ఆశీల పేరుతో అక్రమ వసూళ్లు | Asila the illegal collection | Sakshi
Sakshi News home page

ఆశీల పేరుతో అక్రమ వసూళ్లు

Published Fri, Oct 18 2013 1:24 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Asila the illegal collection

 

=పంచాయతీలకు సంబంధం లేకుండానే...
=నిబంధనలు బేఖాతరు
=పోలీసుల జోక్యంతో మారిన పంథా

 
గుడిమెట్ల (చందర్లపాడు రూరల్), న్యూస్‌లైన్ : మండలంలోని గుడిమెట్ల, కోనాయపాలెం గ్రామాల్లో రాజకీయ ప్రాబల్యం కలిగిన కొందరు గ్రామాభివృద్ధి కోసమంటూ నిబంధనలకు విరుద్ధంగా డబ్బుల  వసూలుకు దిగుతున్నారు. ఇందుకు ఆయా గ్రామ పంచాయతీ పాలకవర్గాలు సహకారమందిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
 
నిబంధనలు బేఖాతరు...

మండలంలోని గుడిమెట్ల గ్రామంలో నెల రోజుల క్రితం రాజకీయంగా బలమైన వర్గానికి చెందిన కొందరు కమిటీగా ఏర్పాటై, అభివృద్ధి పేరిట వసూళ్లకు పక్కా ప్రణాళిక రచించారు. ఇందుకోసం పంచాయతీతో సంబంధం లేకుండానే గ్రామంలో వ్యవసాయ ఉత్పత్తులు, పశువులు, మద్యం అమ్మకాలతో పాటు మొత్తం ఐదు అంశాలకు సంబంధించి ప్రైవేటు వేలం పాట  నిర్వహించి, సంబంధిత వ్యక్తులను ఆశీలు వసూలు చేసుకోవాలని సూచించారు. అయితే స్థానికులతో పాటు పలువురు వ్యాపారులు సైతం రుసుం చెల్లించేందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీంతో కమిటీకి డబ్బులు చెల్లించిన పాటదారులు మాత్రం నిర్బంధ వసూళ్లకు దిగడంతో పరిస్థితి గొడవల దాకా వెళ్లింది. గ్రామంలో పత్తి లోడు చేసిన లారీని కూడా నిలుపుదల చేసిన సందర్భాలున్నాయి. దీంతో విషయం పోలీసుల దాకా వెళ్లింది.
 
పక్క గ్రామాల్లోనూ షురూ

గుడిమెట్ల మాదిగానే పొరుగున ఉన్న కోనాయపాలెంలోనూ ఇదే తరహాలో అశీల వసూళ్లకు రంగం సిద్ధం చేశారు.  ఇక్కడ కూడా పంచాయతీ అధికారుల జోక్యం లేకుండా వసూళ్లు చేయరాదని పలువురు గ్రామస్తులు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఘర్షణలు సైతం చోటుచేసుకున్నాయి.  
 
పోలీసుల జోక్యంతో  మారిన పంథా...

వసూళ్లు సాగుతున్న తీరుపై పోలీసులకు సమాచారం అందడంతో కమిటీ ప్రతినిధులు తమ పంథాను మరో విధంగా కొనసాగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే గురువారం గ్రామంలో మద్యం, సారా అమ్మకాలను నిషేధిస్తున్నట్లు గుడిమెట్ల గ్రామ పంచాయతీ పాలకవర్గంతో తీర్మానం చేయించారు. దీంతో గ్రామంలో అధికారికంగా మద్యం అమ్మకాలకు బ్రేక్ పడినా, మిగిలిన అంశాలపై వసూళ్లకు గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులను బాధ్యులుగా చేసి ఆర్థిక ప్రయోజనాలు పొందాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

విషయంపై గుడిమెట్ల గ్రామ సర్పంచ్ కన్నెకంటి వెంకటేశ్వరరావును వివరణ కోరగా... గ్రామంలో ఆశీల వసూళ్లు జరుగుతున్నాయని, కానీ గ్రామ పంచాయతీకి ఇప్పటి వరకు ఎటువంటి సంబంధం లేదన్నారు. వసూళ్ల  ఆదాయంతో గ్రామం లో ఆలయ అభివృద్ధి చేయనున్నట్లు కమిటీ ప్రతినిధులు చెప్పారన్నారు.   గ్రామంలో సాగుతున్న అక్రమ మద్యం దుకాణంతో పాటు ఆశీల వసూళ్లను తక్షణం నిలిపివేయాలని కమిటీకి తెలి యజేసినట్లు చందర్లపాడు ఎస్‌ఐ దాడి చంద్రశేఖర్ న్యూస్‌లెన్‌కు తెలిపారు. వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement