Slogan
-
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో యూపీ సీఎం నినాదం!
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘బటేంగే తో కటేంగే’ నినాదం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ ఈ నినాదాన్ని పెద్ద ఎత్తున వాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వేడెక్కిన మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఆదిత్యనాథ్ స్లోగన్ పోస్టర్లు దర్శనం ఇవ్వడం ప్రారంభమయ్యాయి. హిందుత్వ అజెండాతో ఓటు బ్యాంకును ఏకం చేసే ప్రయత్నంలో ఈ నినాదాన్ని వాడుకుంటున్నారు. వాస్తవానికి బంగ్లాదేశ్‌లో మారిన రాజకీయ పరిస్థితుల మధ్య, మైనారిటీ హిందువులపై అఘాయిత్యాల అంశంపై సీఎం యోగి గతంలో చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.సీఎం యోగి ప్రకటనపై తొలుత ఇటీవల హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘బటేంగే తో కటేంగే’ అంటూ పోస్టర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ నినాదంతో హిందువులను ఏకం చేయడంతో పాటు తమ ఓటుబ్యాంకును ఏకతాటిపై తెచ్చేందుకు నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో నిర్వహించనున్న ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. విపక్షాల వ్యూహరచనమరోవైపు బీజేపీపై విజయం సాధించేందుకు విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. కుల సమీకరణను ప్రధాన అంశంగా చేసుకొని అధికార వ్యతిరేకత నడుమ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్న కులాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు విపక్షాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. హరియాణాలో జాట్ ఓటు బ్యాంకును ఉపయోగించుకొని అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రయత్నించినప్పటికీ బీజేపీ వ్యూహం ముందు అది ఫలించలేదు. ‘బటేంగే తో కటేంగే’ నినాదంతో హరియాణా ఎన్నికల్లో ప్రచారం చేసిన బీజేపీ .. జాట్లు మినహా ఇతర ఓటు బ్యాంకులను తమవైపు తిప్పుకోగలిగింది.కాగా గతంలో ఆగ్రాలో జరిగిన ఓ కార్యక్రమంలో అందరూ ఐక్యంగా ఉండాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ జాతీయ సమైక్యతా సందేశాన్ని ఇచ్చారు. అందరం ఐక్యంగా ఉన్నప్పుడే దేశం బలపడుతుందని.. విభజిస్తే విడిపోతామని ఆయన అన్నారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న తప్పులు ఇక్కడ జరగరాదని యోగి పిలుపునిచ్చారు. చదవండి: బారామతి నుంచి అజిత్ పవార్ బరిలోకి.. ఎన్సీపీ తొలి జాబితా విడుదల -
అందరికీ ‘రామ్ రామ్’
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించినప్పటికీ.. ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై స్పష్టత రావడం లేదు. అధిష్టానం ఆదేశాల మేరకు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డీవీ శర్మ తదితర ముఖ్య నేతలతో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ తదుపరి సీఎం ఎవరన్న దానిపై సోమవారం ఓ నిర్ణయానికి రానుంది. పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో ‘అందరికీ రామ్ రామ్’అంటూ ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఇకపై తాను ముఖ్యమంత్రి పదవిలో ఉండబోనని పరోక్షంగా చెప్పేందుకే ఆయన అలా ట్వీట్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై చౌహాన్ స్పందిస్తూ.. తన ట్వీట్ అంతరార్థం అది కాదని చెప్పారు. ఎవరినైనా పలకరించేటప్పుడు ‘రామ్..రామ్’అని చెప్పడం ఇటీవల కాలంలో సర్వసాధారణమైందని, రాముడి పేరుతో దినచర్యను ప్రారంభించడం మన సంస్కృతిలో భాగమని అందుకే అలా ట్వీట్ చేశానని చెప్పుకొచ్చారు. కానీ, ఆయన ట్వీట్లో ద్వంద్వ అర్థం ఉండటం రాజకీయంగా దుమారం రేపుతోంది. మధ్యప్రదేశ్‌లో సీఎం రేసులో ప్రధానంగా శివరాజ్ సింగ్‌తోపాటు జ్యోతిరాదిత్య సింథియా, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఉన్నారు. -
ఆరు గ్యారంటీలు.. నూరు సీట్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల కోసం లండన్ వేదికగా కాంగ్రెస్ పార్టీ కొత్త నినాదాన్ని అందుకుంది. ‘‘ఆరు గ్యారంటీలు–నూరు సీట్లు’ పేరు తో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. టీపీసీసీ ఎన్నారై సెల్ (యూకే) ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని లండన్‌లో చేప ట్టారు. దీనిని గాంధీభవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఆరు గ్యారంటీ పథకాలు, నూరు గ్యారంటీ సీట్లు లక్ష్యంగా తెలంగాణ ప్రజల్లోకి వెళ్లాలని.. విదేశాల్లో ఉన్న వారి బంధువులు, సన్నిహి తులు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేసే లా తోడ్పడాలని ఆయన మార్గ నిర్దేశం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలోని యువత, మహి ళలు, రైతులకు ప్రాధాన్యం ఉండేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. విద్యార్థుల కోసం రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు. గల్ఫ్ సంక్షేమ బోర్డు, ఎన్నారై సెల్ ఏర్పాటు తదితర అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాన్ని పరిశీ లిస్తామని తెలిపారు. టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ నేతృత్వంలో జరిగిన కార్య క్రమంలో ఎన్నారై సెల్ నేతలు రంగుల సుధా కర్ గౌడ్, బిక్కుమండ్ల రాజేశ్, మంగళారపు శ్రీధర్, గంగసాని ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆ నినాదం తెలంగాణ ప్రజలది కాదు.. కేసీఆర్‌ది
సాక్షి, హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకా లన్నది తెలంగాణ ప్రజల స్లోగన్ కాదని, అది కేసీఆర్ నినాదం మాత్రమేనని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇక్కడి ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసమని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, పీఏసీ కన్వీనర్ షబ్బీర్‌అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి, మరో నేత మల్రెడ్డి రాంరెడ్డిలతో కలసి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ కార్డు హామీలతో బీఆర్ఎస్ నేతలు కకావికలం అవుతున్నారని ఎద్దేవా చేశారు. ‘పార్లమెంటులో పెప్పర్ స్ప్రే కొట్టి, బిల్లు పేపర్లు చింపేసినా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఏర్పాటు చేశారు. నిజంగా బీఆర్ ఎస్‌కు రాజకీయ విజ్ఞత ఉన్నట్టయితే సోనియాను గౌరవంగా స్వాగతించి ఉండాల్సింది. కానీ, మేం మీటింగ్ పెట్టుకోగానే బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్‌లు ఏకమై కుట్రలు చేశాయి. సభకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించాయి. సోనియా తెలంగాణకు రావడంతో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంల ముసుగులు తొలగిపోయాయి. వీళ్లంతా కలసి సభను అడ్డుకోవాలని చూశారు. అయినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. సభ విజయవంతం కావడంతో ఇప్పుడు అందరూ చొక్కాలు చించుకుంటూ రాజకీయ విచక్షణ కోల్పోయి వీధి కుక్కల కంటే దారుణంగా దిగజారి మాట్లాడుతున్నారు’అని రేవంత్ వ్యాఖ్యానించారు. తాము ప్రజలకు ఏం చేస్తామో చెప్పుకుంటూ వెళతామని, తమ ట్రాక్ రికార్డు ఏమిటో తెలిసిన ప్రజలు.. తగిన నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు. తాము తెలంగాణ ఇచ్చామని, రైతులకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేశామని, అటవీ భూములపై గిరిజనులకు హక్కులు కల్పించామని, అలాగే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదల ఆరోగ్యాన్ని కాపాడామని, ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన చరిత్ర తమదని రేవంత్ పేర్కొన్నారు. ‘2004 నుంచి 2014 వరకు మేము అధికారంలో ఉన్న కాలంలో ప్రజలకు ఎలాంటి హామీలిచ్చామో, ఏమి నెరవేర్చారో చెపుతాం. 2014లో తెలంగాణ ఏర్పాటయిన తర్వాత బీఆర్ఎస్ ఇచ్చిన ఎన్ని హామీలు నెరవేర్చారో వారినే చెప్పమనండి. మేం చర్చకు సిద్ధం’అని అన్నారు. బీఆర్ఎస్కు మిగిలింది ఇక 99 రోజులేనని రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రాల అవసరాల్లో తేడాలుంటాయి తాటిచెట్టంత పెరిగితే.. మెదడు మోకాళ్లలోకి వస్తుందని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావును చూస్తే అర్థమవుతుందని రేవంత్ వ్యాఖ్యానించారు. ‘ఇంటింటికీ ప్రణాళికలు మారినట్టే, రాష్ట్రాల అవసరాల్లో కూడా తేడాలుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని ప్రజల అవసరాలు, ఆదాయం ఆధారంగా పార్టీల కార్యాచరణ ఉంటుంది. జాతీయ పార్టీలు అయినంత మాత్రాన దేశమంతా ఒకే విధానం అమలు కాదు. అలా చేయడం వృథా అవుతుంది. ఏ రాష్ట్రంలో ఏ అవసరం ఉందో గుర్తించి, వాటిని నెరవేర్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుంది’అని అన్నారు. బుర్ర లేకుండా వితండ వాదం చేయవద్దని, వెర్రిమాటలు మాట్లాడితే ప్రజలు చీరి చింతకు కడతారని వ్యాఖ్యానించారు. ధరణిని రద్దు చేస్తామన్న వ్యాఖ్యలను రేవంత్ పునరుద్ఘాటించారు. ‘తెలంగాణలో భూమి సమస్యే ప్రధానమైంది. భూమి కోసమే సాయుధ పోరాటం జరిగింది. కేసీఆర్ పాలనను బొందపెట్టడం ధరణితోనే మొదలు పెడతాం. ధరణిని రద్దు చేసి మెరుగైన విధానం తీసుకువస్తాం’అని రేవంత్ వ్యాఖ్యానించారు. -
మీ సంగతి ప్రజలే చూసుకుంటారు: నరేంద్ర మోదీ
తనపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటరే ఇచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ‘ మీ సమాధిని తవ్వుతారంటూ’ కాంగ్రెస్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మోదీ గట్టిగానే బదులిచ్చారు. ఈ తరహా వ్యాఖ్యలు చేసే వారి సంగతి ప్రజలే చూసుకుంటారని మోదీ స్పష్టం చేశారు. ఒకవైపు దేశ ప్రజలు కమలం వికసిస్తోందని అంటుంటే, కాంగ్రెస్ మాత్రం సమాధిని తవ్వుతామని వ్యాఖ్యానించడం వారు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారని అనడానికి నిదర్శనమన్నారు. తనపై కామెంట్లు చేసే వారంత దేశ ప్రజల చేత బహిష్కరించబడ్డవారేనని మోదీ చమత్కరించారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో శుక్రవారం జరిగిన ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు మోదీ. ఆ ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడి అరెస్టును ప్రస్తావించకుండా కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పించారు. సుప్రీం కోర్టు సైతం ఈ విషయమై ప్రశ్నించినా.. పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ కుటుంబమే ఫస్ట్ అంటూ దాన్నే అనుసరిస్తుందని విమర్శలు గుప్పించారు మోదీ. ఐతే మేఘాలయ ప్రభుత్వం మాత్రం ప్రజలే ఫస్ట్ అనే నినాదానికి పిలుపునిస్తోంది కాబట్టే అక్కడ కమలం శాంతి, స్థిరత్వానికి పర్యాయ పదంగా నిలిచిందన్నారు. అంతేగాదు ఈ రోడ్ షోలో ప్రజలకు తనకు మద్దతు ఇచ్చినందుకు ధన్యావాదాలు తెలిపారు. తనపై కురిపించిన ప్రేమకు ప్రతి ఒక్కరికి ధన్యావాదాలు చెప్పడమే గాక తనపై చూపిన ప్రేమ ఆశీర్వాదాలకు మేఘాలయా అభివృద్ధి చేసి వారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటామన్నారు. కాగా, మేఘాలయలో ఫిబ్రవరి 27న నాగాలాండ్‌తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరాను ఢిల్లీ విమానాశ్రయంలో గురువారం ఛత్తీస్‌గఢ్ వెళ్లే విమానం ఎక్కకుండా అడ్డుకోవడంతో ఆ పార్టీ సభ్యులు ఈ విధంగా మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. (చదవండి: పెళ్లిరోజు మర్చిపోయినందుకు భర్తపై దాడి..నివ్వెరపోయిన పోలీసులు) -
మహోజ్వల భారతి: ‘సైమన్ గో బ్యాక్’ అన్నది ఈయనే!
యూసుఫ్ మెహర్ అలీ స్వాతంత్య్ర సమరయోధులు. సోషలిస్టు నాయకుడు. 1942లో బాంబే మేయర్‌గా ఎన్నికయ్యారు. నేషనల్ మిలీషియా, బాంబే యూత్ లీగ్, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ.. ఈ మూడూ మెహర్ అలీ స్థాపించినవే. అలీ అనేక ఉద్యమాలను నడిపించారు. రైతులు, కార్మికులు ఆయన సారథ్యంలో బ్రిటిష్ సామ్రాజ్యంపై ఉద్యమించారు. ‘సైమన్ గో బ్యాక్’ అనే నినాదం ఆయనదే. అంతేకాదు, భారత్ నుంచి బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడిన ఉద్యమ గర్జన ‘క్విట్ ఇండియా’ అనే మాట ఆయన ఆలోచన నుంచి ఉద్భవించినదే. అలీ గాంధీజీకి అత్యంత సన్నిహితులు. ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి నినాదం ఇవ్వడంతో పాటు, ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించింది కూడా అలీనే. ఆయన ముంబైలో 1903 సెప్టెంబర్ 23న జన్మించారు. 1950లో మరణించారు. నేడు ఆయన వర్ధంతి (జూలై 2). బోస్ అరెస్ట్ అయిన రోజు రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. బ్రిటన్.. ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’తో కనీస సంప్రదింపులైనా లేకుండానే భారతీయులు బ్రిటన్ తరఫున యుద్ధానికి దిగుతున్నట్లు ప్రకటించింది. ఆ నిర్ణయం తీసుకుంది వైశ్రాయ్ లార్డ్ లిన్లిత్గో. బోస్ ఉగ్రుడయ్యారు. మీ యుద్ధంలోకి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు అని ప్రశ్నించారు. ఈ యుద్ధం మనం చేయొద్దు అని గాంధీజీకి చెబితే ఆయన స్పందించలేదు! చివరికి బోస్ కలకత్తాలో కలకలం రేపారు. లిన్లిత్గో నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా సమీకరణలు, ప్రసంగాలు చేశారు. ఆ రోజు జూలై 2, 1940. పోలీసులు బోన్ ను చుట్టు ముట్టారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. జైల్లో వారం రోజులు నిరాహారదీక్ష చేశారు బోస్. దాంతో అతడిని విడుదల చేశారు. కానీ కలకత్తాలోని బోస్ ఇంటి చుట్టూ సి.ఐ.డి. పోలీసులను కాపలాగా పెట్టారు. అయినప్పటికీ మారువేషంలో తప్పించుకుని మద్ధతు కోసం హిట్లర్‌ను కలిసేందుకు బోస్ జర్మనీ వెళ్లారు. సిరాజ్ గెలిచి ఉంటేనా! సిరాజ్ ఉద్దౌలా బెంగాల్ చిట్ట చివరి నవాబు. ప్లాసీ యుద్ధంలో అతడి ఓటమి, భారత ఉపఖండంలో ఈస్టిండియా కంపెనీ పాలనకు ద్వారాలు తెరచింది. క్రమంగా ఉపఖండమంతటా వ్యాపించింది. సిరాజ్ యువకుడు. తన సైన్యంలో కమాండర్‌గా ఉన్న మీర్ జాఫర్ నమ్మకద్రోహం వల్ల యుద్ధంలో పట్టుబడి 24 ఏళ్లకే మరణించాడు. 1757 జూలై 2న ఈస్టిండియా సైన్యం అతడిని ఉరి తీసింది. (చదవండి: మహోజ్వల భారతి: వైద్యుడు, యోధుడు) -
ఇంక్విలాబ్ జిందాబాద్.. నినాద సృష్టికర్త ఎవరంటే?
భారత స్వాతంత్య్ర సమర కాలంలో అనేక నినాదాలను చేసేవారు. వాటిలో ప్రజాదరణ పొందినది ‘ఇంక్విలాబ్ జిందాబాద్’. విప్లవం వర్ధిల్లాలి అనేది ఈ నినాద అర్థం. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాద సృష్టికర్త విప్లవ యోధుడు భగత్ సింగ్ అని చాలామంది భావిస్తుంటారు. నిజానికి ఈ నినాదాన్ని రూపొందించింది నాటి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా హస్రత్ మోహాని. వీరు 1878 అక్టోబర్ 14న ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలోని మోహన్ పట్టణంలో జన్మించారు. ఆయన 1903లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరినా కొన్ని గాంధీజీ సిద్ధాంతాలతో విభేదించి బయటికొచ్చారు. కమ్యూనిస్టు పార్టీలో కొంతకాలం ఉన్నారు. ఆంగ్లేయులను వ్యతిరేకిస్తూ విప్లవ పంథాలో అనేక వ్యాసాలు రచించారు. దీంతో 1909లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను రాజద్రోహ నేరంపై జైల్లో ఉంచింది. హిందూ ముస్లింల ఐక్యతను పెంపొందించే అనేక గజల్స్‌ను రచించారు. పలుమార్లు హైదరాబాద్ సందర్శించి ‘ఖిలాఫత్’ ఉద్యమ ప్రచారం చేశారు. హస్రత్ 1921లో తన రచనల్లోనూ, ఉద్యమబాటలో సైతం ‘ఇంక్విలాబ్ జిందా బాద్’ అనే నినాదాన్ని ప్రస్తావించారు. (చదవండి: మళ్లీ మొదటికొచ్చిన కశ్మీర్ సమస్య) హస్రత్ రూపొందించిన ఈ నినాదం ‘హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్’ అధికార నినాదంగా మారింది. విప్లవ వీరుడు భగత్ సింగ్‌తో పాటు అతని సహచరుడు బీకే దత్ ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై బాంబుల దాడి చేసిన తరువాత... తొలిసారిగా న్యాయస్థానంలో 1929 ఏప్రిల్ 8న ఈ నినాదం చేయడంతో ఎంతో ఇది ప్రాచుర్యం పొందింది. నాటి నుండి ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదం భారత స్వాతంత్య్రోద్యమంలో భాగమైంది. 1951 మే 13న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో హస్రత్ కన్నుమూశారు. – షేక్ అబ్దుల్ హకీం జాని, తెనాలి (భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా...) -
చెత్తకు కొత్త రూపుం...వేస్ట్ క్రాఫ్ట్
సాక్షి, విశాఖపట్నం : మనం రోజూ రకరకాల వస్తువులను ఎడాపెడా వాడేస్తుంటాం.. బోలెడన్ని పదార్థాలు తింటూ ఉంటాం. కానీ.. ఎప్పుడైనా చెత్తగురించి ఆలోచించామా.? రోడ్లపై పడేసిన వస్తువులు, సీసాలు, పాత ఎలక్ట్రానిక్ సామాన్లు.. ఇలా ఒకటేమిటి.? అన్నీ చెత్తని సృష్టించేవే..? వస్తువూ వస్తువూ పోగై.. కొండంత చెత్తగా మారుతూ ప్రపంచానికే సవాల్ విసురుతున్నా.. దాని గురించి మాత్రం ఎప్పుడూ పట్టించుకోం. నగరానికి చెందిన ఓ సంస్థ మాత్రం.. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల.. కాదేదీ పునర్వినియోగానికి అనర్హం అన్నట్లుగా తనదైన శైలిలో వ్యర్థాలకు సరికొత్త అర్థాన్ని చెబుతోంది. జీరో వేస్ట్ నినాదంతో నగరంలోని పలు వ్యర్థాలకు కొత్త రూపునిస్తూ.. ప్రజల్ని చైతన్యవంతులను చేస్తోంది. చీపురు పుల్లల నుంచి.. వలల వరకూ.. గాజువాక ప్రాంతానికి చెందిన గ్రీన్ వేవ్స్ ఎన్విరాన్మెంటల్ సొల్యూషన్స్ సంస్థ.. జీరో వేస్ట్ నినాదంతో ముందుకు వెళ్తోంది. అంటే మనం వాడే ప్రతి వస్తువూ ఏదో ఒక విధంగా.. పునర్వినియోగానికి పనికొస్తుందని సంస్థ భావన. కేవలం భావన మాత్రమే కాదండోయ్.. ఎలా కొత్త రూపాన్ని ఇచ్చి.. పాత వస్తువును ఉపయోగించగలమో చేసి చూపిస్తోంది. చీపురు పుల్లల నుంచి చిరిగిపోయిన చేపల వలల వరకూ.. కాలిపోయిన వైర్ల నుంచి కొబ్బరి చిప్పల వరకూ.. ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి గాజు సీసాల వరకూ.. ప్రతి వస్తువుకూ కొత్తందం తీసుకొస్తోంది. కొబ్బరి చిప్పలతో కళాకృతులు.. మనమంతా కొబ్బరి మాత్రమే తీసుకొని.. చిప్పల్ని బయట పడేస్తాం. ఈ గ్రీన్‌వేవ్స్ సంస్థ ప్రతినిధులు మాత్రం.. అవి కేవలం చిప్పలు మాత్రమే కాదు.. విభిన్న కళాత్మక వస్తువులకు ప్రతిరూపాలని నిరూపిస్తున్నారు. కొబ్బరి చిప్పలతో కాఫీకప్పులు, కీ చైన్లు.. ఎన్ని రకాలుగా తయారు చేశారు. కొత్తగా వచ్చిన కేజీఎఫ్–2 సినిమాకు ప్రతిరూపాన్ని కూడా అచ్చుగుద్దినట్లు తయారు చేసేశారు. అంతేకాదు బుల్లెట్ బండి, దేవుళ్ల ప్రతిమలు, వాచీలు, నైట్ ల్యాంపులు, ఇలా.. ఎన్నో అలంకరణ వస్తువులు తయారు చేస్తున్నారు. (చదవండి: సరదాగా మాట్లాడుకుందామని పిలిచి..) -
‘జై హింద్’ నినాదకర్త మనోడే!
‘జై హింద్’ నినాదాన్ని ప్రతిపాదించింది హైదరాబాద్ నివాసి సయ్యద్ ఆబిద్ హసన్ సఫ్రాని అని విన్నప్పుడు ఆశ్చర్యం కలగక మానదు. 1911 ఏప్రిల్ 11న ఫఖ్రుల్ హాజియా బేగం, అమీర్ హసన్ దంపతులకు జన్మించారు ఆబిద్. ఆయన తల్లి స్వాతంత్య్ర సమర యోధురాలు కావడంతో ఆమె బాటలో నడుస్తూ జాతీయ పతాకాన్ని చేతబట్టారు. మహాత్ముని పిలుపు మేరకు చదువుకు స్వస్తి పలికి 1931లో సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ తరువాత నాసిక్ జైలుకు చెందిన రిఫైనరీని నాశనం చేయ తలపెట్టిన విప్లవకారులతో పనిచేసి కారాగార శిక్షకు గురైనారు. ‘గాంధీ–ఇర్విన్ ఒడంబడిక’ ఫలితంగా జైలు నుండి విడుదలయ్యారు. ఆ తర్వాత జాతీయ కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటూ... ఇంజినీరింగ్ కోసం జర్మనీ వెళ్ళారు. అక్కడ సుభాష్ చంద్రబోస్‌తో పరిచయం ఏర్పడింది. 1942 నుండి రెండేళ్ళ పాటు బోస్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా, అనువాదకుడిగా పని చేశారు. ఆ క్రమంలో అనేక దేశాలు తిరిగి వచ్చారు. జర్మనీలో ఉన్న సమయంలో సైనికులు పరస్పరం పలకరించుకోవడానికి ‘నమస్తే’, ‘సలాం అలైకువ్‌ు’ ఇత్యాది మాటలు వాడేవారు. వీటికి బదులుగా దేశభక్తిని చాటే ఏదైనా ఒక నినాదాన్ని సూచించమని నేతాజీ ఆబిద్ హసన్‌ను కోరగా ‘జై హింద్’ నినాదాన్ని సూచించారు. నాటి నుండి జైహింద్ భారత విప్లవ నినాదంగా మారింది. జైహింద్ నినాదానికి నేతాజీనే రూపకల్పన చేశారని చాలా మంది భావిస్తారు. ఆబిద్ హసన్ ప్రతిపాదించిన ఈ నినాదం నేతాజీ కారణంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళింది. ఆబిద్ హసన్ 1984లో 73 సంవత్సరాల వయస్సులో స్వస్థలమైన హైదరాబాదులోనే తుది శ్వాస విడిచారు. – షేక్ అబ్దుల్ హకీం జానీ, తెనాలి (భారత స్వాతంత్య్రఅమృతోత్సవాల సందర్భంగా...) -
సాంగ్, స్లోగన్ రాయండి.. క్యాష్ ప్రైజ్ గెలుచుకోండి
సాక్షి, హైదరాబాద్: ఓటరు చైతన్య కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న వివిధ పోటీలకు మార్చి 15వ తేదీ వరకు గడువుందని జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘మై ఓట్ ఈజ్ మై ఫ్యూచర్–పవర్ ఆఫ్ వన్ ఓట్’ పేరిట జాతీయస్థాయిలో తొలిసారిగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. సాంగ్, వీడియో మేకింగ్, పోస్టర్ డిజైన్, స్లోగన్, క్విజ్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. వీటిల్లో సాంగ్, వీడియో మేకింగ్, పోస్టర్ డిజైన్ పోటీలను మూడు కేటగిరీల్లో (ఇనిస్టిట్యూషనల్, ప్రొఫెషనల్, అమెచ్యూర్) నిర్వహిస్తున్నారు. మొదటి, ద్వితీయ, తృతీయ, ప్రత్యేక గుర్తింపుగా నగదు బహుమతులున్నాయి. ఇనిస్టిట్యూషన్ కేటగిరీలో నాలుగు ప్రత్యేక గుర్తింపు బహుమతులుండగా, మిగతా విభాగాల్లో మూడు ప్రత్యేక గుర్తింపు బహుమతులున్నాయి. రూ.2 లక్షల నుంచి 10 వేల వరకు బహుమతులు అందుకునే అవకాశం ఉంది. స్లోగన్ విభాగంలో మొదటి బహుమతి, రూ.20వేలు, రెండో బహుమతి రూ. 10వేలు, మూడో బహుమతి రూ.7,500. క్విజ్ పోటీలో విజేతలకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి విలువైన బహుమతులు, బ్యాడ్జిలు అందజేయనున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. మూడు స్థాయిల్లో పాల్గొన్న వారందరికీ ఈ–సర్టిఫికెట్టు అందజేయనున్నట్లు తెలిపింది. పోటీలో పాల్గొనాలనుకునేవారు పూర్తి వివరాల కోసం voterawarenesscontest.in చూడవచ్చునని పేర్కొంది. (చదవండి: కరోనాకు వేవ్‌లు లేవు... వేరియంట్లే) -
కేసీఆర్‌ను ఉంచాలా.. దించాలా?
సాక్షి, హైదరాబాద్: ‘సీఎం కేసీఆర్ కచ్చితంగా ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళతారు. 2022 నవంబర్, డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన రద్దు చేస్తారు. 2023 ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికలు వస్తాయి. ఈసారి ఎన్నికల్లో ఎన్ని పార్టీలు పోటీలో ఉన్నా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే పరిస్థితి ఉండదు. కేసీఆర్‌ను ఉంచాల్నా... దించాల్నా అనే నినాదంపైనే ఎన్నికలు జరుగుతాయి. కేసీఆర్ వ్యతిరేక వర్గం, అనుకూల వర్గం మాత్రమే ఈ ఎన్నికల పోరాటంలో నిలబడుతుంది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పనిచేయాలనుకునే వారంతా కాంగ్రెస్‌లోకి రావాల్సిందే’ అని స్పష్టం చేశారు టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి. ఇంద్రవెల్లిలో సోమవారం ‘దళిత గిరిజన దండోరా’ నిర్వహించనున్న సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... బరితెగింపు కనిపిస్తోంది అందమైన అబద్ధాలను అతికినట్టు చెప్పి ఓట్లు రాబట్టుకోవడంలో కేసీఆర్ దిట్ట. గతంలో నాయకులు అబద్ధాలు చెప్పినా ఏదో ఒక ముసుగు ఉండేది. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆ ముసుగు కూడా లేదు. బరితెగింపు కనిపిస్తోంది. హుజూరాబాద్, దుబ్బాక, నాగార్జునసాగర్, జీహెచ్ఎంసీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ... ఇలా ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికలకు అనుగుణంగా ప్రజలను మభ్య పెట్టడం, ఆ ఎన్నికలైపోగానే ప్రజలకిచ్చిన హామీలను మర్చిపోవడం ఆయనకు అలవాటుగా మారింది. అందులో భాగమే ఇప్పుడు దళితబంధు. ఉద్యోగాలిస్తే 50–60వేలు వారికే వచ్చేవి కదా? రాష్ట్రంలోని 16 లక్షల దళిత కుటుంబాలు, 10 లక్షల గిరిజన కుటుంబాలకు రూ.10లక్షలు ఇవ్వాలి. దళిత బంధు పేరిట దళితులకు రూ.10 లక్షలు దశల వారీగా ఇస్తానని కేసీఆర్ అంటున్నారు. ఈయనకు ప్రజలు అధికారం ఇచ్చిందే ఐదేళ్లకు. కానీ కేసీఆర్ చెప్పినట్టు చేయాలంటే దళిత బంధు పూర్తి కావడానికి వెయ్యేళ్లు పడుతుంది. దళిత ఎమ్మెల్యేలు, మంత్రులకు కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా దొరకదు. నేరెళ్ల ఇసుక మాఫియా ఘటన, ఖమ్మంలో గిరిజన రైతులకు సంకెళ్లు, మరియమ్మ లాకప్‌డెత్, ఎల్బీనగర్లో పారిశుద్ధ్య కార్మికులు చనిపోయిన ఘటన.. ఇలాంటివన్నీ దళిత, గిరిజనులకు వ్యతిరేకంగా జరిగినవే. రాష్ట్రంలోని 1.91 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే ఎస్సీ, ఎస్టీలకు అందులో 50–60 వేల ఉద్యోగాలు వచ్చేవి. కేసీఆర్ దళితుల బంధువు కాదు. వారి పాలిట రాబందు. 40 రోజుల పోరాట కార్యాచరణ కేసీఆర్ నడిపిస్తున్నది శాంపిల్ గవర్న్మెంట్. మార్కెట్లో మామిడిపండ్ల బేరం చేసే వాళ్లు కూడా ఒక ముక్క శాంపిల్‌గా ఇచ్చి రుచి చూడమని అడుగుతారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రతి పథకం పేరుతో శాంపిల్‌గా మాత్రమే ఇస్తోంది. డబుల్ బెడ్రూం ఇళ్లు, మూడెకరాల భూమి, 57 ఏళ్లకు పింఛన్, ఇంటికో ఉద్యోగం, రైతులకు రుణమాఫీ... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. భగవద్గీత అని చెప్పిన మేనిఫెస్టోనే కేసీఆర్ అమలు చేయలేదు. అందుకే ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు 40 రోజుల కార్యాచరణ ప్రకటించాం. ప్రతిరోజూ మండల, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలుంటాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా లేదా రూ.10 లక్షలు అందరికీ ఇస్తారా, చస్తారా అని ప్రజలు నిలదీయాలి. ఆయనకు కేసీఆర్ ఆశీర్వాదం ఉంది.. రాష్ట్రంలో బీజేపీకి బలం లేదు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిస్థితి పార్టీలోనే బాగాలేదు. ఆయన పాదయాత్ర చేస్తానంటే సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారు. ఇప్పుడు మళ్లీ కిషన్‌రెడ్డి తనకు ప్రజల ఆశీర్వాదం కావాలని అడుగుతున్నారు. కాంగ్రెస్ పోరాటాల పుణ్యమా అని సహాయ మంత్రి కాస్తా కేబినెట్ మంత్రి అయ్యాడు. అందులో కేసీఆర్ ఆశీర్వాద బలం కూడా ఉంది. ఇంకా ప్రజల ఆశీర్వాదం ఆయనకెందుకు? అమరుల స్ఫూర్తి నింపేందుకే... ఇంద్రవెల్లిలో అమాయకులైన ఆదివాసీలు పోలీసు తూటాలకు బలయ్యారు. ఆ నేల ఆదివాసీల రక్తంతో, కొమురం భీం ఆశయాలతో, రాంజీ గోండు పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకుంది. ఇంద్రవెల్లి గడ్డ మీద దండు కట్టి దండోరా మోగించి కేసీఆర్ నిరంకుశ వైఖరి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని, అమరుల సాక్షిగా స్ఫూర్తి పొందాలని అక్కడి నుంచే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రపంచ గిరిజనోత్సవ దినోత్సవంతో పాటు, క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన రోజు కాబట్టే ఆగస్టు 9న మొదలు పెడుతున్నాం. -
అమూల్యకు బెయిల్ ఇవ్వకూడదు
-
పథకాల కన్నా కేసీఆర్‌కే ఆదరణ
-
చారిత్రక అవసరం!
ఇదిగో అదిగో అంటున్నారు కానీ వర్షాలు వూడిపడటం లేదంటున్నాడు బాబాయ్ వూరి రచ్చబండ దగ్గర. వచ్చినవే తిరిగెళ్లాయ్. ‘నాల్రోజుల్నాడు బంగాళాఖాతం మీదుగా బందరు అంచుకి వచ్చాయంట. మహానాడు స్పీచ్‌లు విని వెనక్కు తిరిగాయట’ అన్నాడు సత్యం సీరియస్‌గా. ఎందుకనో పాపం అడిగాడొక శ్రోత. ‘రుతుపవనాలు పవిత్రమైన కొండల మీంచి, పచ్చని అడవుల్లోంచి వస్తాయ్. వాటికి అబద్ధాలు బొత్తిగా సరిపడవ్. అవి ధారాళంగా మూడ్రోజుల పాటు వినిపించేసరికి లోపలికెళ్లి నక్కాయంట. వస్తాయ్. కాస్త సద్దుమణిగితే గానీ ధైర్యం చెయ్యవ్’ అన్నాడు సత్యం సహజధోరణిలో. సత్యం మా వూళ్లో మంచి మాటకారి. వింటున్నారా, యీ మధ్య చంద్రబాబు కొత్త స్లో–గన్ నోట పట్టుకున్నాడు. ‘నన్ను గెలిపించుకోవడం చారిత్రక అవసరం’ అని పదేపదే అంటున్నాడు. నాకసలు అర్థమే కావడం లేదన్నాడు బాబాయ్. ‘అప్పుడెప్పుడో మనూళ్లో పోలేరమ్మ గుడి మలుపులో, కిళ్లీ కొట్టు తెరుస్తా, ఇక్కడ దీన్ని నించోపెట్టడం ఒక చారిత్రక అవసరం అన్నాడు మల్లి. అంటే చచ్చేంత అవసరమని అర్థం. గుర్తుందా బాబాయ్! జూని పిండిమరని మన సర్పంచ్ గారితో స్విచాన్ చేయించాడు. అప్పుడాయన యీ సెంటర్లో పిండిమర ఒక చారిత్రక అవసరమని మైకులో మాట్లాడతా అన్నాడు. ఇంకో రెండు మూడు ఓపెనింగుల్లో కూడా ఈ ముక్కలే వినిపించాయ్. ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆరా తీశా’ అంటూ ఆగాడు సత్యం. చిన్న బజారులో సిపాయిగా పని చేసొచ్చిన రాజు నేర్పాడు యీ భాష. హద్దుల్లో గస్తీ తిరుగుతుండగా అవతల్నించి పెద్ద దాడి జరిగిందట. అప్పుడు వాళ్లాఫీసరు మన దగ్గర మందుగుండూ లేదు. మందీ లేరు. వెనుతిరగడం చారిత్రక అవసరం అంటూ వచ్చిన మూడు భాషల్లోనూ అరి చాట్ట. చారిత్రక.. అంటే ఏమిటని సిపాయిలు అడిగార్ట. పారిపోతే ప్రాణాలు దక్కుతాయ్ అన్నాట్ట. అన్నట్లే ప్రాణాలు దక్కాయ్. అందుకని ఆ ముక్కలు ప్రాణప్రదంగా రాజు బుర్రలో ఉండిపోయాయ్. అన్ని సందర్భాల్లో వాడి, వాదిస్తూ వుంటాడు. మన మున్సబుగారు పోయినప్పుడు కూడా, ఇదొక చారిత్రక అవసరమని పేపర్ వాళ్లకి చెప్పాడు. వాళ్లూ స్పష్టత లేక అలాగే అచ్చువేశారు. అంటూ సత్యం రచ్చబండ దగ్గరి జనానికి వివరించాడు. మరి మన చంద్రం భుజం మీద ఎర్రకండువా వేసుకుని అరుగుల మీద అనేక విషయాలు చర్చిస్తూ వుంటాడు. చారిత్రక తప్పిదం అంటూ పళ్లు కొరికి వుమ్మేసి బాధపడుతూ వుంటాడు. అదేంటది అన్నాడు బాబాయ్. కొంపముంచావ్ పేర్లొకటే గాని ఆ ముక్కకు యీ ముక్కకు బోలెడు తేడా వుంది. గొప్ప గొప్ప జాతీయ పార్టీలు తమ బుర్రల్ని ఉపయోగించి, ప్రతి మలుపులోనూ తప్పులో కాలేసి ఆకులు పట్టుకుని చారిత్రక తప్పిందంగా డిక్లేర్ చేస్తారు. అయితే, ఇక్కడో ప్రమాదం వుంది. చంద్రబాబు నాయుడు రెండు ముక్కల్నీ జోడించి, నన్ను గెలిపించడం చారిత్రక అవసరం. లేకపోతే చారిత్రక తప్పిదం అవుతుందని పూర్తి చెయ్యచ్చు. ఎందుకంటే రెండు ముక్కలకీ స్పష్టమైన అర్థం లేదు. శ్రీరమణ, (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఆకట్టుకుంటున్న సన్‌రైజర్స్ స్లోగన్!
సాక్షి, స్పోర్ట్స్: ఐపీఎల్-2018 సీజన్‌కు సంబంధించి విడుదల చేసిన సన్‌రైజర్స్ స్లోగన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘గో గో గో గో హియర్ వి గో గో గో... వియ్ ఆర్ ది ఆరెంజ్ ఆర్మీ’ అనే స్లోగన్‌ను సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ అధికారిక ట్విటర్ పేజీలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ స్లోగన్ సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. టోర్నీ ప్రారంభానికి ఇంకా మూడు వారాల సమయం ఉన్నా ఫ్రాంచైజీలు ప్రచార కార్యక్రమాల్లో అప్పుడే బీజీ అయిపోయాయి. ఇక ఏప్రిల్ 7 న మంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏప్రిల్ 9న రాజస్థాన్ రాయల్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. -
ఆకట్టుకుంటున్న సన్‌రైజర్స్ స్లోగన్!
-
అదే నా పాలసీ!
తమిళసినిమా: అదే నా పాలసీ అంటున్నారు నటి సమంత. వివాహానంతరం కథానాయకిగా కొనసాగడం అన్నది అరుదైన విషయమే అవుతోంది. అలాంటి నటి సమంత. పెళ్లికి ముందు చాలా మంది చాలా చెబుతుంటారు. ఆ తరువాత వాటిని ఆచరించడంలో ఫెయిల్ అవుతుంటారు. నటి సమంత తను కోరుకున్నట్లుగానే ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తరువాత కూడా తాను నటిస్తానని చెప్పారు. అన్నట్టుగానే పెళ్లి అయిన మూడవ రోజు నుంచే షూటింగులలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఐదు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న క్రేజీ నటి సమంత. ముఖ్యంగా తమిళంలో తను విశాల్‌తో నటించిన ఇరుంబుతిరై చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. శివకార్తికేయన్‌తో నటిస్తున్న చిత్రం షూటింగ్లో ఇటీవలే పాల్గొన్నారు. సమంత లాంటి సెలబ్రిటీలు చేసే పనులు కానీ, చెప్పే మాటలు గానీ సాధారణ ప్రజలపై, ముఖ్యంగా అభిమానులపై చాలా ప్రభావం చూపుతాయి. అందుకే సమంత చాలా బాధ్యతగా వ్యవహరిస్తుంటారు. ఇటీవల ఈ బ్యూటీ ఒక స్లోగన్ చెబుతూ శ్రమను నమ్ముకోండి. అదృష్టాన్ని నమ్మి దాని కోసం పరుగులు తీయొద్దు. ఇదే నా పాలసీ అంటూ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇలాంటి స్లోగన్‌ను ఇంతకు ముందు కొన్ని పోస్టర్లలోనో, టీ షర్టులపైనో చూసి ఉండవచ్చు. అయితే సమంత లాంటి ఒక సెలబ్రిటీ చెప్పే ఇలాంటి వ్యాఖల ప్రభావం వాటి కంటే ఎక్కువగా జనాలపై పడుతుందని చెప్పవచ్చు. ఈ ముద్దుగుమ్మ పాలసీ ఇప్పుడు సోషల్ మీడియా మరింత ప్రచారం చేస్తోంది. సమంత కీలక పాత్రలో కీర్తీసురేశ్ మహానటి సావిత్రిగా నటిస్తున్న నడిగైయార్ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ ద్విభాషా చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. -
జనసేన తాజా నినాదం చూశారా?
సాక్షి, హైదరాబాద్: సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదో భవిష్యత్ ప్రణాళికలు రచిస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా జనసేన ట్విట్టర్ లో ప్రత్యక్షమైన ట్వీట్ చూస్తే ఇలాంటి అభిప్రాయం కలుగుతోంది. అంతేకాదు రాబోయే ఎన్నికల్లో ఘన విజయం కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్న జనసేన పార్టీ కొత్త నినాదం ఇదే కావచ్చు అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది. అధినేత పవన్ మనస్సులో ఏముందో స్పష్టం కానప్పటికీ ఆయన పార్టీ ట్వట్టర్ పేజ్‌లో కనిపించిన స్లోగన్ మాత్రం ఆసక్తికరంగా నిలిచింది. ‘‘అడుగు ముందుకు వేస్తే తల తెగి పడాలే గానీ కాళ్ళు అయితే వెనక్కి పడదు " ఇది జనసేన ట్వీట్. అయితే తమ హీరో సినిమా మార్క్ పంచ్ డైలాగును మించి ఈ స్లోగన్ ఉండటంతో అభిమానులు,పార్టీ కార్యకర్తలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. అడుగు ముందుకు వేస్తే తల తెగి పడాలే కానీ కాళ్లు అయితే వెనక్కి పడదు - #JanaSenaParty Chief @PawanKalyan pic.twitter.com/hNqisVMgn3 — JanaSena Party (@JanaSenaParty) September 19, 2017 -
సుద్దముక్కపై ‘హరిత’ నినాదం
‘అగ్గిపుల్ల.. కుక్కపిల్ల.. సబ్బు బిళ్ల కాదేదీ కవితకు అనర్హం’ అన్నాడో కవి. ఇదే తరహాలో మరిపెడ మండలంలోని అబ్బాయిపాలేనికి చెందిన అనుముల హరినాథ్, ఉమ దంపతుల కుమారుడు నరేష్ కళా హృదయంతో స్పందించాడు. తనలోని సృజనాత్మకతను చాటుకునేందుకు సుద్దముక్కలపై హరితహారం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నినాదాలు రాశాడు. – మరిపెడ -
ఫడ్నవీస్‌కు భారతమాత అంటే ఎంత ప్రేమో!
ముంబై: 'భారత మాతాకీ జై' అంటూ ప్రతి భారతీయుడు నినదించి దేశం పట్ల తనకున్న విధేయతను చాటుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తాజాగా పిలుపునిచ్చారు. అలా నినాదం చేయనివాడు భారతీయుడే కాదు పొమ్మన్నారు. దేశం సంగతి దేవుడెరుగు.. కనీసం మహారాష్ట్ర పట్ల కూడా విధేయత లేని ఫడ్నవీస్‌ను ఎక్కడికి పొమ్మనాలి? నేడు విదర్భయే కాకుండా మొత్తం మరఠ్వాడా కరవుకోరల్లో చిక్కుకొని అల్లాడిపోతోంది. రాష్ట్రం మొత్తం మీద 90లక్షల మంది రైతులు కరవుకాటకాలతో ఆర్తనాదాలు చేస్తుంటే, వారిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, మున్సిపాలిటీల పరిధిలోనే తాగునీరు దొరక్క ప్రజలు దాహం... దాహం అంటూ వగరుస్తుంటే, కేవలం పది నెలల కాలంలోనే పౌష్టికాహార లోపం వల్ల 1274 మంది పిల్లలు మృత్యువాత పడితే పట్టకుండా మంత్రాలయం ఏసీ గదిలో కూర్చున్న ఫడ్నవీస్‌కు హఠాత్తుగా 'భారత మాతాకీ జై' అనే నినాదం ఎందుకు గుర్తుకు వచ్చింది? హిందూ ఆలయాల్లో లింగవివక్ష తగదంటూ ముంబై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా అహ్మద్‌నగర్‌లోని శని శింగణాపూర్ ఆలయంలోకి తృప్తి దేశాయ్ నాయకత్వంలోని భూమాతా బ్రిగేడ్‌ను అనుమతించలేక పోయారే, అడ్డుకున్నవారిని అరెస్ట్ చేయాలంటూ సాక్షాత్తు హైకోర్టు ఆదేశాలు జారీచేసినా ఒక్కరంటే ఒక్కరిని అరెస్ట్ చేయడానికి చేతులురాని ఫడ్నవీస్‌కు భారతమాతకు చేయెత్తి జైకొట్టమనే అర్హత ఉందా? రాష్ట్రంలో కరవు పరిస్థితులపై ముంబై హైకోర్టు నాగపూర్ బెంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసినా ఫడ్నవీస్ నీళ్లు నమిలారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. రాష్ట్రంలోని 43 వేల గ్రామాల్లో 27,723 గ్రామాలు తీవ్ర కరవు పరిస్థితులను ఎదొర్కుంటున్నాయి. ఈ గ్రామాల్లో సత్వర నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ ప్రాంతాల్లో రైతురుణాలను మాఫీచేయాలి. తక్షణం ల్యాండ్ రెవెన్యూ వసూళ్లను నిలిపివేయాలి. కరెంటు కోతను ఎత్తివేయాలి. విద్యుత్ బకాయిలు ఉన్నప్పటికీ విద్యుత్‌ను నిలిపివేయరాదు. పిల్లల స్కూల్ ఫీజులను రద్దు చేయాలి. పౌష్టికాహార లోపం వల్ల గత పదినెలల్లోనే నందూర్బర్‌లో 662 మంది పిల్లలు, పాల్ఘర్లో 418 మంది, థానేలో 194 మంది పిల్లలు మరణించినప్పటికీ ఆ మూడు జిల్లాలో ఇప్పటికీ ఎలాంటి సహాయక చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? మున్సిపాలిటీల పరిధిలో దినం తప్పించి దినం మంచినీటి సరఫరాకు సత్వర చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? లాతూర్ సిటీలోనే వారానికి ఒకసారి మంచినీటిని సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నీటిని ఆదా చేయడం కోసం చెరకు క్రషింగ్‌ను నియంత్రించాలి. చెరకు క్రషింగ్‌కు రోజుకు 25 లక్షల లీటర్ల నీరు ఖర్చవుతోంది. మంచి పాలనను అందిస్తానని బీజేపీ, ఆరెస్సెస్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ఫడ్నవీస్ అధికారంలోకి రాగానే హామీ ఇచ్చారు. మంచి పాలనంటే ఇదేనా? సమస్యలను పట్టించుకోకపోవడమా? తమరు చెప్పినట్టే 'భారత మాతాకీ జై' అంటే ఈ సమస్యలు తీరిపోతాయా? అసలు ఈ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకేకదా! ఇలాంటి నినాదాలు తీసుకొచ్చేది? -
ఒవైసీ వ్యాఖ్యల్ని ఖండించిన ఎంపీ అసెంబ్లీ
భోపాల్ : తన మెడపై కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అనేదిలేదన్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను మధ్యప్రదేశ్ అసెంబ్లీ శుక్రవారం ఖండించింది. ఆయనపై ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జితు పట్వారీ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఒవైసీ వైఖరిని ఖండించిన ఆయన తమ పార్టీ అన్ని రకాల మతవాద భావజాలాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఒవైసీలో ఇటువంటి భావజాలం మంచిది కాదని, సర్వ మతాల సంగమంగా ఉన్న దేశాన్ని 'డిస్కవరీ ఆఫ్ ఇండియా'గా తొలి ప్రధాని నెహ్రూ రూపుదిద్దారని ఈ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. మరోవైపు రాష్ట్ర శాసన వ్యవహారాల మంత్రి నరోత్తం మిశ్రా మాట్లాడుతూ ఒవైసీలో ఇటువంటి జాతి వ్యతిరేక మనస్తత్వాన్ని ఏడాదిన్నరగా గమనిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో పలువురు సభ్యులు ఒవైసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కాంగ్రెస్, బీజేపీ సభ్యులమధ్య విమర్శలు వెల్లువెత్తాయి. అయితే గందరగోళం మధ్యే అసెంబ్లీ స్పీకర్ సీతాశరణ్ శర్మ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. -
పెట్టుబడులే లక్ష్యంగా బాబు దావోస్ పర్యటన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దావోస్ పర్యటన సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) 46వ సదస్సుకు చంద్రబాబుతో పాటు 9 మంది సభ్యుల బృందం పర్యటించనుంది. ఇప్పటికే దావోస్ నగరంలో ప్రచార రథంతో కొత్త తరహా ప్రచారానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘మేక్ ఆంధ్రప్రదేశ్ యువర్ బిజినెస్’ పేరుతో రూపొందించిన బస్సు దావోస్ వీధులను చుట్టేస్తుంది. ఈ సదస్సుకు నగరంలో పరుగులు పెడుతున్న ప్రచారం రథంతో పాటు అక్కడ ఏర్పాటుచేసిన హోర్డింగులు స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ‘మేక్ ఆంధ్రప్రదేశ్ యువర్ బిజినెస్’ అనే నినాదం ప్రపంచ పెట్టుబడిదారులకు, వాణిజ్యవేత్తలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడుల సమీకరించిన రాష్ట్ర ప్రభుత్వం రెట్టించిన ఉత్సాహంతో దావోస్ పర్యటనకు బయలుదేరనుంది. -
ఓటుకు కోట్లు గల్లీ నినాదమైందా?
ఎన్నో దశాబ్దాల స్వప్నమైన తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించింది. తెలుగు ప్రజలు అన్నదమ్ముల్లాగా విడిపోయి, రెండు రాష్ట్రాలైనా ఆత్మీయులుగా కలిసుందా మని నేతలందరూ ప్రగల్భాలు పలికారు. ఇద్దరు ‘చంద్రు’లు అధికార పగ్గాలు చేపట్టి ఒకరిని మించి మరొకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ, తమ పార్టీల ప్రయోజనాల మోజులో ఉభయ రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. 2009 తర్వాత ఇటీవల మరొకసారి ‘ఆపరేషన్ ఆకర్ష్’ తెరపైకి వచ్చింది. కేసీఆర్ టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడంలో సఫలీకృతమయ్యారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 63. కానీ ఎమ్మెల్యేల కోటాలో మొన్న జరిగిన ఎమ్మె ల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థులకు 85 ఓట్లు ఎలా వచ్చాయంటే అధికార పక్షం నుండి స్పష్టమైన జవాబు లేదు. దొడ్డిదారినే ఈ ఎమ్మె ల్యేలు సంఖ్యను పెంచుకున్నారనేది నగ్నసత్యం. ఎమ్మెల్యేలు బహిరం గంగా పార్టీ మారుస్తారు. అధికార పార్టీలో తిరుగుతారు. స్పీకర్‌కు ఫిర్యాదులందినా చర్యలు లేవు. మరికొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు. నెలలు, సంవత్సరాల తరబడి పెండింగ్‌లో పెడతారు. బ్యూరో క్రసీ అలాంటి పనులు చేస్తే చర్యలు చేపట్టవలసిన పాలకులే ఫైలు పెం డింగ్‌లో పెట్టడమంటే ప్రజాస్వామ్య విలువలను మంట కలపటమే. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రకటన వెలువడగానే సందడి ఆరంభమైంది. టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత రేవంత్‌రెడ్డి స్వయంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తూ దొరికిపోయా రు. ఇది చినికి చినికి గాలివానలా మారింది. ఈ నిర్వాకం దేశవ్యాపిత చర్చగా మారింది. దీని వెనుక సూత్రధారి ఎవరు అనేది పరోక్షంగా తెలుస్తూనే ఉన్నది. టీడీపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకున్నది. చంద్రబాబు ప్రమేయంపై ఆధా రాలు ఉన్నాయని, రేపో మాపో చట్టపరమైన చర్యలుంటాయని సాక్షా త్తు హోంశాఖామాత్యులు నాయిని నర్సింహారెడ్డి చెప్పి నెల కావస్తున్నా ఎలాంటి కదలిక లేదు. మరోవైపు స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్ మాట్లాడిన ఆడియో క్లిప్పింగ్ వెలుగులోకి వచ్చింది. ఇంతవరకు అందులోని గొంతు తనది కాదని చంద్రబాబు ప్రకటించలేదు. చంద్ర బాబుకు ఏసీబీ నోటీసులిస్తుందని లీకేజీ వార్తలు వచ్చాయి. నోటీసు ఇస్తే ఒక గంటలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని చంద్రబాబు ప్రకటించడం బజారు పంచాయితీని గుర్తు చేస్తున్నది. మరొకవైపు చంద్రబాబు, ఆయన మంత్రులు నేరుగా గవర్నర్‌నే తప్పుపడుతున్నారు. ఆయన కేసీఆర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారానికి పూనుకున్నారు. ఈ వ్యవహారానికి సెంటిమెంట్ రంగు పులి మేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రులు సెక్షన్- 8, 9, 10లను తెర మీదకు తెస్తున్నారు. గవర్నర్ తన పాత్ర పోషించలేదనే మాట గట్టిగా వినిపిస్తున్నారు. నెల దాటినప్పటికీ ఈ అంశం చుట్టూ రాజకీయ వ్యవస్థలు పరిభ్రమించడం సిగ్గుచేటు. సెక్షన్ 8ని అమలు చేయకపోతే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరతామని టీడీపీ మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. అనేక సుదీర్ఘ పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సెక్షన్ 8-9-10 లేదా ఏ ప్రతిపాదనను తెలంగాణలోని ఏ రాజకీయ పార్టీ, సంస్థ కూడా అంగీకరించవు. పునర్విభజన చట్టంలో పొందుపరచిన నిబంధనలను ఎవరు అతి క్రమించినా చట్టం దాని పని అది చేయాలే తప్ప తిమ్మిని బమ్మిని చేసి, కాలం గడుపుకుంటామంటే సాగదని ప్రజాస్వామ్యవాదులు హెచ్చ రికలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కేంద్రం మౌనం వీడి చట్టప రమైన చర్యలు వేగవంతం చేసేందుకు ఆదేశాలివ్వాలి. లేకపోతే టీడీపీ ఉచ్చులో బీజేపీ పడిందనే వాదనకు బలం చేకూరుతుంది. ఇలాంటి కంపు రాజకీయాల అంతానికి వామపక్షాలు, ప్రగతిశీల ప్రజాతంత్ర శక్తులు ప్రత్యక్ష ఆందోళనలకు శ్రీకారం చుట్టాల్సిన సమయం ఆసన్నమైంది. (వ్యాసకర్త సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి) ఫోన్: 040-23224966 -
‘మేక్ ఇన్ ఇండియా’ కేవలం నినాదమే!
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ మొదలుపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ఒక నినాదం మాత్రమేనని సీనియర్ కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోటీని తట్టుకోవడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ఎన్డీయే ప్రభుత్వం ఏడాది పాలన గురించి ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. తయారీలోని డిమాండ్లు, విలోమ పన్ను వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడం, అధిక ధరలను తగ్గించడం లాంటి సవాళ్లను మోదీ ప్రభుత్వం ఎదుర్కోలేకపోయిందని అన్నారు. గతేడాదితో పోలిస్తే 2015లో ఎగుమతులు 11 శాతం తగ్గాయని, గతేడాది 26.89 బిలియన్ యూఎస్ డాలర్లు ఉన్న ఎగుమతులు 2015 జనవరిలో 23.88 డాలర్లకు పరిమితమయ్యాయని అన్నారు. జీఎస్టీ బిల్లులో అంతర రాష్ట్ర పన్నును 1 శాతం పెంచడాని బట్టి చూస్తే ఆర్థిక సమస్యలపై వారికి అవగాహన లేదని తెలుస్తోందన్నారు. ఇది జీఎస్టీ స్పూర్తికి విరుద్ధమని, మేక్ ఇన్ ఇండియాకు పూర్తి వ్యతిరేకమని చెప్పారు. ఏడాదికాలంలో పప్పు ధాన్యాలు, ఉల్లిపాయ ధరలు 15 నుంచి 28 శాతం వరకు పెరిగాయన్నారు. ఆర్థికవృద్ధి, దిశలపై మోదీ ప్రభుత్వానికి సరైన అవగాహన లేదన్నారు. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ, ఎరువులు, కరెంటు, స్టీల్ పరిశ్రమల్లో వృద్ధి 2014-2015లో 3.5 శాతం పడిపోయిందని అన్నారు. ఏడాది పాలనలో రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామన్న ప్రభుత్వం 17.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని అన్నారు.