ఉత్తరప్రదేశ్‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన వ్యాఖ్యలతో మరోసారి వివాదంలో నిలిచారు. సోమవారం జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి.. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కేంద్ర నిధులను కొల్లగొట్టిందని ఆరోపించారు. కేంద్రం నిధులను రికవరీ చేయడానికి ‘బుల్డోజర్ సిద్ధంగా ఉంది’ అని హెచ్చరించారు. అయితే బుల్డోజర్ చర్య చట్టరిత్యా ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన కొన్ని రోజులకే సీఎం ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
‘జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో జార్ఖండ్‌లోని సహజ వనరులను, ప్రధాని నరేంద్ర మోదీ అందించిన కేంద్ర నిధులను కొల్లగొట్టింది. ఈ ప్రభుత్వం బంగ్లాదేశ్ వలసదారులు, రోహింగ్యాల చొరబాట్లను ప్రోత్సహిస్తోంది. ఇది 'బేటీ, మటీ, రోటీ' (కుమార్తె, భూమి, రొట్టె)కి తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. ఇప్పుడు దోచుకున్న నిధులను తిరిగి పొందేందుకు బుల్డోజర్ సిద్ధంగా ఉంది’ అని జమ్తారాలో ఎన్నికల ర్యాలీలో వ్యాఖ్యానించారు. .
జార్ఖండ్‌లో ఇప్పటికే తొలి విడత పోలింగ్ ముగియగా.. రెండో విడత ఓటింగ్ నవంబర్ 20న జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాగా యూపీలో వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లను, ఆస్తులను కూల్చివేస్తున్న యోగీ ఆదిత్యనాథ్ ‘బుల్డోజర్ బాబా’గా పేరొందారు
ఇక బుల్డోజర్ న్యాయానికి సుప్రీంకోర్టు బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొంటున్నారనే కారణంతో అధికారులు న్యాయ ప్రక్రియను తమ చేతుల్లోకి తీసుకోవడం సరికాదని ధర్మాసనం తెలిపింది. నిందితులను దోషిగా చిత్రీకరించలేమని, దాని ఆధారంగా వాళ్ల ప్రాపర్టీలను నాశనం చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించింది. బుల్డోజర్‌తో ఇంటిని కూల్చేసి మహిళలు, చిన్నారులు, వృద్ధులను రాత్రికి రాత్రి నిరాశ్రయులు చేసే దృశ్యం భయంకరమైనదని అభివర్ణించింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఆస్తులు కూల్చడానికి వీలు లేదని స్పష్టం చేసింది. కూల్చివేతలపై అనుసరించాల్సిన ప్రక్రియపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద అధికారాలను వినియోగించి రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment