
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) సర్కారు ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తోంది. ప్రతి జిల్లాలోనూ బీజేపీ నేతలు సంబరాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్‌చార్జ్‌లు, కార్యకర్తలు ‘ఉత్తరప్రదేశ్ శ్రేయస్సు - ఎనిమిది వసంతాల బీజేపీ ప్రభుత్వం’ అనే నినాదంతో గ్రామాలలో సందడి చేస్తున్నారు.
ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం(State Government) మార్చి 24 నుండి ఏప్రిల్ 14 వరకు నిర్వహించనుంది. రాష్ట్రంలోని బూత్‌ల నుండి జిల్లా ప్రధాన కార్యాలయాల వరకు అన్నిచోట్లా ఉత్సవాలు జరగనున్నాయి. మార్చి 24 నుండి జిల్లా స్థాయిలో వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వ పథకాలను, ఇందుకోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఇంటింటికి చేరవేయనున్నారు. అసెంబ్లీ స్థాయిలో అభివృద్ధి సదస్సులు కూడా నిర్వహించనున్నారు.
జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న ప్రధాన ప్రాజెక్టుల గురించి అందరికీ వివరించేందుకు యువమోర్చా బైక్ ర్యాలీ(Bike rally)లు నిర్వహించనుంది. గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించి, అందరికీ తెలియజేయనున్నారు. ఏప్రిల్ 14న బాబా సాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బాబా సాహెబ్ విగ్రహానికి బీజేపీ నేతలు పూలమాలలు వేయనున్నారు.
ఇది కూడా చదవండి: ‘రెండు కిలోల వెల్లుల్లి, రూ. 500 తెస్తేనే కేసు దర్యాప్తు’