
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయ శాఖలోని రెండు సంఘాలకు చెందిన పలువురు నాయకులకు బదిలీ నుంచి మినహాయింపునిచ్చారు. ఈ మేరకు శనివారం సంఘాల నాయకులకు, వ్యవసాయ కమిషనర్ జగన్‌మోహన్‌కు మధ్య ఒప్పందం జరిగింది. ఈ నెల 11, 12 తేదీల్లో వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ చేసి బదిలీలు చేపట్టాలని వ్యవసాయ శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఐదేళ్లకు పైబడినవారు దాదాపు 300 మంది వరకు బదిలీ అయ్యే అవకాశముందని అంచనా వేశారు. ఇంకా జాబితాను ఖరారు చేయలేదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, తమ ఆఫీస్ బేరర్లను బదిలీ చేయకూడదన్న నిబంధన ఉందని ఇటీవల కొందరు వ్యవసాయాధికార సంఘ నేతలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి మరింత సమాచారం కోరుతూ జీఏడీకి లేఖ రాశారు. రాష్ట్రంలో అసలు ఎన్ని సంఘాలకు ప్రభుత్వ గుర్తింపు ఉందో వివరణ కోరారు. అయితే ఇంతలోనే మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కల్పించుకుని వ్యవసాయ శాఖలో రెండే సంఘాలున్నందున అనవసరంగా రాద్ధాంతం చేయడం ఎందుకని, ఆ రెండు సంఘాల నేతలను కూర్చోబెట్టి ఒప్పందం చేసుకోవాలని సూచించారు. దీంతో పార్థసారథి ఆదేశం మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్‌మోహన్ రెండు సంఘాల నేతలతో సమావేశమై కొందరు నేతలను బదిలీ నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు.
సంఘానికి రాష్ట్రస్థాయిలో 10 మంది..
కమిషనర్ జగన్‌మోహన్‌తో జరిగిన ఒప్పందం ప్రకారం ఆ రెండు సంఘాలకు ప్రత్యేక వసతి కల్పించారు. ఆ సంఘాలకు చెందిన 10 మంది చొప్పున రాష్ట్ర స్థాయి ఆఫీస్ బేరర్లకు బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చారు. అంటే రెండు సంఘాలకు కలిపి రాష్ట్రస్థాయిలో 20 మందికి మినహాయింపు వస్తుంది. అలాగే జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శులకు బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆ ప్రకారం 31 జిల్లాల్లో రెండు సంఘాలకు కలిపి 62 మందికి మినహాయింపు రానుంది. అంటే మొత్తంగా 82 మంది బదిలీ నుంచి మినహాయింపు పొందారు. ఆ మేరకు జగన్‌మోహన్‌తో సమావేశం జరిగిందని అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.రాములు ‘సాక్షి’కి తెలిపారు. కాగా, వ్యవసాయశాఖలో బదిలీ కోసం ఇతర ఉద్యోగులు పైరవీలు ముమ్మరం చేశారు. రోజూ అనేకమంది వ్యవసాయ కమిషనరేట్‌కు వచ్చి తమతమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment