ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తాం
అవసరమైతే లీగల్, పొలిటికల్, ఫైనాన్స్ కమిటీలు వేస్తాం
అడ్డగోలు భూసేకరణకు దిగుతున్న ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం
రాజధాని ప్రాంతంలోని 6 గ్రామాల రైతుల ఏకగ్రీవ తీర్మానం
కమిటీ సభ్యులుగా టీడీపీ నాయకులు
తాడికొండ: రాజధాని ప్రాజెక్టుల పేరుతో భూములు సేకరిస్తుండటంపై మంత్రి పి.నారాయణను కలిసి సమస్య వివరిస్తే.. కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్టుగా ముచ్చట్లు చెబుతున్నారని రాజధాని భూసేకరణ బాధిత రైతుల సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు యెడ్డూరి వీరహనుమంతరావు, కంచర్ల శివరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గుంటూరు జిల్లా తాడికొండలో రైల్వే ప్రాజెక్టు, ఇన్నర్ రింగ్ రోడ్డు, కొండవీటి వాగు ఆధునికీకరణ, ఇతర కనెక్టివిటీ రోడ్ల పేరుతో భూములు సేకరించేందుకు ముందుకెళుతున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఐదు గ్రామాల రైతులు సమావేశమయ్యారు.
పార్టీలకు అతీతంగా నిర్వహించిన ఈ సమావేశంలో టీడీపీ నాయకులే ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించడం, న్యాయపోరాటానికి సిద్ధమని వెల్లడించడం విశేషం. పలువురు రైతులు మాట్లాడుతూ రైతుల అంగీకారం లేకుండా భూముల సేకరణ ప్రక్రియ ఎలా కొనసాగుతుందో చూస్తామని హెచ్చరించారు. ఓ పద్ధతి లేకుండా ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో భూసేకరణ చేస్తే సహించేది లేదని, సమీకరణ ద్వారా తీసుకుంటే భూములిచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
ఈ అంశాలపై ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను సంప్రదించగా సానుకూలంగా స్పందించలేదని, మంత్రి నారాయణ కూడా స్పష్టత ఇవ్వకుండా కాలం గడిపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాల నుంచి వస్తున్న భూములను కోల్పోకుండా ప్రభుత్వంపై న్యాయపోరాటం చేసి కాపాడుకునేందుకు పార్టీలకు అతీతంగా తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు.
ఇందుకోసం లీగల్, పొలిటికల్, ఫైనాన్స్ కమిటీలను ఏర్పాటు చేసి కోర్టులో న్యాయపోరాటానికి దిగనున్నట్టు వెల్లడించారు. ఇటీవల కాలంలో రైల్వే ప్రాజెక్టు పేరుతో పంట పొలాలను తొక్కించుకుంటూ అధికారులు పెగ్ మార్క్ సర్వే చేస్తుంటే.. తాము అడ్డుకొని రాళ్లు తొలగించామని, కొప్పురావూరు, ఇతర గ్రామాలకు చెందిన రైతులు కూడా రాళ్లు తొలగించాలని సూచించారు.
పూలింగ్ ప్యాకేజీ వర్తింపజేయాలి
రాజధానిలో రైతుల భూములకు ఇచ్చిన ప్యాకేజీని తమకూ వర్తింపజేయాలని, 1,250 చదరపు గజాల భూమిని అమరావతిలో అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైల్వే ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీని ప్రభుత్వమే తీసుకుని రైతులకు మాత్రం పూలింగ్ ప్యాకేజీ ఇస్తే తప్ప రూ.కోట్ల విలువ చేసే భూములకు తగిన న్యాయం జరగదన్నారు.
ప్రభుత్వ విధానాన్ని ఎండగడుతూ టీడీపీకి చెందిన నాయకులే కమిటీ సభ్యులుగా ఉండి పార్టీలకు అతీతంగా పోరాడతామనిప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటివరకు గ్రామాల్లో భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా ముందుకెళ్లడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అడ్డగోలు భూసేకరణకు దిగుతున్న ప్రభుత్వానికి బుద్ధిచెప్పి హక్కులు సాధించుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment