సాక్షి, హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకా లన్నది తెలంగాణ ప్రజల స్లోగన్ కాదని, అది కేసీఆర్ నినాదం మాత్రమేనని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇక్కడి ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసమని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, పీఏసీ కన్వీనర్ షబ్బీర్‌అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి, మరో నేత మల్‌రెడ్డి రాంరెడ్డిలతో కలసి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ కార్డు హామీలతో బీఆర్‌ఎస్ నేతలు కకావికలం అవుతున్నారని ఎద్దేవా చేశారు.
‘పార్లమెంటులో పెప్పర్ స్ప్రే కొట్టి, బిల్లు పేపర్లు చింపేసినా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఏర్పాటు చేశారు. నిజంగా బీఆర్ ఎస్‌కు రాజకీయ విజ్ఞత ఉన్నట్టయితే సోనియాను గౌరవంగా స్వాగతించి ఉండాల్సింది. కానీ, మేం మీటింగ్ పెట్టుకోగానే బీఆర్‌ఎస్, బీజేపీ, మజ్లిస్‌లు ఏకమై కుట్రలు చేశాయి. సభకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించాయి. సోనియా తెలంగాణకు రావడంతో బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎంల ముసుగులు తొలగిపోయాయి. వీళ్లంతా కలసి సభను అడ్డుకోవాలని చూశారు. అయినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు.
సభ విజయవంతం కావడంతో ఇప్పుడు అందరూ చొక్కాలు చించుకుంటూ రాజకీయ విచక్షణ కోల్పోయి వీధి కుక్కల కంటే దారుణంగా దిగజారి మాట్లాడుతున్నారు’అని రేవంత్ వ్యాఖ్యానించారు. తాము ప్రజలకు ఏం చేస్తామో చెప్పుకుంటూ వెళతామని, తమ ట్రాక్ రికార్డు ఏమిటో తెలిసిన ప్రజలు.. తగిన నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు.
తాము తెలంగాణ ఇచ్చామని, రైతులకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేశామని, అటవీ భూములపై గిరిజనులకు హక్కులు కల్పించామని, అలాగే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదల ఆరోగ్యాన్ని కాపాడామని, ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన చరిత్ర తమదని రేవంత్ పేర్కొన్నారు. ‘2004 నుంచి 2014 వరకు మేము అధికారంలో ఉన్న కాలంలో ప్రజలకు ఎలాంటి హామీలిచ్చామో, ఏమి నెరవేర్చారో చెపుతాం. 2014లో తెలంగాణ ఏర్పాటయిన తర్వాత బీఆర్‌ఎస్ ఇచ్చిన ఎన్ని హామీలు నెరవేర్చారో వారినే చెప్పమనండి. మేం చర్చకు సిద్ధం’అని అన్నారు. బీఆర్‌ఎస్‌కు మిగిలింది ఇక 99 రోజులేనని రేవంత్ పేర్కొన్నారు.
రాష్ట్రాల అవసరాల్లో తేడాలుంటాయి
తాటిచెట్టంత పెరిగితే.. మెదడు మోకాళ్లలోకి వస్తుందని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావును చూస్తే అర్థమవుతుందని రేవంత్ వ్యాఖ్యానించారు. ‘ఇంటింటికీ ప్రణాళికలు మారినట్టే, రాష్ట్రాల అవసరాల్లో కూడా తేడాలుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని ప్రజల అవసరాలు, ఆదాయం ఆధారంగా పార్టీల కార్యాచరణ ఉంటుంది. జాతీయ పార్టీలు అయినంత మాత్రాన దేశమంతా ఒకే విధానం అమలు కాదు.
అలా చేయడం వృథా అవుతుంది. ఏ రాష్ట్రంలో ఏ అవసరం ఉందో గుర్తించి, వాటిని నెరవేర్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుంది’అని అన్నారు. బుర్ర లేకుండా వితండ వాదం చేయవద్దని, వెర్రిమాటలు మాట్లాడితే ప్రజలు చీరి చింతకు కడతారని వ్యాఖ్యానించారు. ధరణిని రద్దు చేస్తామన్న వ్యాఖ్యలను రేవంత్ పునరుద్ఘాటించారు. ‘తెలంగాణలో భూమి సమస్యే ప్రధానమైంది. భూమి కోసమే సాయుధ పోరాటం జరిగింది. కేసీఆర్ పాలనను బొందపెట్టడం ధరణితోనే మొదలు పెడతాం. ధరణిని రద్దు చేసి మెరుగైన విధానం తీసుకువస్తాం’అని రేవంత్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment