జలం.. గరళం
మహా నగరంలోని పైపులైన్లు జలానికి బదులు గరళాన్ని సరఫరా చేస్తున్నాయి. గత్యంతరం లేని జనం... ఆ గరళాన్ని మింగి... ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎప్పుడో తాతల కాలం నాటి పైపులైన్లు... అవీ మురుగు కాల్వల మధ్య నుంచి... పోనీ మంచిగా ఉన్నాయా? అంటే.... ఎక్కడికక్కడే లీకులు. ఇవే కాలుష్యానికి ద్వారాలు. వింత వింత రంగుల్లో కనిపించే నీరు...ప్రజల కన్నీటికి కారణమవుతోంది. వీటిని సరి చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ప్రేక్షక పాత్రకే పరిమితమవుతోంది.
సాక్షి,సిటీబ్యూరో: బంజారాహిల్స్ రోడ్‌నెం.12లోని ఎన్బీటీ నగర్, ఎన్బీనగర్, శ్రీరాంనగర్, భోలానగర్, ఖాజానగర్ బస్తీల్లో కొన్ని నెలలుగా నల్లాల్లో రంగుమారి దుర్వాసన వెదజల్లుతున్న, పురుగులతో కూడిన కలుషిత నీరుసరఫరా అవుతోంది. ఇటీవల స్వచ్ఛ హైదరాబాద్‌లో ఈ బస్తీల్లో పర్యటించిన మంత్రి హరీష్‌రావుతో పాటు అధికారులకు ఈ విషయమై వందలాది మంది మహిళలు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే దెబ్బతిన్న మంచినీటి పైపులను మార్చాలని అధికారులను ఆదేశించారు. కానీఇంతవరకు ఈ పనులు ప్రారంభం కాలేదు. బస్తీవాసులు కలుషిత నీటితో రోగాల పాలయ్యే దుస్థితి నెలకొంది.
... ఇది కొన్ని బస్తీల సమస్య కాదు. గ్రేటర్ పరిధిలో కలుషిత జలాలతో సతమతమవుతున్న ఇలాంటి బస్తీలు వందల్లో ఉన్నాయి. పురాతన మంచినీటి పైప్‌లైన్లకు చిల్లులు పడడం... వీటి పక్కనే డ్రైనేజి పైప్‌లైన్లు ఉండడంతో మురుగు నీరు మంచినీటి పైప్‌లైన్లలో చేరి తాగునీరు కలుషితమవుతోంది. ఈ నీటిని తాగిన చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు డయేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. పాత నగరం సహా అనేకప్రాంతాల్లో సుమారు 1150 కి.మీ. పరిధిలో దశాబ్దాల క్రితం వేసిన పురాతన మంచినీటి పైప్‌లైన్లు తుప్పుపట్టి చెడిపోవడం... వాటికి చిల్లులు పడడంతో తాగునీటిలో మురుగు నీరు కలుస్తోంది. ఫలితంగా కలుషిత జలాల సమస్య ఉత్పన్నమవుతోంది. వీటిని మార్చేందుకు అవసరమైన రూ.1200 కోట్లను ఠమొదటిపేజీ తరువాయి రాష్ట్ర సర్కారు విదల్చడం లేదు. నల్లా నీళ్లు కలుషితమవడంతో బస్తీవాసులు ఫిల్టర్‌ప్లాంట్లు విక్రయిస్తున్న తాగునీటిని కొనుగోలు చేసి... జేబులు గుల్ల చేసుకుంటున్నారు. కలుషిత జలాలతో సతమతమవుతున్న బస్తీల్లో మంగళవారం పర్యటించిన ‘సాక్షి’ బృందం వద్ద స్థానికులు తమ సమస్యలను ఏకరవు పెట్టారు.
ఎక్కడెక్కడంటే...
- కుత్బుల్లాపూర్ పరిధిలోని షాపూర్ నగర్, జీడిమెట్ల, ఆదర్శ నగర్, జగద్గిరిగుట్ట సెక్షన్ల పరిధిలో మంచినీటి పైప్‌లైన్లకు తరచూ లీకేజీలతో మురుగు నీరు చేరి తాగునీరు గరళమవుతోంది.
- సూర్యానగర్‌కు వెళ్లే ఎస్‌కే ఫంక్షన్ హాలు రోడ్డు, నందా నగర్‌కు వెళ్లే దారి, రంగారెడ్డి నగర్ ఐ పైలాన్ ఎదురుగా, గాంధీనగర్ పారిశ్రామికవాడకు వెళ్లే దారి, బాల్‌రెడ్డి నగర్ మెయిన్ రోడ్డు, పద్మానగర్ ఫేజ్-02 శ్మశాన వా టిక, మాణిక్యనగర్, గోదావరి హోమ్స్, చింతల్ చంద్రానగర్, భగత్‌సింగ్ నగర్ హైస్కూల్ సమీపంలో, చింతల్ ఆగ్రోస్ సమీపంలో, గాంధీనగర్ ఠాగూర్ స్కూల్ గల్లీలో గత కొద్ది రోజులుగా మంచినీటి పైప్‌లైన్లకు లీకేజీలతో తాగునీరు వృథా అవడంతో పాటు కలుషిత జలాల సమస్య వేధిస్తోంది.
- రహమత్ నగర్ డివిజన్‌లోని బస్తీల్లో కలుషిత జలాల సమస్య ఉత్పన్నమవుతున్నా... అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనే జీ పైపులకు చిల్లులు పడడం, మ్యాన్‌హోళ్లు లీకై... మంచినీటి పైప్‌లైన్లలో కలవడంతో కలుషిత నీరు సరఫరా అవుతోందని బస్తీ వాసులు మండిపడుతున్నారు. ఇటీవల స్థానిక ఓంనగర్ బస్తీలో మహిళలు కలుషిత మంచినీటిని సీసాలలో నింపి బస్తీలో ఆందోళన నిర్వహించారు.
- కూకట్‌పల్లి ఆస్‌బె స్టాస్ కాలనీలో భూమిలోకి చేరిన పారిశ్రామిక రసాయనాలతో బోర్ల నుంచి ఎర్రటి రంగుతో నీరు వెలువడుతోందని స్థానికులు చెబుతున్నారు.
- కూకట్‌పల్లి ప్రశాంత్ నగర్, రంగారెడ్డి నగర్‌లలోని పారిశ్రామికవాడల్లోని కంపెనీల్లో వాడిన వ్యర్ధాలను స్థానిక నాలాలోకి వదులుతున్నారు. ఆ నీరు మంచినీటిలో చేరుతోంది. సుమారు 2 వందల అడుగుల లోతులో బోర్లు వేసినా ఎర్రటి దుర్గంధభరితమైన నీరు సరఫరా అవుతోంది. ఈ ప్రాంతాలకు అరకొరగా మంజీర నీరు సరఫరా అవుతుండడంతో బోరుబావుల నీటిని వినియోగించిన వారు రోగాల పాలవుతున్నారు. పాపారాయుడు నగర్, ఏబీవీపురం ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి.
- జియాగూడ డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో మురుగునీటి పైపులు, కచ్చామోరీలు పొంగిపొర్లి పక్కనే ఉన్న మంచినీటి పైప్‌లైన్‌లోకి చేరుతున్నాయి. వెంకటేశ్వర నగర్, ఇక్బాల్‌గంజ్, పురానాపూల్ వెనుక, పురానాపూల్, అర్జున్‌గల్లీ, మక్బరా, గోపీ హోటల్, బీమ్‌నగర్, ఇమామ్‌పురా, సత్తన్నగల్లీ, గౌలిగూడ సెక్షన్ పరిధిలోని గౌలిగూడ, ఫీల్‌ఖానా, బేగంబజార్, సిద్దంబర్‌బజార్ తదితర ప్రాంతాల్లోనూ తరచూ కలుషిత జలాలు సరఫరా అవుతున్నాయి.
- వనస్థలిపురంలోని రెడ్‌వాటర్ ట్యాంక్‌ను చివరిసారి 2013 జనవరి 23న శుభ్రం చేశారు. రెండున్నరేళ్లుగా దీన్ని పట్టించుకోవడం లేదు.
కలుషిత జలాలకు కారణాలివే...
- గతంలో జలమండలి నిర్వహించిన అధ్యయనంలో నగరంలో 1150 కిలోమీటర్ల మేర ఉన్న పురాతన ఆర్‌సీసీ మంచినీటి పైప్‌లైన్ వ్యవస్థ వల్లనే కలుషిత జలాల పరిస్థితి పునరావృతమవుతున్నట్టు తేలింది.
- పైప్‌లైన్ వ్యవస్థను ఆధునికీకరించేందుకు రూ.1200 కోట్లు అవసరం. ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేయడం లేదు.
- వివిధ ప్రాంతాల్లో లీకేజీలను అరికట్టడంలో జలమండలి సిబ్బంది విఫలమవుతున్నారు.
- వందేళ్లు పూర్తయిన మీరాలం ఫిల్టర్ బెడ్లను ఆధునికీకరించకపోవడం శాపంగా పరిణమిస్తోంది. గ్రేటర్‌కు మంచినీరు సరఫరా చేస్తున్న ఫిల్టర్ బెడ్ల వద్ద క్లోరినేషన్, ఫిల్టరేషన్, రసాయన పరీక్షలు సక్రమంగా నిర్వహించడం లేదు.
- జలమండలి ఆధ్వర్యంలో కలుషిత జలాల నివారణకు రూ.75 కోట్ల అంచనాతో చేపట్టిన సమగ్ర వాటర్ సేఫ్టీ ప్రణాళిక అమలుకు ప్రభుత్వం అరకొర నిధులు విడుదల చేస్తోంది.
- స్టోరేజి రిజర్వాయర్లు, పైప్‌లైన్ వ్యవస్థల్లో క్లోరినేషన్ ప్రక్రియ మొక్కుబడిగా సాగుతోంది. దీంతో బాక్టీరియా విజృంభించి.. రోగాలకు కారణమవుతోంది.
ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు
చింతల్ ప్రధాన రహదారిలో మంజీర పైపులైన్ మరమ్మతుల కోసం తవ్వారు. నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో ఈ ప్రాంతంలో మంజీర నీరు వృథా పోతూ... కలుషితమవుతోంది. దీనిపై మూడుసార్లు జలమండలి అధికారులకు ఫిర్యాదు చేశాం. అయినా పట్టించుకోవడం లేదు.
-పి.శ్రీనివాస్‌రెడ్డి, చింతల్.
రంగు మారిన నీరు సరఫరా
రహమత్ నగర్ డివిజన్ ఓం నగర్ బస్తీతో పాటు కొన్ని బస్తీల్లో కలుషిత మంచినీరు సరఫరా అవుతోంది. అధికారులు పట్టించుకోవడం లేదు. పేదలు నివసించే ఎస్.పి.ఆర్. ప్రాంతంలోని వివిధ బస్తీల్లో సమస్య అధికంగా ఉంది.
- మేఘన పద్మ, ఓం నగర్
నీటి నమూనాలు పరీక్షించండి
వాటర్‌వర్క్స్ అండ్ సీవరేజ్ బోర్డ్‌లో ప్రత్యేకంగా కాలుష్యాన్ని గుర్తించే విభాగం ఉంటుంది. వీరు తప్పనిసరిగా ఆయా ప్రాంతాల్లో పర్యటించి సమస్యను పరిష్కరించాలి. ప్రతిరోజూ సరఫరా అవుతున్న మంచినీటి నమూనాలను సేకరించి పరీక్షించాలి.
- దర్పల్లి నర్సింహులు, కేశవస్వామి నగర్
డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలి
మంచినీరు కలుషితం కావడానికి ప్రధాన కారణం డ్రైనేజీ ఓవర్‌ఫ్లో. ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని పరిష్కరించకపోవడం వల్లే మురుగునీరు మంచినీటి పైప్‌లైన్‌లలో కలుస్తోంది.
- నరహరి చారి, దుర్గానగర్