ఫడ్నవీస్‌కు భారతమాత అంటే ఎంత ప్రేమో!
ముంబై: 'భారత మాతాకీ జై' అంటూ ప్రతి భారతీయుడు నినదించి దేశం పట్ల తనకున్న విధేయతను చాటుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తాజాగా పిలుపునిచ్చారు. అలా నినాదం చేయనివాడు భారతీయుడే కాదు పొమ్మన్నారు. దేశం సంగతి దేవుడెరుగు.. కనీసం మహారాష్ట్ర పట్ల కూడా విధేయత లేని ఫడ్నవీస్‌ను ఎక్కడికి పొమ్మనాలి?
నేడు విదర్భయే కాకుండా మొత్తం మరఠ్వాడా కరవుకోరల్లో చిక్కుకొని అల్లాడిపోతోంది. రాష్ట్రం మొత్తం మీద 90లక్షల మంది రైతులు కరవుకాటకాలతో ఆర్తనాదాలు చేస్తుంటే, వారిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, మున్సిపాలిటీల పరిధిలోనే తాగునీరు దొరక్క ప్రజలు దాహం... దాహం అంటూ వగరుస్తుంటే, కేవలం పది నెలల కాలంలోనే పౌష్టికాహార లోపం వల్ల 1274 మంది పిల్లలు మృత్యువాత పడితే పట్టకుండా మంత్రాలయం ఏసీ గదిలో కూర్చున్న ఫడ్నవీస్‌కు హఠాత్తుగా 'భారత మాతాకీ జై' అనే నినాదం ఎందుకు గుర్తుకు వచ్చింది?
హిందూ ఆలయాల్లో లింగవివక్ష తగదంటూ ముంబై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా అహ్మద్‌నగర్‌లోని శని శింగణాపూర్ ఆలయంలోకి తృప్తి దేశాయ్ నాయకత్వంలోని భూమాతా బ్రిగేడ్‌ను అనుమతించలేక పోయారే, అడ్డుకున్నవారిని అరెస్ట్ చేయాలంటూ సాక్షాత్తు హైకోర్టు ఆదేశాలు జారీచేసినా ఒక్కరంటే ఒక్కరిని అరెస్ట్ చేయడానికి చేతులురాని ఫడ్నవీస్‌కు భారతమాతకు చేయెత్తి జైకొట్టమనే అర్హత ఉందా?
రాష్ట్రంలో కరవు పరిస్థితులపై ముంబై హైకోర్టు నాగపూర్ బెంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసినా ఫడ్నవీస్ నీళ్లు నమిలారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. రాష్ట్రంలోని 43 వేల గ్రామాల్లో 27,723 గ్రామాలు తీవ్ర కరవు పరిస్థితులను ఎదొర్కుంటున్నాయి. ఈ గ్రామాల్లో సత్వర నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ ప్రాంతాల్లో రైతురుణాలను మాఫీచేయాలి. తక్షణం ల్యాండ్ రెవెన్యూ వసూళ్లను నిలిపివేయాలి. కరెంటు కోతను ఎత్తివేయాలి. విద్యుత్ బకాయిలు ఉన్నప్పటికీ విద్యుత్‌ను నిలిపివేయరాదు. పిల్లల స్కూల్ ఫీజులను రద్దు చేయాలి.
పౌష్టికాహార లోపం వల్ల గత పదినెలల్లోనే నందూర్బర్‌లో 662 మంది పిల్లలు, పాల్ఘర్‌లో 418 మంది, థానేలో 194 మంది పిల్లలు మరణించినప్పటికీ ఆ మూడు జిల్లాలో ఇప్పటికీ ఎలాంటి సహాయక చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? మున్సిపాలిటీల పరిధిలో దినం తప్పించి దినం మంచినీటి సరఫరాకు సత్వర చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? లాతూర్ సిటీలోనే వారానికి ఒకసారి మంచినీటిని సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నీటిని ఆదా చేయడం కోసం చెరకు క్రషింగ్‌ను నియంత్రించాలి. చెరకు క్రషింగ్‌కు రోజుకు 25 లక్షల లీటర్ల నీరు ఖర్చవుతోంది.
మంచి పాలనను అందిస్తానని బీజేపీ, ఆరెస్సెస్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ఫడ్నవీస్ అధికారంలోకి రాగానే హామీ ఇచ్చారు. మంచి పాలనంటే ఇదేనా? సమస్యలను పట్టించుకోకపోవడమా? తమరు చెప్పినట్టే 'భారత మాతాకీ జై' అంటే ఈ సమస్యలు తీరిపోతాయా? అసలు ఈ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకేకదా! ఇలాంటి నినాదాలు తీసుకొచ్చేది?