చక్కగా చదువుకునే వయసులో మోహం ప్రేమవైపు నడిపిస్తే.. అది ఏకంగా ప్రాణాన్నే బలిగొంది. ఒకవైపు ప్రియుడు, మరోవైపు కుటుంబం నుంచి వస్తున్న ఒత్తిళ్లతో మనోవేదనకు గురై ఈ లోకాన్ని విడిచివెళ్లింది. పిల్లలు లేత వయసులో వేసే తప్పటడుగులు కన్నవారికి తీరని శోకాన్నే పంచాయి.
సాక్షి, బొమ్మనహళ్లి: పెళ్ళి చేసుకోవాలని ప్రియుడు పదే పదే వేధింపులకు గురి చేస్తుండటం, ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోక పోవడంతో మైనర్ బాలిక తీవ్ర మానసిక క్షోభకు గురైంది. బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. బన్నేరుఘట్ట పోలీసు స్టేషన్ సమీపంలోనున్న జిగణిలో ఉన్న చెరువులో దూకింది. మృతురాలు బన్నేరుఘట్ట దగ్గరిలోని శ్యానబోగనహళ్ళి గ్రామానికి చెందిన పుష్ప (17). వివరాలు.. పుష్ప జిగిణిలో ఉన్న ప్రైవేట్ కాలేజీలో పియూసీ చదువుతోంది.
ఆమె తల్లిదండ్రులు కూలీ పనిచేస్తుంటారు. అదే కళాశాల్లో చదువుతున్న నిఖిల్ అనే యువకుడు– పుష్ప మధ్య పరిచయమై ప్రేమగా మారింది. మనం పెళ్ళి చేసుకుందామని నిఖిల్ పుష్పను పదేపదే అడుగుతున్నాడు. కానీ పుష్ప మాత్రం అప్పుడే వివాహం వద్దని, ఇంట్లో వారిని ఒప్పించి పెళ్ళి చేసుకుందామని చెబుతున్నా నిఖిల్ వినేవాడు కాదు. చివరకు పుష్ప ఈ విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పగా వారు ఈ పెళ్లికి ససేమిరా అన్నారు.
కాలేజీ దగ్గరిలోని చెరువులో శవమై...
ఈ పరిణామాలతో మనోవేదనకు గురైన పుష్ప రెండు రోజుల క్రితం కాలేజీకి వచ్చి మళ్లీ ఇంటికి వెళ్ళలేదు. ఆమె కనిపించకపోవడంతో అంతటా గాలించిన బంధువులు చివరికి బన్నేరుఘట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు బాలిక కోసం గాలింపు చేపట్టారు. శనివారం ఉదయం జిగణిలో కాలేజీకి సమీపంలోనున్న చెరువులో ఒక బాలిక శవం కనిపించింది. స్థానికులు జిగణి పోలీసులకు తెలియజేయగా, సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు బాలిక మృతదేహాన్ని వెలికితీసి చూడగా ఆమె పుష్పేనని తేలింది. అనంతరం కుటుంబ సభ్యులకు వివరాలను తెలిపి, శవపరీక్ష కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారూ. జిగిణి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment