
సయ్యద్ ఆబిద్ హసన్ సఫ్రాని
‘జై హింద్’ నినాదాన్ని ప్రతిపాదించింది హైదరాబాద్ నివాసి సయ్యద్ ఆబిద్ హసన్ సఫ్రాని అని విన్నప్పుడు ఆశ్చర్యం కలగక మానదు. 1911 ఏప్రిల్ 11న ఫఖ్రుల్ హాజియా బేగం, అమీర్ హసన్ దంపతులకు జన్మించారు ఆబిద్. ఆయన తల్లి స్వాతంత్య్ర సమర యోధురాలు కావడంతో ఆమె బాటలో నడుస్తూ జాతీయ పతాకాన్ని చేతబట్టారు.
మహాత్ముని పిలుపు మేరకు చదువుకు స్వస్తి పలికి 1931లో సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ తరువాత నాసిక్ జైలుకు చెందిన రిఫైనరీని నాశనం చేయ తలపెట్టిన విప్లవకారులతో పనిచేసి కారాగార శిక్షకు గురైనారు. ‘గాంధీ–ఇర్విన్ ఒడంబడిక’ ఫలితంగా జైలు నుండి విడుదలయ్యారు. ఆ తర్వాత జాతీయ కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటూ... ఇంజినీరింగ్ కోసం జర్మనీ వెళ్ళారు.
అక్కడ సుభాష్ చంద్రబోస్‌తో పరిచయం ఏర్పడింది. 1942 నుండి రెండేళ్ళ పాటు బోస్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా, అనువాదకుడిగా పని చేశారు. ఆ క్రమంలో అనేక దేశాలు తిరిగి వచ్చారు. జర్మనీలో ఉన్న సమయంలో సైనికులు పరస్పరం పలకరించుకోవడానికి ‘నమస్తే’, ‘సలాం అలైకువ్‌ు’ ఇత్యాది మాటలు వాడేవారు. వీటికి బదులుగా దేశభక్తిని చాటే ఏదైనా ఒక నినాదాన్ని సూచించమని నేతాజీ ఆబిద్ హసన్‌ను కోరగా ‘జై హింద్’ నినాదాన్ని సూచించారు. నాటి నుండి జైహింద్ భారత విప్లవ నినాదంగా మారింది.
జైహింద్ నినాదానికి నేతాజీనే రూపకల్పన చేశారని చాలా మంది భావిస్తారు. ఆబిద్ హసన్ ప్రతిపాదించిన ఈ నినాదం నేతాజీ కారణంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళింది. ఆబిద్ హసన్ 1984లో 73 సంవత్సరాల వయస్సులో స్వస్థలమైన హైదరాబాదులోనే తుది శ్వాస విడిచారు.
– షేక్ అబ్దుల్ హకీం జానీ, తెనాలి
(భారత స్వాతంత్య్రఅమృతోత్సవాల సందర్భంగా...)