాలి పట్టణంలో ఇటువంటి వంతెన నిర్మాణానికి సన్నాహాలు చేసిన అధికారులు ఆనక దానికి సంబంధించిన ఫైలును పక్కన పడేశారు.
పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ వంతెన వద్ద, ఇక్కడి మహాత్మాగాంధీ కూరగాయల మార్కెట్ కాంప్లెక్సు నుంచి పాత బస్టాండ్ వరకు తూర్పు, పడమర, నిజాంపట్నం, తూర్పు కాల్వల మీదుగా వంతెనను నిర్మించేందుకు నిర్ణయించారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో సుమారు రూ. ఐదు కోట్ల అంచనాతో వంతెనను నిర్మించేందుకు కసరత్తులు చేశారు. 100 మీటర్ల పొడవు ఉండే ఈ వంతెన నిర్మాణానికి సంబంధించి సర్వే పూర్తయ్యాక, ప్రాజెక్టు రిపోర్టును తయారు చేశారు. మూడు రోజులపాటు చేపట్టిన సర్వేలో మార్కెట్ వంతెన వద్ద తెనాలి-గుంటూరు రోడ్డు, తెనాలి-చందోలు రహదారిలో గంటకు 1400 నుంచి 1600 మంది పాదచారులు రాకపోకలు సాగిస్తున్నారని, ఇదే సంఖ్యలో వస్తున్న వాహనాల రద్దీ కారణంగా పాదచారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదని సర్వేలో తేలింది. ముంబయి, బెంగళూరు నగరాల్లో ఇటువంటి వంతెనలను నిర్మించిన సంస్థతో సంప్రదించి మరిన్ని సలహాలు, సూచనలను అధికారులు తీసుకున్నారు. ప్రైవేటు ఏజెన్సీల ద్వారా స్కైవాక్ వంతెన నమూనానూ తయారు చేయించారు.
తొలిగా రూ. 10 కోట్లతో వంతెనకు ఇరువైపులా ఎస్కలేటర్లతో నిర్మించాలని భావించిన అధికారులు పూర్తి సర్వే అనంతరం రూ. ఐదు కోట్లతో పనులు పూర్తి చేయవచ్చన్న నిర్ణయానికొచ్చారు. కేవలం పాదచారులను దృష్టిలో పెట్టుకుని నిర్మించనున్న ఈ వంతెనకు ఎస్కలేటర్ల స్థానంలో స్టెయిర్‌కేస్, లిఫ్టులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. పట్టణంలో టౌన్ హాల్ నిర్మాణానికి శంఖుస్థాపన జరిగిన నాడు ఇదే విషయాన్ని అధికారులు స్పష్టంగా తెలియజేశారు. పాదచారులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఈ వంతెన ఉపయోగపడుతుందని అప్పట్లో అధికారుల భావన. మార్కెట్ కాంప్లెక్సుతో పాటు మున్సిపల్ కార్యాలయం, మార్కెట్ ఏరియాకు వెళ్లే ప్రజలకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది.
కౌన్సిల్ ఆమోదం తీసుకోలేకపోయాం
ప్రతిష్టాత్మకంగా వంతెనను నిర్మించేందుకు రంగం సిద్ధం చేశాం. ఈ లోగా ఎన్నికలు రావడంతో కౌన్సిల్ ఆమోదం తీసుకోలేకపోయాం. దాంతో స్కైవాక్ నిర్మాణం మరుగునపడిపోయింది. ఎం ప్రభాకరరావు, మున్సిపల్ ఇంజినీర్