మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల్లో యూపీ సీఎం నినాదం! | Yogi Adityanath slogan Posters in Maharashtra and Jharkhand Elections | Sakshi
Sakshi News home page

Batenge to Katenge: మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల్లో యూపీ సీఎం నినాదం!

Published Wed, Oct 23 2024 7:34 PM | Last Updated on Wed, Oct 23 2024 8:02 PM

Yogi Adityanath slogan Posters in Maharashtra and Jharkhand Elections

ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ‘బటేంగే తో కటేంగే’ నినాదం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ ఈ నినాదాన్ని పెద్ద ఎత్తున వాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వేడెక్కిన మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఆదిత్యనాథ్‌ స్లోగన్‌ పోస్టర్లు దర్శనం ఇవ్వడం ప్రారంభమయ్యాయి. హిందుత్వ అజెండాతో ఓటు బ్యాంకును ఏకం చేసే ప్రయత్నంలో ఈ నినాదాన్ని వాడుకుంటున్నారు. వాస్తవానికి బంగ్లాదేశ్‌లో మారిన రాజకీయ పరిస్థితుల మధ్య, మైనారిటీ హిందువులపై అఘాయిత్యాల అంశంపై సీఎం యోగి గతంలో చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

సీఎం యోగి ప్రకటనపై తొలుత ఇటీవల హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ‘బటేంగే తో కటేంగే’ అంటూ పోస్టర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ నినాదంతో హిందువులను ఏకం చేయడంతో పాటు తమ ఓటుబ్యాంకును ఏకతాటిపై తెచ్చేందుకు నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో నిర్వహించనున్న ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 
 
విపక్షాల వ్యూహరచన
మరోవైపు బీజేపీపై విజయం సాధించేందుకు విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. కుల సమీకరణను ప్రధాన అంశంగా చేసుకొని అధికార వ్యతిరేకత నడుమ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్న కులాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు విపక్షాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. హరియాణాలో జాట్‌ ఓటు బ్యాంకును ఉపయోగించుకొని అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రయత్నించినప్పటికీ బీజేపీ వ్యూహం ముందు అది ఫలించలేదు. ‘బటేంగే తో కటేంగే’ నినాదంతో హరియాణా ఎన్నికల్లో ప్రచారం చేసిన బీజేపీ .. జాట్‌లు మినహా ఇతర ఓటు బ్యాంకులను తమవైపు తిప్పుకోగలిగింది.

కాగా గతంలో ఆగ్రాలో జరిగిన ఓ కార్యక్రమంలో అందరూ ఐక్యంగా ఉండాలని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ జాతీయ సమైక్యతా సందేశాన్ని ఇచ్చారు. అందరం ఐక్యంగా ఉన్నప్పుడే దేశం బలపడుతుందని.. విభజిస్తే విడిపోతామని ఆయ‌న‌ అన్నారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న తప్పులు ఇక్కడ జరగరాదని యోగి పిలుపునిచ్చారు.  

చ‌ద‌వండి: బారామతి నుంచి అజిత్‌ పవార్‌ బరిలోకి.. ఎన్సీపీ తొలి జాబితా విడుదల   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement