నిధులైనా... విధులైనా... Sarpanchs across the state in agitation | Sakshi
Sakshi News home page

నిధులైనా... విధులైనా...

Published Sat, Jan 27 2024 5:24 AM

Sarpanchs across the state in agitation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో ప్రథమ పౌరులు గందరగోళంలో పడ్డారు. వారం రోజుల్లో పదవీకాలం ముగియనుండటం.. గతంలో సొంత నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా రాకపోవడంపై సర్పంచులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వెంటనే పెండింగ్‌ బిల్లులకు సంబంధించి నిధులైనా ఇవ్వాలని.. లేకుంటే మరో ఆరు నెలలపాటు పదవీకాలమైనా పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన అంటే ప్రజాస్వామ్యానికి విలువే ఉండదని స్పష్టం చేస్తున్నారు. అప్పులు చేసి మరీ గ్రామాల్లో పనులు చేయించామని.. పెండింగ్‌ బిల్లులు రాకపోతే సమస్యల్లో మునిగిపోతామని వాపోతున్నారు. 

ఊర్లలో పనులు చేయించి.. 
రాష్ట్రంలో 12,752 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ గ్రామాలకు సర్పంచ్‌లు ఎన్నికయ్యారు. అందులో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల సానుభూతిపరులు కూడా ఉన్నారు. గత ఐదేళ్లుగా పంచాయతీలకు నిధులు, ఇతర పనుల విషయంలో ఇబ్బందులు ఉన్నా గ్రామాల అభివృద్ధి కోసం కృషిచేశారు. గ్రామంలో అభివృద్ధి పనులతోపాటు వివిధ పథకాల కింద మంజూరైన ప్రాజెక్టుల  పనులూ చేశారు. పంచాయతీల్లో నిధులు లేకున్నా.. చాలా మంది సర్పంచులు సొంత డబ్బుతోనో, అప్పులు తెచ్చో పనులు పూర్తి చేయించారు.  

గడువు ముగుస్తుండటంతో.. 
ప్రస్తుతం గ్రామాల్లో సర్పంచులు, పాలకవర్గాల పదవీకాలం ఫిబ్రవరి 1వ తేదీతో ముగుస్తోంది. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఇప్పటికిప్పుడు గ్రామ పంచాయతీ (జీపీ) ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేనట్టు సంకేతాలు ఇచ్చింది. ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో.. అవి ముగిశాక పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో.. వారినే మరో ఆరు నెలలు కొనసాగించేందుకు, లేదా వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందిని గ్రామాలకు ప్రత్యేక అధికారులుగా నియమించేందుకు అవకాశం ఉంటుంది.

ప్రస్తుత సర్పంచులలో చాలా వరకు బీఆర్‌ఎస్‌కు అనుకూలమైనవారేనన్న ఆలోచనతో ఉన్న కాంగ్రెస్‌ సర్కారు.. వారినే ఇన్‌చార్జులుగా కొనసాగించేందుకు సుముఖంగా లేనట్టు సంకేతాలు ఇచ్చింది. వచ్చే ఆరు నెలల పాటు (పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేదాకా) గ్రామాల్లో పాలన బాధ్యతను ప్రత్యేకాధికారులకు అప్పగించేందుకు మొగ్గుచూపుతోంది. ఇది సర్పంచులలో కలకలం రేపుతోంది. 

‘ప్రత్యేక’పాలనతో ఇబ్బందులేనంటూ.. 
ఫిబ్రవరి 2వ తేదీ నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన మొదలవబోతోందంటూ జిల్లా, మండల స్థాయిలో అధికారులు హడావుడి చేస్తున్నారని సర్పంచులు అంటున్నారు. సొంత నిధులతో కొత్త పంచాయతీ భవనాలు, శ్మశానవాటికలు, క్రీడా మైదానాలు వంటివి నిర్మించామని.. ఉపాధి హామీ, ప్రత్యేక అభివృద్ధి నిధి, రాష్ట్ర ఆర్థిక సంస్థ పరిధిలోని పనులు చేపట్టామని చెప్తున్నారు. తమ పదవీకాలం ముగిసేలోగా పెండింగ్‌ బిల్లులైనా ఇప్పించాలని, లేదా ఎన్నికలు జరిగేదాకా సర్పంచ్‌లుగా కొనసాగించాలని సీఎం రేవంత్‌రెడ్డికి, పంచాయతీరాజ్‌ మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేస్తున్నారు.

తాము రాజకీయ పార్టీల గుర్తులపై ఎన్నికకాలేదని, తమను ఒక రాజకీయపక్షానికే అనుకూలమైనవారిగా పరిగణించవద్దని కోరుతున్నారు. తమను క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వపరంగా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేవారిగా గుర్తించాలని అంటున్నారు. ప్రత్యేకాధికారుల పాలన అంటే ఇబ్బందేనని.. గ్రామాల్లో అభివృద్ధి జరగదని సర్పంచులు పేర్కొంటున్నారు. అధికారులు కేవలం ఆఫీస్‌ వేళల్లోనే అందుబాటులో ఉంటారని.. వారాంతాలు, సెలవు రోజుల్లో వారిని సంప్రదించే అవకాశమే ఉండదని చెప్తున్నారు. దీనితో ప్రజలకు సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు. 

గ్రాంట్లపై ఆధారపడిన చోట సమస్య ఎక్కువ 
ఏడాదికిపైగా పెండింగ్‌ బిల్లుల సమస్య వెంటాడుతోందని.. సొంత నిధులతో చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బందిపడుతున్నామని సర్పంచ్‌లు చెప్తున్నారు. సొంత ఆదాయ వనరులు అధికంగా ఉన్న పలు మేజర్‌ గ్రామ పంచాయతీలు, పెద్ద గ్రామాల్లో ఇబ్బంది పెద్దగా లేదని.. ఆదాయ వనరులు అంతగా లేని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, గ్రాంట్లపై ఆధారపడిన మధ్య, చిన్నతరహా గ్రామాలకు సమస్య ఎక్కువగా ఉందని అంటున్నారు.

ఇలాంటి గ్రామ పంచాయతీల్లో రూ.6 లక్షల నుంచి రూ.11 లక్షల దాకా పెండింగ్‌ బిల్లులు ఉన్నాయని.. మొత్తంగా రూ.1,200 కోట్ల మేర బకాయిలు ఉండొచ్చని సర్పంచుల సంఘాలు అంచనా వేస్తున్నాయి. గతంలో రాష్ట్ర ఆర్థిక సంఘం, ఇతర అభివృద్ధి నిధులు సకాలంలో విడుదలకాకపోవడంతోపాటు నిధుల వ్యయంపై ఫ్రీజింగ్‌ పెట్టడంతో పెండింగ్‌ బిల్లుల సమస్య పెరిగిందని అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థికసంఘం నిధులు నేరుగా పంచాయతీలకే అందడంతో.. కొందరు సర్పంచులు కొంతమేర బిల్లులు రాబట్టుకోగలిగారని చెప్తున్నాయి.  

కొనసాగిస్తే భరోసా! 
గతంలో సకాలంలో బిల్లులు రాక, అభివృద్ధి, ఇతర పనుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక, ఇతర కారణాలతో పలువురు సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్నారని సర్పంచుల సంఘాలు గుర్తు చేస్తున్నాయి. అందువల్ల పెండింగ్‌ బిల్లులపై ప్రభుత్వం వెంటనే ఏదైనా హామీ ఇవ్వాలని కోరుతున్నాయి. లేకుంటే పంచాయతీలకు ఎన్నికలు జరిగేదాకా ఇప్పుడున్నవారినే కొనసాగిస్తే పెండింగ్‌ బిల్లుల రాకపై సర్పంచులకు భరోసా ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. 

పెండింగ్‌ బిల్లుల సమస్యను వెంటనే పరిష్కరించాలి: యాదయ్యగౌడ్‌ 
ఫిబ్రవరి 1న తమ పదవీకాలం ముగుస్తున్నందున పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డిని తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్‌ ఒక ప్రకటనలో కోరారు. సర్పంచులు అప్పులు తెచ్చి గ్రామాభివృద్ధికి పాటుపడ్డారని, అలాంటి వారి సమస్యలకు రాజకీయ రంగు రుద్దవద్దని విజ్ఞప్తి చేశారు. వివిధ పనులు చేసిన బిల్లులు రాక, తెచి్చన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందిపడుతున్నామని.. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.  

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement