నీటికుంట మింగేసింది..!
నీటికుంట మింగేసింది..!
Published Wed, May 17 2017 10:29 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
- కానాల గ్రామంలో ఇంటర్ విద్యార్థి మృతి
- దాహం తీర్చుకునేందుకు వెళ్లి మృత్యువాత
సంజామల: దాహం తీర్చుకునేందుకు వెళ్లి నీటికుంటలో పడి ఇంటర్ విద్యార్థి సోము సాయికుమార్‌రెడ్డి (17) మృతి చెందాడు. ఈ ఘటనతో బుధవారం కానాల గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. సోము భాస్కర్‌రెడ్డి, కృష్ణవేణి దంపతుల కుమారుడైన సాయికుమార్ రెడ్డి.. కర్నూలు శ్రీ చైతన్య ఇంటర్ కాలేజీలో ఎంపీసీ చదివి 840 మార్కులు సాధించాడు. ఉదయం వ్యవసాయ పనిముట్ల కోసం నంద్యాలకు తండ్రి, కోవెలకుంట్లలో బంధువుల పెళ్లికి కుమారుడు బయలు దేరారు. తండ్రి బైక్‌పై ముందు బయలుదేరగా ఆవెంటనే కుమారుడు మరోబైక్‌పై బయలుదేరారు. తండ్రి వెళ్తున్న బైక్‌ను దాటి వెళ్తున్న కుమారుడు టాటా చెప్పి మందుకు కదిలాడు. అయితే తండ్రికి బాయ్‌చెప్పిన కుమారుడు అదే చివరి పలుకు అయింది.
పెండ్లికి వెళ్ళొచ్చిన సాయికుమార్ రెడ్డి.. సాయంత్రం పొట్టేళ్లు మేపేందుకు గ్రామ సమీపంలోని ముక్కమళ్ళ రహదారిలో ఉన్న పొలాల్లోకి వెళ్ళాడు. సమీపంలో ఉన్న నీటి కుంటలో దాహం తీర్చుకునేందుకు వెళ్లి.. కాలుజారి పడ్డాడు. ఈత రాకపోవడంతో బిగ్గరగా కేకలు వేశాడు. సమీపంలో పశువులు కాసేందుకు వెళ్లిన మహమ్మద్ అలీ, వెంగన్న..మరొకరు ప్రమాద స్థలికి చేరుకొన్నారు. అయితే అక్కడున్నవారికి ఎవరికీ ఈత రాకపోవడంతో పంచెలు ఊడదీసి వాటి సహాయంతో కాపాడే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో గ్రామంలోని బంధువులకు సమాచారాన్ని ఇచ్చారు. వారు వచ్చేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నీటిలో మునిగిన బాధితున్ని బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నంద్యాల నుంచి ఇంటికి వచ్చిన తండ్రి కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు సంతానం కాగా ఉన్న ఒక్క కుమారుడు ప్రమాదంలో మృత్యువాత చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
Advertisement
Advertisement