ఆదోని రూరల్: నిధుల కొరతతో నీరసిస్తున్న గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం షాక్‌నిచ్చింది. సమగ్ర మంచినీటి పథకాలు(సీపీడబ్ల్యూఎస్) నిర్వహణ నుంచి సర్కార్ తప్పుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి మూడు రోజుల క్రితం ఉత్తర్వులు వెలుబడ్డాయి. గతంలో ఈ పథకాల నిర్వహణ బాధ్యత ప్రభుత్వమే చూసేది. ప్రతి ఏడాది వీటి నిర్వహణ కోసం టెండర్లను పిలిచి తక్కువ ధర కోట్ చేసిన వారికి నిర్వహణ బాధ్యతను అప్పగించేవారు. అయితే ఈ ఏడాది కొత్తగా ఏర్పాటైన తెలుగుదేశం ప్రభుత్వం వీటి నిర్వహణ బాధ్యతను పంచాయతీలపై మోపింది.
జిల్లాలో 889 పంచాయతీలుండగా వీటిలో 405 గ్రామాలు సీపీడబ్ల్యూఎస్ కింద నీటి సౌకర్యాన్ని పొందుతున్నాయి. ఈ ఏడాది 13వ ఆర్థిక సంఘం ద్వారా జిల్లాకు రూ.19.70 కోట్ల నిధుల మంజూరయ్యాయి. ఇందులో 40 శాతం నిధులు సీపీడబ్ల్యూఎస్‌ల నిర్వహణకు కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో 405 గ్రామాలకు సంబంధించి రూ.4 కోట్ల నిధులు బదలాయింపు కానున్నాయి. గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతుల కోసం 13వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించారు.
వీటిలో కోత విధిస్తే గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు కూడా చేసుకునేందుకు అవకాశం లేకుండా పోతుందని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదోని మండల పరిధిలోని 25 గ్రామాలకు 13వ ఆర్థిక సంఘం నిధుల్లో కోత పడుతుంది. డణాపురం, నాగనాథన హళ్లి, నారాయణపురం, విరుపాపురం, మండిగిరి, కుప్పగల్, పాండవగల్, పెద్దతుంబళం, తదితరుల గ్రామాలకు సంబంధించి రూ.20,33, 777 నిధులు సీపీడబ్ల్యూఎస్‌ల నిర్వహణకు కేటాయించాల్సి ఉంది.
పంచాయతీలకు ప్రభుత్వం షాక్..!
Published Wed, Jul 2 2014 4:53 AM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM
Advertisement