ఇవేం పైపులైన్లు?
తీవ్రంగా కలుషితమవుతున్న జలాలు
పురాతన పైపులైన్లే కారణం గుర్తించిన అధికారులు
నూతన పైపులైన్ల ఏర్పాటుకు చర్యలు..
ఏడు నీటి నమూనాల్లో బ్యాక్టీరియా కలకలం..
సిటీబ్యూరో: నగరంలో పురాతన మంచినీటి పైపులైన్లు, డ్రైనేజి పైపులైన్లు ఒకదానిపై మరొకటి ఉన్న చోట కలుషిత జలాల సమస్య తరచూ తలెత్తుతోంది. ఇటీవల సరూర్‌నగర్ పరిధిలోని కామేశ్వర్‌రావు నగర్, అల్వాల్‌లోని రాజీవ్‌నగర్, అంబేద్కర్‌నగర్, మలక్‌పేట్‌లోని ప్రిన్స్ బాడీగార్డ్‌లేన్, చర్చికాలనీ, రామంతాపూర్‌లోని గోకుల్‌నగర్‌లో కలుషిత జలాల సమస్య ఉత్పన్నమైన విషయం విదితమే. ఈనేపథ్యంలో జలమండలి అధికారులు రంగంలోకి దిగి కలుషిత జలాలకు కారణాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో పురాతన ఆర్‌సీసీ, ఏసీ, పీవీసీ, హెచ్‌డీపీఈ మంచినీటి సరఫరా పైపులను భూమి నుంచి 5 నుంచి ఆరు అడుగుల లోతున ఏర్పాటు చేశారు. వీటిపై నుంచి నూతనంగా మురుగు నీటి పైపులైన్లు వేయడంతో మంచినీరు, మురుగు నీటి పైపులైన్లకు ఏర్పడిన స్వల్ప లీకేజీలతో కలుషిత సమస్య ఉత్పన్నమైంది. ఆయా ప్రాంతాల్లో తక్షణం పురాతన మంచినీటి పైపులైన్ల స్థానే నూతన పైపులైన్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హడ్కో సంస్థ మంజూరు చేసిన రుణంతో ఆయా ప్రాంతాల్లో ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని జలమండలి ఎండీ బి.జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారన్నారు. ఇక ఆయా ప్రాంతాల్లో గుంతల్లో ఏర్పాటు చేసిన పిట్‌ట్యాప్‌లను తక్షణం తొల గించాలని స్థానికులకు సూచించామని జలమండలి వర్గాలు తెలిపాయి.
11247 నీటి నమూనాలకు పరీక్షలు..
మార్చి 1 నుంచి 24 వరకు నగర వ్యాప్తంగా 11,247 మంచినీటి నమూనాలకు ఇన్సిట్యూట్ ఆఫ్ హెల్త్‌సిస్టమ్స్ ల్యాబుల్లో పరీక్షలు నిర్వహించినట్లు జలమండలి ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో ఏడు నీటి నమూనాల్లో మాత్రమే బ్యాక్టీరియా ఆనవాళ్లున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో కలుషిత జలాల సమస్యను నివారించామని ప్రకటించింది. ఇక రోజువారీగా నగరం నలుమూలల నుంచి 2180 నీటి నమూనాలను సేకరింంచి ఇన్సిట్యూట్ ఆఫ్ హెల్త్‌సిస్టమ్స్, ఇన్సిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ల్యాబుల్లో పరీక్షిస్తున్నామన్నారు. నీటి నమూనాల సేకరణకు సెల్ఫ్‌హెల్ప్‌గ్రూపు మహిళల సహకారం తీసుకుంటున్నామన్నారు. కలుషిత జలాలపై అందిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఎండీ బి.జనార్దన్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సీజీఎం, జీఎం, డీజీఎం, మేనేజర్లకు ఆదేశాలిచ్చారన్నారు.