జాతీయ పండుగగా గుర్తిస్తాం
ఎస్‌ఎస్ తాడ్వాయి: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను ఘనంగా జరుపుకుంటున్నామని, వచ్చే జాతర నాటికి జాతీయ పండుగగా గుర్తించేందుకు కృషి చేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం ఆయన కుటుంబసభ్యులతో కలిసి మేడారంలో సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకుని మొక్కు లు చెల్లించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణలో మొదటిసారి జరిగే జాతరకు రూ. కోట్లు వెచ్చించి భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. గోదావరి పుష్కరాల అనుభవంతో ఈ జాతరను విజయవంతం చేసేందుకు కలెక్టర్, ఎస్పీలు కృషి చేస్తున్నారన్నారు. ప్రశాంత వాతవారణంలో భక్తులు దేవతలను దర్శించుకునేలా దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారని చెప్పారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎంపీ సీతారాంనాయక్ తదితరులు ఉన్నారు.