C R. DA
-
అంతన్నారు.. ఇంతన్నారు
► ముందుకు కదలని స్కైవాక్ వంతెన నిర్మాణం ► ఫైలును పక్కన పడేసిన వైనం ► ఆంధ్రా ప్యారిస్‌లో నిర్మాణం సీఆర్డీఏకే తలమానికం ప్రపంచ స్థాయి ప్రజా రాజధాని నిర్మిస్తున్నామంటూ అధికార పక్ష నాయకులు పదే పదే ప్రకటనలు గుప్పిస్తున్నారు. వీరి ప్రకటనలు నిజం కావాలంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా సౌకర్యాలు కల్పించాలి. దీనికి దేశ దేశాల్లోని అనేక అభివృద్ధి నమూనాలను ఆదర్శంగా తీసుకోవాలి. కానీ నేటి పాలకులు నాటి అభివృద్ధి ప్రతిపాదనలను కాలగర్భంలో కలిపేస్తున్నారు. ఇలా మరుగున పడినదే స్కైవాక్ (ఆకాశ నడక) వంతెన నిర్మాణం. ఢిల్లీ, బెంగళూరు వంటి మహా నగరాలకే పరిమితమైన ఈ వంతెనను ఆంధ్రా ప్యారిస్ తెనాలిలో నిర్మించాలని నాలుగేళ్ల క్రితం అప్పటి పాలకులు నిర్ణయించగా..ఇప్పుడు పాలకులు ఆ ఊసే లేకుండా చేశారు. తెనాలిరూరల్ : మహా నగరాలకే పరిమితమైన స్కై వాక్ వంతెనను రాష్ట్రంలోనే తొలిగా తెనాలి పట్టణంలో నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబయ్ నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా పాదచారులు రోడ్డు దాటేందుకు వీలుగా రహదారులపై భారీ ఆకాశ నడక వంతెనలను నిర్మించారు. తెనాలి పట్టణంలో ఇటువంటి వంతెన నిర్మాణానికి సన్నాహాలు చేసిన అధికారులు ఆనక దానికి సంబంధించిన ఫైలును పక్కన పడేశారు. పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ వంతెన వద్ద, ఇక్కడి మహాత్మాగాంధీ కూరగాయల మార్కెట్ కాంప్లెక్సు నుంచి పాత బస్టాండ్ వరకు తూర్పు, పడమర, నిజాంపట్నం, తూర్పు కాల్వల మీదుగా వంతెనను నిర్మించేందుకు నిర్ణయించారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో సుమారు రూ. ఐదు కోట్ల అంచనాతో వంతెనను నిర్మించేందుకు కసరత్తులు చేశారు. 100 మీటర్ల పొడవు ఉండే ఈ వంతెన నిర్మాణానికి సంబంధించి సర్వే పూర్తయ్యాక, ప్రాజెక్టు రిపోర్టును తయారు చేశారు. మూడు రోజులపాటు చేపట్టిన సర్వేలో మార్కెట్ వంతెన వద్ద తెనాలి-గుంటూరు రోడ్డు, తెనాలి-చందోలు రహదారిలో గంటకు 1400 నుంచి 1600 మంది పాదచారులు రాకపోకలు సాగిస్తున్నారని, ఇదే సంఖ్యలో వస్తున్న వాహనాల రద్దీ కారణంగా పాదచారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదని సర్వేలో తేలింది. ముంబయి, బెంగళూరు నగరాల్లో ఇటువంటి వంతెనలను నిర్మించిన సంస్థతో సంప్రదించి మరిన్ని సలహాలు, సూచనలను అధికారులు తీసుకున్నారు. ప్రైవేటు ఏజెన్సీల ద్వారా స్కైవాక్ వంతెన నమూనానూ తయారు చేయించారు. తొలిగా రూ. 10 కోట్లతో వంతెనకు ఇరువైపులా ఎస్కలేటర్లతో నిర్మించాలని భావించిన అధికారులు పూర్తి సర్వే అనంతరం రూ. ఐదు కోట్లతో పనులు పూర్తి చేయవచ్చన్న నిర్ణయానికొచ్చారు. కేవలం పాదచారులను దృష్టిలో పెట్టుకుని నిర్మించనున్న ఈ వంతెనకు ఎస్కలేటర్ల స్థానంలో స్టెయిర్‌కేస్, లిఫ్టులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. పట్టణంలో టౌన్ హాల్ నిర్మాణానికి శంఖుస్థాపన జరిగిన నాడు ఇదే విషయాన్ని అధికారులు స్పష్టంగా తెలియజేశారు. పాదచారులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఈ వంతెన ఉపయోగపడుతుందని అప్పట్లో అధికారుల భావన. మార్కెట్ కాంప్లెక్సుతో పాటు మున్సిపల్ కార్యాలయం, మార్కెట్ ఏరియాకు వెళ్లే ప్రజలకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. కౌన్సిల్ ఆమోదం తీసుకోలేకపోయాం ప్రతిష్టాత్మకంగా వంతెనను నిర్మించేందుకు రంగం సిద్ధం చేశాం. ఈ లోగా ఎన్నికలు రావడంతో కౌన్సిల్ ఆమోదం తీసుకోలేకపోయాం. దాంతో స్కైవాక్ నిర్మాణం మరుగునపడిపోయింది. ఎం ప్రభాకరరావు, మున్సిపల్ ఇంజినీర్ -
పాత ఉద్యోగులపై పక్షపాతం
ఉడా ఉద్యోగులకుప్రాధాన్యత కరువు ఇంజినీరింగ్ విభాగంలో వింత సాక్షి, విజయవాడ బ్యూరో : వీజీటీఎం ఉడాలో పనిచేసిన ఉద్యోగులకు సీఆర్డీఏలో కనీస ప్రాధాన్యం లభించట్లేదు. వారిని పూర్తిగా పక్కనపెట్టేసి తూతూమంత్రం పనులు జరిగే రాజధాని రీజియన్ ప్రాజెక్టుల పనికి కేటాయించారు. ఉడా ఇంజినీరింగ్ విభాగంలో కీలకంగా పనిచేసిన వారికి ఇప్పుడు అక్కడా దాదాపు పనిలేకుండాపోయింది. తాత్కాలిక సచివాలయ నిర్మాణం, రాజధాని ప్రాజెక్టుల కోసం.. అదే ఇంజినీరింగ్ విభాగంలో బయటి నుంచి కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగులను నియమించుకుంటున్నారు. కానీ, అదే విభాగంలో ఎప్పటి నుంచో ఉన్న పాత ఉద్యోగులను మాత్రం ఖాళీగా కూర్చోబెడుతున్నారు. దాదాపు పూర్తయిన ఇన్నర్ రింగురోడ్డు, పంటకాలువ రోడ్డు పనులను వీరికి కేటాయించారు. ఉద్యోగుల కంటే.. ఫర్నీచరే ఎక్కువ బందరు రోడ్డులోని మనోరమ హోటల్ పక్కన అద్దెకు తీసుకున్న భవనంలో ఒక అంతస్తును ఉడా ఇంజినీరింగ్ ఉద్యోగులకు కేటాయించారు. ఇక్కడ ఉద్యోగుల కంటే బల్లలు, కుర్చీలు, బీరువాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఒక డెప్యూటీ ఇంజినీర్, ముగ్గురు అసిస్టెంట్ ఇంజినీర్లు, మరో నలుగురు సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. కనీసం అటెండర్‌ను కూడా కేటాయించకపోవడంతో అన్ని పనులు వారే చూసుకుంటున్నారు. ఒకవైపు రాజధాని ప్రాజెక్టులు చూసే ఇంజినీరింగ్ విభాగం తీవ్రమైన పని ఒత్తిడి ఎదుర్కొంటుండగా, అక్కడ వీరిని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారనే దానికి ఉన్నతాధికారుల నుంచి సమాధానం రావడంలేదు. సీఆర్డీఏ ఆవిర్భవించినప్పుడు ఉడా ఉద్యోగుల పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత అన్ని విభాగాల్లోనూ పాతవారిని అందరితో కలిపేసి పనిచేయిస్తున్నా ఒక్క ఇంజినీరింగ్ విభాగంలోనే పాత వారిని పక్కనపెట్టారు. ప్రస్తుతం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం జరుగుతోంది. రాజధాని అనుసంధాన రోడ్డు, అవుటర్ రింగు రోడ్డు పనులతోపాటు త్వరలో చేపట్టే పనులకూ చాలామంది ఉద్యోగులు, అధికారుల అవసరం ఉంది. అయితే సీఆర్డీఏ ఉన్నతాధికారులు ఈ పనులకు బయట నుంచి కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగులను నియమించుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ఏఈలను అలాగే నియమించారు. మరికొందరి నియామకానికి కసరత్తు చేస్తున్నారు. ఉన్న ఉద్యోగులను పక్కనపెట్టి కాంట్రాక్టు ఉద్యోగుల కోసం పాకులాడడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
భూసేకరణతో భయపెడితే సహించం
బోరుపాలెం సీఆర్డీఏ కార్యాలయూనికి తాళం వేసిన రైతులు తుళ్లూరు: నిత్యం పండే భూములను మెట్టగా నమోదు చేశారని, దీనిపై అభ్యంతరాలు చెప్పినా పట్టించుకోలేదని బోరుపాలెం, అబ్బరాజుపాలెం రైతులు బోరుపాలెం సీఆర్డీఏ కార్యాలయానికి శనివారం తాళాలు వేశారు. తమ భూములను జరీబుగా గుర్తించాలని ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, జేసీ చెరుకూరి శ్రీధర్‌కు విన్నవించినా స్పందించకపోవడంతో కౌలు చెక్కులు తిరస్కరించామన్నారు. ఇప్పుడు తమ భూములకు కరెంటు నిలిపేస్తున్నారని, ఇలా చేస్తే వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. మా పక్క భూములు జరీబైనప్పుడు మావెందుకు కావని ప్రశ్నించారు. భూసేకరణ పేరుతో బెదిరించాలనుకుంటే ఆత్మహత్యలకూ వెనకాడబోమని హెచ్చరించారు. జరీబు ప్రకటన మా పరిధిలో లేదు: డిప్యూటీ కలెక్టర్ శేషారెడ్డి జరీబు భూములు గుర్తించే విషయంపై అధికారులకు నివేదిక పంపామని, ఇది తమ పరిధిలో లేదని బోరుపాలెం సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ శేషారెడ్డి తెలిపారు. జరీబు భూములుగా గుర్తించేందుకు ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన బృందాన్ని నియమించిందని చెప్పారు. ఏడాదిగా సమస్యలు పరిష్కారం కానప్పుడు రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడం సహజమన్నారు. ఈ విషయంపై సీఆర్డీఏ ల్యాండ్ డెరైక్టర్ బీఎల్ చెన్నకేశవులును వివరణ కోరగా నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత కొంత సమయం పడుతుందని రైతులు కంగారు పడాల్సిన పని లేదని చెప్పారు. సీఆర్డీఏ కార్యాలయూనికి తాళాలు వేశారని తెలిసిన ఎస్ఐ రవిబాబు సంఘటన స్థలానికి వచ్చి రైతులతో మాట్లాడారు. ఈ రెండు గ్రామాల్లో 42 ఎకరాలు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చినట్లు ఆయా గ్రామాల రైతులు చనుమోలు చంద్రశేఖరరావు, గూడూరు బుల్లెబ్బాయి, కంచర్ల శరత్, వెంకటేశ్వరరావు, తదితరులు చెప్పారు.