shortage of funds
-
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి
-
స్టార్టప్‌లకు నిధుల కొరత..
ముంబై: అంతర్జాతీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో దేశీ అంకుర సంస్థల్లోకి పెట్టుబడుల ప్రవాహం గణనీయంగా తగ్గిపోతోంది. గతేడాది ప్రథమార్ధంతో పోలిస్తే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 79 శాతం క్షీణించింది. వెంచర్ ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం గతేడాది జనవరి–జూన్ మధ్యకాలంలో 18.4 బిలియన్ డాలర్ల మేర ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ (పీఈ/వీసీ) పెట్టుబడులు రాగా ఈసారి మాత్రం అదే వ్యవధిలో 3.8 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. ఫండింగ్ పరిమాణం తగ్గిపోవడం ఒక ఎత్తైతే.. అటు డీల్స్ కూడా పడిపోవడం మరో ఎత్తు. గతేడాది ప్రథమార్థంతో పోలిస్తే ఒప్పందాల సంఖ్య 60 శాతం క్షీణించి 727 నుంచి 293కి పడిపోయింది. అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో పీఈ/వీసీ ఫండ్స్ వర్ధమాన మార్కెట్లలో రిసు్కలతో కూడుకున్న పెట్టుబడులు పెట్టడం కంటే పెద్దగా రిసు్కలు లేకుండా మెరుగైన రాబడులు అందించే బాండ్లు మొదలైన సాధనాల వైపు మొగ్గు చూపుతున్నారని ఆస్క్ ప్రైవేట్ వెల్త్ సీఈవో రాజేష్ సలూజా తెలిపారు. అయితే, దీర్ఘకాలికంగా ఈ ధోరణి ఉండకపోవచ్చని, పరిస్థితులు కాస్త చక్కబడిన తర్వాత పెట్టుబడులు మళ్లీ పుంజుకోగలవని ఆయన అభిప్రాయపడ్డారు. తగ్గిన వేల్యుయేషన్స్ .. కోవిడ్ తర్వాత ఒక్కసారిగా ఎగిసిన దేశీ టెక్నాలజీ స్టార్టప్‌ల వేల్యుయేషన్లు గత కొన్నాళ్లుగా గణనీయంగా తగ్గాయి. యూనికార్న్‌లపరంగా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల స్టార్టప్‌లు) ప్రపంచంలోనే భారత్ మూడో ర్యాంకులో ఉన్నప్పటికీ .. గత తొ మ్మిది నెలలుగా కొత్తగా ఒక్క అంకుర సంస్థ కూడా యూనికార్న్ హోదా దక్కించుకోలేదు. సమీప కాలంలో దక్కించుకునే సూచనలూ కనిపించడం లేదు. యూనికార్న్‌లు కాగలిగే సత్తా ఉన్న అంకురాలంటూ హురున్ గతేడాది 122 స్టార్టప్‌లతో జాబితా చేయగా, ఈ ఏడాది అందులో నుంచి 19 సంస్థలు స్థానం కోల్పోయాయి. మరోవైపు, ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల రీత్యా వాటాలు విక్రయించి పెట్టుబడులు తెచ్చుకునేందుకు అంకుర సంస్థలు కూడా సుముఖత చూపడం లేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అత్యంత సంపన్న వర్గాలు లేదా వెంచర్ డెట్ ఫండ్స్ నుంచి రుణాల రూపంలో తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నాయని పేర్కొన్నాయి. తద్వారా వాటాలను విక్రయించాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నట్లు వివరించాయి. చక్కని పనితీరుతో మంచి వేల్యుయేషన్ గల కంపెనీలు.. మార్కెట్ పరిస్థితులు బాగా లేనప్పుడు నిధులను సమీకరించేందుకు ఇష్టపడవని హురున్ ఇండియా ఎండీ అనాస్ రెహా్మన్ జునైద్ తెలిపారు. బుల్ మార్కెట్‌తో పోలిస్తే బేర్ మార్కెట్లో సరైన వేల్యుయేషన్ లభించదు కాబట్టి పరిస్థితి చక్కబడే వరకు అవి కాస్త వేచి చూస్తాయని పేర్కొన్నారు. డేటాలో మరిన్ని అంశాలు.. ► 2023 ప్రథమార్ధంలో 170 పైచిలుకు తొలి దశ పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. 2022 ప్రథమార్ధంలో నమోదైన 435 డీల్స్‌తో పోలిస్తే 61 శాతం క్షీణించాయి. ఇన్వెస్ట్ చేసిన నిధుల పరిమాణం బట్టి చూస్తే స్టార్టప్‌లకు 624 మిలియన్ డాలర్లు లభించాయి. గతేడాది ప్రథమార్ధంలో వచి్చన 1.8 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 65 శాతం క్షీణత. ► వృద్ధి దశ, ఆఖరు అంచె పెట్టుబడులు కూడా గణనీయంగా తగ్గాయి. 123 డీల్స్ ద్వారా 3.2 బిలియన్ డాలర్లు వచ్చాయి. గతేడాది ఇదే వ్యవధిలో ఈ విభాగానికి సంబంధించి 292 డీల్స్ ద్వారా 16.6 బిలియన్ డాలర్లు వచ్చాయి. ► మే నెలలో 948 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో 53 డీల్స్ కుదరగా .. జూన్‌లో 546 మిలియన్ డాలర్ల విలువ చేసే 44 ఒప్పందాలు కుది రాయి. గతేడాది జూన్‌లో ఏకంగా 2.4 బిలియ న్ డాలర్ల విలువ చేసే 108 డీల్స్ కుదిరాయి. ► ప్రథమార్ధంలో పీక్ 15 పార్ట్నర్స్ (గతంలో సెక్వోయా ఇండియా) అత్యధికంగా 21 డీల్స్‌తో టాప్ ఇన్వెస్టరుగా నిలి్చంది. యాక్సెల్ ఇండియా 11, బ్లూమ్ వెంచర్స్ 10 ఒప్పందాలతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రెయిన్‌మ్యాటర్ క్యాపిటల్, ఆనికట్ క్యాపిటల్, లైట్‌స్పీడ్ వెంచర్స్ మొదలైన ఇన్వెస్ట్మెంట్ సంస్థలు చురుగ్గా పాలుపంచుకున్నాయి. ► ఈ ఏడాది ఇప్పటివరకూ కళ్లద్దాల బ్రాండ్ లెన్స్‌కార్ట్ అత్యధికంగా 500 మిలియన్ డాలర్లు సమీకరించింది. 250 మిలియన్ డాలర్లతో బిల్డర్.ఏఐ, తలో 150 మిలియన్ డాలర్లతో ఇన్ఫ్రా.మార్కెట్, జెట్వెర్క్, ఇన్సూరెన్స్‌దేఖో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అధిక వేల్యుయేషన్స్‌తో ఒత్తిడి .. అంకుర సంస్థల ప్రమోటర్లు, వ్యవస్థాపకులు భారీ వేల్యుయేషన్స్‌తో పెట్టుబడులు సమీకరించడం శ్రేయస్కరం కాదని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల సత్వరం ఫలితాలు చూపించాల్సిన ఒత్తిడి పెరిగిపోతుందని వారు తెలిపారు. ఫలితంగా దీర్ఘకాలికంగా ఆలోచించడం కన్నా స్వల్పకాలిక ప్రయోజనాల కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయని వివరించారు. భారత్‌పే, ట్రెల్, జిలింగో, గోమెకానిక్ వంటి పలు దేశీ అంకుర సంస్థల్లో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు బైటపడటం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇలాంటి పరిణామాల వల్ల కూడా ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరిస్తున్నారని చెప్పారు. కాబట్టి అంకుర సంస్థలు అధిక వేల్యుయేషన్ల వెంటబడకుండా అవసరానికి తగినన్ని నిధులను మాత్రమే సమీకరించుకోవడం, సుస్థిరమైన వ్యాపార మోడల్‌ను తీర్చిదిద్దుకోవడంపై దృష్టి పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. -
స్టార్టప్ వ్యవస్థ బలోపేతానికి కృషి,నిధుల కొరత లేదు: అమితాబ్ కాంత్
గురుగ్రామ్: అంకుర సంస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. స్టార్టప్‌ల వ్యవస్థను ప్రోత్సహించేందుకే తప్ప నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయత్నించబోదని ఆయన స్పష్టం చేశారు. ఆ వ్యవస్థలో భాగమైన వర్గాలే స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. స్టార్టప్20 సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. (హార్లే డేవిడ్సన్ ఎక్స్440 బుకింగ్స్ షురూ ) అంకుర సంస్థల పురోగతికి అవరోధాలు కల్పించాలనేది ప్రభుత్వల ఉద్దేశం కాదనే స్పష్టమైన సందేశం స్టార్టప్‌లకు చేరాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. భారత్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని అంకుర సంస్థలను ఆహ్వానించారు. 2030 నాటికి అంకుర సంస్థల వ్యవస్థలోకి జీ20 దేశాలన్నీ కలిసి ఏటా 1 లక్ష కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టేలా చూసేందుకు స్టార్టప్20 గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలు సాకారమైతే స్టార్టప్‌లకు మరిన్ని ప్రయోజనాలు చేకూరగలవని గోయల్ చెప్పారు. (Virat Kohli First Car: స్టార్ క్రికెటర్ కోహ్లీ, ఫస్ట్ కారు ఏదో తెలుసా? దుమ్మురేపే లగ్జరీ కార్ల కలెక్షన్) స్టార్టప్‌లకు నిధుల కొరత లేదు: అమితాబ్ కాంత్ సరైన అంకుర సంస్థలకు పెట్టుబడుల కొరతేమీ లేదని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. పటిష్టమైన వ్యాపార విధానాలున్న మంచి స్టార్టప్‌లకు నిధుల లభ్యత బాగానే ఉందని ఆయన చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు స్టార్టప్ వ్యవస్థ చురుగ్గా పని చేస్తోందని స్టార్టప్20 శిఖర్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భారత్‌లో 1,00,000 పైచిలుకు స్టార్టప్‌లు, 108 యూనికార్న్‌లు (బిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే అంకురాలు) ఉన్నాయని అమితాబ్ కాంత్ తెలిపారు. (జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా) -
ఏవియేషన్‌కు రూ. 1,500 కోట్ల రుణ పరిమితి
న్యూఢిల్లీ: కోవిడ్ ధాటికి కుదేలైన రంగాలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడానికి ఉద్దేశించిన ఈసీఎల్‌జీఎస్‌కి (అత్యవస రుణ సదుపాయ హామీ పథకం) కేంద్ర ఆర్థిక శాఖ సవరణలు చేసింది. వైమానిక రంగ సంస్థలకు గరిష్ట రుణ పరిమితిని రూ. 400 కోట్ల నుంచి రూ. 1,500 కోట్లకు పెంచింది. సముచిత వడ్డీ రేటుతో తనఖా లేని రుణాలు పొందడం ద్వారా విమానయాన సంస్థలు నిధుల కొరత సమస్యను అధిగమించడంలో తోడ్పాటు అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో 2020 మే నెలలో కేంద్రం ఈ స్కీమును ప్రవేశపెట్టింది. ఆ తర్వాత నుంచి పరిస్థితులను బట్టి సవరిస్తూ, పొడిగిస్తూ వస్తోంది. ఇది ఈ ఏడాది మార్చితో ముగియాల్సి ఉండగా 2023 మార్చి వరకూ పొడిగించింది. ఈ స్కీము కింద 2022 ఆగస్టు 5 నాటికి ఈ స్కీము కింద రూ. 3.67 లక్షల కోట్ల మేర రుణాలు మంజూరయ్యాయి. -
విత్‌డ్రాయల్స్ ఆంక్షలు, ఆర్బీఐ గుప్పిట్లో ‘యస్’!
న్యూఢిల్లీ: కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, మొండిబాకీల భారం, నిధుల కొరత కష్టాలతో సతమతమవుతున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ కొరడా ఝుళిపించింది. బ్యాంక్ బోర్డును రద్దు చేయడంతో పాటు ఖాతాదారులకు షాక్‌నిచ్చేలా విత్డ్రాయల్స్పై పరిమితులు విధించింది. ఖాతాదారులకు రూ. 50,000కు మించి చెల్లింపులు జరపకుండా 30 రోజుల మారటోరియం విధిస్తూ ఆర్బీఐ గురువారం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 5 నుంచి అమల్లోకి వచ్చిన మారటోరియం ఏప్రిల్ 3 దాకా కొనసాగుతుంది. వైద్యం, ఉన్నత విద్య, వివాహం వంటి అత్యవసర సందర్భాల్లో మాత్రమే రూ. 50,000కు మించి విత్‌డ్రా చేసుకోవడానికి వీలుంటుంది. అటు యస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిన నేపథ్యంలో బోర్డును కూడా రద్దు చేసిన ఆర్బీఐ.. ప్రభుత్వ రంగ ఎస్బీఐ మాజీ సీఎఫ్‌వో ప్రశాంత్ కుమార్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. భారీ స్కామ్‌తో కుదేలైన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంకుపైనా ఆర్బీఐ కొన్నాళ్ల క్రితం ఇలాంటి ఆంక్షలే విధించింది. అది జరిగిన 6 నెలల వ్యవధిలోనే యస్ బ్యాంక్‌పైనా రిజర్వ్ బ్యాంక్ అటువంటి చర్యలే తీసుకోవడం గమనార్హం. ఆందోళన వద్దు .. డిపాజిట్లు భద్రమే.. మొండిబాకీల భారం, డిపాజిట్ల విత్‌డ్రాయల్స్, రేటింగ్ డౌన్‌గ్రేడ్స్ వంటి పలు ప్రతికూల అంశాలతో బ్యాంకు పరిస్థితి నానాటికి దిగజారిందని ఆర్బీఐ పేర్కొంది. ‘పరిస్థితి చక్కదిద్దుకోవడానికి, విశ్వసనీయమైన పునరుద్ధరణ ప్రణాళికతో నిధులు సమీకరించుకోవడానికి యస్ బ్యాంక్ మేనేజ్మెంట్కు తగినన్ని అవకాశాలు ఇచ్చాం. కానీ ప్రణాళికలు అమలు చేయడంలో అది విఫలమైంది. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత.. ఖాతాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం యస్ బ్యాంకుపై మారటోరియం విధించాలంటూ ప్రభుత్వానికి సూచించడం మినహా మరో మార్గాంతరం లేదని భావించాం. తదనుగుణంగానే కేంద్రం నిర్ణయం తీసుకుంది‘ అని ఆర్బీఐ పేర్కొంది. ఖాతాదారులు ఆందోళన చెందనక్కర్లేదన్న ఆర్బీఐ.. డిపాజిట్లు భద్రంగానే ఉంటాయని, డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడతామని భరోసానిచ్చింది. బ్యాంకింగ్ రంగ నియంత్రణ చట్ట నిబంధనల ప్రకారం యస్ బ్యాంక్ పునరుద్ధరణ లేదా మరో బ్యాంకులో విలీనం చేయడానికి సంబంధించి త్వరలోనే తగు ప్రణాళికను రూపొందిస్తామని ఆర్బీఐ పేర్కొంది. డిపాజిటర్లు సుదీర్ఘకాలం ఇబ్బందులు పడకుండా మారటోరియం ముగిసేలోగానే దీన్ని అమలు చేస్తామని తెలిపింది. ఎస్బీఐ చేతికి..? ఎల్ఐసీతో కలిసి టేకోవర్ వార్తలు రిజర్వ్ బ్యాంక్ మారటోరియం విధిస్తున్నట్లు ప్రకటించడానికి ముందు.. యస్ బ్యాంక్‌ను ఎల్ఐసీతో కలిసి ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్యంలోని కన్సార్షియం టేకోవర్ చేయనుందంటూ వార్తలు వచ్చాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కన్సార్షియం మొత్తం 49 శాతం వాటాలు కొనేలా ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. నియంత్రణాధికారాలు దక్కే స్థాయిలో వాటాలు కొనుగోలు చేసేందుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా రావొచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గురువారం ముంబైలో ఎస్బీఐ బోర్డు సమావేశం కావడం ఈ వార్తలకు ఊతమిచ్చింది. యస్ బ్యాంక్ మూతబడే పరిస్థితి ఉండబోదంటూ ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వ్యాఖ్యలు చేసిన కొన్నాళ్లకే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొటక్ మహీంద్రా వంటి ప్రైవేట్ దిగ్గజ బ్యాంకులు.. యస్ బ్యాంక్‌ను టేకోవర్ చేసేందుకు అనువైనవంటూ గతంలో ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ వార్తలపై వివరణనివ్వాలంటూ ఎస్బీఐ, యస్ బ్యాంకులకు స్టాక్ ఎక్సే్చంజీలు సూచించాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం అలాంటి పరిణామాలేమైనా ఉన్న పక్షంలో వెల్లడిస్తామంటూ ఎస్బీఐ తెలియజేసింది. అటు యస్ బ్యాంక్ కూడా .. ఇప్పటిదాకా తమకు దీనిపై ఆర్బీఐ లేదా ప్రభుత్వం లేదా ఇతరత్రా నియంత్రణ సంస్థలు, ఎస్బీఐ నుంచి ఏ విధమైన సమాచారమూ రాలేదని తెలిపింది. అటు, బ్రోకరేజీ సంస్థలు మాత్రం యస్ బ్యాంక్ పరిస్థితి ఆశావహంగా లేదంటూ వ్యాఖ్యానించాయి. ఒకవేళ ఇన్వెస్టర్లకు బలవంతంగా అంటగట్టినా.. మొండిబాకీల రిస్కులు భారీగా ఉన్నందున బ్యాంకు విలువను సున్నా కింద లెక్కగట్టి తీసుకోవడమే జరగవచ్చని జేపీ మోర్గాన్ వర్గాలు వ్యాఖ్యానించాయి. ‘యస్’ నుంచి ‘నో’ వరకూ...! ► జూన్ 12, 2018: యస్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓగా మూడేళ్లపాటు రాణా కపూర్ పునర్నియామకానికి వాటాదారుల ఆమోదం ► సెప్టెంబర్ 19, 2018: రాణా కపూర్ పదవీ కాలాన్ని జనవరి 31,2019 వరకే తగ్గించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ► సెప్టెంబర్ 21, 2018: యస్ బ్యాంక్ షేర్ ఒకే రోజు 30 శాతం పతనం, రూ.21,951 కోట్ల మార్కెట్ క్యాప్ ఆవిరి ► సెప్టెంబర్ 28, 2018: ప్రమోటర్ షేర్లను విక్రయించబోనని, కూతుళ్లకు ఇచ్చేస్తానని రాణా కపూర్ ప్రకటన. యస్ బ్యాంక్ డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌కు క్రెడిట్ వాచ్ రేటింగ్‌ను ఇస్తున్నామని కేర్ రేటింగ్స్ వెల్లడి ► అక్టోబర్ 17, 2018: రాణా కపూర్‌కు మరింత గడువును ఇవ్వడానికి నిరాకరించిన ఆర్బీఐ. 2019, ఫిబ్రవరి 1 కల్లా కొత్త సీఈఓను నియమించుకోవాలని ఆదేశం ► అక్టోబర్ 25, 2018: గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి. మార్క్‌టు మార్కెట్ నష్టాలు రెట్టింపు కావడం, మొండి బకాయిలకు కేటాయింపులు అధికంగా ఉండటంతో ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. రుణ నాణ్యత భారీగా క్షీణించింది. ► నవంబర్ 14, 2018: చైర్మన్ పదవికి అశోక్ చావ్లా రాజీనామా. ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలగిన వసంత్ గుజరాతీ ► నవంబర్ 19, 2018: మరో ఇండిపెండెంట్ డైరెక్టర్ రెంటాల చంద్రశేఖర్ రాజీనామా ► నవంబర్ 27, 2018: యస్ బ్యాంక్ రేటింగ్‌ను డౌన్ గ్రేడ్‌చేసిన మూడీస్ సంస్థ. ► మార్చి 1, 2019: యస్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన రవ్నీత్ గిల్. 3 శాతం ఎగసిన షేర్ ధర ► మార్చి 5, 2019: స్విఫ్ట్ కార్యకలాపాల విషయంలో నిబంధనలు పాటించనందుకు రూ. 1 కోటి జరిమానా విధించిన ఆర్బీఐ ► ఏప్రిల్ 26, 2019: గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఆర్థిక ఫలితాలు వెల్లడి. రూ.1,507 కోట్ల నికర నష్టాలు ► ఏప్రిల్ 29, 2019: యస్ బ్యాంక్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసిన మాక్వైరీ బ్రోకరేజ్ సంస్థ. ► ఏప్రిల్ 30, 2019: క్యూ4 ఫలితాల ప్రభావంతో 30% పతనమైన షేర్ ► మే 9, 2019: యస్ బ్యాంక్ లాంగ్ టర్మ్ రేటింగ్‌ను ప్రధాన రేటింగ్ ఏజెన్సీలైన ఇండియా రేటింగ్స్, ఇక్రాలు డౌన్ గ్రేడ్ చేశాయి. ► మే 15, 2019: యస్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్‌లో అదనపు డైరెక్టర్‌గా ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధీ నియామకం ► జూలై 18, 2019: రాణా కపూర్ తన పూర్తి వాటా షేర్లను తనఖా పెట్టారన్న వార్తలు వచ్చాయి. భారీగా పతనమైన బ్యాంక్ షేర్ ► ఆగస్టు 10, 2019: సీఎఫ్ఓగా అనురాగ్ అద్లాఖ నియామకం ► సెప్టెంబర్ 21, 2019: యస్ బ్యాంక్‌లో 2.75 శాతం వాటా విక్రయించిన రాణా కపూర్. 6.89 శాతానికి తగ్గిన వాటా ► అక్టోబర్ 3, 2019: యస్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ రజత్ మోంగా రాజీనామా ► నవంబర్ 1, 2019: ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.600 కోట్ల నష్టాలు ► డిసెంబర్ 6, 2019: యస్ బ్యాంక్‌కు నెగిటివ్ అవుట్ లుక్ ఇచ్చిన రేటింగ్ ఏజెన్సీ మూడీస్. 9 శాతానికి పైగా పతనమైన షేర్ ధర ► డిసెంబర్ 17, 2019: కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో యస్ బ్యాంక్ విలీనం కానున్నదని వినిపించిన వార్తలు ► జనవరి 10, 2020: కార్పొరేట్ గవర్నెన్స్ సరిగ్గా లేదంటూ రాజీనామా చేసిన బోర్డ్ మెంటర్ ఉత్తమ్ ప్రకాశ్ రాజీనామా ► జనవరి 13, 2020: ఇన్సైడర్ ట్రేడింగ్ చోటు చేసుకుందని, ఈ విషయమై సెబీ దర్యాప్తు చేయాలని లేఖ రాసిన ఉత్తమ్ ప్రకాశ్ అగర్వాల్. 6 శాతం పతనమైన షేర్ ధర ► మార్చి 5, 2020: ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్షియమ్... యస్ బ్యాంక్‌లో వాటా కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపిందని వార్తలు. 26 శాతం లాభంతో రూ.36.85కు ఎగసిన షేర్. షేరు టార్గెట్ @ రూ. 1 అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, జేపీ మోర్గాన్ యస్ బ్యాంక్ షేర్ టార్గెట్ ధరను రూ.1కు (గతంలో రూ.55)కు తగ్గించింది. రేటింగ్‌ను అండర్ వెయిట్‌గా కొనసాగించింది. ప్రస్తుత ధర (రూ.37)కు బాగా ఎక్కువ డిస్కౌంట్‌కు కొత్త మూలధనం లభించే అవకాశాలున్నందున టార్గెట్ ధరను రూ.1కు తగ్గిస్తున్నామని జేపీ మోర్గాన్ వివరించింది. గురువారం 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయిన యస్ బ్యాంక్ షేరు.. ఆ తర్వాత టేకోవర్ వార్తలతో బీఎస్ఈలో 26% పెరిగి రూ.36.85 వద్ద క్లోజయ్యింది. -
నిధుల వేటలో సక్సె(య)స్!
న్యూఢిల్లీ: నిధుల కొరత, మొండిపద్దులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌కు భారీ ఊరట లభించింది. 1.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,500 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు ఓ ఇన్వెస్టర్ ముందుకొచ్చారు. కొత్తగా ఈక్విటీ షేర్ల జారీకి ప్రతిగా ఈ మేరకు ఇన్వెస్ట్ చేసేందుకు విదేశీ ఇన్వెస్టర్ నుంచి ఆఫర్ వచ్చినట్లు యస్ బ్యాంక్ గురువారం వెల్లడించింది. బ్యాంకు బోర్డు, నియంత్రణ సంస్థ, షేర్‌హోల్డర్ల నుంచి అనుమతులకు లోబడి తాజా పెట్టుబడులు ఉంటాయని తెలిపింది. ‘మరిన్ని పెట్టుబడుల కోసం ఇతర దేశ, విదేశ ఇన్వెస్టర్లతో కూడా చర్చలు కొనసాగుతాయి‘ అంటూ బ్యాంకు వివరించింది. వ్యాపార వృద్ధికి దోహదపడేలా మరిన్ని పెట్టుబడులు సమీకరిస్తున్నామని, పలు విదేశీ సంస్థలతో పాటు దేశీయంగా ప్రైవేట్ ఈక్విటీ, వ్యూహాత్మక ఇన్వెస్టర్లు తమ సంస్థలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని యస్ బ్యాంకు గత నెలలో స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా ఆగస్టులో యస్ బ్యాంక్ రూ. 1,930 కోట్లు సమీకరించింది. నియంత్రణ సంస్థ ఏం చేస్తుందో.. పెట్టుబడుల వార్త వెల్లడి కావడానికి ముందు యస్ బ్యాంక్ మార్కెట్ విలువ సుమారు 2 బిలియన్ డాలర్ల వద్ద తిరుగాడింది. ఆ ప్రకారం చూస్తే 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడి చాలా భారీ మొత్తమే కానుంది. సంస్థ భవిష్యత్ వృద్ధి అవకాశాలపై గట్టి నమ్మకమున్నందుకే ఇన్వెస్టర్లు కాస్త ఎక్కువ రేటు ఇచ్చేందుకు కూడా సిద్ధపడి ఉండొచ్చని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ రూ. 100 వద్ద షేరు కేటాయించిన పక్షంలో విదేశీ ఇన్వెస్టరుకు 25 శాతం వాటా లభించవచ్చు. అంతకు మించి 26 శాతం వాటా తీసుకున్న పక్షంలో మైనారిటీ షేర్హోల్డర్లకు ఓపెన్ ఆఫరు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మొత్తం వ్యవహారం జటిలంగా మారే అవకాశం ఉంది. మరోవైపు, ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఏ విధంగా వ్యవహరిస్తుందనేది కూడా చూడాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం భారతీయ బ్యాంకుల్లో ఏ ఒక్క ఇన్వెస్టరుకు 10 శాతానికి మించి వాటాలు తీసుకోవడానికి లేదు. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దీన్ని సడలించే అంశాన్ని పరిశీలించవచ్చని ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నాయి. ప్రస్తుతం యస్ బ్యాంకు దీన్ని ఉపయోగించుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో క్యాథలిక్ సిరియన్ బ్యాంకులో ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ కూడా ఇదే తరహాలో మెజారిటీ వాటాలు తీసుకునేందుకు అంగీకరించినందున.. తాజాగా అదే తరహా యస్ బ్యాంకు డీల్ విషయంలో ఆర్బీఐ కాదనకపోవచ్చని అంచనాలు ఉన్నాయి. 24 శాతం ఎగిసిన షేరు.. విదేశీ ఇన్వెస్టరు పెట్టుబడుల వార్తలతో గురువారం యస్ బ్యాంక్ షేరు భారీగా ఎగిసింది. బీఎస్ఈలో ఒక దశలో ఏకంగా 35% పెరిగి రూ.76.65 స్థాయిని తాకింది. చివరికి 24% పెరిగి రూ. 70.45 వద్ద క్లోజైంది. ఎన్ఎస్ఈలో ఇంట్రాడేలో 39% (రూ.78.70కి) ఎగిసిన షేరు ఆ తర్వాత సుమారు 24 శాతం లాభంతో రూ.70.30 వద్ద ముగిసింది. యస్ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 3,500 కోట్లు ఎగిసి రూ.17,967 కోట్లకు చేరింది. -
మేమే చెల్లిస్తాం.. తిరిగి ఇస్తారా?
⇒ ఉపాధి హామీ కూలీలకు వేతన బకాయిలపై కేంద్రానికి సర్కారు లేఖ ⇒ ఎన్ఈఎఫ్ఎంఎస్ అమల్లోకి వచ్చినా నిధులు విడుదల చేయని కేంద్రం ⇒ రాష్ట్రంలో 7 లక్షల మంది కూలీల ఖాతాలకు చేరని రూ. 80 కోట్ల బకాయిలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. గత 50 రోజులుగా కేంద్ర ప్రభుత్వం వేతన కాంపోనెంట్ నిధులను విడుదల చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూలీలకు వేతన బకాయిలు పేరుకు పోతున్నాయి. క్షేత్రస్థాయిలో ఉపాధి పనులు చేసిన కూలీల నుంచి ఆందోళన వ్యక్తమవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వమే వేతన బకాయిలను చెల్లించేందుకు సన్నద్ధమైంది. వారికి ఇవ్వాల్సిన వేతన బకాయిలు రూ. 80 కోట్లను తామే చెల్లిస్తామని, ఆపై తాము చెల్లించిన మేరకు నిధులను తిరిగి రీయింబర్స్మెంట్ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. రీయింబర్స్ చేసేందుకు కేంద్రం నుంచి ఆమోదం లభించిన పక్షంలో దాదాపు 7 లక్షల మంది కూలీల బ్యాంకు ఖాతాలకు వారి వేతన బకాయిలను వెంటనే జమ చేసేలా ఏర్పాట్లు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మెటీరియల్ కాంపోనెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన నిధుల్లో రూ. 99 కోట్లను ఇప్పటికే గ్రామీణాభివృద్ధి శాఖ ఖాతాకు జమ చేసింది. అప్పుడు రాష్ట్రం.. ఇప్పుడు కేంద్రం.. గతేడాది కేంద్రప్రభుత్వం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించినందున ఉపాధి పనులు చేసిన కూలీలకు సకాలంలో వేతనాలు అందలేదని ఫిర్యాదులు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇకపై తామే నేరుగా ఉపాధి పనులు చేసిన కూలీలకు వేతనాలను చెల్లిస్తామని గత జనవరిలో ప్రకటించింది. అయితే.. కేంద్ర ప్రభుత్వం కూడా గత 50 రోజులుగా ఉపాధి పనులు చేసిన కూలీలకు వేతనాల నిమిత్తం నిధులు విడుదల చేయలేదు. వాస్తవానికి రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు వేతనాలను నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసే నిమిత్తం నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్మెంట్ వ్యవస్థ (ఎన్ఈఎఫ్ఎంఎస్)ను కేంద్ర ప్రభుత్వం గత జనవరిలో ఏర్పాటు చేసింది. అయితే.. పనులు చేసిన కూలీలకు ఎప్పటికప్పుడు వారి వేతనాలు బ్యాంకు ఖాతాలకు జమ కావాల్సి ఉండగా, గత 50 రోజులుగా కూలీల ఖాతాల్లో నయాపైసా కూడా పడలేదు. కేంద్రం ఇస్తుందిలే అని రాష్ట్ర ప్రభుత్వం కూడా మిన్నకుండటంతో రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. ఎందుకీ నిధుల కొరత.. కేంద్ర ప్రభుత్వం వేతన కాంపోనెంట్‌ను విడుదల చేయకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం వద్ద మెటీరియల్ కాంపోనెంట్‌కు మాత్రమే నిధులు ఉండటంతో వేతనాలిచ్చేందుకు నిధుల కొరత ఏర్పడింది. జనవరి 1 నుంచి 10 రోజుల పాటు ఎన్ఈఎఫ్ ఎంఎస్ ద్వారా ఉపాధి పనులు చేసిన కూలీలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి నేరుగా వేతనాలు అందగా, జనవరి 11 నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి. -
పోలీస్ నియామకాలకు నిధుల కొరత!
⇒ పోలీస్ పరీక్ష ఫలితాల ఆలస్యానికి నిధుల కొరతే కారణం ⇒ శిక్షణలో ఉన్నవారికి స్టైఫండ్ పెంచాలన్న పోలీస్ శాఖ ⇒ ఖజానాలో నిధుల్లేవన్న ఆర్థిక శాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు శాఖలో పోస్టుల భర్తీకి నిధుల కొరత అడ్డంకిగా మారింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత భారీ స్థాయిలో నియామకాలకు పోలీస్ శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. గతేడాది ప్రారంభమైన ఈ ప్రక్రియలో తుది ఫలితాల కోసం వేలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. అయితే ఫలితాల వెల్లడిపై పెద్ద నోట్ల రద్దు, ఖజానాలో నిధులలేమి ప్రభావం పడినట్టు కనిపిస్తోంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలోనే పోలీస్ అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం కావాల్సి ఉంది. పెద్ద నోట్ల రద్దుతో ప్రభుత్వ ఖజానాలో నిధుల్లేకపోవడంతో 2017–18 ఆర్థిక సంవత్సరంలోనే శిక్షణ ప్రారంభించాలని ప్రభుత్వం పోలీస్ శాఖకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ కారణం వల్లే జనవరిలో వెలువడాల్సిన పోలీస్ పరీక్ష ఫలితాలు ఆలస్యమవుతున్నట్లు ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది. ఫలితాలు ఎప్పుడు వెలువడుతాయో తెలియక అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు. నిత్యం 150 నుంచి 200 మంది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులకు ఫోన్లుచేసి ఫలితాలపై ఆరాతీస్తున్నారు. స్టైఫండ్ పెంచలేం... కాగా, ఇప్పటికే శిక్షణలో ఉన్న పోలీస్ కానిస్టేబుళ్లు, ఎస్ఐలకు చాలీచాలని స్టెఫండ్ ఇస్తున్నామని, దీన్ని పెంచాలని పోలీస్ ఉన్నతాధికారులు ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం శిక్షణలో ఉన్న కానిస్టేబుల్‌కు రూ.4వేలు స్టెఫండ్ చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని రూ.9వేలకు పెంచాలని పోలీస్ శాఖ ప్రతిపాదించింది. అదే విధంగా సబ్ఇన్స్పెక్టర్లకు ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.9వేల స్టైఫండ్‌ను రూ.15 వేలకు పెంచాలని కోరింది. అయితే రాష్ట్ర ఖాజానాలో నిధుల్లేవని, ఇంత మొత్తంలో స్టెఫండ్ పెంచడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదని ఆర్థిక శాఖ ఆ ఫైలును తిప్పిపంపినట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. పలు రాష్ట్రాల్లో శిక్షణ సమయం నుంచే జీతభత్యాలు చెల్లిస్తుండగా, ఇక్కడ కనీసం స్టెఫండ్ అయినా పెంచాలని తాము కోరామని, కానీ ఆ ప్రతిపాదనను ఆర్థిక శాఖ పక్కనబెట్టడం ఇబ్బందిగా మారిందని అధికారులు స్పష్టంచేశారు. -
ఆర్థిక సంక్షోభంలో ‘గ్రేటర్’
* అత్యవసర రోడ్ల మరమ్మతులకు నిధుల కొరత * రూ. 300 కోట్లకు పైగా బకాయిలున్న రాష్ట్ర ప్రభుత్వం * తక్షణమే చెల్లించాలని జీహెచ్ఎంసీ అభ్యర్థన సాక్షి, హైదరాబాద్: మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భారీ వర్షాలతో ఛిద్రంగా మారిన నగర రహదారులకు అత్యవసర మరమ్మతులు చేపట్టేందుకు దగ్గర నిధులు లేకుండా పోయాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో నగర రోడ్లన్నీ నరకప్రాయంగా మారడంతో సంస్థ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. యుద్ధప్రాతిపదికన రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు సంస్థ చేస్తున్న ప్రయత్నాలకు నిధుల కొరత అడ్డంకిగా మారింది. కొద్దో గొప్పో ఉన్న నిధులను మరమ్మతు పనులకు ఖర్చు చేసేస్తే, వచ్చే నెలలో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేమని సంస్థ అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వివిధ గ్రాంట్ల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని జీహెచ్ఎంసీ యాజమాన్యం తాజాగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నట్లు తెలిసింది. వాస్తవానికి 2014-15లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీకి రూ.450 కోట్ల గ్రాంట్లు విడుదల కాగా 2015-16, ఆ తర్వాత కేవలం రూ.40 కోట్లే విడుదలయ్యాయి. వృత్తి పన్ను, వినోద పన్నులు, స్టాంపు డ్యూటీల్లో సంస్థ వాటాలు, 13వ ఆర్థిక సంఘం, 14వ ఆర్థిక సంఘం నిధుల బకాయిలు, రోడ్ ట్యాక్స్ వాటాల రూపంలో రూ.300 కోట్లకు పైగా నిధులను రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీకి చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. నష్టాల్లో ఉన్న టీఎస్ఆర్టీసీని గట్టెక్కించేందుకు గతేడాది జీహెచ్ఎంసీ ఆదాయం నుంచి రూ.365 కోట్లను కేటాయించడంతో.. ప్రస్తుతం సంస్థ మరింత ఆర్థిక చిక్కుల్లో చిక్కుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బకాయిల గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి సైతం మాట్లాడినట్లు తెలిసింది. దీంతో శుక్రవారం సాయంత్రం లోగా జీహెచ్ఎంసీకి రూ.150 కోట్ల బకాయిలను విడుదల చేసేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ హామీ ఇచ్చినట్లు తెలిసింది. -
పంచాయతీరాజ్‌కు నిధుల్లో కోత!
బడ్జెట్లో రూ. 4,686.16 కోట్ల కేటాయింపులతో సరి ⇒ ఈ శాఖకు గతేడాది కేటాయింపులు రూ. 6,927.48 కోట్లు ⇒ గ్రామీణాభివృద్ధిశాఖకు స్వల్పంగా పెరిగిన నిధులు ⇒ గత బడ్జెట్లో రూ. 6,256.68 కోట్లు కేటాయించగా ఈసారి ⇒ రూ. 6,344.55 కోట్ల కేటాయింపు ⇒ మిషన్ భగీరథకు కేటాయింపులు శూన్యం సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి వ్యవస్థల బలోపేతానికి అత్యంత ప్రాధాన్యమిస్తామన్న ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో ఆ మేరకు కేటాయింపులు మాత్రం చేయలేదు. 2015-16 ఆర్థిక బడ్జెట్లో వివిధ పథకాల కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలకు రూ.13,184 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్లో కేవలం రూ. 11,031 కోట్లతో సరిపెట్టింది. ఇందులోనూ తగ్గింపు వసూళ్లు రూ. 300 కోట్లు చూపి నికర కేటాయింపులను రూ. 10,731 కోట్లుగా పేర్కొన్నారు. ఆసరా పథకం మినహా మిషన్ భగీరథ, గ్రామీణ రహదారుల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. కేటాయింపుల మొత్తంలో పంచాయతీరాజ్‌కు గతేడాదికన్నా నిధులను బాగా తగ్గించగా గ్రామీణాభివృద్ధికి మాత్రం స్వల్పంగా కేటాయింపులు పెంచారు. అయితే పెరిగిన కేటాయింపులు కూడా కేంద్రం నుంచి వచ్చే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులకు సంబంధించినవే కావడం గమనార్హం. పంచాయతీరాజ్ విభాగానికి గతేడాది మొత్తం రూ. 6,927.48 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్లో రూ. 4,686.16 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక గ్రామీణాభివృద్ధి విభాగానికి గత బడ్జెట్లో రూ. 6,256.68 కోట్లు కేటాయించగా ఈ ఏడాది కేటాయింపులను స్వల్పంగా పెంచుతూ రూ. 6,344.55 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్ విభాగానికి కేటాయించిన నిధుల్లో రూ. 2,102.96 కోట్లను ప్రణాళికేతర వ్యయంగానూ రూ. 2,583.20 కోట్లు ప్రణాళికా వ్యయంగానూ చూపారు. గ్రామీణాభివృద్ధిశాఖకు ప్రణాళికా వ్యయం కింద రూ. 6,336.30 కోట్లు చూపగా, ప్రణాళికేతర వ్యయం కింద రూ. 8.25 కోట్లను మాత్రమే చూపారు. పంచాయతీరాజ్‌కు కేటాయింపులు ఇలా.. పంచాయతీరాజ్ విభాగంలో ముఖ్య కేటాయింపులను పరిశీలిస్తే సచివాలయశాఖ ఆర్థిక సేవలకు రూ. 3.50 కోట్లు, జిల్లా పరిషత్‌లకు ఆర్థిక సాయంగా రూ. 58.65 కోట్లు, మండల పరిషత్‌లకు రూ. 240.08 కోట్లు, గ్రామ పంచాయతీలకు రూ. 819.50 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్ సంస్థలకు నష్టపరిహారం, ఇతర కేటాయింపుల కింద మొత్తం రూ. 1,468.56 కోట్లు కేటాయించారు. ప్రణాళిక కింద ఇతర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు మరో రూ. 94.02 కోట్లు, ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాల నిమిత్తం రూ. 45.16 కోట్లు, గ్రామ పంచాయతీల బలోపేతానికి రూ. 45.16 కోట్లు, ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద రూ. 45.16 కోట్లు కేటాయించారు. ఆస్తుల రూపకల్పన, ఉపాధి హామీ పనుల అప్‌గ్రెడేషన్ కోసం మొత్తం రూ. 1,078 కోట్లు కేటాయించారు. మండల పరిషత్ భవనాల కోసం రూ. 45 కోట్లు, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద కేంద్రం నుంచి రూ. 407 కోట్లు రావచ్చని చూపారు. గ్రామీణ నీటిసరఫరా విభాగానికి రూ. 164 కోట్లు కేటాయించారు. నిర్మల భారత్ అభియాన్, ఎన్ఆర్డీడబ్ల్యూఎంపీ ప్రోగ్రామ్‌ల కింద కేంద్రం నుంచి మరో రూ. 1,040 కోట్లు వస్తాయని బడ్జెట్ కేటాయింపుల్లో చూపారు. గ్రామీణాభివృద్ధికి ఇలా.. గ్రామీణాభివృద్ధిశాఖకు బడ్జెట్లో ప్రణాళికా వ్యయం కింద మొత్తం రూ. 6,344.55 కోట్లు చూపగా ఇందులో వివిధ సామాజిక భద్రతా పింఛన్ల కోసం రూ. 3,260 కోట్లు కే టాయించారు. ఈ శాఖ పరిధిలో చేపట్టనున్న ఇతర ప్రత్యేక కార్యక్రమాలకు రూ. 2,712.55 కోట్లు, ఇతర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు రూ. 3.74 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. వడ్డీలేని రుణాలకు గతేడాదికన్నా కేటాయింపులు పెంచారు. గతంలో రూ. 84.61 కోట్లు కేటాయించగా తాజాగా రూ. 148.43 కోట్లకు పెంచారు. స్త్రీ నిధి బ్యాంకుకు ప్రత్యేక గ్రాంటును రూ. 11 కోట్లకు పెంచారు. గ్రామీణ జీవనోపాధికి రూ. 57.36 కోట్లు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు రూ. 133 కోట్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 2,450 కోట్లు, ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ ప్రోగ్రామ్‌కు రూ. 84 కోట్లు కేటాయించారు. ప్రణాళికేతర వ్యయం కింద గతేడాది రూ. 11.81 కోట్లు కేటాయించగా ఈ ఏడాది దాన్ని రూ. 8.24 కోట్లకు కుదించారు. ఇందులో ప్రత్యేక కార్యక్రమాలకు రూ. 2.16 కోట్లు, టీసీపార్డ్కు గతేడాది రూ. 7.96 కోట్లు కేటాయించగా ఈ ఏడాది కేవలం రూ. 4.85 కోట్లకు కుదించారు. ‘మిషన్ భగీరథ’కు అప్పులే ఆధారం! ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి వివిధ ఆర్థిక సంస్థలిచ్చే అప్పులే ఆధారం కానున్నాయి. గతేడాది ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం బడ్జెట్లో రూ. 4 వేల కోట్లు కేటాయించగా ఈ ఏడాది బడ్జెట్లో నిధుల కేటాయింపు ఊసేలేదు. బడ్జెట్ ప్రసంగంలోనూ మిషన్ భగీరథకు హడ్కో, నాబార్డు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ మొదలైన సంస్థల నుంచి ఆర్థిక వనరులను సమకూర్చుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. సుమారు రూ. 40 వేల కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును వచ్చే మూడేళ ్లలో పూర్తి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ఈటల చెప్పారు. 2016 చివరికి 6,100 గ్రామాలు, 12 పట్టణాలకు సురక్షిత తాగునీరందిస్తామని సర్కారు ప్రకటించింది. గ్రామజ్యోతికి నిధులు కరువు ప్రభుత్వం గత ఆగస్టులో ప్రారంభించిన గ్రామజ్యోతికి ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించలేదు. మన ఊరు-మన ప్రణాళికలో ప్రజల సూచనల ప్రకారం గ్రామాభివృద్ధి ప్రణాళికలను తయారు చేయడమే గ్రామజ్యోతి ముఖ్య ఉద్దేశమని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. -
ఐటీ శాఖకు అంతంతే!
సాక్షి, హైదరాబాద్: ఐటీ శాఖకు ఈసారి బడ్జెట్లో తగిన ప్రాధాన్యత దక్కలేదు. నిధుల కేటాయింపు అంతంతే ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించాల్సిన ఐటీ శాఖకు అవసరమైన మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదని నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఐటీ శాఖకు గతేడాది కన్నా తాజా బడ్జెట్లో కేటాయింపులు కాస్త పెరిగినా, హైదరాబాద్‌పై ఐటీ మార్క్‌ను ప్రతిబింబింపజేసే విధంగా లేవని చెబుతున్నారు. గత సంవత్సరం రూ.134 కోట్లు కేటాయించగా, ఈసారి రూ. 254 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ఉన్న దాదాపు 1,300 సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా సుమారు రూ.70 వేల కోట్ల ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయి. ఐటీ దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన టి-హబ్ సత్ఫలితాలను ఇవ్వడంతో రెండోదశ నిర్మాణం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రతి ఒక్కరినీ డిజిటల్ అక్షరాస్యులుగా చే సేందుకు డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అయితే.. నిధుల కొరత కారణంగా ఆయా కార్యక్రమాలన్నీ నత్తనడకన సాగుతున్నాయి. ఇక రాజధాని నగరం హైదరాబాద్ రూపురేఖలను సమూలంగా మార్చే ఐటీఐఆర్ ప్రాజెక్ట్ గురించి బడ్జెట్లో కనీసం ప్రస్తావించలేదు. -
హైదరాబాద్‌లో స్పార్క్ 10 స్టార్టప్ యాక్సిలేటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘కొత్త కంపెనీలంటేనే (స్టార్టప్స్) మంచి ఆలోచనలకు, ఆవిష్కరణలకు వేదికలు. సమస్యల్లా ఆచరణకు అవసరమైన మార్గదర్శకత్వం, నిధుల కొరత’’ ఇదీ స్పార్క్ 10 లీడ్ ఫౌండర్ అటల్ మాలవీయ మాట. దీనికి తగిన పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతోనే హైదరాబాద్ వేదికగా ‘స్పార్క్ 10’ స్టార్టప్ యాక్సిలేటర్‌ను ప్రారంభించామని తెలియజేశారాయన. స్పార్క్ 10 వ్యవస్థాపకులు సుబ్బరాజు, విజయ్ కేతన్, ఎల్ఎన్ పర్మి, డాక్టర్ సురేష్ కామిరెడ్డి, రాజేష్ తదితరులతో కలిసి సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. స్టార్టప్స్ హబ్‌గా పేరొందిన బెంగళూరును కాదని హైదరాబాద్‌లో ఈ యాక్సిలరేటర్‌ను ప్రారంభించడానికి ప్రధాన కారణం.. స్పార్క్ 10 ఫౌండర్స్‌లో చాలా మంది ఇక్కడి వారే కావటం ఒకెత్తయితే... ఇక్కడి స్టార్టప్స్‌కు కాసింత ప్రోత్సాహం, ఆఫీసు స్థలం కల్పిస్తే ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు వస్తుందని తమ పరిశోధనలో తేలిందన్నారు. అందుకే భాగ్యనగరాన్ని ఎంచుకున్నామన్నారు. అసలు స్పార్క్ 10 ఏం చేస్తుందని అడిగిన ప్రశ్నకు... ‘‘భవిష్యత్తు అవసరాలను తీర్చే 10 స్టార్టప్స్‌ను ఎంపిక చేస్తారు. అవసరాన్ని బట్టి ఒక్కో స్టార్టప్స్‌లో రూ.20 లక్షలు పెట్టుబడులు పెడతారు. 13 వారాల పాటు ప్రపంచ స్థాయి మెంటార్స్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలుంటాయి. మరి స్పార్క్ 10కి ఏం లాభమంటే.. నిధుల సమీకరణ అయ్యాక.. కంపెనీ ఒక స్థాయికొచ్చాక.. ఆ స్టార్టప్స్‌లో కొంత వాటా తీసుకుంటాం. అది సుమారు 8% వరకూ ఉండొచ్చు’’ అని అటల్ వివరించారు. స్టార్టప్స్‌లకు ఆఫీసు ఏర్పాటుకు గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఈఎస్సీఐ)లో రెండున్నర ఎకరాల్లో క్యాంపస్‌ను ప్రారంభించామన్నారు. తొలి విడతగా 4,000 చ.అ. కార్యాలయ స్థలాన్ని అందుబాటులో ఉంచామన్నారు. దరఖాస్తు విధానాన్ని వచ్చే ఏడాది జనవరి చివరి నుంచి ప్రారంభిస్తామన్నారు. మెంటార్స్‌గా యూరోపియన్ స్టార్టప్స్‌కు గాడ్ ఫాదర్‌గా పేరొందిన జాన్ బ్రాడ్ఫోర్డ్తో ఈగ్నైట్ సీఈఓ పాల్ స్మిత్, హెచ్‌బీసీ మాజీ వైస్ ప్రెసిడెంట్ విజయ్ కేతన్ మిత్రా.. సుమారు 500 మంది ఉంటారన్నారు. అలాగే 25-30 మంది పెట్టుబడిదారులు కూడా ఈ యాక్సిలరేటర్‌లో రిజిస్టరై ఉన్నారన్నారు. రెండేళ్లలో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడులు లక్ష్యమని మాలవీయ తెలియజేశారు. -
కల్యాణలక్ష్మికి నిధుల వరద
ఇందూరు : కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిధుల కొరతతో అబాసుపాలు కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పేద దళిత, గిరిజన యువతుల పెళ్లిళ్లకు ఆపన్న హస్తంగా మారిన ఈ రెండు పథకాలకు నిధులను పుష్కలంగా కేటాయించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం మార్చినెలతో ముగిసి పోవడంతో, ఆ తరువాత దరఖాస్తుచేసుకున్న లబ్ధిదారులకు 2015-16 ఆర్థిక సం వత్సరంలో నిధుల వరదను పారించింది. సాంఘిక, మైనారిటీ సంక్షేమ శాఖలకు రూ. ఐదు కోట్ల చొప్పున మంజూరు చేసి వెయ్యి మంది చొప్పున లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ మేరకు మూడు రోజుల క్రితం ఉత్తర్వులు విడుదల చేసింది. అధికారుల హడావుడి 2015-16 సంవత్సరానికి సంబంధించిన కొత్త బడ్జెట్ రావడానికి కాస్త ఆలస్యం కావడంతో లబ్ధిదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. సకాలంలో నిధులు అందకుండానే పెళ్లిళ్లు చేసుకున్నారు. మరి కొందరు పెళ్లి తేదీ దగ్గర పడటంతో నిధుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం నిధులు రావడంతో వందల సంఖ్యలో ఉన్న లబ్దిదారుల ఖాతాలలో ట్రెజరీ నుంచి బ్యాంకు ద్వారా నిధులు వేసేందుకు అధికారులు హడావుడి చేస్తున్నారు. అర్హులను గుర్తించేందుకు తర్జనభర్జన పడు తున్నారు. వచ్చిన దరఖాస్తులను వెంట వెంటనే పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. రెండు మూ డు రోజులలో బ్యాంకు ఖాతాల్లో నిధులు వేస్తామని లబ్ధిదారులకు సర్ది చెబుతున్నారు. మొత్తానికి ఈసారి నూతన వధువులకు మేలు జరిగినట్టే. గిరిజన సంక్షేమ శాఖకు తక్కువ నిధులు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకం కింద ఎస్సీ సంక్షేమ శాఖకు రూ. ఐదు కోట్లు, షాదీ ముబారక్ పథకం కింద మైనార్టీ సంక్షేమ శాఖకు రూ.ఐదు కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖకు పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వలేదు. ప్రస్తుతానికి రూ.75 లక్షలను మాత్రమే విడుదల చేసిం ది. విడుతలవారీగా నిధులు వస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు. -
పంచాయతీలకు ప్రభుత్వం షాక్..!
ఆదోని రూరల్: నిధుల కొరతతో నీరసిస్తున్న గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం షాక్‌నిచ్చింది. సమగ్ర మంచినీటి పథకాలు(సీపీడబ్ల్యూఎస్) నిర్వహణ నుంచి సర్కార్ తప్పుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి మూడు రోజుల క్రితం ఉత్తర్వులు వెలుబడ్డాయి. గతంలో ఈ పథకాల నిర్వహణ బాధ్యత ప్రభుత్వమే చూసేది. ప్రతి ఏడాది వీటి నిర్వహణ కోసం టెండర్లను పిలిచి తక్కువ ధర కోట్ చేసిన వారికి నిర్వహణ బాధ్యతను అప్పగించేవారు. అయితే ఈ ఏడాది కొత్తగా ఏర్పాటైన తెలుగుదేశం ప్రభుత్వం వీటి నిర్వహణ బాధ్యతను పంచాయతీలపై మోపింది. జిల్లాలో 889 పంచాయతీలుండగా వీటిలో 405 గ్రామాలు సీపీడబ్ల్యూఎస్ కింద నీటి సౌకర్యాన్ని పొందుతున్నాయి. ఈ ఏడాది 13వ ఆర్థిక సంఘం ద్వారా జిల్లాకు రూ.19.70 కోట్ల నిధుల మంజూరయ్యాయి. ఇందులో 40 శాతం నిధులు సీపీడబ్ల్యూఎస్‌ల నిర్వహణకు కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో 405 గ్రామాలకు సంబంధించి రూ.4 కోట్ల నిధులు బదలాయింపు కానున్నాయి. గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతుల కోసం 13వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించారు. వీటిలో కోత విధిస్తే గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు కూడా చేసుకునేందుకు అవకాశం లేకుండా పోతుందని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదోని మండల పరిధిలోని 25 గ్రామాలకు 13వ ఆర్థిక సంఘం నిధుల్లో కోత పడుతుంది. డణాపురం, నాగనాథన హళ్లి, నారాయణపురం, విరుపాపురం, మండిగిరి, కుప్పగల్, పాండవగల్, పెద్దతుంబళం, తదితరుల గ్రామాలకు సంబంధించి రూ.20,33, 777 నిధులు సీపీడబ్ల్యూఎస్‌ల నిర్వహణకు కేటాయించాల్సి ఉంది. -
ఆర్వీఎంకు ఊరట
- రూ.192.69 కోట్ల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సుముఖత - పెండింగ్ పనుల పూర్తి, కొత్త కార్యక్రమాలు చేపట్టనున్న యంత్రాంగం సాక్షి, రంగారెడ్డి జిల్లా: నిధుల కొరతతో సతమతమవుతున్న రాజీవ్ విద్యామిషన్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఊరట కలిగింది. ఆ శాఖ రూపొందించిన వార్షిక ప్రణాళికకు కొంత మెరుగులు దిద్దిన కేంద్రం ప్రభుత్వం.. నిధుల మంజూరుకు అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా జిల్లా రాజీవ్ విద్యామిషన్‌కు 2014-15 వార్షిక సంవత్సరంలో రూ.192.69 కోట్ల బడ్జెట్ విడుదల కానుంది. దీంతో గతంలో పెండింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు కొత్తగా పలు కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక కొత్త కార్యక్రమాలు... రాజీవ్ విద్యామిషన్ నిధుల విడుదలలో గత ఏడాది కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన పాత నిధులను ఖర్చు చేస్తేనే కొత్తగా బడ్జెట్ ఇస్తామని స్పష్టం చేయడంతో 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆర్వీఎం నిధులకు భారీగా కోత పడింది. ఫలితంగా గతేడాది కేవలం రూ.124.54 కోట్లు విడుదల కాగా.. ఇందులో రూ.80కోట్లు ఉద్యోగుల వేతనాలకే ఖర్చు చేశారు. తాజాగా బడ్జెట్ పరిమితి పెరిగింది. ఈ ఏడాది రూ.192.69 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేయడంతో.. అధికారులు కొత్త కార్యక్రమాల కోసం ప్రణాళికలు తయారు చేస్తున్నారు. మరోవైపు నిర్మాణ పనులకు సైతం నిధులు సంతృప్తికరంగా రావడంతో పల్లె బడులకు అదనపు గదులు నిర్మించేందుకు ఆర్వీఎం అధికారులు చర్యలకు ఉపక్రమించారు. పనితీరులో వెనకబడితే నిధుల్లో కోత.. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఆర్వీఎంకు నిధుల విడుదల మెరుగుపడినప్పటికీ.. పనితీరును బట్టి నిధులు విడుదల కానున్నాయి. ప్రతి త్రైమాసికానికి సంబంధించి ఆర్వీఎం లక్ష్యాలు, సాధించిన పురోగతి ఆధారంగా తదుపరి త్రైమాసికానికి నిధులు విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పనితీరులో వెనకబడితే నిధుల విడుదలలో కోతపెట్టనుంది. దీంతో ఆర్వీఎం అధికారుల్లో గుబులు మొదలైంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు నెలలు ఎన్నికల హడావుడిలో కొన్ని కార్యక్రమాలు వెనకబడ్డాయి.అయితే తొలి త్రైమాసికానికి సంబంధించి నిధులు విడుదల చేయకుండా నిల్వ ఉన్న నిధులను వినియోగించుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. అయితే జిల్లా ఆర్వీఎంలో అంతంతమాత్రంగా నిధులుండగా.. ప్రస్తుత నిధులు వినియోగించుకుని ఉద్యోగులకు వేతనాలు అందించారు. ఇందుకు సంబంధించి నివేదికను కేంద్రానికి పంపితే.. రెండో త్రైమాసికానికి సంబంధించిన నిధులు విడుదల కానున్నాయి. కొత్త ప్రణాళికలో ముఖ్యాంశాలివీ.. - 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లా ఆర్వీఎంకు రూ.192.69కోట్ల బడ్జెట్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. - ఈ ఏడాది విద్యార్థుల యూనిఫాం, పుస్తకాలకు రూ.11 కోట్లు ఖర్చు చేయనున్నారు. - ఉపాధ్యాయులు, కాంట్రాక్టు సిబ్బంది వేతనాల కోసం రూ.80.55 కోట్లు ఖర్చు చేయనున్నారు. - పాఠశాల గ్రాంట్లు, టీచర్ల గ్రాంట్లతో పాటు శిక్షణల కోసం రూ.10 కోట్లు వెచ్చించనున్నారు. - పాఠశాల్లో మౌలికవసతుల కల్పనకు రూ.55కోట్లు ఖర్చు పెట్టనున్నారు. -
సర్పంచ్‌లకు అప్పుల తిప్పలు
యాచారం, న్యూస్‌లైన్: మండలంలోని 20 గ్రామాల్లో ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చడానికి వందకు పైగా బోరుబావులున్నాయి. రెండు నెలల క్రితం 90 శాతం బోరుబావులు ఎండిపోగా, ఇటీవల కురిసిన వర్షాలతో ప్రస్తుతం బోరుబావుల్లో పుష్కలంగా భూగర్భజలాలు పెరిగాయి. కృష్ణాజలాలు వారం రోజులకు ఒకసారి సరఫరా అవుతుండడంతో అవసరాల కోసం బోరు బావులపై ఆధారపడక తప్పని పరిస్థితి. అయితే, లో ఓల్టేజీ సమస్య, బోరుబావుల్లో ఇసుక చేరడం, ఆన్ ఆఫ్ సౌకర్యాం లేకపోవడంతో మోటార్లు తరుచూ కాలిపోతున్నాయి. సర్పంచ్‌లుగా గెలిచినప్పటి నుంచి అత్యధికంగా బోరుమోటార్ల మరమ్మతుల కోసం ఖర్చు చేయడం విశేషం. ప్రతి గ్రామంలో ఐదుకు పైగా బోరుబావులు ఉన్నాయి. వారానికి ఒక మోటారు కాలిపోతుండడంతో నెలకు రూ.10వేల నుంచి రూ.20 వేల వరకు మరమ్మతుల కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. యాచారం, గునుగల్, మాల్, నందివనపర్తి గ్రామాలు మినహా మిగితా గ్రామాల్లో పెద్దగా ఆదాయవనరులు లేవు. అయినా మరమ్మతులు చేయించకుంటే నీళ్లున్నా సరఫరా చేయడం లేదని ప్రజలు మండిపడే అవకాశముందనే భయంతో అప్పులు చేయక తప్పడం లేదు. గెలిచిన నాటి నుంచి నాలుగు నెలల కాలంలో ప్రతి గ్రామంలో రూ. 50 వేలకు పైగా మోటార్ల మరమ్మతులకు ఖర్చు చేసిన దాఖలాలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో పంచాయతీల్లో నిధులు లేక కాలిపోయిన మోటార్లు మోకానిక్ దుకాణాల్లోనే మూలుగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో మాయమైన మోటార్లు... మరమ్మతులు చేయిస్తున్నప్పటికీ నేటికీ కొన్ని గ్రామాల్లో ఎన్ని మోటార్లు ఉన్నాయనే విషయం రికార్డుల పరంగా సర్పంచ్‌లకు తెలియడం లేదు. కొన్నేళ్లుగా 20 గ్రామాల్లో బోరుమోటార్ల కోసం రూ.లక్షలు ఖర్చు చేసినప్పటికీ కొనుగోలు చేసిన మోటార్ల లెక్క మాత్రం కనిపించడం లేదు. గునుగల్, నక్కర్తమేడిపల్లి, మాల్, యాచారం, నందివనపర్తి, మంతన్‌గౌరెల్లి గ్రామాల్లో కొన్నేళ్లుగా కొనుగోలు చేసిన మోటార్ల వివరాల రికార్డులు అసలే లేవు. గెలిచిన సర్పంచ్‌లు మోటార్ల లెక్క చూపించాలని అధికారులను కోరినా ఫలితం లేకుండా పోయింది. కొన్ని గ్రామాల్లో బోరుబావుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ మోటార్లు లేక నిరుపయోగంగా మారాయి. సరిపడా కృష్ణాజలాలైనా సరఫరా చేయండి.. లేదంటే మోటార్ల మరమ్మతులు నిధులైనా ఇప్పించాలని సర్పం చ్‌లు పదేపదే కోరినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని వారు కోరుతున్నారు. రూ. 50 వేలు ఖర్చు చేశా... సర్పంచ్‌గా గెలిచిన నాటి నుంచి ఇప్పటివరకూ బోరుమోటార్ల మరమ్మతుల కోసం రూ.50 వేలకు పైగా ఖర్చు చేశా. వారానికి ఒక మోటార్ కాలిపోతోంది. మరమ్మతులకే ప్రతీసారి రూ.4వేలకు పైగా ఖర్చవుతోంది. అయినా ప్రజల నుంచి విమర్శలు తప్పడం లేదు. - నర్సయ్య, సర్పంచ్, మంతన్‌గౌరెల్లి నిధులు మంజూరు చేయాలి... బోరుమోటార్ల మరమ్మతుల కోసం నాలుగు నెలల్లో రూ. 60 వేలకు పైగా ఖర్చు చేశా. స్టార్టర్లు కూడా తరుచూ కాలిపోతున్నాయి. రెండు రోజులకోసారి కృష్ణాజలాలు సరఫరా చేసేలా కృషి చేయాలి. లేదంటే మరమ్మతుల కోసం పంచాయతీలకు అవసరమైన నిధులు మంజూరు చేయాలి. అప్పులు చేసి మరమ్మతులు చేయించాల్సిన పరిస్థితి ఉంది. -పాశ్ఛ భాష, సర్పంచ్, నక్కర్తమేడిపల్లి నిలదీతలు తప్పడం లేదు.. మోటార్ల కోసం అవసరమైన నిధులు మంజూరు చేయడం లేదు. కనీసం కృష్ణాజలాలు సరిగా సరఫరా చేయడం లేదు. నీళ్లు పుష్కలంగా ఉన్నా ప్రజలు నీటిఎద్దడిని ఎదుర్కోక తప్పడం లేదు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదు. నిత్యం ప్రజల నుంచి నిలదీతలు తప్పడం లేదు. - బొక్క నారాయణరెడ్డి, సర్పంచ్, తాడిపర్తి