యాచారం, న్యూస్‌లైన్: మండలంలోని 20 గ్రామాల్లో ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చడానికి వందకు పైగా బోరుబావులున్నాయి. రెండు నెలల క్రితం 90 శాతం బోరుబావులు ఎండిపోగా, ఇటీవల కురిసిన వర్షాలతో ప్రస్తుతం బోరుబావుల్లో పుష్కలంగా భూగర్భజలాలు పెరిగాయి. కృష్ణాజలాలు వారం రోజులకు ఒకసారి సరఫరా అవుతుండడంతో అవసరాల కోసం బోరు బావులపై ఆధారపడక తప్పని పరిస్థితి. అయితే, లో ఓల్టేజీ సమస్య, బోరుబావుల్లో ఇసుక చేరడం, ఆన్ ఆఫ్ సౌకర్యాం లేకపోవడంతో మోటార్లు తరుచూ కాలిపోతున్నాయి. సర్పంచ్‌లుగా గెలిచినప్పటి నుంచి అత్యధికంగా బోరుమోటార్ల మరమ్మతుల కోసం ఖర్చు చేయడం విశేషం. ప్రతి గ్రామంలో ఐదుకు పైగా బోరుబావులు ఉన్నాయి.
వారానికి ఒక మోటారు కాలిపోతుండడంతో నెలకు రూ.10వేల నుంచి రూ.20 వేల వరకు మరమ్మతుల కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. యాచారం, గునుగల్, మాల్, నందివనపర్తి గ్రామాలు మినహా మిగితా గ్రామాల్లో పెద్దగా ఆదాయవనరులు లేవు. అయినా మరమ్మతులు చేయించకుంటే నీళ్లున్నా సరఫరా చేయడం లేదని ప్రజలు మండిపడే అవకాశముందనే భయంతో అప్పులు చేయక తప్పడం లేదు. గెలిచిన నాటి నుంచి నాలుగు నెలల కాలంలో ప్రతి గ్రామంలో రూ. 50 వేలకు పైగా మోటార్ల మరమ్మతులకు ఖర్చు చేసిన దాఖలాలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో పంచాయతీల్లో నిధులు లేక కాలిపోయిన మోటార్లు మోకానిక్ దుకాణాల్లోనే మూలుగుతున్నాయి.
కొన్ని గ్రామాల్లో మాయమైన మోటార్లు...
మరమ్మతులు చేయిస్తున్నప్పటికీ నేటికీ కొన్ని గ్రామాల్లో ఎన్ని మోటార్లు ఉన్నాయనే విషయం రికార్డుల పరంగా సర్పంచ్‌లకు తెలియడం లేదు. కొన్నేళ్లుగా 20 గ్రామాల్లో బోరుమోటార్ల కోసం రూ.లక్షలు ఖర్చు చేసినప్పటికీ కొనుగోలు చేసిన మోటార్ల లెక్క మాత్రం కనిపించడం లేదు. గునుగల్, నక్కర్తమేడిపల్లి, మాల్, యాచారం, నందివనపర్తి, మంతన్‌గౌరెల్లి గ్రామాల్లో కొన్నేళ్లుగా కొనుగోలు చేసిన మోటార్ల వివరాల రికార్డులు అసలే లేవు. గెలిచిన సర్పంచ్‌లు మోటార్ల లెక్క చూపించాలని అధికారులను కోరినా ఫలితం లేకుండా పోయింది. కొన్ని గ్రామాల్లో బోరుబావుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ మోటార్లు లేక నిరుపయోగంగా మారాయి. సరిపడా కృష్ణాజలాలైనా సరఫరా చేయండి.. లేదంటే మోటార్ల మరమ్మతులు నిధులైనా ఇప్పించాలని సర్పం చ్‌లు పదేపదే కోరినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని వారు కోరుతున్నారు.
రూ. 50 వేలు ఖర్చు చేశా...
సర్పంచ్‌గా గెలిచిన నాటి నుంచి ఇప్పటివరకూ బోరుమోటార్ల మరమ్మతుల కోసం రూ.50 వేలకు పైగా ఖర్చు చేశా. వారానికి ఒక మోటార్ కాలిపోతోంది. మరమ్మతులకే ప్రతీసారి రూ.4వేలకు పైగా ఖర్చవుతోంది. అయినా ప్రజల నుంచి విమర్శలు తప్పడం లేదు.
- నర్సయ్య, సర్పంచ్, మంతన్‌గౌరెల్లి
నిధులు మంజూరు చేయాలి...
బోరుమోటార్ల మరమ్మతుల కోసం నాలుగు నెలల్లో రూ. 60 వేలకు పైగా ఖర్చు చేశా. స్టార్టర్లు కూడా తరుచూ కాలిపోతున్నాయి. రెండు రోజులకోసారి కృష్ణాజలాలు సరఫరా చేసేలా కృషి చేయాలి. లేదంటే మరమ్మతుల కోసం పంచాయతీలకు అవసరమైన నిధులు మంజూరు చేయాలి. అప్పులు చేసి మరమ్మతులు చేయించాల్సిన పరిస్థితి ఉంది.
-పాశ్ఛ భాష, సర్పంచ్, నక్కర్తమేడిపల్లి
నిలదీతలు తప్పడం లేదు..
మోటార్ల కోసం అవసరమైన నిధులు మంజూరు చేయడం లేదు. కనీసం కృష్ణాజలాలు సరిగా సరఫరా చేయడం లేదు. నీళ్లు పుష్కలంగా ఉన్నా ప్రజలు నీటిఎద్దడిని ఎదుర్కోక తప్పడం లేదు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదు. నిత్యం ప్రజల నుంచి నిలదీతలు తప్పడం లేదు.
- బొక్క నారాయణరెడ్డి, సర్పంచ్, తాడిపర్తి
సర్పంచ్‌లకు అప్పుల తిప్పలు
Published Mon, Dec 23 2013 12:12 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement