‘పంచాయతీ’లో విప్లవాత్మక మార్పులు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తామని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి తారక రామారావు తెలిపారు. కేరళలో విజయవంతమైన పంచాయతీ వ్యవస్థను స్ఫూర్తిగా తీసుకుని అక్కడ అమలు చేస్తున్న పలు విధానాలను తెలంగాణలో కూడా అమలు చేస్తామన్నారు. పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలపై అధ్యయనంలో భాగంగా బుధవారం ఆయన తిరువనంతపురం జిల్లాలోని మణికల్ గ్రామంలో పర్యటించారు. మంత్రి పర్యటన వివరాలను ఇక్కడ అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ సందర్భంగా మణికల్ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ కమిటీలు, ఇతర సిబ్బంది, ప్రజలతో సమావేశమై ఆయన పలు అంశాలపై చర్చించారు. కేరళలోని గ్రామ పంచాయతీలు తమ అధికారాలను వినియోగించుకుని సమర్థంగా పనిచేస్తున్నాయని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. కేరళలో కేవలం 964 గ్రామ పంచాయతీలు మాత్రమే ఉన్నాయని, తెలంగాణలో మాత్రం వాటి సంఖ్య 8,400పైనే ఉంటుందన్నారు. సమీకృత గ్రామ పంచాయతీ భవన సముదాయంలోని వసతులను ఆయన పరిశీలించారు. ఒకే చోట పౌర సేవలు అందిస్తున్న తీరును కొనియాడారు.
అనంతరం మంత్రి కేటీఆర్ .. కేరళ పంచాయతీరాజ్ వ్యవస్థ రూపకర్త, కేంద్ర ప్రత్యేక కార్యదర్శి విజయానంద్, సీనియర్ అధికారి జేఎం వర్గీస్‌తో భేటీ అయ్యారు. కేరళ నమూనా స్ఫూర్తితో తెలంగాణలో అమలు చేయదగిన కార్యక్రమాలపై అధికారుల నుంచి సలహాలు స్వీకరిం చారు. ‘కేరళ స్థానిక పాలన సేవల పథకం’ వివరాలను సేకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి రేమండ్ పీటర్‌ని మంత్రి ఆదేశించారు. ఈ పర్యటనలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.