నేటితో ముగియనున్న పురపాలక మండళ్ల పదవీ కాలం
ప్రత్యేక అధికారులుగా కార్పొరేషన్లకు జిల్లా కలెక్టర్లు, మునిసిపాలిటీలకు ఆర్డీఓ స్థాయి అధికారులు
120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ముగుస్తున్న ప్రజా ప్రతినిధుల పదవీ కాలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 120 మునిసిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో పాలకమండళ్ల పదవీ కాలం ఆదివారంతో ముగుస్తోంది. ఇప్పటికే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్‌ల పదవీ కాలం పూర్తయి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుండగా, సోమవారం నుంచి పట్టణాలు, నగరాల్లోనూ అధికారుల పాలనే సాగనుంది. రెండు రోజులు ఆలస్యంగా ఎన్నిక జరిగిన కరీంనగర్ నగరపాలక సంస్థ పాలక మండలి పదవీ కాలం మాత్రం ఈనెల 28తో ముగియనుంది.
కాగా, పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో అనేక మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో శనివారమే పాలకమండళ్ల సభ్యులు సంబరాలు జరుపుకొన్నారు. కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారులుగా జిల్లా కలెక్టర్లు, మునిసిపాలిటీలకు ఆర్డీఓ స్థాయి అధికారులు ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారు.
అవినీతి ఆరోపణలు
2020 జనవరి 22న రాష్ట్రంలోని 120 మునిసిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. 24న కరీంనగర్ ఎన్నిక జరిగింది. అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ (టీఆర్‌ఎస్) మెజారిటీ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను దక్కించుకుంది. ఏకంగా 77 మునిసిపాలిటీలను ఏకగ్రీవంగా కైవసం చేసుకొని తన ఆధిపత్యాన్ని చాటింది.
2023 డిసెంబర్‌లో రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో చాలా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ‘అవిశ్వాస’తీర్మానాల ద్వారా అధికార కాంగ్రెస్ పార్టీ పరమయ్యాయి. జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి సహా పలువురు మేయర్లు, మునిసిపల్ చైర్మన్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
మరో నాలుగురోజుల్లో పదవీ కాలం ముగుస్తుండగా కరీంనగర్ మేయర్ సునీల్ రావు శనివారం బీజేపీలో చేరారు. కాగా, చాలాచోట్ల పాలక మండళ్లు డబ్బుల సంపాదనే ధ్యేయంగా ఐదేళ్ల పాలన సాగిందన్న ఆరోపణలు వచ్చాయి.
అక్కడ ఇంకా ఏడాదిన్నర..
రాష్ట్రంలోని హైదరాబాద్ (జీహెచ్‌ఎంసీ) కార్పొరేషన్ పదవీ కాలం మరో ఏడాది మిగిలి ఉండగా, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు కొత్తగా ఏర్పాటైన మరో ఐదు మునిసిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం మరో ఏడాదిన్నర ఉంది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు 2020 డిసెంబర్ 1న జరగగా, వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్లతోపాటు జడ్చర్ల, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరు, సిద్దిపేట మునిసిపాలిటీల ఎన్నికలు 2021 ఏప్రిల్ 30న జరిగాయి. ఈ 8 పురపాలికల పాలక మండళ్ల పదవీ కాలం ఇంకా ఏడాదిన్నర వరకు మిగిలి ఉంది.
ఎన్నికల నాటికి ఇంకా మార్పులు
కొత్త మునిసిపల్ చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని భావిస్తే, పదవీ కాలం మిగిలి ఉన్న పాలక మండళ్లను కూడా రద్దు చేసి ఎన్నికలు జరిపించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్తగా మహబూబ్‌నగర్, మంచిర్యాల మునిసిపాలిటీలను కార్పొరేషన్‌లుగా అప్‌గ్రేడ్ చేయడంతోపాటు కొత్తగా 12 మునిసిపాలిటీలను ఏర్పాటు చేస్తూ ఇటీవలే ప్రభుత్వం చట్టం చేసింది.
ఔటర్ రింగ్ రోడ్డు లోపలి వైపు ఉన్న 50కి పైగా గ్రామాలను పక్కనున్న మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపింది. కాగా మునిసిపల్ ఎన్నికల నాటికి ఓఆర్‌ఆర్ పరిధిలో ఉన్న అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేసి, మూడు లేదా నాలుగు కార్పొరేషన్లుగా మార్చే యోచనతో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment