హెచ్‌ఎండీఏకు అంతంతే...
సిటీబ్యూరో: నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్న హెచ్‌ఎండీఏకు గ్రాంట్ రూపంలో నేరుగా అందించే నిధులు విషయంలో ప్రభుత్వం మళ్లీ మొండిచెయ్యి చూపింది. ప్రస్తుతం అమలవుతున్న ప్రాజెక్టులకు ‘జైకా’ నుంచి తీసుకున్న రుణాలనే నిధులుగా బడ్జెట్‌లో చూపించారు. ప్రతిష్టాత్మకమైన ఔటర్ రింగ్‌రోడ్డు, హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంత అభివృద్ధి పనులకు రుణ రూపంలో విదేశీ సాయం పొందేలా ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.250కోట్లు కేటాయించింది.
ఓఆర్‌ఆర్ కాంట్రాక్టు సంస్థలకు యాన్యుటీ పేమెంట్‌కు రూ.415 కోట్లు కోరితే... రూ.345.83 కోట్లు ఇచ్చింది. కొత్త ప్రాజెక్టులకు ప్రణాళికేతర వ్యయంలో రూ.1043.30 కోట్లు కోరగా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. గత ఏడాది బడ్జెట్‌లో రూ.1985.50 కోట్లు ప్రతిపాదించగా కేవలం రూ.338 కోట్లు కేటాయించి చేతులు దులుపుకొంది. ఈ ఏడాది(2015-16) కూడా రెగ్యులర్ స్కీంల కింద ఔటర్ యాన్యుటీ పేమెంట్‌కు, బాపూఘాట్ బ్రిడ్జికి రూ.416 కోట్లు కోరగా... రూ.250కోట్లు కేటాయించింది.
అన్నీ బుట్టదాఖలే...
హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్ పరిధిలోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు రూ.538 కోట్లు కోరగా... ప్రభుత్వం బుట్ట దాఖలు చేసింది. హుస్సేన్‌సాగర్ పరిధిలోని ఎస్టీపీలు, ఐ అండ్ డిల నిర్వహణకు బడ్జెట్లో పైసా కూడా కేటాయించకపోవడంతో సాగర్ నిర్వహణ హెచ్‌ఎండీఏకు మోయలేని భారంగా మారనుంది. ప్రస్తుతం వాటికి నెలవారీగా రూ.75 లక్షలు కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు. హరితహారానికి రూ.70 కోట్లు ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పక్కకు పెట్టేసింది. ఔటర్ రింగ్‌రోడ్డులో భూములు కోల్పోయిన బాధితులకు ప్రత్నామ్నాయ ప్లాట్లు ఇచ్చేందుకు కొహెడలో మెగా లేఅవుట్ అభివృద్ధికి రూ.11.40 కోట్లు, ఓఆర్‌ఆర్ భూ నిర్వాసితుల పరిహారానికి రూ.261.40 కోట్లు కావాలని కోరగా.. సర్కార్ వాటిని పరిగణనలోకే తీసుకోలేదు. చిలుకూరు రిజర్వ్ ఫారెస్టులో కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు రూ.9.90 కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. వాటిని సైతం పక్కన పెట్టేసింది.