Gram Panchayat
-
Telangana: జీపీ లేఔట్లన్నీ నిషేధిత జాబితాలోకి..
ఇబ్రహీంపట్నంలోని ఆదిబట్లలో 289/పీ సర్వే నంబరులోని ఓ జీపీ లేఔట్లో శ్రీనివాస్ రెడ్డి కొన్నేళ్ల క్రితమే 250 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. కూతురు పెళ్లి సమయానికి కట్నం కింద ఉపయోగపడుతుందని భావించారు. వచ్చే నెలలో ముహూర్తాలు ఉండటంతో పెళ్లి పెట్టుకున్నారు. అల్లుడికి కానుకగా ఇద్దామనుకున్న ఓపెన్ ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేసే వీలు లేకుండాపోయింది. దీనికి కారణం ప్రభుత్వం ఆ లేఔట్‌ను నిషేధిత జాబితాలో చేర్చడమే. దీంతో శ్రీనివాస్‌రెడ్డి లబోదిబోమంటున్నాడు.సాక్షి, హైదరాబాద్: వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే గ్రామ పంచాయతీ (జీపీ) లేఔట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. కానీ, తాజాగా రేవంత్ సర్కారు జీపీ లేఔట్లను నిషేధిత జాబితాలో చేర్చింది. ఈమేరకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని అనధికార లేఔట్ల సర్వే నంబర్లను నిషేధిత జాబితా 22–ఏ (1)(ఈ) కిందకు బదలాయించింది. దీంతో భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని కొనుగోలు చేసిన ప్లాట్లను విక్రయించుకోలేక సామాన్య, మధ్యతరగతి ప్రజలు కష్టాలు పడుతున్నారు. సాధారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు పైసా పైసా కూడబెట్టుకొని ప్లాట్ కొనుగోలు చేస్తుంటారు. కూతురు పెళ్లి కోసమో, కొడుకు ఉన్నత చదువుల కోసమో అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందనుకుంటారు. నగదు అవసరమైన³్పుడు ప్లాట్ అమ్మితే సొమ్ము వస్తుందనే భరోసాతో ఉంటారు. కానీ, తాజాగా ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచింది. ఎంపిక చేసిన సర్వే నంబర్లలోని జీపీ లేఔట్లు, అందులోని ఓపెన్ ప్లాట్లను నిషేధిత జాబితాలోకి చేర్చింది. దీంతో ఆయా స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరగకుండా అడ్డుకట్ట వేశారు. ఫలితంగా స్థల యజమానులు ప్లాట్లను విక్రయించుకోలేరు. రిజిస్ట్రేషన్లు జరగకపోతే కొనుగోలుదారులెవరూ ముందుకు రారు. దీంతో భవిష్యత్తు అవసరాల కోసమని కొనుగోలు చేసిన ప్లాట్ ఎందుకూ పనికిరాకుండా మిగిలిపోయినట్టయింది.ఏ చట్టం ప్రకారం చేర్చారు?జీపీ లేఔట్లు ఉన్న సర్వే నంబర్లన్నింటినీ ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెడుతూ నిర్ణయం తీసుకుంది. పట్టా స్థలాలను నిషేధిత జాబితా 22–ఏ (1)(ఈ)లో పెట్టే అధికారం ప్రభుత్వానికి లేదు. లేఔట్లకు అనుమతి ఇచ్చే అధికారం గ్రామ పంచాయతీలకు లేదు. హెచ్ఎండీఏ, డీటీసీపీ విభాగాలు మాత్రమే లేఔట్లకు అనుమతి ఇచ్చే అధికారం ఉంది. మరి, హుడా ఏర్పడకుముందే ఈ లేఔట్లు వెలిస్తే.. డీటీసీపీ ఏం చేస్తున్నట్టు? కొత్తగా అవి జీపీ లేఔట్లని పేర్కొంటే నిషేధిత జాబితాలోకి ఏ చట్టం ప్రకారం చేర్చారు? అని డెవలపర్ల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ భూములు లేదా కోర్టు కేసుల్లో ఉన్న స్థలాలను 22–ఏ జాబితా కింద చేర్చుతారు.ఇందులో ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూములు ఇలా ఐదు వర్గాలుగా ఉంటాయి. ఈ స్థలాలను ఎవరూ ఆక్రమించకుండా, రిజిస్ట్రేషన్లు జరగకుండా ఆయా సర్వే నంబర్లను 22–ఏ కింద చేర్చుతారు. తాజాగా ప్రభుత్వం జీపీ లేఔట్లను సైతం 22–ఏ జాబితాలోకి చేర్చడం గమనార్హం. దీంతో లేఔట్, పట్టాదారు స్థలాలు కూడా ప్రభుత్వ భూముల పరిధిలోకి వస్తాయని ఓ న్యాయవాది అభిప్రాయపడ్డారు. దీంతో చాలామంది భూ యజమానులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. డాక్యుమెంట్లను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత న్యాయస్థానం ఆయా స్థలాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి, రిజిస్ట్రేషన్లు చేయాలంటూ సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసే అవకాశముంటుందన్నారు. అయితే ఇలా ఎంతమంది సామాన్యులు కోర్టును ఆశ్రయిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కాగా, జీపీ లేఔట్లను నిషేధిత జాబితాలో పెడితే వాటిని ఎల్ఆర్ఎస్ ఎలా చేస్తారని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. -
నలభై ఏళ్లుగా మద్యానికి దూరం.. కాట్రేవ్
చౌటుప్పల్ రూరల్: ఇప్పుడు ఏ పల్లెలో చూసినా బెల్ట్ షాపుల జోరుతో మద్యం ఏరులై పారుతోంది. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కాట్రేవ్ గ్రామంలో మాత్రం మద్యం జాడే కనిపించదు. గ్రామంలో నాలుగు దశాబ్దాలుగా సంపూర్ణ మద్య నిషేధం అమలవుతోంది. అప్పట్లో గ్రామ పెద్దలు నిర్ణయించిన కట్టుబాటును ఇప్పటికీ కొనసాగిస్తూ.. తమ ప్రత్యేకతను నిలుపుకొంటున్నారు కాట్రేవ్ గ్రామ ప్రజలు. రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని గ్రామాల్లోనూ కొన్నేళ్లు మద్యం విక్రయాలు, వినియోగంపై నిషేధం పెట్టుకోవడం గమనార్హం. కాట్రేవ్లో అయితే సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతోంది.గ్రామ యువత కూడా దూరమే..కాట్రేవ్ గ్రామం ఒకప్పుడు ఆరెగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. ఐదేళ్ల కింద నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. సుమారు 700కుపైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో అంతా రైతులే. రోజంతా వ్యవసాయ పనుల్లో మునిగిపోతారు. సాయంత్రానికి ఇంటికొచ్చి సేదతీరుతారే తప్ప మద్యం జోలికి వెళ్లరు. ఈ గ్రామం నుంచి బయట పట్టణాల్లో ఉద్యోగం, ఉపాధి, చదువు కోసం వెళ్లిన యవత కూడా.. ఈ గ్రామానికి ఎప్పుడూ మద్యం తీసుకురారు. ఇక్కడ వినియోగించరు. మద్య నిషేధమేకాదు.. అభివృద్ధిలోనూ కాట్రేవ్ గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. పక్కనే ఉన్న దివిస్ పరిశ్రమ అందించే ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)’ నిధులతో గ్రామంలో ప్రతి వీధిలో సీసీ రోడ్లు, ఎల్ఈడీ లైట్లు, ప్రతి ఇంటికి శుద్ధిచేసిన సురక్షిత నీరు అందించేలా ఏర్పాటు చేసుకున్నారు. పక్కనే ఉన్న ఆరెగూడెంలోనూ రెండు దశాబ్దాలుగా మద్యం విక్రయాలు లేవు.గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామస్తుల సహకారంతోనే కొనసాగిస్తున్నా..నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ గ్రామంలో మద్యపానం అలవాటు లేదు. 40 ఏళ్ల కింద పెద్దలు పెట్టుకున్న కట్టుబాటును.. గ్రామస్తుల సహకారంతో కొనసాగిస్తున్నాం. అభివృద్ధిలోనూ ముందుకెళ్తున్నాం.– బచ్చ రామకృష్ణ మాజీ సర్పంచ్, కాట్రేవ్ -
ఈ ఊరు మాది.. అందరూ ఖాళీ చేయండి!
కిషోర్‌కుమార్ పెరుమాండ్ల, మహబూబ్‌నగర్: ఆ గ్రామానికి 80 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఐదేళ్ల క్రితం గ్రామపంచాయతీగా ఆవిర్భవించింది. 200 కుటుంబాలు.. 1,000 మంది జనాభా. ఇందులో నాలుగు సామాజిక వర్గాలకు చెందిన వారు ఉండగా.. ఎక్కువగా బోయ, ఆ తర్వాత కుర్వ, ముస్లిం, గౌడ్లు ఉన్నారు. చాలావరకు వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నారు. అంతా బాగానే ఉన్న ఆ ఊరుకు ఇప్పుడు ఆపదొచ్చింది. కొందరు వ్యక్తులు గ్రామం మొత్తాన్ని ఖాళీ చేయించి, 200 కుటుంబాల్ని నిరాశ్రయుల్ని చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి రాజకీయ నాయకులు, పోలీసులు తోడుకావడంతో పల్లెవాసులు ఎప్పుడు ఇల్లు వదిలి పోవాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని చమన్‌ఖాన్‌దొడ్డి వాసుల దీనగాథపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. అనుబంధ గ్రామం నుంచి పంచాయతీగా.. చమన్‌ఖాన్‌దొడ్డి మొదట్లో మల్లంపల్లి గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉండేది. శాసనసభ, లోక్ సభ, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ గ్రామంలోని ఓటర్లు మల్లంపల్లికి వెళ్లి ఓటు వేసేవారు. ఐదేళ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసినప్పుడు చమన్‌ఖాన్‌దొడ్డి కూడా నూతన గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రస్తుతం 450 మంది ఓటర్లు ఉన్నారు. భూమి మొత్తం మాదేనంటూ.. ఇప్పుడు ఈ గ్రామానికి సంబంధించిన భూమి మొత్తం తమదేనంటూ.. ఈ ప్రాంత పూర్వీకుల వారసులుగా చెప్పుకుంటున్న ముగ్గురు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. వీరికి ఎక్స్‌పార్టీ డిక్రీ ఆర్డర్ వచ్చింది. దీంతో వారు కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, ఊరు ఖాళీ చేయమంటూ గ్రామస్తులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం మారిన పరిస్థితుల నేపథ్యంలో.. రాజకీయ నాయకులు, పోలీసులు కూడా వారికే దన్నుగా నిలవడంతో స్థానికులు లబోదిబోమంటున్నారు. మేము మూడు తరాలుగా ఇక్కడే ఉంటున్నామని, మా పెద్దలు ఇక్కడే పుట్టి, ఇక్కడే చనిపోయారని.. ఉన్న ఫళంగా ఊరు వదిలి పొమ్మంటే ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎస్పీ రితిరాజ్‌కు వినతిపత్రం అందజేశారు. మరి ప్రభుత్వం ఎలా అభివృద్ధి పనులు చేపట్టింది?! గ్రామంలో ప్రభుత్వ పంచాయతీ కార్యాలయం, ఐదో తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలున్నాయి. గ్రామంలో బ్రహ్మంగారి గుడి, కనకదాసు గుడి, దర్గా, మసీదు, పీర్లగుడి, ఆంజనేయస్వామి, శివాలయాలతో పాటు గ్రామ దేవతలైన మారెమ్మ, సుంకులమ్మ, బొడ్రాయి, సావిడి వంటి నిర్మాణాలు ఏళ్ల క్రితమే ఉన్నాయి. అదేవిధంగా గ్రామంలో అంతర్గత రహదారులు, తాగునీటి సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సౌకర్యం, వాటర్ ట్యాంకులు వంటివి కూడా ప్రభుత్వం ఎప్పుడో ఏర్పాటు చేసింది. గ్రామ కంఠానికి చెందిన భూముల్లో ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు రికార్డులు ఉండగా.. ఇప్పుడు ఎవరో వచ్చి ఈ భూమి తమదే అని ఎలా అంటారని, ఎలా ఖాళీ చేయమంటున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఊరొదిలి పొమ్మంటే ఎలా? నేను ఈ గ్రామంలోనే పుట్టా. మా తాత, ముత్తాతలు కూడా ఇక్కడే పుట్టి, ఇక్కడే చనిపోయారు. ప్రస్తుతం మా కుటుంబ సభ్యులమే 30 మంది వరకు ఉన్నాం. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. అకస్మాత్తుగా ఊరు వదిలిపొమ్మంటే ఎలా కుదురుతుంది? – భీమయ్య గ్రామకంఠం కిందే ఉంది.. గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసినప్పుడు అప్పటి తహసీల్దార్ వచ్చి మా ఊరు మొత్తం 9 ఎకరాల వరకు ఉంటుందని చెప్పారు. రెవెన్యూ రికార్డులో భూమి మొత్తం గ్రామ కంఠం కిందే ఉందన్నారు. అలాంటిది మా ఊరి ముఖం ఒక్కసారి కూడా చూడని వారు వచ్చి.. గ్రామం మొత్తం మాదే, ఖాళీ చేసి వెళ్లిపొమ్మంటున్నారు. ఇదెక్కడి న్యాయం? – ఆంజనేయులు ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతాం చమన్‌ఖాన్‌దొడ్డికి సంబంధించిన అంశం ఇప్పటివరకు నా దృష్టికి రాలేదు. దీనిపై గ్రామస్తులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. – రాంచందర్, ఆర్డీఓ, గద్వాల -
చిన్నపల్లెపై చిన్నచూపు!
ఊరిలో 108 మంది జనాభా... 69 మంది ఓటర్లు.. ప్రాథమిక పాఠశాల.. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు ఏడుగురే విద్యార్థులు.. ఒక్కరే మాస్టారు.. ఊరికి ఒకవైపు కిన్నెరసాని, మరో వైపు వాగులు.. వర్షాకాలమైతే ఊరు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. సమీపంలోని కాస్త పెద్ద ఊరికి వెళ్లాలంటే ఆరు కిలోమీటర్ల మేర గతుకులు, బురద రోడ్డు దాటాలి. ఇది దాటేందుకు కనీసంగా గంటన్నర సమయం పడుతుంది. గుండెపోటుకు గురైతే రోడ్డు దాటే లోపు మృత్యువాత పడటమే.. అసలు ఇంతవరకు అంబులెన్స్ ఆ గ్రామానికి ఒక్క సారి కూడా రాలేదంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామ పంచాయతీ ‘దొంగతోగు’ దుస్థితి ఇది. గ్రామంలో మద్యం విక్రయాలు లేకుండా అంతా ఏకతాటిపై ఉన్న ఆ ఏజెన్సీ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. మళ్లీ పంచాయతీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం దొంగతోగు గ్రామ పంచాయతీ దయనీయ స్థితిపై ‘సాక్షి’గ్రౌండ్ రిపోర్ట్.. (సాక్షిప్రతినిధి, ఖమ్మం) : పాలనా సౌలభ్యం కోసం గుండాల గ్రామ పంచాయతీలో భాగంగా ఉన్న దొంగతోగు 2018లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. కేవలం 80 మంది జనాభా, 35 మంది ఓటర్లతో రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామ పంచాయతీగా ఏర్పాటైనా నేటికీ సమస్యలు సమసిపోలేదు. తొలి పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుని ఆదర్శంగా నిలిచినా ప్రభుత్వ ప్రోత్సాహకం మాత్రం అందలేదు. వర్షం వస్తే కిన్నెరసానికి వరదతో వాగులు.. వంకలు పొంగిపొర్లడం, కనీస రహదారి సౌకర్యం లేకపోవడం వంటి సమస్యలు అక్కడ నిత్యకృత్యం. మండల కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరం గుండాల నుంచి ఇక్కడికి 18 కిలోమీటర్లు కాగా, ఆళ్లపల్లికి 40 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. వాగులు పొంగిపొర్లితే ఇక్కడికి చేరుకోవడం కష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆళ్లపల్లి మండలంలో ఈ గ్రామాన్ని కలిపినా దూరాభారంతో ఆ మండల కేంద్రం వైపు కూడా గ్రామస్తులు వెళ్లడం లేదు. పాలనా కేంద్రంగా బడి.. గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు ఏడుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఈ భవనంలోనే అంగన్వాడీ కేంద్రం కొనసాగుతోంది. గ్రామ పంచాయతీ నిర్మాణానికి ఐటీడీఏ నుంచి రూ.16 లక్షలు మంజూరైనా ఇప్పటికీ పునాది పడలేదు. దీంతో పాఠశాల భవనంలోనే పంచాయతీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలు పడితే ఈ బడికి చేరుకునేందుకు ఉన్న ఏకైక ఉపాధ్యాయుడు సాహ సం చేయాల్సిందే. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులు కూడా రాకపోవడంతో ఆ పల్లె అభివృద్ధికి నోచుకోలేదు. మిషన్ భగీరథ ట్యాంకు నిర్మించినా వరదలతో పైపులైన్లు ధ్వంసమై ఏడాదిగా గ్రామానికి తాగునీరు రావడం లేదు. ఆరు కిలోమీటర్లు.. అవస్థలు.. దొంగతోగు సమీపంలోని ముత్తాపురం నుంచి ఇక్కడికి ఆరు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించాలి. ఎందుకంటే వర్షం వస్తే పొంగే వాగులు, వంకలు, గుంతల మయంగా ఉన్న ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఆరు కిలోమీటర్ల దూరం వెళ్లాలంటే కనీసం రెండు గంటలు పడుతుంది. గ్రామం నుంచి గర్భిణులు, అస్వస్థతకు గురైన వారు వైద్యం కోసం గుండాల ఆస్పత్రికి వెళ్లాలంటే నరకం చూడాల్సిందే. రెండు నెలల క్రితం గుండె పోటుకు గురైన ఓ వ్యక్తిని ఈ దారిలో ట్రాక్టర్‌పై గుండాలకు, అక్కడి నుంచి కొత్తగూడెం తీసుకెళ్లే సరికే మృతి చెందాడు. రోడ్డు లేకపోవడంతో ఇప్పటివరకు ఒక్కసారి కూడా అంబులెన్స్ రాలేదు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నిధుల కింద ఆరు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరైనా అటవీ శాఖ అనుమతి లభించలేదు. ఇటీవల రెండు కిలోమీటర్లకు అనుమతి రాగా, పనులు ప్రారంభమయ్యాయి. మద్యం అమ్మకుండా.. గ్రామంలో 27 కుటుంబాలున్నాయి. అంతా పోడు వ్యవసాయం చేస్తుంటారు. వర్షాధారంగా వరి, మొక్కజొన్న, పత్తి, కంది పంటలు సేద్యమవుతున్నాయి. పోడు పట్టాలు రావడంతో వారి ఖాతాల్లో వానాకాలం రైతుబంధు డబ్బు పడింది. ఆదివాసీ కుటుంబాలన్నీ ఏకగ్రీవంగా సర్పంచ్‌ని ఎన్నుకున్నట్లే.. గ్రామంలో మద్యం అమ్మకూడదని ఏకగ్రీవంగా తీర్మానించారు. సర్పంచ్, నలుగురు వార్డు సభ్యులు ఉన్నారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు వస్తుండడంతో సందడి నెలకొనాల్సిన ఈ గ్రామంలో పాత కష్టాలే కళ్లముందు కనిపిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. కొత్త పంచాయతీ అయితే రోడ్డు, మంచినీటి వసతి, కొత్త పంచాయతీ భవనం వస్తాయనుకున్న వారి ఆశలు నెరవేరలేదు. గ్రామ ప్రొఫైల్ ♦ గ్రామ పంచాయతీ: దొంగతోగు (రాష్ట్రంలో అతి చిన్నది) ♦ 2018లో గుండాల పంచాయతీ నుంచి వీడి నూతన పంచాయతీగా ఏర్పాటు. ♦ తొలుత 35 మంది ఓటర్లు ♦ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల జాబితా ప్రకారం 69 మంది ఓటర్లు. ♦ మొత్తం ఓటర్లలో పురుషులు 36, స్త్రీలు 33 మంది ♦ మొత్తం జనాభా : 108 మంది ♦ పురుషులు : 44, స్త్రీలు : 64 మంది రోడ్డే ప్రధాన ఇబ్బంది.. ముత్తాపురం నుంచి రోడ్డు పడితేనే మా గ్రామ సమస్యలు తీరుతాయి. పైపులైన్లు ధ్వంసం కావడంతో ట్యాంకు నుంచి మంచినీళ్లు రావడం లేదు. పంచాయతీకి ఇచ్చిన చిన్న ట్రాక్టర్ రిపేరు వచ్చినా చేయించలేకపోతున్నాం. నిధులు లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. – కొమరం బాయమ్మ, సర్పంచ్, దొంగతోగు రోడ్డు ఉంటే ప్రాణం దక్కేది.. నా భర్త అక్టోబర్ 20న గుండెపోటుతో చనిపోయాడు. గుండె నొప్పి వస్తే బండి మీద గుండాల తీసుకెళ్లాం. అక్కడి నుంచి కొత్తగూడెం తీసుకెళ్లమన్నారు. అక్కడ వైద్యం పొందుతూ చనిపోయిండు. ఆరు కిలోమీటర్ల రోడ్డుపై గంటకు పైగా ప్రయాణించి గుండాల వేళ్లే సరికి నొప్పి ఎక్కువైంది. అదే రోడ్డు బాగుంటే త్వరగా ఆస్పత్రికెళ్తే ప్రాణాలు దక్కేవి. గర్భిణులను మొన్నటివరకు ఎడ్ల బండిపై తీసుకెళ్లారు. ఇప్పుడు ట్రాక్టర్లలో ఆస్పత్రికి తీసుకెళ్తున్నాం. –పూణె అనంతలక్ష్మి, దొంగతోగు -
ఆ మహిళలు.. పేరుకే సర్పంచులు
రాంచీ: మహిళా సాధికారత సాధనకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం మహిళల భాగస్వామ్యం అంతంతమాత్రంగానే ఉంటోంది. జార్ఖండ్‌లో చేపట్టిన సర్వేలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో మహిళలకు సగం సీట్లు కేటాయించారు. ధన్‌బాద్ జిల్లాలో 95 మంది మహిళా సర్పంచులున్నారు. తమ ఫోన్‌కాల్‌కు వీరిలో 11 మంది సర్పంచులు మాత్రమే స్వయంగా స్పందించినట్లు సర్వే నిర్వాహకులు తెలిపారు. మిగతా 84 మందిలో సర్పంచుల భర్తలో, మరుదులో, లేక ఆమె కుటుంబంలోని ముఖ్యులో ఆ ఫోన్ కాల్లకు స్పందించారు. అధికారులు ఏర్పాటు చేసిన సమావేశాలకు సైతం సర్పంచులకు బదులుగా వారి భర్తలు, ఇతర కుటుంబసభ్యులే హాజరవుతున్నట్లు కూడా ఈ సర్వేలో తేలింది. బ్లాక్, సబ్ డివిజిన్, జిల్లా స్థాయి సర్పంచుల సమావేశాలకు హాజరై వీరు తమను ఫలానా గ్రామ సర్పంచి భర్త అనో లేక ఇతర కుటుంబ సభ్యులమనో పరిచయం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇకపై అధికారులు ఏర్పాటు చేసే సమావేశాలకు మహిళా సర్పంచులు మాత్రమే హాజరు కావాలని స్పష్టం చేసింది. వారికి బదులుగా కుటుంబసభ్యులను, ఇతరులను లోపలికి రానివ్వద్దంటూ అధికారులను ఆదేశించాల్సి వచ్చింది! -
విలేజ్ పంచాయతీ ప్రెసిడెంట్: వీరమ్మాళ్ @ 89
‘సేవకు వయసుతో పని ఏమిటి?’ అంటోంది 89 సంవత్సరాల వీరమ్మాళ్. ఈ బామ్మ తమిళనాడులోని అరిట్టపట్టి గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్. రకరకాల కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే వీరమ్మాళ్ తన ఆరోగ్య రహస్యం ‘నిరంతర కష్టం’ అంటోంది... మామూలుగానైతే బామ్మల మాటల్లో ‘మా రోజుల్లో’ అనేది ఎక్కువగా వినబడుతుంది. అది ఆ వయసుకు సహజమే కావచ్చుగానీ 89 సంవత్సరాల వీరమ్మాళ్ ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది. నలుగురితో కలిసి నడుస్తుంది. వారి కష్టసుఖాల్లో భాగం అవుతుంది. వీరమ్మాళ్ విలేజ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మధురైలోని అరిట్టపట్టి గ్రామాన్ని తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర తొలి బయో డైవర్శిటీ సైట్‌గా ఎంపిక చేసింది. అరిట్టపట్టిలో పుట్టి పెరిగి అక్కడే వివాహం అయిన వీరమ్మాళ్‌కు ఆ గ్రామమే ప్రపంచం. అలా అని ‘ఊరి సరిహద్దులు దాటి బయటకు రాదు’ అనే ముద్ర ఆమెపై లేదు. ఎందుకంటే గ్రామ సంక్షేమం, అభివృద్ధి కోసం ఉన్నతాధికారులతో మాట్లాడడానికి పట్టణాలకు వెళుతూనే ఉంటుంది. ‘ఫలానా ఊళ్లో మంచిపనులు జరుగుతున్నాయి’ లాంటి మాటలు చెవిన పడినప్పుడు పనిగట్టుకొని ఆ ఊళ్లకు వెళ్లి అక్కడ అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేస్తుంటుంది. తన గ్రామంలో అలాంటి కార్యక్రమాలు అమలయ్యేలా కృషి చేస్తుంటుంది. ‘స్త్రీలకు ఆర్థిక స్వాతంత్య్రం’ అనే మాట గట్టిగా వినిపించని రోజుల్లోనే స్వయం–సహాయక బృందాలను ఏర్పాటు చేసి గ్రామంలోని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేది. రైతులకు వ్యవసాయ రుణాలు అందేలా ఆఫీసుల చుట్టూ తిరిగేది. మహిళలు గడప దాటి వీధుల్లోకి వస్తే... ‘ఇదేం చోద్యమమ్మా’ అని గుసగుసలాడుకునే కాలం అది. వీరమ్మాళ్ మాత్రం గ్రామంలోని రకరకాల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఊళ్లు తిరిగేది. ఎవరు ఎలా మాట్లాడుకున్నా పట్టించుకునేది కాదు. ఆమె దృష్టి మొత్తం సమస్యల పరిష్కారంపైనే ఉండేది. విలేజ్ ప్రెసిడెంట్‌గా వాటర్ ట్యాంకులు, వాగులు దాటడానికి వంతెనలు నిర్మించింది. జల్ జీవన్ మిషన్ కింద ఎన్నో ఇండ్లకు తాగునీరు అందేలా చేసింది. వీధిలైట్ల నుంచి వీధుల పరిశుభ్రత వరకు అన్నీ దగ్గరి నుంచి చూసుకుంటుంది. అలా అని ఊళ్లో అందరూ వీరమ్మాళ్‌కు సహకరిస్తున్నారని కాదు. ఎవరో ఒకరు ఏదో రకంగా ఆమె దారికి అడ్డుపడుతుంటారు. వారి నిరసన వెనక రాజకీయ కారణాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతూనే ఉంటుంది. అలాంటి వారికి వీరమ్మాళ్ తరపున గ్రామస్థులే సమాధానం చెబుతుంటారు. గ్రామంలో వృథాగా పడి ఉన్న భూములను వినియోగంలోకి తీసుకువచ్చే విషయంపై దృష్టి పెట్టింది వీరమ్మాళ్. ‘పనికిరాని భూమి అంటూ ఏదీ ఉండదు. మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా, వృథాగా వదిలేస్తున్నామా అనే దానిపైనే ఆ భూమి విలువ ఆధారపడి ఉంటుంది’ అంటుంది వీరమ్మాళ్. ‘వీరమ్మాళ్ అంకితభావం గురించి ఆ తరం వాళ్లే కాదు ఈ తరం వాళ్లు కూడా గొప్పగా చెబుతుంటారు. గ్రామ అభివృధ్ధికి సంబంధించి ఎంతోమందికి ఆమె స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నాడు అరిట్టపట్టి విలేజ్ ఫారెస్ట్ కమిటీ హెడ్ ఆర్’ ఉదయన్. రోజూ ఉదయం అయిదు గంటలకు నిద్ర లేచే వీరమ్మాళ్ వంటపని నుంచి ఇంటి పనుల వరకు అన్నీ తానే స్వయంగా చేసుకుంటుంది. పొలం పనులకు కూడా వెళుతుంటుంది. ‘బామ్మా... ఈ వయసులో ఇంత ఓపిక ఎక్కడిది?’ అని అడిగితే– ‘నా గ్రామం బాగు కోసం నా వంతుగా కష్టపడతాను... అని అనుకుంటే చాలు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. అదే శక్తిగా మారి ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుడు నన్ను ఈ భూమి మీది నుంచి తీసుకుపోయే లోపు గ్రామ అభివృద్ధి కోసం నేను కన్న కలలు సాకారం కావాలని కోరుకుంటున్నాను’ అంటుంది వీరమ్మాళ్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సుప్రియ సాహు అరిట్టపట్టి గ్రామానికి వచ్చి బామ్మను కలుసుకుంది. ‘వీరమ్మాళ్ బామ్మతో మాట్లాడడం, ఆమె నోటి నుంచి గ్రామ అభివృద్ధి ప్రణాళికల గురించి వినడం అద్భుతమైన అనుభవం’ అంటుంది సుప్రియ. -
18న ఎమ్మెల్యేల ఇళ్ల ఎదుట ధర్నా
సాక్షి, హైదరాబాద్: తమ డిమాండ్ల సాధనకు పది రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది సోమవారం నుంచి తీవ్రం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 18 నుంచి ఎమ్మెల్యేల ఇళ్ల ఎదుట ధర్నాలు, 19న మండల కేంద్రాల్లో రాజకీయపార్టీలు, ట్రేడ్ యూనియన్లతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ (సీఐటీయూ, ఏఐటీయూసీ, టీజీకేబీయూ, ఐఎఫ్‌టీయూలతో కూడిన) శనివారం నిర్ణయించింది. అలాగే 20న సమ్మె పరిష్కరించాలంటూ అన్ని గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేయాలని, 21న కలెక్టరేట్ల ముట్టడి చేపట్టాలని తీర్మానించింది. ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 21 తర్వాత నీరు, కరెంట్, వీధి దీపాలు సహా అన్ని అత్యవసర సేవలు నిలిపేస్తామని హెచ్చరించింది. డిమాండ్ల సాధన కోసం జేఏసీ ఈనెల 6న ప్రారంభించిన సమ్మె నేటికి పదో రోజుకు చేరనుంది. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో వివిధ కేటగిరీల్లో 50 వేల మంది పనిచేస్తున్నారు. సిబ్బందిని పర్మినెంట్ చేయడంతోపాటు పీఆర్సీలో నిర్ణయించినట్టు రూ.19 వేలు కనీస బేసిక్ పే ఇవ్వాలని, అప్పటిదాకా స్వీపర్లకు రూ.15,600, పంప్ ఆపరేటర్లు, ఎల్రక్టీషియన్లు, డ్రైవర్లు, కారోబార్, బిల్ కలెక్టర్లకు రూ.19,500 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, పది రోజులుగా సమ్మె చేస్తున్నా జేఏసీని ప్రభుత్వం చర్చలకు పిలవకపోగా సమ్మెను నీరుగార్చేందుకు పోటీ కార్మికులను నియమించే ప్రయత్నం చేస్తోందని జేఏసీ చైర్మన్ పాలడుగు భాస్కర్ ఆరోపించారు. -
అనుమతులకు అష్టకష్టాలు... ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: గ్రామాల్లో ఇంటి నిర్మాణ అనుమతులకు కష్టాలు మొదలయ్యాయి. కొత్త ఇంటి నిర్మాణం చేసుకోవాలన్నా.. పాత ఇంటిని పునర్నిర్మించుకోవాలన్నా.. అనుమతులు తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇంతకాలం గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉన్న అనుమతుల ప్రక్రియ ప్రస్తుతం టీఎస్‌బీపాస్ పరిధిలోకి వెళ్లింది. దీంతో అనుమతులు తీసుకునే విషయంలో ప్రజలకు ఎలాంటి అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. టీఎస్ బీపాస్‌లో ఇంటి నిర్మాణ అనుమతుల కోసం మీసేవా కార్యాలయంలో గాని లేదా సిటిజన్ లాగిన్‌లో గాని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విధానం ఇంకా గ్రామీణ స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. గతంలో ఈ పంచాయతీ ద్వారా అనుమతుల ప్రక్రియను సులువుగా నిర్వహించుకునేవారు. టీఎస్‌బీపాస్ వచ్చాక ఈ పంచాయతీ పోర్టల్ విధానాన్ని నిలిపివేశారు. దీంతో టీఎస్‌బీపాస్ విధివిధానాలపై అవగాహన లేక గ్రామాల్లో ఎక్కడికక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు. తద్వారా గ్రామ పంచాయతీకి ఎలాంటి ఆదాయం రాకపోవడంతోపాటు ఆయా నిర్మాణా లకు సంబంధించి ఇంటి నంబర్లు, నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా కొత్తగా నిర్మాణం చేపట్టే ఇళ్ల విషయంలో ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నా గ్రామ పంచాయతీలు నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. ముడా పరిధిలో.. ఇదిలా ఉండగా మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వెళ్లిన గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఆయా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణ అనుమతులను ఎలా తీసుకోవాలో అధికారులకు సైతం స్పష్టత లేకపోవడం గమనార్హం. ఇళ్ల నిర్మాణాలకు తీసుకోవాల్సిన అనుమతులు సైతం టీఎస్‌బీపాస్‌లో దరఖాస్తు చేయాలి. అయితే అనుమతుల ప్రక్రియ మూడు కేటగిరీలలో జరగాల్సి ఉంది. గ్రామ పంచాయతీ, ముడా, డీటీసీపీ పరిధిలో అనుమతుల ప్రక్రియ జరుగుతుంది. ఏ కేటగిరీలో ఎన్ని గజాల వరకు అనుమతులు ఇస్తారు.. అందుకు కావాల్సిన పత్రాలు ఏమేం కావాలి.. అనేదానిపై ఎవరికీ స్పష్టత లేకపోవడం గమనార్హం. కార్యదర్శుల నిస్సహాయత టీఎస్‌బీపాస్ ద్వారా గ్రామాల్లో ఇంటి నిర్మాణ, ఇతర అనుమతుల ప్రక్రియపై గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం ఇప్పటి వరకు శిక్షణ ఇవ్వకపోవడంతో నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఈ పంచాయతీ పోర్టల్‌ను ప్రభుత్వం నిలిపివేయడం, గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చే అనుమతులన్నీ టీఎస్ బీపాస్ ద్వారానే తీసుకునేలా చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఆ మేరకు పంచాయతీ కార్యదర్శులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులకు దారితీస్తోంది. మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వెళ్లిన గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ముడాలోకి వెళ్లిన గ్రామాలకు సంబంధించి అభివృద్ధి పనులు, అనుమతులు తదితర అంశాలపై పంచాయతీ కార్యదర్శులకు, సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకు అలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో మొత్తం 441 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే మహబూబ్‌నగర్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న 143 గ్రామ పంచాయతీలు మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వెళ్లాయి. ఈ–పంచాయతీ పోర్టల్‌లో ఆప్షన్లు లేకపోవడం, టీఎస్ బీపాస్‌పై అవగాహన లేకపోవడం పంచాయతీల అభివృద్ధికి శాపంగా మారుతోంది. ముడా పరిధిలోకి వెళ్లిన గ్రామాల్లో ఇప్పటివరకు ముడా ఆధ్వర్యంలో ఎలాంటి పనులు చేపట్టలేదు. ముడా ఏర్పాటై 16 నెలలు కావొస్తున్నా ఆశించిన పురోగతి కనిపించడం లేదనే ఆరోపణలున్నాయి. త్వరలో శిక్షణ ఇస్తాం ముడా పరిధిలోకి వచ్చిన గ్రామ పంచాయతీ కార్యదర్శులకు త్వరలో శిక్షణ ఇస్తాం. ఆయా గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు, రికార్డుల నిర్వహణ, అనుమతులు వంటి అశాలపై అవగాహన కల్పిస్తాం. ముడా సమావేశంలో తీసుకునే నిర్ణయాల మేరకు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది. – మజీద్, ముడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ -
ఆర్బీకేల పనితీరు బాగుంది
భీమడోలు: రైతులకు అనేక రకాల సేవలందిస్తున్న రైతు భరోసా కేంద్రాల పనితీరు బాగుందని స్వచ్ఛ భారత్ మిషన్ సంయుక్త కార్యదర్శి, జలశక్తి శాఖ డైరెక్టర్ జితేంద్ర శ్రీవాత్సవ కొనియాడారు. స్వచ్ఛాంధ్ర మిషన్ కార్యక్రమంలో పారిశుధ్య పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన ఏలూరు జిల్లా భీమడోలు, దుద్దేపూడి గ్రామ పంచాయతీలను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ జె. వెంకట మురళీతో కలిసి జితేంద్ర శ్రీవాత్సవ సందర్శించారు. ఇక్కడ అమలవుతున్న కార్యక్రమాల తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతీరును సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులపై హౌసింగ్ అధికారులను అడిగారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న సచివాలయ వ్యవస్థలోని ప్రతి విభాగం పనితీరు, అది ఏ విధంగా ఉపయోగపడుతున్నదీ వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వెల్నెస్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. తొలుత సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్, మత్స్యశాఖ సహాయకులు, ఇంజనీరింగ్ శాఖల సహాయకులు జాబ్‌చార్ట్‌తో పాటు వారు చేసే సేవలపై ఆరా తీశారు. మంచి స్పర్శ.. చెడు స్పర్శ (గుడ్ టచ్.. బ్యాడ్ టచ్) కార్యక్రమంపై నువ్వేం చేస్తావు.. అంటూ మహిళా కానిస్టేబుల్ని ప్రశ్నించగా.. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలుచేస్తోందని, తాను ఉన్నత పాఠశాలల బాలికలు, కళాశాలల్లో యువతులు, డ్వాక్రా మహిళలకు దీనిపై విస్తృత ప్రచారం చేస్తూ అవగాహన కలి్పస్తున్నానని ఆమె తెలిపింది. కియోస్క్ పనితీరుపై ఆరా.. ఆ తర్వాత రైతుభరోసా కేంద్రంలోని కియోస్క్ యంత్రాన్ని చూసిన ఆయన వీఏఏ (విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్) రూప నుంచి ఈ యంత్రం ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఆరా తీశారు. కియోస్క్ యంత్రంలో రైతులు తమకు కావాల్సిన ఎరువులను బుక్ చేసుకుంటారని, వాటి నగదును చెల్లిస్తే రైతుల చెంతకే ఎరువులు చేరుకుంటాయని ఆమె వివరించారు. రైతులకు మద్దతు రేటుకే అందుబాటులో ఉంటున్నాయని, ఈ విధానంలేని తరుణంలో రైతులు దళారుల వద్ద ఎక్కువ రేటుకు కొనుగోలు చేసుకునేవారని ఎండీ జె. వెంకటమురళి ఆయనకు వివరించారు. అక్కడే ఉన్న సర్పంచ్ పాము సునీతామాన్‌సింగ్‌ను కియోస్క్ యంత్రం రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతోందని ప్రశ్నించారు. ఆర్బీకే సేవలవల్ల రైతులు సంతృప్తికరంగా ఉన్నారని, ఈ విధానం లేనప్పుడు రైతులు సాగుకు తీవ్ర ఇబ్బందులు పడేవారని సర్పంచ్ వివరించారు. దీంతో రైతుభరోసా కేంద్రాల పనితీరు బాగుందని, రైతులకు సంతృప్తికరమైన సేవలు అందుతాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయ ప్రాంగణంలో జితేంద్ర శ్రీవాత్సవ మొక్కలు నాటారు. నూజివీడు సబ్‌కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, ఈడీ ఊరి్మళాదేవి, జెడ్పీ సీఈఓ కేవీఎస్ఆర్ రవికుమార్, డీపీఓ ఏవీ విజయలక్షి్మ, ఎంపీపీ కనమాల రామయ్య, జెడ్పీటీసీ తుమ్మగుంట భవానీరంగ, కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
Karnataka assembly election 2023: ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.కోటి
సాక్షి, బళ్లారి: కర్ణాటకలో అధికారంలోకి వస్తే ప్రతి గ్రామ పంచాయతీకి రూ.కోటి, కళ్యాణ కర్ణాటక ప్రాంతాభివృద్ధికి రూ.5,000 కోట్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. శుక్రవారం కలబురిగి జిల్లాలోని జేవర్గీ సభలో హోరు వానలోనూ రాహుల్ ప్రసంగించారు. ‘బళ్లారిలో రూ.5,000 కోట్లతో వస్త్ర పరిశ్రమను తెస్తాం. జిల్లాను ప్రపంచ జీన్స్ హబ్‌గా, జీన్స్ రాజధానిగా మారుస్తాం. 50 వేల ఉద్యోగాల భర్తీని పూర్తిచేస్తాం’ అని అన్నారు. ‘ప్రతీ పనికి కాంట్రాక్టర్ల నుంచి మంత్రులు 40 శాతం కమిషన్ గుంజారు. ఈ ప్రభుత్వ దోపిడీతో బళ్లారి ప్రజలు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు’’ అని ఆరోపించారు. తాము 150 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తంచేశారు. -
Telangana: తెలంగాణ పల్లెలకు 13 జాతీయ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయి పురస్కారాల్లో తెలంగాణ పల్లెలకు అవార్డుల పంట పండింది. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్‌కు సంబంధించి 8 పురస్కారాలతోపాటు నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్‌కు సంబంధించి 5 పురస్కారాలు సాధించి రాష్ట్రం సత్తా చాటింది. దీన్‌దయాళ్ పురస్కారాల్లో 9 కేటగిరీల్లోని 27 అవార్డులకుగాను 8 అవార్డులు సాధించి రాష్ట్రాలవారీగా అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో నాలుగు పంచాయతీలు తొలి ర్యాంకు సాధించగా మరో రెండు పంచాయతీలు రెండో ర్యాంకు, ఇంకో రెండు పంచాయతీలు మూడో స్థానంలో నిలిచాయి. అలాగే నానాజీ పురస్కారాల్లో 7 కేటగిరీలకుగాను ఐదు (వాటిలో ఒకటి ప్రథమ స్థానం) అవార్డులు లభించాయి. తెలంగాణ వివిధ కేటగిరీల్లో పురస్కారాలకు ఎంపికైన విషయాన్ని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఆర్థిక సలహాదారు డాక్టర్ బిజయకుమార్ బెహరా ఓ లేఖ ద్వారా రాష్ట్ర పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శికి తెలియజేశారు. ఈ నెల 17న ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో జరిగే ‘నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇన్సెంటివైజేషన్ ఆఫ్ పంచాయత్స్ కమ్ అవార్డ్ సెర్మనీ’లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. మార్కుల ఆధారంగా ర్యాంకులు.. ఏటా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీలకు ప్రోత్సాహకంగా అవార్డులు అందిస్తోంది. జాతీయ పంచాయతీ అవార్డుల్లో భాగంగా, ఆన్లైన్లో పంచాయతీల ద్వారా నామినేషన్లను తీసుకొని 9 అంశాల్లో (థీమ్‌లలో) ఉత్తమ గ్రామ పంచాయతీలకు మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఉత్తమ అవార్డులు ప్రకటిస్తోంది. అయితే ఈ ఏడాది నుంచి అవార్డులను 9 అంశాల్లో ఏ పంచాయతీలు ప్రగతిని సాధించాయో వాటికి మొదటి, రెండవ, మూడవ బహుమతులుగా అవార్డులు ఇస్తోంది. ఇందులో ప్రతి అంశానికి వంద మార్కులకు సూచికలను ప్రకటించింది. ఈ తొమ్మిది అంశాల్లో ప్రతి పంచాయతీ సాధించిన మార్కుల ఆధారంగా దేశంలో ఉత్తమ పంచాయతీలను ప్రకటిస్తోంది. మంత్రి ఎర్రబెల్లి, ఆయన బృందానికి అభినందనలు సీఎం కేసీఆర్ మానసపుత్రిక అయిన పల్లెప్రగతి కార్యక్రమాల అమలు వల్లే రాష్ట్రానికి ఈ ఘనత లభించిందని, తెలంగాణను అవార్డులు వరించాయని మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు ఆయన బృందాన్ని ట్విట్టర్ వేదికగా అభినందించారు. ఇందుకు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలియజేశారు. అవార్డులు రావడానికి కృషి చేసిన అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, సహకరించిన ప్రజలకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–2023 ► ఉత్తమ బ్లాక్ (మండల) పంచాయతీ: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎల్.ఎం.డి (సెకండ్ ర్యాంకు) ► ఉత్తమ జిల్లా పంచాయతీలు: ములుగు జిల్లా (సెకండ్ ర్యాంకు) ► గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ (స్పెషల్ కేటగిరీ): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కె. (థర్డ్ ర్యాంకు). ► కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయతీ పురస్కార్: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా (సెకండ్ ర్యాంకు) ► గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ (స్పెషల్ కేటగిరీ–నాన్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్–సర్టిఫికెట్): సిద్దిపేట జిల్లా మార్కూక్ ఎర్రవెల్లి (ఫస్ట్ ర్యాంకు) దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–2023 ► ఆరోగ్యవంతమైన పంచాయతీ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెంచుపల్లి మండలం గౌతంపూర్ (ఫస్ట్ ర్యాంకు) ► తాగునీరు సమృద్ధిగా ఉన్న పంచాయతీ: జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల (ఫస్ట్ ర్యాంకు) ► సామాజిక భద్రతగల పంచాయతీ: మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం కొంగట్పల్లి (ఫస్ట్ ర్యాంకు) ► స్నేహపూర్వక మహిళా పంచాయతీ: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం ఏపూరు (ఫస్ట్ ర్యాంకు) ► పేదరికరహిత, జీవనోపాధి పెంచిన పంచాయతీ: గద్వాల జిల్లా రాజోలి మండలం మందొండి గ్రామం (సెకండ్ ర్యాంకు) ► సుపరిపాలనగల పంచాయతీ: వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం చీమల్దారి (సెకండ్ ర్యాంకు) ► క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ: పెద్దపల్లి జిల్లా ఎలిగాడ్ మండలం సుల్తాన్పూర్ (థర్డ్ ర్యాంకు) ► స్వయం సమృద్ధ మౌలిక సదుపాయాలుగల పంచాయతీ: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం గంభీర్రావుపేట (థర్డ్ ర్యాంకు) చదవండి: హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. తెలంగాణలో వేడెక్కిన రాజకీయం -
దీపావళి కానుకగా ఖరీదైన గిఫ్టులు ఇచ్చిన పర్యాటక మంత్రి
బెంగళూరు: కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ తన నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన సభ్యులకు ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చి వివాదంలో చిక్కుకున్నారు. ఈ మేరకు ఆనంద్ సింగ్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ సభ్యులకు రెండు గిఫ్ట్ బాక్సులను పంపారు. ఐతే మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులకు ఇచ్చిన గిఫ్ట్ బాక్స్‌లో రూ. లక్ష రూపాయలు నగదు, 144 గ్రాముల గోల్డ్, 1 కేజీ వెండి, సిల్క్ చీర, ధోతీ, డ్రై ఫ్రూట్ బాక్స్ ఉన్నాయి. కానీ గ్రామ పంచాయతీ సభ్యులకు పంపిన గిఫ్ట్ బాక్స్‌లో తక్కువ మొత్తంలో నగదు, బంగారం తప్పించి అన్ని ఇతర వస్తువులు ఉండటం గమనార్హం. (చదవండి: ఆ తండ్రి కోరిక నెరవేరింది.. ముగ్గురు కూతుళ్లకు పోలీసు ఉద్యోగం!) -
ఎల్ఈడీ వీధిలైట్లపై వ్యతిరేకత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ వీధిదీపాలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై కొన్ని పంచాయతీల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు సంబం ధించి బలవంతంగా తీర్మానాలు చేయించేందుకు ప్రయత్నించడంపై కొన్ని గ్రామాల సర్పంచ్‌లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పంచాయతీకి అవసరమనుకుంటే తీర్మానం చేస్తుంది తప్ప.. తీర్మానాలు చేయాల్సిందిగా పంచాయతీరాజ్ కమిషనర్ కార్యా లయం ఆదేశాలివ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా తీర్మానాలు చేసేందుకు కొందరు సర్పంచ్‌లు నిరాకరిస్తున్నారు. ఎల్ఈడీ వీధిదీపాల విషయమై ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, తదితర జిల్లాల్లో సర్పంచ్ల సంఘాలు సమావేశాలు నిర్వహించినప్పుడు వ్యతిరేకత వ్యక్తమైనట్టు సమాచారం. బలవంతపు తీర్మానాలను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించాలని, ఎక్కడికక్కడ నిరసనలు, ధర్నాలు చేపట్టాలనే ఆలోచనలో సర్పంచ్‌లు ఉన్నారు. తక్కువ ఖర్చయ్యే వ్యవస్థగా మార్చేందుకు.. విద్యుత్ ఆదా చర్యల్లో భాగంగా గ్రామాల్లోని సంప్రదాయ వీధి దీపాలను విద్యుత్ తక్కువ ఖర్చయ్యే ఎల్ఈడీ వీధిదీపాల వ్యవస్థగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిద్వారా వీధి దీపాల నిర్వహణ వ్యయం తగ్గి పంచాయతీలపై భారం తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ ప్రాజెక్ట్ అమ లుకు ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీల నెలవారీ గ్రాంట్ల నుంచి ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)æ సంస్థకు బకాయిలు చెల్లించేలా తీర్మానాలు చేయాల ని సూచించింది. ఈ మేరకు ఆమోదం తెలు పుతూ పంచాయతీలు వెంటనే తీర్మానాలు చేసేలా చూడాలంటూ జిల్లా పంచాయతీ అధికారులకు (డీపీవోలు) పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది« శాఖ కమిషనర్ ఆదేశాలిచ్చారు. దీంతో డీపీవోలు తీర్మానాల కోసం సర్పంచ్‌లపై ఒత్తిడి పెంచుతున్నారు. గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేశాక సంబంధి త డీపీవోలు ఈఈఎస్ఎల్ సంస్థతో ఒప్పందాలపై సంతకాలు చేయాల్సి ఉంది. అయితే ఎల్ఈడీ దీపాల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని పంచాయతీలు వీటి ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా వీధిదీపాల నిర్వహణ బాధ్యతను తమ నుంచి తప్పించి మరొక సంస్థకు అప్పగించే ప్రయత్నాలపై సర్పంచ్‌లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఈడీ వ్యవస్థతో ఇబ్బందులు పంచాయతీల్లో ఎల్ఈడీ లైట్లు పెట్టాలంటూ రెండేళ్ల క్రితమే ఒత్తిడి తెచ్చారు. కానీ మేము ఒప్పుకోలేదు. తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో అప్పుడు వెనక్కు తగ్గారు. ఇప్పుడు మళ్లీ తీర్మానాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఈసారి కూడా మేము అంగీకరించేది లేదు. మున్సిపాలిటీలకు, పంచాయతీలకు వీధిలైట్ల నిర్వహణ, తదితరాల్లో తేడాలుంటాయి. ఎల్ఈడీల నిర్వహణ బాధ్యత అప్పగించే సంస్థ ఆఫీసులు జిల్లా కేంద్రాల్లో ఉంటాయి. ఏదైనా సమస్య తలెత్తితే సకాలంలో మరమ్మతులు చేయడం కష్టమవుతుంది. ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. – అంజనీప్రసాద్, తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు -
మండల, జిల్లా పరిషత్‌లకూ ఆర్థిక సంఘం నిధులు
సాక్షి, అమరావతి: ఐదేళ్లుగా నిధుల విడుదల నిలిచిపోవడంతో నీరసించిన మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్తులకు ఆర్థిక ఆసరా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం ఈ ఏడాది పంచాయతీరాజ్ సంస్థలకు విడుదల చేసే నిధులలో 15 శాతం మండల పరిషత్‌లకు, మరో 15 శాతం జిల్లా పరిషత్‌లకు, 70 శాతం గ్రామ పంచాయతీలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థలకు రూ.2,625 కోట్లను కేంద్రం కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 660 మండల పరిషత్‌లకు రూ.393.75 కోట్లు అందనున్నాయి. 13 జిల్లా పరిషత్‌లకు మరో రూ.393.75 కోట్లు కేటాయిస్తారు. రాష్ట్రంలోని 13,371 గ్రామ పంచాయతీలకు రూ.1,837.5 కోట్లు జనాభా ప్రాతిపదికన పంచాయతీరాజ్ శాఖ కేటాయించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 2015 నుంచి నిలిచిన నిధులు.. 2015 ఏప్రిల్ నుంచి రాష్ట్రంలోని మండల, జిల్లా పరిషత్‌లకు నిధుల కేటాయింపులు నిలిచిపోయాయి. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా వంద శాతం నిధులు గ్రామ పంచాయతీలకే కేటాయించారు. మండల, జిల్లా పరిషత్‌లకు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి నిధులు కేటాయించాలని కేంద్రం సూచించినా టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. దీంతో జడ్పీ చైర్మన్లు, మండల పరిషత్ ప్రెసిడెంట్లు అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు లేక ఉత్సవ విగ్రహాలుగా మారారనే విమర్శలున్నాయి. మరోవైపు పంచాయతీలకు నిధులు సమృద్ధిగా అందుబాటులో ఉండటంతో సర్పంచులు అధికారం చలాయించారు. అయితే 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు నిధుల కేటాయింపుపై నిర్ణయాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. ఈ నేపథ్యంలో పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు 70 : 15 : 15 నిష్పత్తిలో నిధులు కేటాయించేందుకు రాష్ట్రం అనుమతి తీసుకుంది. ఈసారి మరో మెలిక.. పంచాయతీరాజ్ సంస్థలకిచ్చే నిధులలో 50 శాతం బేసిక్ గ్రాంట్స్ రూపంలో, మిగిలిన 50 శాతం టైడ్ గ్రాంట్స్ రూపంలో విడుదల చేయనున్నట్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇటీవల కేంద్ర పంచాయతీరాజ్ శాఖ లేఖలు రాసింది. బేసిక్ గ్రాంట్ నిధులను గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఓడీఎఫ్ కార్యక్రమాల అమలుకు వ్యయం ఆధారంగా టైడ్ గ్రాంట్స్‌ను రెండు విడతల్లో విడుదల చేయనున్నట్లు కేంద్రం లేఖలో స్పష్టం చేసింది. -
వీధులకు వాళ్ల పేర్లు.. ఎందుకంటే..
ఊళ్లలో కాని, పట్టణాల్లో కాని మనం ఉంటున్న వీధి పేర్లు ఎప్పటినుంచో ఉన్నవే. పైగా కొన్నింటి వీధుల పేర్ల చరిత్ర మనకు ఎంత మాత్రమూ తెలియదు. అయితే ఇప్పుడు గుజరాత్‌లోని కచ్ జిల్లాకు చెందిన కుక్మా గ్రామ పంచాయితీ వాళ్లు తమ పరిధిలోని వీధులకు ఓ ప్రత్యేకత తీసుకువస్తున్నారు. హిమాని మార్గ్, శివానీ మార్గ్, సోనాలి మార్గ్, రుచితా మార్గ్, భూమి మార్గ్, అశ్విని మార్గ్, గుల్జార్ మార్గ్, ఉర్వి మార్గ్, శిల్పా మార్గ్, కోమల్ మార్గ్, జియా మార్గ్, పాలక్ మార్గ్, కృపా మార్గ్, ఖుషి మార్గ్, హెన్షి మార్గ్, పూజా మార్గ్.. ఇలా తమ గ్రామాలకు చెందిన 16 మంది ప్రతిభావంతులైన కూతుళ్ల పేర్లను వీధులకు పెట్టబోతున్నారు. వీళ్లంతా చదువులో ప్రతిభ కనబరిచి, ఉద్యోగాలలో రాణిస్తూ ఇంటికి, ఊరికి పేరు తెచ్చినవారే. కుక్మా పంచాయతీ సర్పంచ్ కంకుబెన్ వాంకర్ 2018 సెప్టెంబరులో ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఈ పదహారు మంది అమ్మాయిల పేర్లు పెట్టడానికి ఇటీవలే పంచాయతీ సర్వసభ్య సమావేశంలో తీర్మానాన్నీ ఆమోదించారు. కుక్మా పంచాయితీ.. కచ్ జోన్ ప్రధాన కార్యాలయమైన భుజ్ తహసీల్ పరిధిలోకి వస్తుంది. కచ్ జిల్లా మహిళా, శిశు అభివృద్ధి అధికారి గత నెలలో జారీ చేసిన సర్క్యులర్ వల్ల స్ఫూర్తివంతమైన ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే కుక్మా గ్రామ పంచాయితీ తీరుతెన్నులు తెలుసుకోవడానికి ఐదు జిల్లాల నుండి సర్పంచ్‌లు వచ్చారు. తమ ప్రాంతాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలనే చేపట్టాలని, ఇది మహిళాభ్యున్నతికి తోడ్పడేలా ఉందని వారు కొనియాడారు. -
కేంద్రంతో సమానంగా... పంచాయతీలకు నిధులు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు సమృద్ధిగా నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వచ్చే బడ్జెట్లో పంచాయతీల అభివృద్ధికి రూ.2,714 కోట్లను ప్రతిపాదించినట్లు వెల్లడించారు. దీంతో స్థానిక సంస్థలకు నిధుల కొరత ఉండదని స్పష్టం చేశారు. గురువారం ఎంసీహెచ్ఆర్డీలో ‘కొత్త పంచాయతీరాజ్ చట్టం’పై అదనపు కలెక్టర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థలకు నిధులు కేటాయిస్తోందని, తద్వారా గ్రామ పంచాయితీలకు ప్రతీ నెల రూ.339 కోట్లు విడుదల చేస్తోందని తెలిపారు. దేశానికే ఆదర్శంగా రూ.45వేల కోట్లతో మిషన్ భగీరథను పూర్తి చేసి గ్రామాలకు శుద్ధమైన తాగు నీటిని అందిస్తున్నామని, తాగునీటి సరఫరా ఖర్చు భారం గ్రామపంచాయతీలపై వేయడం లేదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. పారదర్శకతకు పెద్దపీట వేయాలనే.. పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర గ్రామీణ విధానాన్ని అమలు చేస్తోందని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రంగా ఉండడంతోపాటు సమగ్ర అభివృద్ధి జరగాలనే లక్ష్యంతో ‘పల్లె ప్రగతి’ని రూపొందించామని, మొదటి దశ స్ఫూర్తిని కొనసాగించే విషయంలో ఆశించిన మేరకు జరగలేదనే అభిప్రాయంతో సీఎం కేసీఆర్ ఉన్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు కూడా ఇలాగే ఉన్నాయన్నారు. అదనపు కలెక్టర్లు పల్లె ప్రగతి ఒరవడిని కొనసాగించడంలో చొరవచూపాలని పిలుపునిచ్చారు. వైకుంఠధామం, డంపింగ్ యార్డులు, ఇంకుడుగుంతలు, నర్సరీలు, హరితహారం, ఉపాధిహామీ పథకంలో నిధుల వినియోగం, దాతల విరాళాలు, డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ, మిషన్ భగీరథ నల్లాల పరిశుభ్రత, వా ల్టా అమలు, జరిమానాల విధింపుపై అదనపు కలెక్టర్లు పకడ్బందీగా వ్యవహ రించాలని ఆదేశించారు. సదస్సులో ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ ఎం.రఘునందన్ రావు, స్పెషల్ కమిషనర్ సైదులు, ఎంసీఆర్ హెచ్ఆర్డీ అడిషనల్ డైరెక్టర్ బెనహార్ దత్ ఎక్కా పాల్గొన్నారు. -
పన్ను చెల్లించండి బంగారం గెలవండి
ముంబై: పన్ను రాబడి పెంచుకోవడానికి మహారాష్ట్రలోని ఓ గ్రామం వినూత్న ప్రయోగం చేపట్టింది. వచ్చే సంవత్సరం మార్చి 15 లోపు గ్రామపంచాయతీ పన్ను బకాయిలు చెల్లిస్తే వారిని లక్కీడ్రాకు ఎంపిక చేస్తామని, లక్కీడ్రాలో వారు బంగారం గెలుపొందవచ్చని ప్రకటించింది. సంగ్లీ జిల్లా కడేగావ్ తాలూకాలోని వాంగీ అనే గ్రామపంచాయతీ ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. పన్ను బకాయిలను నిర్ణీత గడువులోగా చెల్లించిన వారి పేర్లతో లక్కీడ్రా తీస్తామని, లక్కీడ్రాలో తొలి రెండు స్థానాల్లో వచ్చినవారు 5 గ్రాములు, 3 గ్రాముల బంగారపు ఉంగరాలు, మూడో స్థానంలో నిలిచిన వారు 2 గ్రాముల బంగారు నాణెం గెలుచుకుంటారని తెలిపింది. ఈ పథకానికి మంచి స్పందన వస్తోందని వాంగీ గ్రామ సర్పంచ్ విజయ్ హన్మానే తెలిపారు. -
గ్రామాల్లో మిషన్ అంత్యోదయ సర్వే
సాక్షి, నిజామాబాద్: పల్లెలు ప్రగతికి పట్టుకొమ్మలు, ఆ పల్లెల వికాసమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మిషన్ అంత్యోదయ క్రింద ‘సబ్కీ యోజన సబ్కా వికాస్’అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో ప్రతి గ్రామ పంచాయతీ వారిగా కార్యదర్శులు 29 అంశాలలో సర్వే చేస్తున్నారు. నెలాఖరులోగా సమగ్ర సమాచారం సేకరించి ప్రత్యేక యాప్‌లో డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సర్వే తీరు తెన్నులపై ప్రత్యేక కథనం.. అన్ని శాఖల సమన్వయంతో.. కేంద్ర, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖలు, గ్రామ పంచాయతీల అభి వృద్ధే ధ్యేయంగా అడుగు వేస్తోంది. అందులో ప్రధానంగా పేదరిక నిర్మూలన, మౌళిక వసతు ల కల్పన, మెరుగైన రవాణా, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలలో ఏ మేరకు అభివృద్ధి జరిగింది. మరేమి అభివృద్ధి జరిగాలి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయి. ఇందులో ప్రజల భాగస్వా మ్యం వంటి అంశాలను తెలుసుకోవడానికి మిషన్ అంత్యోదయ సర్వే చేపడుతుంది. ఇందు లో బాగంగా 29 అంశాలకు చెందిన సమగ్ర సమాచారం తెలిసేలా 146 ప్రశ్నలను రూపొందించారు. ఆయా ప్రశ్నల సమాధానాలతో మిషన్ అంత్యోదయ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో 1062 గ్రామ పంచాయతీల్లో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. సేకరిస్తున్న అంశాలివే.. సర్వేను పార్ట్–ఏ, పార్ట్–బీ విభాగాలుగా విభజించి సర్వే చేస్తున్నారు. పార్ట్ ఏలో నియోజక వర్గం, జనాభా, గృహాలు వంటి ప్రాథమిక సమచారంతో మొదలయ్యే సర్వేలో వ్యవసాయం, చిన్న నీటి వనరులు, భూ అభివృద్ధి, పశుసంవర్థక, మత్స్య, ఇంటి నిర్మాణం, తాగునీరు, రహదారులు, విద్యుత్, సామాజిక ఆస్తుల వివరాలు, భూ వివరాలు, లైబ్రరీ, అందుబాటులో ఉన్న బ్యాంకులు, ప్రజా పంపిణీ వ్యవస్థ, రవాణా, విద్యా సౌకర్యం, మార్కెటింగ్, ఆరోగ్యం, పారిశుధ్యం, మహిళా శిశు సంక్షేమం, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, ఖాదీ, చేనేత, పరిశ్రమలు, సామాజిక అటవీ విభాగంచిన్న తరహా పరిశ్రమలు మొదలైన అంశాలు, పార్ట్ బీలో నమోదు చేస్తున్నారు. సమగ్ర, సమాచార సేకరణలో పల్లె వికాసానికి మరేం చేయాలో స్పష్టత రానుంది. మిగిలింది 11రోజులే.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1062 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,334 గ్రామాలు కలవు. డిసెంబర్ 16 నాటికి 856 గ్రామ పంచాయతీలు మిషన్ అంత్యోదయ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోగా 73 గ్రామ పంచాయతీలు మాత్రమే సర్వేను పూర్తి చేశాయి. రూపొందించిన సర్వే ఆధారంగా గ్రామ అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలి. గ్రామ కార్యదర్శులు పారదర్శకంగా సర్వే వివరాలు నమోదు చేయడానికి ప్రయతి్నస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సర్వే నత్తనడకన కొనసాగుతోంది. కొందరు గ్రామ కార్యదర్శులు కూర్చున్నచోటు నుండే సెల్‌ఫోన్ ద్వారా సమాచారం సేకరించి నమోదు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎంత మందికి అందుతున్నాయన్న సమాచారం కూడా పక్కాగా నమోదు కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. సర్వే వివరాలు గ్రామ సభ ముందుంచాలి గ్రామ పంచాయతీల పరిధిలో 29 అంశాల్లో చేస్తున్న సర్వే ద్వారా ప్రతి గ్రామం యొక్క అభివృద్ధి వివరాలు తెలుస్తాయి. సర్వే వివరాలు గ్రామ సభ ముందుంచి చర్చించాలి. సర్వే వివరాలు పారదర్శకంగా నమోదు చేస్తే వచ్చే నిధులను సక్రమంగా ఖర్చు పెట్టుకోవచ్చు. – పెద్ది మురళి, యుఎఫ్ ఆర్టీఐ జిల్లా కనీ్వనర్ -
అక్రమాలకు అడ్డు రేఖ
నడుస్తున్న జేసీబీని పట్టుకొని వేళ్లాడుతున్న ఒక మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్తాన్‌లోని మండావలాలో ఇది జరిగింది. అసలు విషయం ఏంటంటే.. మండావలా సర్పంచ్ పేరు రేఖా దేవి. అదే గ్రామానికి చెందిన వాఘా రామ్ అనే వ్యక్తి గ్రామ పంచాయతీకి చెందిన భూమిని ఆక్రమించుకున్నాడట. అప్పటి నుంచి సర్పంచ్ రేఖా దేవి అతని మీద ఎన్నోసార్లు ఫిర్యాదు చేసింది. అయినా ఫలితం శూన్యం. వాఘా రామ్ ఆక్రమించుకున్న గ్రామ పంచాయతీ భూమిలో ఈ మధ్య అక్రమ కట్టడమేదో చేపట్టే పనిలోనూ పడ్డాడట. అందులో భాగంగానే జేసీబీ వాహనాన్ని తెచ్చి నిర్మాణపనులూ మొదలుపెట్టాడు. ఇది తెలిసిన రేఖాదేవి ఉన్నపళంగా అక్కడికి వచ్చి ఆ కట్టడాన్ని ఆపే ప్రయత్నంలో లోడర్ బకెట్‌ను పట్టుకుంది. అది గమనించి కూడా జేసీబీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా ఆ లోడర్‌ను పైకెత్తాడు. దాంతో రేఖాదేవి దానికి వేలాడింది. డ్రైవర్ అక్కడితో ఆగకుండా వాహనాన్ని అలాగే ముందుకు తీసుకెళ్లాడు. ఇది చూసి అక్కడున్న వాళ్లంతా పరిగెత్తుకుంటూ వచ్చి రేఖాదేవిని పట్టుకొని కిందకు దిగడంలో సాయపడ్డారు. ‘‘డ్రైవర్ కావాలనే ఇలా చేశాడు. ముందు నా మీద నుంచి తీసుకెళ్లి తర్వాత నా వెహికిల్నూ ఢీ కొట్టాలనుకున్నాడు. ఆగస్టు నుంచి ఈ భూమి వాఘా రామ్ కబ్జాలో ఉంది. ఇప్పుడు దీంట్లో అక్రమ కట్టడానికీ సాహసిస్తున్నాడు’’ అని చెప్తున్న అతనికి రేఖాదేవి కొంతమేరకు అడ్డురేఖ గీసినట్లే అయింది. -
నిందితుడు తక్కువ కులంవాడు కావడంతో..
రాజ్‌ఘర్/భోపాల్ : కులం కుంపటి నెత్తినబెట్టుకుని ఊరేగుతున్న కొందరు ‘పెద్ద మనుషులు’ కళ్లునెత్తికెక్కి ప్రవర్తించారు. దళితుడి చేతిలో అత్యాచారానికి గురైన కారణంగా.. తమకు విందు భోజనాలు ఏర్పాటుచేస్తేనే ఓ యువతి పవిత్రత పొందినట్లని తీర్పునిచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. వివరాలు.. రాజ్‌ఘర్ జిల్లాలోని ఓ గ్రామంలో దామోదర్ (పేరుమార్చాం) కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఆయన కూతురు(16)పై ఓ దళిత యువకుడు గత జనవరిలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేశారు. అయితే, నిందితుడు తక్కువ కులంవాడు కావడంతో... యువతి మలినమైందని కుల పంచాయతీ పెద్దలు తేల్చారు. కులం మొత్తానికి విందు ఏర్పాటు చేసి ఆ మాలిన్యాన్ని పోగొట్టుకోవాలని హుకుం జారీ చేశారు. అప్పటివరకు ఆ కుంటుంబాన్ని బహిష్కరిస్తున్నట్టు తీర్పు చెప్పారు. కూతురికి జరిగిన అన్యాయంపై ఓ పక్క ఆ తండ్రి ఆవేదనకు గురవుతోంటే... పంచాయతీ పెద్దల మతిలేని తీర్పు అతనికి మరింత భారమైంది. ఆర్థికస్థితి అంతంత మాత్రమే కావడంతో తామెలాంటి విందు ఇవ్వలేమని దామోదర్ వేడుకున్నాడు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో మహిళా శిశుసంక్షేమం అధికారులకు సమాచారం ఇచ్చాడు. దాని ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, తమ ప్రాథమిక విచారణలో దామోదర్ ఆరోపణలు నిజం కాదని తేలినట్టు పోలీసులు చెప్తుండటం గమనార్హం. -
పురపాలనలోకి శంషాబాద్
శంషాబాద్: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుతో ప్రపంచపటంలో చోటు సంపాదించుకున్న శంషాబాద్ మేజర్ గ్రామపంచాయతీ ఆదివారం నుంచి పురపాలనలోకి అడుగులు పెట్టింది. అరవై ఏళ్ల గ్రామీణ పాలన శనివారంతో ముగిసింది. 1959 అక్టోబరు 29 శంషాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ పాలన ప్రారంభమై 2019 ఏప్రిల్ 20 నాటికి ముగిసింది. అరవై ఏళ్ల వ్యవధిలో మొత్తం 8 మంది సర్పంచ్‌లుగా పనిచేశారు. ఇందులో మామిడి దయానంద్‌రెడ్డి 1970 నుంచి 1988 వరకు రికార్డు స్థాయిలో సర్పంచ్‌గా పనిచేశారు. ఆ తర్వాత కూడా మరో దఫా 1995 నుంచి 2001 వరకు ఐదేళ్ల పాటు శంషాబాద్ సర్పంచ్‌గా పనిచేశారు. అందరోని అబాదీగా.. శంషాబాద్ గ్రామాన్ని నిజాం పాలనలో అందరోని అబాదీగా పిలిచేవారని పూర్వీకులు చెబుతుంటారు. గ్రామానికి నాలుగు వైపులా గౌనీలు (పెద్ద ఎత్తున దర్వాజాలు) ఉండి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉండేది. ఆ తర్వాత నిజాం బంధువులైన శంషాద్‌బేగం పేరిట దీనిని శంషాబాద్‌గా మార్చినట్లు చరిత్ర చెబుతోంది. చారిత్రక కట్టాడాలకు నెలవు శంషాబాద్ చారిత్ర కట్టడాలకు నెలవైన ప్రాంతం. శంషాబాద్ పాత గ్రామంలో పాత పోలీస్‌స్టేషకు సుమారు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. ఈ కట్టడానికి ఇప్పటికే ‘హెరిటేజ్’ గుర్తింపు కూడా దక్కింది. నేటికీ ఠాణాగా ఈ భవనం సేవలందిస్తోంది. పాలరాతి కొండపై వెలిసిన చోళరాజుల కాలం నాటి సిద్దులగుట్ట దేవాయలం ఎంతో ప్రసిద్ధి చెందింది. సంతానం కోసం ఇక్కడ మొక్కుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం. ఇక్కడ మొక్కుకున్న వారికి సంతానం కలిగితే పిల్లలకు సిద్దప్ప, సిద్దులు, సిద్దేశ్వర్ నామకరణ చేస్తూ ఉంటారు. శంషాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాలో ఈ పేర్లతో వందల సంఖ్యల్లో ఉంటారు. శంషాబాద్ మొదటి సర్పంచ్ సిద్దప్ప అయితే.. చివరి సర్పంచ్ సిద్దేశ్వర్ కావడం కూడా ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక ఆలయానికి సమీపంలో ఉన్న వేట బంగళా కూడా నేటికీ రాజదర్పాని ఒలకబోస్తోంది. దీంతో పాటు శంషాబాద్ (ఉందానగర్) రైల్వేస్టేషన్ పాతభవనం కూడా ఎంతో చారిత్రాత్మకమైనది. దీంతో దశాబ్దాలకాలంగా శంషాబాద్ ప్రజలకు వైద్యసేవలందించిన పాత బంగళా కూడా నాడు ‘ముసాఫిర్ ఖానా’ ప్రయాణికుల విడిది కేంద్రంగా కొనసాగిందని చరిత్రలో ఉంది. ఇలా ఎన్నో చరిత్రలకు శంషాబాద్ వేదికగా మారింది. మినీభారత్‌గా... శంషాబాద్‌కు పారిశ్రామిక వాడతో పాటు 2008 మార్చి 23 నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రారంభం కావడంతో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్క జీవనం సాగిస్తున్నారు. సమీపంలో పారిశ్రామిక వాడ సైతం ఉడడంతో శంషాబాద్ జనాభా గత పదేళ్లలో భారీగా పెరిగింది. శంషాబాద్ పట్టణంతో పాటు ప్రస్తుత మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాలు కలుపుకుని సుమారు యాభైవేలకు పైగా జనాభా ఉంది. దీనికి తోడు వాణిజ్య, వ్యాపారా కేంద్రాలతో నిత్యం రాకపోకలు సాగించే వారు వేలల్లో ఉంటారు. నిబంధనలు తూచ్.. చారిత్రాత్మకమైనన శంషాబాద్‌లో అక్రమ కట్టడాలు ఎక్కువగానే వెలస్తున్నాయి. 111 జీవో నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమార్కులు వందల సంఖ్యలో భారీ నిర్మాణాలను చేపట్టారు. పట్టణంలోని ఫిరంగి నాలాను మురుగుకాల్వలా మార్చారు. ఫిరంగినాలాను ఆక్రమంచి నిర్మాణాలు చేపట్టినా పట్టించుకునే వారే లేకుండా పోయారు. దీంతో ఇక్కడ ఫిరంగి నాలా ఉనికి ప్రశ్నార్థంకగా మారుతోంది. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపట్టడం వాటికి కావాల్సిన నీటి వసతి కోసం విచ్చలవిడిగా బోర్లు వేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. రహదారులపై కూడా బోర్లు వేసే దారుణ పరిస్థితులు శంషాబాద్‌లో నిత్యకత్యంగా మారుతున్నాయి. కొత్త పాలనలోకి అడుగులు పెట్టిన సందర్భంగానైనా అడ్డుకట్టపడుతుందా.. అందుకు అనుగుణంగా అధికార వ్యవస్థ పనిచేస్తుందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తొలి కమిషనర్‌గా.. శంషాబాద్ మేజర్ గ్రామ పంచాయతీతో పాటు గొల్లపల్లి, తొండుపల్లి, ఊట్పల్లి, సాతంరాయి కొత్వాల్గూడతో కలిపిన శంషాబాద్ మున్సిపాలిటీకి తొలి కమిషనర్‌గా చాముండేశ్వరీ నియమితులయ్యారు. ఇప్పటికే ఆమె మున్సిపాలిటీలో భాగమైన గొల్లపల్లి, తొండుపల్లి, ఊట్పల్లిలో పురపాలనను ప్రారభించారు. పౌరుల భాగస్వామ్యంతో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తొలి కమిషనర్ అన్నారు. -
పంచాయతీల్లో ‘డ్రై డే’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో దోమల నివారణకు ప్రత్యేక కార్యాచరణను చేపట్టనున్నారు. దోమలు వృద్ధి చెందకుండా నిరోధించేందుకు వారానికి ఒకరోజు ‘డ్రై డే’నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పంచాయతీ సిబ్బంది వారానికి ఒకరోజు ఇంటింటికి వెళ్లి డ్రై డే పాటించాల్సిన ప్రాముఖ్యతను వివరిస్తారు. ఇళ్లు.. వాటి చుట్టూ పరిసరాల్లోని గుంటలు, తొట్టెలు, పాత టైర్లు.. తదితరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసేలా ప్రజల్లో చైతన్యం కల్పిస్తారు. కలెక్టర్లు, డీపీవోలకు ఆదేశాలు.. పంచాయతీల్లో పారిశుధ్యం, హరితహారం, వీధిలైట్లు, పన్నుల వసూలు తదితరాలకు సంబంధించి గత నెలలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలకు కొనసాగింపుగా జిల్లా కలెక్టర్లు, డీపీవోలకు పంచాయతీరాజ్ శాఖ మరిన్ని ఉత్వర్వులిచ్చింది. ఈ ఆదేశాలను అన్ని గ్రామ పంచాయతీలకు పంపించి, వాటిని కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ కమిషనర్ నీతూ కుమారి ఇటీవల ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రంలోని అన్ని పల్లెలను పచ్చదనం, పరిశుభ్రతతో కూడిన గ్రామాలుగా తీర్చిదిద్దడంలో భాగంగా అన్ని జిల్లాల్లో మూడు నెలల ప్రత్యేక కార్యాచరణను చేపట్టాలని గతంలోనే ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం వివిధ రూపాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు (క్యాంపెయిన్) చేపట్టాలని సూచించింది. కార్యక్రమంలో భాగంగా 90 రోజుల పాటు ప్రతీ గ్రామ పంచాయతీలో వివిధ చర్యలు చేపట్టాలని నిర్దేశించింది. తాజా ఆదేశాలు... అన్ని గ్రామాల్లోని రోడ్లను ప్రతిరోజూ శుభ్రపరచాలి. చెత్తను డంపింగ్ యార్డులకు తరలించాలి. ఘనవ్యర్థాల నిర్వహణ షెడ్ నిర్మించి ఉంటే కంపోస్ట్ తయారీకి చర్యలు ప్రారంభించాలి. ఠి రోజు విడిచి రోజు మురుగుకాల్వలు శుభ్రపరచాలి. ఖాళీ ప్రదేశాల్లో పొదలు, తుప్పలను తొలగించాలి. ఠి ఉపయోగించని బావులను పూడ్చాలి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా వాటిని పూడ్చేయాలి. ఠి స్కూళ్లు, ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, మార్కెట్లు శుభ్రపరిచేందుకు ఒకరోజు కేటాయించాలి. ఠి రాష్ట్రం లోని 12,751 పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి. ఠి రైతులు తమ పొలాల్లోని గట్లు, బావుల చుట్టూ మొక్కలు నాటేలా చూడాలి. ఠి గ్రామాల్లోని అన్ని రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలి. ఠి గ్రామ పంచాయతీల పరిధిలో జరిగే వివాహాలను తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి. -
పన్ను వసూళ్లు @ 17.28 కోట్లు
సాక్షి,ఆదిలాబాద్ అర్బన్: ఇంటి పన్ను వసూళ్లలో ఉమ్మడి జిల్లా కొంత మెరుగుపడింది. పన్నులు వసూలు చేయడంలో ఎప్పుడు వెనుకబడి ఉండే ఆదిలాబాద్ ఈ ఏడాది ముందు వరుసలో నిలిచేందుకు సిద్ధమవుతోంది. జిల్లాల వారీగా పన్ను వసూలు లక్ష్యాన్ని ముందుగానే చేరుకునే పరిస్థితి కనిపిస్తోంది. నాలుగు జిల్లాల పంచాయతీ అధికారులు పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చాలెంజ్‌గా తీసుకొని వసూలు చేస్తున్నారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులతోపాటు సిబ్బంది నానాఅవస్థలు పడుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా పన్ను కూడా వసూలు అవుతోంది. గడిచిన రెండు నెలల్లో భారీగా పన్ను వసూలు అయినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. పన్ను వసూలు శాతాన్ని జిల్లాల వారీగా గమనిస్తే.. రెండు నెలల కిందట 28వ స్థానంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతం 61 శాతం పన్ను వసూలు చేసి రాష్ట్రంలోనే ఏడోస్థానం సాధించింది. మంచిర్యాల జిల్లా 58.79 శాతం, కుమురంభీం జిల్లా 57.64 శాతం పన్ను వసూలు చేసి రాష్ట్రంలో ఎనిమిది, తొమ్మిది స్థానాలను పదిలం చేసుకున్నాయి. ఇక నిర్మల్ జిల్లా 47.75 శాతం పన్ను వసూలు చేసి 20వ స్థానంలో ఉంది. అయితే అధికారులు వసూలు చేసే పన్నులో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది ఇంటి పన్ను (ట్యాక్స్) కాగా, రెండోది నాన్ ట్యాక్స్ ఉంది. జిల్లా లక్ష్యం వసూలైంది శాతం ఆదిలాబాద్ రూ.5,06,50,733 రూ.3,08,98,625 61 మంచిర్యాల రూ.4,60,93,108 రూ.2,70,98,771 58.79 కుమురంభీం రూ.3,51,85,189 రూ.2,02,82,159 57.64 నిర్మల్ రూ.4,08,82,404 రూ.1,95,22,580 47.75 మొత్తం రూ.17,28,11,434 రూ.7,82,79,555 56.2 నెల రోజుల్లో సాధ్యమేనా.? ఆయా జిల్లాల జిల్లా పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీల వారీగా ఇంటి పన్ను వసూలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేశారు. ఈ ప్రణాళిక ప్రకారం గత రెండు నెలల నుంచి ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు. అయితే నవంబర్, డిసెంబర్లోనే పన్ను వసూలు చేపట్టిన సిబ్బంది అంతగా శ్రద్ధ చూపకపోవడంతో తక్కువగా వసూలైంది. దీనికి తోడు అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల సందడి కూడా తోవడంతో వసూలు లక్ష్యం మందగించింది. జనవరి మొదటి నుంచి ఇప్పటి వరకు గ్రామాల్లో జోరుగా పన్ను వసూలు జరుగుతోంది. ఒక్కో ఇంటికి రూ.85 నుంచి రూ.350కిపైగా వసూలు చేస్తున్నారు. ఇందులో కొంత మంది ఇంటి యాజమానులు రెండేళ్ల పన్ను కట్టని సంఘటనలు ఉన్నాయి. ప్రతీ ఏటా జనవరి, ఫిబ్రవరిలో పన్ను వసూలుకు ఉరుకులు పరుగులు పెట్టే అధికారులు ఈ ఏడాది ముందుగానే లక్ష్యాన్ని చేరుకునేలా కనిపిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా ఇరవై ఏడు రోజుల సమయమే మిగిలి ఉంది. అయితే ఈ ఇరవై ఏడురోజుల్లో రూ.9,45,31,879 లను వసూలు చేయగలరా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పన్ను వసూళ్లకు ప్రత్యేక బృందాలు.. గ్రామ పంచాయతీల్లో పన్ను వసూళ్లు చేసేందుకు జిల్లా పంచాయతీ అధికారులు ప్రత్యేక బృందా లను నియమించారు. నాలుగైదు పంచాయతీల కు ఒక బృందం చొప్పున సభ్యులు గ్రామాల్లో తిరుగుతున్నారు. ఈ బృందాలలో పంచాయతీ కార్యదర్శి, కారోబర్, వీసీవో, సాక్షరభారత్ కో–ఆర్డినేటర్లు, ఇతర అధికారులు ఉన్నారు. అయితే జిల్లాలో ఇది వరకే కొన్ని జీపీలో 100 శాతం పన్ను వసూలైంది. అయితే ఆ పంచాయతీ పరిధిలోని అధికారులు, సిబ్బంది వందశాతం చేరుకొని పంచాయతీల్లో పన్ను వసూలు చేయడంలో భాగస్వాములు అవుతున్నారు. సిబ్బంది ఎక్కువై పన్ను వసూళ్ల లక్ష్యం త్వరగా చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనికి తోడు పంచాయతీ కార్యదర్శులు, ఏవోపీఆర్డీలకు వేర్వేరుగా వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేశారు. పన్ను వసూళ్ల విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులను ఈ గ్రూపుల్లో షేర్ చేసుకుంటూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లక్ష్యం సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో జిల్లాలో పన్ను వసూలు సిబ్బంది సుమారు 220 నుంచి 250 మంది వరకు ఉన్నట్లు , బృందాలుగా పన్ను వసూలు చేస్తే పని సులువుగా ఉంటుందని చెబుతున్నారు. నెలాఖరులోగా లక్ష్యాన్ని చేరుకుంటాం ఇంటి పన్ను వసూలు ప్రస్తుతం జోరుగా సాగుతుంది. ఈ నెలాఖరులోగా నిర్దేశించిన లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటాం. ఈ రెండు నెలల్లో భారీగా పన్ను వసూలైంది. జిల్లాలో కొన్ని జీపీల్లో ఇప్పటికే వందశాతం ఇంటి పన్ను వసూలైంది. పన్ను వసూలుకు ప్రణాళికతో ముందుకెళ్లడంతో అన్ని జీపీల్లో వంద శాతం వసూలు చేస్తున్నాం. గడువులోగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం. – సాయిబాబా, జిల్లా పంచాయతీ అధికారి, ఆదిలాబాద్ -
ఎన్నికల పిటిషన్ల పరిష్కారానికి ట్రిబ్యునళ్లు
సాక్షి, హైదరాబాద్:గ్రామపంచాయతీ, మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికలకు సంబంధించి తలెత్తే ఎలాంటి వివాదాలనైనా ఇకపై ఎన్నికల ట్రిబ్యునళ్లు పరిష్కరించనున్నాయి. ఈ మేరకు కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎన్నికల ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ మంగళవారం నోటిఫికేషన్ జారీచేశారు. వివిధ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతోపాటు ఇతరు లు ఎవరైనా వీటి ముందు పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆ పంచాయతీ పరిధిలోకి వచ్చే జూనియర్ సివిల్ జడ్జి ఎన్నికల ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారు. మండల, జిల్లాపరిషత్ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై సీనియర్ సివిల్ జడ్జి ఎన్నికల ట్రిబ్యునల్‌గా విచారణ జరుపుతారు. అలాగే గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించే అధికారి లేదా అధికారులు కూడా ఎన్నికల ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారు. 30 రోజుల్లోగా పిటిషన్... గ్రామ పంచాయతీ, మండల, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికల ఫలితాలను ప్రకటించిన రోజు నుంచి 30 రోజులలోపు పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 30వ రోజున ట్రిబ్యునల్ తెరచి లేనిపక్షంలో ఆ మరుసటిరోజు పిటిషన్ వేసుకోవచ్చు. పిటిషనర్లు తాము చేస్తున్న ఆరోపణలకు పూర్తి ఆధారాలను దరఖాస్తుతోపాటు జతచేయాల్సి ఉంటుంది. సివిల్ ప్రొసీజర్ కోడ్ (సీపీసీ) ప్రకారం పిటిషన్ దాఖలు చేయాలి. పిటిషన్‌తోపాటు సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.1,000 జమ చేయాలి. ఈ నిబంధనలకు అనుగుణంగా లేని పిటిషన్లను ట్రిబ్యునల్ తిరస్కరించొచ్చు. పిటిషన్ కాపీలను ప్రతివాదికి అందజేయడంతోపాటు ట్రిబ్యునల్ నోటీస్ బోర్డులో అతికించాలి. తన ఎదుట దాఖలైన పిటిషన్లపై సీపీసీ నిబంధనల్లో నిర్దేశించిన కాలపరిమితి మేరకు ట్రిబ్యునల్ విచారణ జరపాల్సి ఉంటుంది. సాక్షుల విచారణకు, ఆధారాల స్వీకరణకు ట్రిబ్యునల్‌కు అధికారం ఉంటుంది. సాక్షులు తాము ఎన్నికల్లో ఎవరికి ఓటేశామో తెలియజేయాల్సిన అవసరంలేదు. ట్రిబ్యునల్ అనుమతి లేకుండా ఎన్నికల పిటిషన్లను ఉపసంహరించుకునే అవకాశం లేదు. పిటిషనర్లు ఒకరి కంటే ఎక్కువగా ఉంటే వారందరి అనుమ తితో పిటిషన్‌ను ఉపసంహరించుకోవచ్చు. ఉపసంహరణకు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇతర పార్టీలకు నోటీసు జారీచేసి విచారణ తేదీని నిర్ణయించాల్సి ఉంటుంది. ఏదైనా పిటి షన్ ఉపసంహరణకు అనుమతినిచ్చినప్పుడు ట్రిబ్యునల్ ఆ నిర్ణయాన్ని సంబంధిత గ్రామ పంచాయతీ, మండల, జిల్లా ప్రజాపరిషత్ అధికారులకు తెలియజేయాలి. ట్రిబ్యునళ్ల విధులు, అధికారాలివీ.. ►పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులు, పిటిషన్లను ఈ ట్రిబ్యునళ్లు పరిష్కరిస్తాయి. ►ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి, అతడు/ఆమె ఏజెంటు, అతడు/ఆమె ఆమోదం పొందిన ఏ వ్యక్తి అయినా అక్రమాలకు పాల్పడినట్టు తేలితే.. వారి ఎన్నికను రద్దు చేయడమే కాకుండా ఆరేళ్లపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయకుండా ట్రిబ్యునల్ ఆదేశించవచ్చు. సదరు వ్యక్తిని అంతే కాలానికి ఓటేయడానికి వీలు లేదని ఆదేశించే అధికారం కూడా ట్రిబ్యునల్‌కు ఉంది. ►గెలుపొందిన వ్యక్తి ఎన్నిక చెల్లదని ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన పక్షంలో ఆ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి లేదా వ్యక్తుల్లో అర్హులైనవారిని గెలుపొందినట్టుగా ప్రకటించవచ్చు లేదా మళ్లీ ఎన్నిక నిర్వహించాలని ఆదేశాలు జారీచేయొచ్చు. -
పంచాయతీ కార్మికులకు బెదిరింపులా?: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: న్యాయమైన డిమాండ్లకోసం సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ ఉద్యోగుల జేఏసీతో చర్చలు జరపకుండా భయభ్రాంతులకు గురిచేయడం ప్రభుత్వానికి మంచిదికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని నోటీసులు జారీచేయడాన్ని ఖండించారు. ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పూనుకోకుండా, వారి న్యాయమైన కోరికలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి మూడేళ్ల క్రితమే హామీ ఇచ్చిన ప్రభుత్వం, వాటి అమలుకు చర్యలు తీసుకోకుండా సమ్మెను అణిచివేయాలని ప్రయత్నించడం అప్రజాస్వామికమని విమర్శించారు.