
హెలీ, సీ టూరిజం అభివృద్ధి చేస్తున్న కేరళ
నగరంలో ప్రత్యేక పర్యాటక కార్యక్రమం ఈ ఏడాది ప్రత్యేకం..
సాక్షి, సిటీబ్యూరో : దేశవ్యాప్తంగానే కాకుండా విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించడానికి వినూత్నంగా హెలీ–టూరిజం, సీ టూరిజం అభివృద్ధి చేశామని కేరళ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సజీవ్ కే.ఆర్ తెలిపారు. కేరళ ప్రభుత్వ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని తాజ్ డెక్కన్ వేదికగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా సజీవ్ కేరళ పర్యాటక విశేషాలను వెల్లడిస్తూ.. ఇప్పటికే మంచి ఆదరణ ఉన్న పర్యాటక ప్రాంతాలతో పాటు బేకల్, వయనాడ్, కోజికోడ్ వంటి ప్రసిద్ధ ప్రాంతాలను పరిచయం చేయడం పై దృష్టి సారించామని అన్నారు. నూతన ప్రాజెక్టులతో పాటు బీచ్, హిల్ స్టేషన్స్, హౌస్‌బోట్లు, బ్యాక్‌వాటర్ విభాగం వంటి అంశాలు సందర్శకులకు హాట్‌స్పాట్‌లుగా మారాయన్నారు. కేరళలో పర్యాటకుల సంఖ్య 2022లో పెరిగిందని, 2023 నుంచి ఈ ఆదరణ రికార్డు స్థాయిలో పెరిగిందన్నారు. గతేడాది మొదటి ఆరు నెలల్లో 1,08,57,181 దేశీయ పర్యాటకులు రావడం విశేషమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేరళ కళాకారులు మోహినియాట్టం, కథక్, కత్తిసాము వంటి సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. ఈ వేదికగా బెంగళూరు, అహ్మదాబాద్, చండీగఢ్, ఢిల్లీ, జైపూర్, చెన్నై, కోల్‌కతా తదితర ప్రాంతాలకు చెందిన పర్యాటక రంగ సంస్థలు, ప్రముఖులు బీ టు బీ సమావేశాల్లో పాల్గొన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి 21 వరకూ కనకక్కున్ను ప్యాలెస్‌లో నిషాగంధి నృత్యోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో దేశ వ్యాప్తంగా ప్రఖ్యాత నృత్యకారులు మోహినియాట్టం, కథక్, కూచిపూడి, భరతనాట్యం, మణిపురి వంటి శాస్త్రీయ నృత్య రూపాలను ప్రదర్శిస్తారు. జనవరి 23–26 వరకూ కోజికోడ్ బీచ్‌లో ప్రసిద్ధ కేరళ సాహిత్య ఉత్సవం నిర్వహించనున్నారు. ఇందులో 12కి పైగా దేశాల నుంచి 400 మంది ప్రముఖులు పాల్గోనున్నారు. అంతేకాకుండా సుమారుగా 200 సదస్సులు జరగనున్నాయి. వీటిలో విలాసం, విశ్రాంతిని, కేరళ డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి అంశాలు ప్రధానంగా నిలువనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment