
ఇదిగో అదిగో అంటున్నారు కానీ వర్షాలు వూడిపడటం లేదంటున్నాడు బాబాయ్ వూరి రచ్చబండ దగ్గర. వచ్చినవే తిరిగెళ్లాయ్. ‘నాల్రోజుల్నాడు బంగాళాఖాతం మీదుగా బందరు అంచుకి వచ్చాయంట. మహానాడు స్పీచ్‌లు విని వెనక్కు తిరిగాయట’ అన్నాడు సత్యం సీరియస్‌గా. ఎందుకనో పాపం అడిగాడొక శ్రోత. ‘రుతుపవనాలు పవిత్రమైన కొండల మీంచి, పచ్చని అడవుల్లోంచి వస్తాయ్. వాటికి అబద్ధాలు బొత్తిగా సరిపడవ్. అవి ధారాళంగా మూడ్రోజుల పాటు వినిపించేసరికి లోపలికెళ్లి నక్కాయంట. వస్తాయ్. కాస్త సద్దుమణిగితే గానీ ధైర్యం చెయ్యవ్’ అన్నాడు సత్యం సహజధోరణిలో. సత్యం మా వూళ్లో మంచి మాటకారి.
వింటున్నారా, యీ మధ్య చంద్రబాబు కొత్త స్లో–గన్ నోట పట్టుకున్నాడు. ‘నన్ను గెలిపించుకోవడం చారిత్రక అవసరం’ అని పదేపదే అంటున్నాడు. నాకసలు అర్థమే కావడం లేదన్నాడు బాబాయ్. ‘అప్పుడెప్పుడో మనూళ్లో పోలేరమ్మ గుడి మలుపులో, కిళ్లీ కొట్టు తెరుస్తా, ఇక్కడ దీన్ని నించోపెట్టడం ఒక చారిత్రక అవసరం అన్నాడు మల్లి. అంటే చచ్చేంత అవసరమని అర్థం. గుర్తుందా బాబాయ్! జూని పిండిమరని మన సర్పంచ్ గారితో స్విచాన్ చేయించాడు. అప్పుడాయన యీ సెంటర్లో పిండిమర ఒక చారిత్రక అవసరమని మైకులో మాట్లాడతా అన్నాడు. ఇంకో రెండు మూడు ఓపెనింగుల్లో కూడా ఈ ముక్కలే వినిపించాయ్. ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆరా తీశా’ అంటూ ఆగాడు సత్యం.
చిన్న బజారులో సిపాయిగా పని చేసొచ్చిన రాజు నేర్పాడు యీ భాష. హద్దుల్లో గస్తీ తిరుగుతుండగా అవతల్నించి పెద్ద దాడి జరిగిందట. అప్పుడు వాళ్లాఫీసరు మన దగ్గర మందుగుండూ లేదు. మందీ లేరు. వెనుతిరగడం చారిత్రక అవసరం అంటూ వచ్చిన మూడు భాషల్లోనూ అరి చాట్ట. చారిత్రక.. అంటే ఏమిటని సిపాయిలు అడిగార్ట. పారిపోతే ప్రాణాలు దక్కుతాయ్ అన్నాట్ట. అన్నట్లే ప్రాణాలు దక్కాయ్. అందుకని ఆ ముక్కలు ప్రాణప్రదంగా రాజు బుర్రలో ఉండిపోయాయ్. అన్ని సందర్భాల్లో వాడి, వాదిస్తూ వుంటాడు. మన మున్సబుగారు పోయినప్పుడు కూడా, ఇదొక చారిత్రక అవసరమని పేపర్ వాళ్లకి చెప్పాడు. వాళ్లూ స్పష్టత లేక అలాగే అచ్చువేశారు. అంటూ సత్యం రచ్చబండ దగ్గరి జనానికి వివరించాడు.
మరి మన చంద్రం భుజం మీద ఎర్రకండువా వేసుకుని అరుగుల మీద అనేక విషయాలు చర్చిస్తూ వుంటాడు. చారిత్రక తప్పిదం అంటూ పళ్లు కొరికి వుమ్మేసి బాధపడుతూ వుంటాడు. అదేంటది అన్నాడు బాబాయ్. కొంపముంచావ్ పేర్లొకటే గాని ఆ ముక్కకు యీ ముక్కకు బోలెడు తేడా వుంది. గొప్ప గొప్ప జాతీయ పార్టీలు తమ బుర్రల్ని ఉపయోగించి, ప్రతి మలుపులోనూ తప్పులో కాలేసి ఆకులు పట్టుకుని చారిత్రక తప్పిందంగా డిక్లేర్ చేస్తారు.
అయితే, ఇక్కడో ప్రమాదం వుంది. చంద్రబాబు నాయుడు రెండు ముక్కల్నీ జోడించి, నన్ను గెలిపించడం చారిత్రక అవసరం. లేకపోతే చారిత్రక తప్పిదం అవుతుందని పూర్తి చెయ్యచ్చు. ఎందుకంటే రెండు ముక్కలకీ స్పష్టమైన అర్థం లేదు.
శ్రీరమణ, (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Comments
Please login to add a commentAdd a comment