జలసిరికి దుర్గతి
చెరువుల్లో చేరుతున్న నీరు
♦ ఆక్రమణల గుప్పెట్లో కాలువలు
♦ మూతపడుతున్న జమీందారు నాటి కాలువ
♦ నీటి ప్రవాహానికి కనిపించని దారి
♦ సీఎం నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి
ప్రతినీటి చుక్కనూ ఒడిసి పట్టి నిల్వ చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. ఇప్పుడు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే చెరువుల్లోకి నీరు చేరుతున్నా అవి పొలానికి చేరే దారి లేక అయోమయ పరిస్థితి నెలకొంది. కాలువలు ఆక్రమణదారుల చేతిలో చిక్కుకున్నాయి. ఫలితంగా నీటి ప్రవాహానికి దారీతెన్నూ కనిపించడం లేదు. తాజాగా పడుతున్న వర్షపు నీరు వృథా అవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
కుప్పం : కుప్పం కరువు కోరల్లో చిక్కుకున్న నియోజకవర్గం..అంతేకాదు సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఎక్కువసార్లు ఎన్నికైన నియోజకవర్గమిది. తాజాగా ఆశాజనకంగా కొంచెం వర్షం పడుతోంది. ఈనీరు వ్యవసాయ అవసరాలు తీరుస్తుందనుకుంటే పొరపాటే. చెరువుల నుంచి నీరు వెళ్లే మార్గాలన్నీ ఆక్రమణల పరమయ్యాయి. ఉదా హరణకు దళవాయికొత్తపల్లె చెరువు నుంచి పెద్దబంగారునత్తం చెరువు వరకు ఉన్న సప్లై ఛానల్ పరిస్థితే ఇందుకు ఉదాహరణ.ఇన్నాళ్లూ నీరు తగినంత చేరకపోవడంతో ఎవరూ దీనిని పట్టించుకోలేదు. 12 ఏళ్ల పాటు చెరువులు ఎండిపోయాయి. సప్లై ఛానళ్లుగా ఉన్న కాలువలు మూతపడిపోయాయి. ఇవి కాస్తా ఆక్రమణలకు గురయ్యాయి. ప్రస్తుతం వర్షాలతో నీరు చెరువుల్లో చేరుతోంది. అయితే నీటి ప్రవాహానికి ఇబ్బందికరంగా మారింది. హెచ్‌పీ రోడ్డులోని రాజుకాలువ ఆక్రమణల వల్ల ఆనవాలే లేకుండా పోయింది.
నియోజకవర్గంలోని పెద్ద చెరువులుగా పేరుపొందిన దళవాయికొత్తపల్లె చెరువు, పెద్దబంగారునత్తం చెరువుల మధ్య అనుసంధానంగా ఉన్న సప్లైఛానల్ మూతపడింది. డీకేపల్లె చెరువు కాలువ, దాని చుట్టూ ఉన్న వ్యవసాయ భూములు రియల్‌ఎస్టేట్ పరిధిలోకి వెళ్లిపోయాయి. హెచ్‌పీ రోడ్డులో కాలువను ఆక్రమించుకుని భవనాలు కూడా నిర్మించారు. కాలువ ఆనవాలు కనపడకుండా ఆక్రమించుకుని నిర్మాణాలు వెలిశాయి. ప్రధాన బ్రిడ్జి వద్ద ప్రస్తుతం రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించిన ఆక్రమణ వ్యర్థ పదార్థాలను ఈ కాలువల్లో వేయడం వల్ల పూర్తిగా మూతపడింది. వంద ఎకరాలు విస్తరించివున్న జమీందారునాటి కాలువ నీటి ప్రవా హానికి ఆస్కారం లేకపోవడంతో ఇబ్బందికరంగా మారింది.
ఈ క్రమంలో జిల్లాలో కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వివిధ పథకాల కింద చెరువుల లోతట్టు భాగం తవ్వారు. దీంతో చెరువుల్లో నీటి మట్టం పెరిగింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి నియోజకవర్గంలోని చెరువులన్నీ నిండాయి. దళవాయికొత్తపల్లె చెరువు మొరువ దశకు చేరుకుంది. మరో రెండు రోజులు వర్షాలు కురిస్తే దళవాయికొత్తపల్లె చెరువు మొరువతో నీరు హెచ్చి ఇళ్లపైకి దూసుకొచ్చే ప్రమాదముంది. ఇక్కడున్న కాలువ ఆక్రమణకు గురి కావడం, మూసివేయడం వలన నీటి ప్రవాహానికి మార్గం లేదని, ఇళ్లల్లోకి చొరబడే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.