సాక్షి, హైదరాబాద్: ‘సీఎం కేసీఆర్ కచ్చితంగా ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళతారు. 2022 నవంబర్, డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన రద్దు చేస్తారు. 2023 ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికలు వస్తాయి. ఈసారి ఎన్నికల్లో ఎన్ని పార్టీలు పోటీలో ఉన్నా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే పరిస్థితి ఉండదు. కేసీఆర్‌ను ఉంచాల్నా... దించాల్నా అనే నినాదంపైనే ఎన్నికలు జరుగుతాయి. కేసీఆర్ వ్యతిరేక వర్గం, అనుకూల వర్గం మాత్రమే ఈ ఎన్నికల పోరాటంలో నిలబడుతుంది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పనిచేయాలనుకునే వారంతా కాంగ్రెస్‌లోకి రావాల్సిందే’ అని స్పష్టం చేశారు టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి. ఇంద్రవెల్లిలో సోమవారం ‘దళిత గిరిజన దండోరా’ నిర్వహించనున్న సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
బరితెగింపు కనిపిస్తోంది
అందమైన అబద్ధాలను అతికినట్టు చెప్పి ఓట్లు రాబట్టుకోవడంలో కేసీఆర్ దిట్ట. గతంలో నాయకులు అబద్ధాలు చెప్పినా ఏదో ఒక ముసుగు ఉండేది. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆ ముసుగు కూడా లేదు. బరితెగింపు కనిపిస్తోంది. హుజూరాబాద్, దుబ్బాక, నాగార్జునసాగర్, జీహెచ్‌ఎంసీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ... ఇలా ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికలకు అనుగుణంగా ప్రజలను మభ్య పెట్టడం, ఆ ఎన్నికలైపోగానే ప్రజలకిచ్చిన హామీలను మర్చిపోవడం ఆయనకు అలవాటుగా మారింది. అందులో భాగమే ఇప్పుడు దళితబంధు.
ఉద్యోగాలిస్తే 50–60వేలు వారికే వచ్చేవి కదా?
రాష్ట్రంలోని 16 లక్షల దళిత కుటుంబాలు, 10 లక్షల గిరిజన కుటుంబాలకు రూ.10లక్షలు ఇవ్వాలి. దళిత బంధు పేరిట దళితులకు రూ.10 లక్షలు దశల వారీగా ఇస్తానని కేసీఆర్ అంటున్నారు. ఈయనకు ప్రజలు అధికారం ఇచ్చిందే ఐదేళ్లకు. కానీ కేసీఆర్ చెప్పినట్టు చేయాలంటే దళిత బంధు పూర్తి కావడానికి వెయ్యేళ్లు పడుతుంది. దళిత ఎమ్మెల్యేలు, మంత్రులకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ కూడా దొరకదు. నేరెళ్ల ఇసుక మాఫియా ఘటన, ఖమ్మంలో గిరిజన రైతులకు సంకెళ్లు, మరియమ్మ లాకప్‌డెత్, ఎల్బీనగర్‌లో పారిశుద్ధ్య కార్మికులు చనిపోయిన ఘటన.. ఇలాంటివన్నీ దళిత, గిరిజనులకు వ్యతిరేకంగా జరిగినవే. రాష్ట్రంలోని 1.91 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే ఎస్సీ, ఎస్టీలకు అందులో 50–60 వేల ఉద్యోగాలు వచ్చేవి. కేసీఆర్ దళితుల బంధువు కాదు. వారి పాలిట రాబందు.
40 రోజుల పోరాట కార్యాచరణ
కేసీఆర్ నడిపిస్తున్నది శాంపిల్ గవర్న్‌మెంట్. మార్కెట్‌లో మామిడిపండ్ల బేరం చేసే వాళ్లు కూడా ఒక ముక్క శాంపిల్‌గా ఇచ్చి రుచి చూడమని అడుగుతారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రతి పథకం పేరుతో శాంపిల్‌గా మాత్రమే ఇస్తోంది. డబుల్ బెడ్రూం ఇళ్లు, మూడెకరాల భూమి, 57 ఏళ్లకు పింఛన్, ఇంటికో ఉద్యోగం, రైతులకు రుణమాఫీ... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. భగవద్గీత అని చెప్పిన మేనిఫెస్టోనే కేసీఆర్ అమలు చేయలేదు. అందుకే ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు 40 రోజుల కార్యాచరణ ప్రకటించాం. ప్రతిరోజూ మండల, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలుంటాయి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా లేదా రూ.10 లక్షలు అందరికీ ఇస్తారా, చస్తారా అని ప్రజలు నిలదీయాలి.
ఆయనకు కేసీఆర్ ఆశీర్వాదం ఉంది..
రాష్ట్రంలో బీజేపీకి బలం లేదు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిస్థితి పార్టీలోనే బాగాలేదు. ఆయన పాదయాత్ర చేస్తానంటే సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారు. ఇప్పుడు మళ్లీ కిషన్‌రెడ్డి తనకు ప్రజల ఆశీర్వాదం కావాలని అడుగుతున్నారు. కాంగ్రెస్ పోరాటాల పుణ్యమా అని సహాయ మంత్రి కాస్తా కేబినెట్ మంత్రి అయ్యాడు. అందులో కేసీఆర్ ఆశీర్వాద బలం కూడా ఉంది. ఇంకా ప్రజల ఆశీర్వాదం ఆయనకెందుకు?
అమరుల స్ఫూర్తి నింపేందుకే...
ఇంద్రవెల్లిలో అమాయకులైన ఆదివాసీలు పోలీసు తూటాలకు బలయ్యారు. ఆ నేల ఆదివాసీల రక్తంతో, కొమురం భీం ఆశయాలతో, రాంజీ గోండు పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకుంది. ఇంద్రవెల్లి గడ్డ మీద దండు కట్టి దండోరా మోగించి కేసీఆర్ నిరంకుశ వైఖరి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని, అమరుల సాక్షిగా స్ఫూర్తి పొందాలని అక్కడి నుంచే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రపంచ గిరిజనోత్సవ దినోత్సవంతో పాటు, క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన రోజు కాబట్టే ఆగస్టు 9న మొదలు పెడుతున్నాం.
Comments
Please login to add a commentAdd a comment