మౌలానా హస్రత్ మోహాని
భారత స్వాతంత్య్ర సమర కాలంలో అనేక నినాదాలను చేసేవారు. వాటిలో ప్రజాదరణ పొందినది ‘ఇంక్విలాబ్ జిందాబాద్’. విప్లవం వర్ధిల్లాలి అనేది ఈ నినాద అర్థం. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాద సృష్టికర్త విప్లవ యోధుడు భగత్ సింగ్ అని చాలామంది భావిస్తుంటారు. నిజానికి ఈ నినాదాన్ని రూపొందించింది నాటి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా హస్రత్ మోహాని. వీరు 1878 అక్టోబర్ 14న ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలోని మోహన్ పట్టణంలో జన్మించారు.
ఆయన 1903లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరినా కొన్ని గాంధీజీ సిద్ధాంతాలతో విభేదించి బయటికొచ్చారు. కమ్యూనిస్టు పార్టీలో కొంతకాలం ఉన్నారు. ఆంగ్లేయులను వ్యతిరేకిస్తూ విప్లవ పంథాలో అనేక వ్యాసాలు రచించారు. దీంతో 1909లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను రాజద్రోహ నేరంపై జైల్లో ఉంచింది. హిందూ ముస్లింల ఐక్యతను పెంపొందించే అనేక గజల్స్‌ను రచించారు. పలుమార్లు హైదరాబాద్ సందర్శించి ‘ఖిలాఫత్’ ఉద్యమ ప్రచారం చేశారు. హస్రత్ 1921లో తన రచనల్లోనూ, ఉద్యమబాటలో సైతం ‘ఇంక్విలాబ్ జిందా బాద్’ అనే నినాదాన్ని ప్రస్తావించారు. (చదవండి: మళ్లీ మొదటికొచ్చిన కశ్మీర్ సమస్య)
హస్రత్ రూపొందించిన ఈ నినాదం ‘హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్’ అధికార నినాదంగా మారింది. విప్లవ వీరుడు భగత్ సింగ్‌తో పాటు అతని సహచరుడు బీకే దత్ ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై బాంబుల దాడి చేసిన తరువాత... తొలిసారిగా న్యాయస్థానంలో 1929 ఏప్రిల్ 8న ఈ నినాదం చేయడంతో ఎంతో ఇది ప్రాచుర్యం పొందింది. నాటి నుండి ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదం భారత స్వాతంత్య్రోద్యమంలో భాగమైంది. 1951 మే 13న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో హస్రత్ కన్నుమూశారు.
– షేక్ అబ్దుల్ హకీం జాని, తెనాలి
(భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా...)
Comments
Please login to add a commentAdd a comment