ఉడా ఉద్యోగులకుప్రాధాన్యత కరువు
ఇంజినీరింగ్ విభాగంలో వింత
సాక్షి, విజయవాడ బ్యూరో : వీజీటీఎం ఉడాలో పనిచేసిన ఉద్యోగులకు సీఆర్‌డీఏలో కనీస ప్రాధాన్యం లభించట్లేదు. వారిని పూర్తిగా పక్కనపెట్టేసి తూతూమంత్రం పనులు జరిగే రాజధాని రీజియన్ ప్రాజెక్టుల పనికి కేటాయించారు. ఉడా ఇంజినీరింగ్ విభాగంలో కీలకంగా పనిచేసిన వారికి ఇప్పుడు అక్కడా దాదాపు పనిలేకుండాపోయింది. తాత్కాలిక సచివాలయ నిర్మాణం, రాజధాని ప్రాజెక్టుల కోసం.. అదే ఇంజినీరింగ్ విభాగంలో బయటి నుంచి కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగులను నియమించుకుంటున్నారు. కానీ, అదే విభాగంలో ఎప్పటి నుంచో ఉన్న పాత ఉద్యోగులను మాత్రం ఖాళీగా కూర్చోబెడుతున్నారు. దాదాపు పూర్తయిన ఇన్నర్ రింగురోడ్డు, పంటకాలువ రోడ్డు పనులను వీరికి కేటాయించారు.
ఉద్యోగుల కంటే.. ఫర్నీచరే ఎక్కువ
బందరు రోడ్డులోని మనోరమ హోటల్ పక్కన అద్దెకు తీసుకున్న భవనంలో ఒక అంతస్తును ఉడా ఇంజినీరింగ్ ఉద్యోగులకు కేటాయించారు. ఇక్కడ ఉద్యోగుల కంటే బల్లలు, కుర్చీలు, బీరువాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఒక డెప్యూటీ ఇంజినీర్, ముగ్గురు అసిస్టెంట్ ఇంజినీర్లు, మరో నలుగురు సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. కనీసం అటెండర్‌ను కూడా కేటాయించకపోవడంతో అన్ని పనులు వారే చూసుకుంటున్నారు.
ఒకవైపు రాజధాని ప్రాజెక్టులు చూసే ఇంజినీరింగ్ విభాగం తీవ్రమైన పని ఒత్తిడి ఎదుర్కొంటుండగా, అక్కడ వీరిని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారనే దానికి ఉన్నతాధికారుల నుంచి సమాధానం రావడంలేదు. సీఆర్‌డీఏ ఆవిర్భవించినప్పుడు ఉడా ఉద్యోగుల పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత అన్ని విభాగాల్లోనూ పాతవారిని అందరితో కలిపేసి పనిచేయిస్తున్నా ఒక్క ఇంజినీరింగ్ విభాగంలోనే పాత వారిని పక్కనపెట్టారు. ప్రస్తుతం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం జరుగుతోంది. రాజధాని అనుసంధాన రోడ్డు, అవుటర్ రింగు రోడ్డు పనులతోపాటు త్వరలో చేపట్టే పనులకూ చాలామంది ఉద్యోగులు, అధికారుల అవసరం ఉంది. అయితే సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు ఈ పనులకు బయట నుంచి కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగులను నియమించుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ఏఈలను అలాగే నియమించారు. మరికొందరి నియామకానికి కసరత్తు చేస్తున్నారు. ఉన్న ఉద్యోగులను పక్కనపెట్టి కాంట్రాక్టు ఉద్యోగుల కోసం పాకులాడడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
పాత ఉద్యోగులపై పక్షపాతం
Published Fri, Mar 18 2016 2:00 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement