ఇదీ హెచ్‌ఎండీఏ బడ్జెట్
బోర్డు ఆమోదం
సిటీబ్యూరో: ప్రస్తుత (2016-17) ఆర్థిక సంవత్సరానికి రూ.2,008 కోట్ల బడ్జెట్‌కు హెచ్‌ఎండీఏ బోర్డు ఆమోదం తెలిపింది. గురువారం నిర్వహించిన ఈ సమావేశంలో... హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా హెచ్‌ఎండీఏ.. జీహెచ్‌ఎంసీ కలిసి పని చేయాలని బోర్డు నిర్ణయించింది. భవిష్యత్తులో హెచ్‌ఎండీఏ పరిధిలోనే అధిక శాతం అభివృద్ధికి అవకాశం ఉండడంతో... ఆమేరకు ప్రణాళికాబద్ధంగా సౌకర్యాలు...మౌలిక వసతులు కల్పించాలని భావిస్తోంది.
ప్రస్తుత బోర్డు సమావేశంలో చర్చకు రాని అంశాలపై తదుపరి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించింది. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు సమన్వయంతో పౌర సేవలు అందించాల్సిన అవసరాన్ని గుర్తించింది. విశృంఖలత్వానికి అడ్డుకట్ట వేస్తేనే.. విశ్వనగరం కల సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్ తదితరులు హాజరయ్యారు.